You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బనకచర్ల బదులు నల్లమల సాగర్ ప్రాజెక్టును ఏపీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది? తెలంగాణ ప్రభుత్వం ఏమంటోంది?
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్.
- హోదా, బీబీసీ కోసం
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు స్థానంలో పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తెరపైకి తెచ్చింది.
ఈ కొత్త ప్రాజెక్టులో భాగంగా పోలవరం నుంచి బొల్లాపల్లి జలాశయానికి గోదావరి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్ జలాశయానికి తరలిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఈ మేరకు డీపీఆర్ తయారీకి గత నవంబర్ 27వ తేదీన టెండర్లకు ఆహ్వానం పలుకుతూ ప్రకటన చేసినట్టు జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరత్నం బీబీసీకి తెలిపారు.
అదే సందర్భంలో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి గత అక్టోబర్ 29వ తేదీన పిలవగా వచ్చిన టెండర్లను రద్దు చేసినట్టు వెంకటరత్నం స్పష్టం చేశారు.
అయితే, పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును ప్రతిపాదించినా అది తెలంగాణకు నష్టమేనని, దాన్ని అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. అసలేంటీ ప్రాజెక్టు? దీనిచుట్టూ అభ్యంతరాలేంటి, సమర్ధనలేంటి?
అసలు బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలేంటంటే..
కృష్ణానదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదనీ, ఇదే సందర్భంలో ప్రతి ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు పోలవరం –బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఏడాదిన్నర కిందట నిర్ణయించింది.
రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జునసాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో సుమారు 80 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందంటూ ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
గోదావరి నుంచి బనకచర్లకు మూడు దశల్లో....
మూడు దశల్లో పోలవరం–బనకచర్ల అనుసంధానం చేపట్టాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
మొదటి దశ... పోలవరం జలాశయం నుంచి వరద జలాలను కృష్ణానదికి మళ్లించడం, ఇందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచాలని నిర్ణయం. ప్రస్తుతం కుడికాలువ సామర్ధం 17,500 క్యూసెక్కులు ఉండగా, దాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదనలు
రెండో దశ.. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వలో 80వ కిలోమీటర్ వద్ద ఈ నీటిని కలపడం.. సాగర్ కుడికాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసి.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలించడం. ఇందుకు 150 టీఎంసీలు నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మించడం.
మూడో దశ ... బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అరణ్యం మీదుగా కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్‌కు నీళ్లు తరలించడం. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వి నీటిని మళ్లించడం.
ఇప్పుడు మూడో దశలో మార్పులు చేసి.. నల్లమల సాగర్ వైపు మళ్లింపు
బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి మొదటి రెండు దశలను యధాతథంగానే ఉంచి.. మూడో దశలోనే మార్పులు చేస్తున్నట్టు పులిచింతల ప్రాజెక్టుతో పాటు తాజాగా ప్రతిపాదిత నల్లమల సాగర్ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచంద్రరావు బీబీసీకి తెలిపారు.
మూడో దశలో గతంలో అనుకున్నట్లు పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి జలాశయం నుంచి కర్నూలు జిల్లాలోని బనకచర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న నల్లమలసాగర్ జలాశయం వరకు మాత్రమే నీళ్లను తరలిస్తామని చెప్పారు.
తాజాగా ప్రతిపాదించిన ఈ మూడో దశ కోసం దాదాపు రూ.9,000 కోట్లు ఖర్చవుతుందని లెక్క వేస్తున్నామని రామచంద్రరావు తెలిపారు.
మూడు దశలు కలిపి మొత్తంగా ప్రాజెక్టు ఖర్చు సుమారు రూ. 55వేల కోట్లుగా అంచనా వేస్తున్నామని, గతంలో బనకచర్ల ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రూ.81,900 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పుడు సుమారు రూ.27 వేల కోట్ల ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నామని తెలిపారు.
ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలిలా..
''ముందుగా గోదావరి వరదనీటిని తాడిపూడి వరద కాలువద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువలోకి పంపి.. విజయవాడ ప్రకాశం బరాజ్‌కు ఎగువన ఇబ్రహీంపట్నం సమీపంలోని దాములూరు వరకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి గుంటూరు జిల్లా హరిశ్చంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ కుడికాలువలోకి ఎత్తిపోస్తారు.
