యాపిల్ ఫోన్‌ను బియ్యంలో ఆరబెట్టవద్దని కంపెనీ ఎందుకు చెబుతోంది... ఈ ఫోన్ నీళ్ళల్లో తడిస్తే ఏం చేయాలి?

యాపిల్ ఫోన్ తడిసినప్పుడు దాన్ని బియ్యంలో పెట్టి ఆరబెట్టాలన్నది మంచి ఆలోచన కాదని ఆ కంపెనీ చెబుతోంది.

అలా చేయడం వల్ల సరైన ఫలితం ఉండదని యాపిల్ చెబుతోంది. బియ్యంలో ఉండే సూక్ష్మ పదార్థాల వల్ల ఫోన్ పాడయ్యే అవకాశం ఉంటుందని ఆ కంపెనీ తని వినియోగదారులకు తెలిపింది.

దానికి బదులుగా, ఐఫోన్ వినియోగదారులు తడిసిన ఫోన్‌ను కనెక్టర్ కింది వైపు ఉండేలా పట్టుకుని దులిపేయాలని, అలాగే మామూలుగా ఆరబెట్టాలని సూచించింది.

స్మార్ట్ ఫోన్ల టెక్నాలజీ ఎంతో మెరుగ్గా అభివృద్ధి చెందినప్పటికీ, అవి తడిసినప్పుడు ఎలా రిపేర్ చేయాలనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

యాపిల్ గైడ్‌లో ఏముంది?

రైస్ బ్యాగులో పెట్టడం సరైనది కాదని చెబుతున్న యాపిల్, తడిసిన ఫోన్‌ను హీటర్, హెయిర్ డ్రయర్ వంటి వాటితో డ్రై చేయడం కూడా మంచిది కాదని అంటోంది.

"దూది, పేపర్ న్యాప్‌కిన్ వంటివి కూడా ఫోన్లో ఇన్సర్ట్ చేయకూడదు" అని ఈ కంపెనీ సూచించింది. అలా కాకుండా, తడిసిన ఫోన్‌ను గాలి, వెచ్చని వెలుతురు ఉన్న అలా కాసేపు ఉంచడమే మంచిదని, ఫోన్ డ్రై అయిన తరువాతే చార్జింగ్ చేయాలని సూచించింది.

"ఫోన్ పూర్తిగా ఆరడానికి 24 గంటల వరకూ పట్టవచ్చు" అని కూడా యాపిల్ గైడ్ హెచ్చరిస్తోంది.

"ఫోన్ పూర్తిగా ఆరకముందే లైట్నింగ్ లేదా యుఎస్‌బీ-సీ చార్జర్‌ను కనెక్ట్ చేస్తే అది పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది. అలా చేయడం వల్ల కనెక్టింగ్ సమస్యలు తలెత్తవచ్చు" అని ఈ గైడ్‌లో వివరించారు.

యాపిల్ సపోర్ట్ సిస్టమ్‌లో కొత్త అప్డేట్స్‌ను మొదటగా చూపించే మ్యాక్‌వరల్డ్ వెబ్‌సైౌట్ ప్రకారం కొత్త వెర్షన్ ఐఫోన్లు మరింతగా వాటర్-రెసిస్టెంట్‌గా ఉండబోతున్నాయి.

ఐఫోన్-12, ఆ తరువాత వచ్చిన ఐఫోన్లన్నీ ఆరు మీటర్ల లోతు వరకూ, గరిష్టంగా అరగంట వరకూ నీటిని నిరోధించగలుగుతాయి.

అయితే, పాత ఐఫోన్లు ఉపయోగించేవారు మాత్రం బియ్యం డబ్బాలో తడిసిన ఫోన్ పెట్టడం వల్ల ఫలితం ఉండదని గుర్తించాలని యాపిల్ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)