సెకన్లలోనే గుండె జబ్బులను పసిగట్టే ఏఐ స్టెతస్కోప్, ఇది వైద్యరంగంలో గేమ్ ఛేంజర్ కానుందా?

    • రచయిత, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ న్యూస్

వైద్యులు సెకన్లలోనే ప్రధాన గుండె సమస్యలను/జబ్బులను గుర్తించడంలో ఏఐ (కృత్రిమ మేధస్సు) స్టెతస్కోప్‌లు సాయపడతాయని పరిశోధకులు అంటున్నారు.

మొదటి స్టెతస్కోప్‌ను 1816లో కనుగొన్నారు. వైద్యులు శరీరం లోపల శబ్దాలను వినడానికి వీలుగా దీన్ని తయారుచేశారు. ఇప్పుడు.. ఒక బ్రిటిష్ బృందం దాని ఆధునిక వెర్షన్‌ను తీసుకొచ్చింది.

ఇది హార్ట్ ఫెయిల్యూర్(గుండె వైఫల్యం), హార్ట్ వాల్వ్ డిసీజ్ (గుండె కవాట వ్యాధి), అబ్‌నార్మల్ హార్ట్ రిథమ్స్(అసాధారణ గుండె లయ)లను త్వరగా గుర్తించగలదని వారు చెబుతున్నారు.

ఈ స్టెతస్కోప్ సాయంతో రోగులు వేగంగా చికిత్స పొందగలరని, ఇది 'రియల్ గేమ్-ఛేంజర్' కావొచ్చునని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

లండన్‌లోని 205 జీపీ(జనరల్ ప్రాక్టీషనర్) క్లినిక్‌లలో అధ్యయనం చేసిన తర్వాత యూకే అంతటా ఈ పరికరాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు.

పరిశోధన ఎలా జరిగింది?:

ఈ కొత్త పరికరం సాధారణ స్టెతస్కోప్ కంటే భిన్నంగా ఉంది. దీనికి చెస్ట్ పీస్‌కు బదులుగా ప్లేయింగ్ కార్డ్ పరిమాణంలో పరికరం ఉంటుంది. హృదయ స్పందన, రక్త ప్రవాహంలో మనిషి చెవి గుర్తించలేని సూక్ష్మమైన తేడాలను విశ్లేషించడానికి ఇది మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తుంది.

ఇది ఈసీజీ (గుండె విద్యుత్ సంకేతాలను రికార్డ్ చేయడం) పరీక్ష కూడా చేస్తుంది. డేటాను క్లౌడ్‌కు పంపుతుంది. అక్కడ, వేలాది మంది రోగుల సమాచారంతో శిక్షణ పొందిన ఏఐ- దానిని విశ్లేషిస్తుంది.

ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్ ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. అమెరికా కంపెనీ ఎకో హెల్త్ తయారు చేసిన ఈ ఏఐ స్టెతస్కోప్‌లతో 96 జీపీ క్లినిక్‌లలో 12,000కు పైగా రోగులను పరీక్షించారు. ఈ ఫలితాలను 109 క్లినిక్‌ల రోగుల ఫలితాలతో పోల్చారు.

గుండె వైఫల్యం ఉన్న వ్యక్తుల్లో వైద్యులు ఏఐ స్టెతస్కోప్‌ను ఉపయోగించినప్పుడు 12 నెలల్లోపు దానిని గుర్తించే అవకాశం 2.3 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

అంతేకాదు, అసాధారణ గుండె సమస్యలను గుర్తించడంలో ఏఐ స్టెతస్కోప్‌ మెరుగ్గా ఉంది. అసాధారణ హృదయ స్పందన నమూనాలు (ఇవి సాధారణంగా లక్షణాలను చూపించవు కానీ, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి) కనుగొనే అవకాశం 3.5 రెట్లు ఎక్కువగా ఉంది. గుండె వాల్వ్ జబ్బును గుర్తించే అవకాశం 1.9 రెట్లు ఎక్కువగా ఉంది.

''200 ఏళ్ల కిందట కనుగొన్న స్టెతస్కోప్‌ను 21వ శతాబ్దానికి ఎలా అప్‌గ్రేడ్ చేయవచ్చో ఇది చూపిస్తుంది'' అని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌ క్లినికల్ డైరెక్టర్, డాక్టర్ సోన్యా బాబు-నారాయణ్ అన్నారు.

ఇలాంటి ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవని చెబుతూ, ''చాలా గుండె జబ్బులు ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. రోగులు అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చినప్పుడు మాత్రమే గుర్తిస్తున్నారు'' అని ఆమె వివరించారు.

వ్యాధిని ముందుగానే గుర్తిస్తే, రోగులు త్వరగా చికిత్స పొందవచ్చని, ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని డాక్టర్ సోన్యా అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలోనే అతిపెద్ద గుండె ఆరోగ్య సదస్సు అయిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సమావేశం మాడ్రిడ్‌లో జరిగింది. ఈ సదస్సులో వేలాది మంది వైద్యులకు ఈ పరిశోధన ఫలితాలను సమర్పించారు.

దక్షిణ లండన్, సస్సెక్స్, వేల్స్‌లోని జీపీ క్లినిక్‌‌లలో ఈ ఏఐ స్టెతస్కోప్‌లను వినియోగించాలని భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)