అక్కడి నుంచి ప్రకాశం జిల్లాలోని నల్లమల సాగర్‌కు తీసుకువెళ్తారు. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశాం’’ అని జలవనరుల శాఖ ఈఈ రామచంద్రరావు తెలిపారు.
బనకచర్ల రద్దు కాలేదు.. మార్పు మాత్రమే
బనకచర్ల ప్రాజెక్టు రద్దు అనే మాట వాస్తవం కాదని ఏపీ జలవనరులశాఖ అధికారులు బీబీసీ తో అన్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా బొల్లాపల్లి నుంచి బనకచర్ల వరకు అరణ్యంలో సొరంగం తవ్వడం, అందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు రావడం ఆలస్యం కానున్న నేపథ్యంలో ప్రాజెక్టు మూడో దశలో మార్పులు చేసి ఎవరికీ ఇబ్బంది లేకుండా వేగంగా పూర్తి చేసేలా ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని జలవనరులశాఖ అధికారులు వెంకటరత్నం, రామచంద్రరావు, సుగుణాకర్‌రావు బీబీసీకి వెల్లడించారు.
అంతేతప్ప బనకచర్ల రద్దు కాలేదని, ఈ ప్రాజెక్టు పనులు పూర్తయిన తర్వాత దానిపై దృష్టి పెడతామని వారు తెలిపారు.
ఈ ప్రాజెక్టయినా తెలంగాణకు జల విఘాతమే: తెలంగాణ నీటిపారుదలశాఖ నిపుణులు
ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న పోలవరం– నల్లమలసాగర్ ప్రాజెక్టు కూడా రాష్ట్రాల మధ్య జలాలపంపిణీ హక్కులు, నిబంధనలకు పూర్తి వ్యతిరేకమేనని తెలంగాణ నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు.
ఆ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో ఎస్‌ఈగా పనిచేసి ఇటీవల రిటైర్ అయిన శ్రీధర్ రావు దేశ్ పాండే బీబీసీతో మాట్లాడుతూ.. వరద జలాలు, మిగులు జలాలు అంటూ రాష్ట్రాలు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి లేదని చెప్పారు.
ఆ జలాల్లో కూడా పక్క రాష్ట్రాలకు వాటాలు ఉంటాయని ఆయన చెప్పారు. కానీ ఎక్కడా ఎప్పుడూ లేనివిధంగా నీటి కేటాయింపులకు భిన్నంగా వృధా జలాలను వినియోగించుకుంటామంటూ ఏపీ ప్రభుత్వం చెబుతున్న వాదనలు సరికాదని, నిబంధనలకు విరుద్ధంగా ఏపీ కట్టే ఏ ప్రాజెక్టయినా తెలంగాణకు జల విఘాతమే అని శ్రీధర్‌రావు వ్యాఖ్యానించారు.
కేంద్రానికి లేఖ రాశాం: తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
బనకచర్ల, నల్లమల సాగర్ ఈ రెండు ప్రాజెక్టులకు తేడా ఏమీ లేదని.. మిగులు జలాలు లేదా వరద జలాల వినియోగం పేరిట ఏపీ నిర్మించే ఏ ప్రాజెక్టునైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన బీబీసీతో మాట్లాడారు.
''బనకచర్లను మేం తీవ్రంగా వ్యతిరేకించాం.. అన్ని దశల్లోనూ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకుండా అడ్డుకున్నాం.. అందుకే ఇప్పుడు మరోరూపంలో ఏపీ ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. అయితే.. ఇప్పటికే ఏపీ ప్రతిపాదించిన నల్లమల సాగర్ ప్రాజెక్టు పై కేంద్రానికి లేఖ రాశాం'' అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
కేంద్రం నుంచి స్పందన రాకపోయినా, ఏపీ ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్లినా ఈ ప్రాజెక్టును నిలువరించేలా సుప్రీంకోర్టులో కేసు వేస్తామని ఉత్తమ్ బీబీసీతో చెప్పారు.
మరోవైపు ఇదే విషయమై ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన స్పందిస్తే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.
నిపుణులు ఏం చెబుతున్నారు?
‘‘బనకచర్ల ప్రాజెక్టే కాదు.. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులతో ఏపీ ప్రభుత్వం తాజాగా తెరపైకి తెచ్చిన పోలవరం– నల్లమలసాగర్ ప్రాజెక్టు కూడా అనవసర ప్రయాసే’’ అని ఏపీ ఇరిగేషన్ శాఖలో ఎస్‌ఈగా పని చేసిన రిటైర్ అయిన కృష్ణారావు బీబీసీతో అన్నారు.
''విశాఖకు తాగునీరు అందించడంతో పాటు గోదావరి జిల్లాల్లో ఏడులక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎన్నేళ్లకు పూర్తయినాసరే.. కేవలం రెండు లక్షల ఎకరాలకే సాగు నీరు వచ్చే పరిస్థితే ఇప్పటికీ ఉంది.
మరో ఐదు లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు కాలువలు తవ్వాలి. కనీసం ఆ దిశగా ఆలోచించకుండా ఇక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయాలని చూడటం సరికాదు. అది బనకచర్ల అయినాసరే.. నల్లమల సాగర్ అయినా సరే.. ఏదైనా అనవసరమే'' అని కృష్ణారావు అభిప్రాయపడ్డారు.
''తాడిపూడి ద్వారా నీళ్లు తరలిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. అప్పుడు చింతలపూడి ప్రాజెక్టు నిర్వీర్యమవుతుంది.. పైగా ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టేందుకు పదేళ్లు పడుతుంది.. ఈలోగా ఆ డబ్బులతో పోలవరం అన్ని కెనాల్స్‌తో పాటు వెలిగొండ ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉన్న కాల్వల నిర్మాణం చేపడితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ నీళ్లు సమృద్ధిగా చేరతాయి'' అని ఆయన సూచించారు.
బెజవాడకు బుడమేరు ముంపు ఉంటుందా?
బనకచర్లగానీ.. నల్లమల సాగర్ గానీ.. ఏ ప్రాజెక్టయినా సరే, పోలవరం నుంచి తీసుకొచ్చే గోదావరి వరద నీళ్లను విజయవాడ మీదుగా కాకుండా దూరంగా ఉన్న వైకుంఠాపురం వద్ద కృష్ణానదిలో ఎత్తిపోయాలని నీటిపారుదల రంగ నిపుణులు టి.లక్ష్మీనారాయణ సూచించారు.
గత ఏడాది వచ్చిన బుడమేరు వరదలను దృష్టిలో పెట్టుకునైనా కచ్చితంగా ఈ మార్పు చేయాలని ఆయన అన్నారు. వానలు, వరదలు వచ్చినప్పుడు బుడమేటి నీటితో పాటు గోదావరి వరద జలాలు వస్తే విజయవాడకు చాలా ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకని పోలవరం నుంచి చింతలపూడి మీదుగా వైకుంఠాపురం వద్ద కృష్ణాలో కలిపి బొల్లాపల్లి తీసుకువెళ్లి అక్కడి నుంచి నల్లమల సాగర్‌తో పాటుగా సోమశిల వరకు తీసుకువెళ్తేనే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం చేకూరుతుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
అవన్నీ అపోహలే.. : జలవనరులశాఖ
విజయవాడ మీదుగా తీసుకువెళ్తే నగరానికి వరద ముప్పు పెరుగుతుందనే వాదనలు సరికాదని, ప్రతిపాదిత నల్లమల సాగర్ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచంద్రరావు బీబీసీతో అన్నారు.
‘‘మనం బుడమేరులో పోలవరం కుడి కాల్వ నీళ్లు కలపడం లేదు.. గతంలో ఇవి బుడమేరు కెనాల్‌లో కలిపి అక్కడి నుంచి ప్రకాశం బరాజ్ సమీపంలో కృష్ణాలో కలపాలని భావించాం.. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదనల్లో మార్పులు చేశాం.. బుడమేరు కెనాల్‌లో కలపకుండా నేరుగా ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణాలో కలిపేలా చర్యలు చేపడతాం’’ అని రామచంద్రరావు వివరించారు.
ఇక్కడ ప్రకాశం బరాజ్ వద్ద ఒత్తిడి పెరుగుతుందనే వాదనలు సరికాదు.. మ్యాగ్జిమం 20వేల క్యూసెక్కుల నీళ్లు వస్తాయి.. దాన్ని తట్టుకునే పరిస్థితి అక్కడ ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కొలిక్కి వస్తే అందరి అనుమానాలు తీరిపోతాయి'' అని రామచంద్రరావు వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)