గాజా: బాంబుల శబ్దాలతో మహిళలకు గర్భస్రావాలు, పెయిన్ కిల్లర్స్ లేకుండానే ప్రసవాలు... చెప్పతరం కాని గర్భిణుల కష్టాలు

    • రచయిత, యోగితా లిమాయే
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలేం

‘‘నా బిడ్డకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రసవమై నాలుగు రోజులైంది. యుద్ధం కారణంగానే నా బిడ్డకు ఇంకా పేరు లేదు’’ అని అన్నారు కెఫాయా అబు అసర్.

రఫాలోని ఒక స్కూల్ శిబిరంలో గడ్డి చాప మీద ఒక మూలన కూర్చున్న కెఫాయా, ఎరుపు రంగు దుప్పటిలో చుట్టి ఉన్న తన కూతుర్ని ఆడిస్తున్నారు. దక్షిణ గాజాలోని ఈ స్కూల్ షెల్టర్‌ను ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది.

ఆమె మొహంలో ఒత్తిడి, అలసట కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎవరికైనా తొలి కాన్పు కష్టంగానే ఉంటుంది. కానీ, కెఫాయా విషయానికొస్తే, ఊహకు కూడా అందనంత వేదనను ఆమె తొలికాన్పు సమయంలో అనుభవించాల్సి వచ్చింది.

నిజానికి, కెఫాయా ఉత్తర గాజాకు చెందినవారు. ఆమె వయస్సు 24 ఏళ్లు. సురక్షితంగా ఉండటం కోసం దక్షిణ గాజాకు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ మిలిటరీ చేసిన హెచ్చరికల మేరకు ఆమె తన కుటుంబంతో కలిసి ఉత్తర గాజాను విడిచి వచ్చారు.

‘‘నిండు గర్భంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పరిగెత్తుతూ పారిపోవాల్సి వచ్చింది. నేను పూర్తిగా అలసిపోయా. మొదట మేం నుసీరత్ శిబిరానికి వెళ్లాం. కానీ, దానికి సమీపంలోనే బాంబు దాడులు జరుగుతున్నాయి. ముక్కలైన మృతదేహాలను చూశాను. అలా చూసి తట్టుకోవడం చాలా కష్టం’’ అని గాజాలో బీబీసీ కోసం పనిచేస్తోన్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌ మజ్దీ ఫతీతో ఆమె చెప్పారు.

ఉత్తర గాజా నుంచి పారిపోయిన లక్షల మందిలో కెఫాయా, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అందరిలాగే కెఫాయా కూడా మైళ్ల దూరం నడవాల్సి వచ్చింది. బాంబు దాడులు జరుగుతాయేమోనని దారి అంతటా ఆందోళన చెందాల్సి వచ్చింది.

‘‘నా కడుపులోని బిడ్డకు అది చాలా ప్రమాదకరం. మాపై కూడా బాంబులు వేస్తారేమోనని చాలా భయపడ్డా’’ అని కెఫాయా తెలిపారు.

చివరకు ఆమె కుటుంబం రఫా నగరంలోని కువైతీ ఆసుపత్రికి చేరుకుంది. కానీ, ఆసుపత్రిలోని ప్రసూతి వార్డును మూసి వేశారు. దీంతో సమీపంలోని ఎమైరతి ఆసుపత్రికి కెఫాయాను తీసుకెళ్లారు.

‘‘అక్కడ ప్రసవానికి వచ్చిన మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గాజాలోని అన్ని ప్రాంతాలవారు అక్కడికే వస్తున్నారు.

ప్రసూతికి వచ్చిన వారికి సరిపడా నొప్పినివారణ (పెయిన్ కిల్లర్ల్) మందులు అక్కడ లేవు. భరించలేనంత నొప్పి ఉన్నవారికి, పెయిన్ కిల్లర్స్ అవసరం బాగా ఉన్నవారికి మాత్రమే వైద్యులు వాటిని ఇచ్చారు’’ అని కెఫాయా చెప్పారు.

పెయిన్ కిల్లర్స్ తీసుకోకుండానే ఆమె బిడ్డకు జన్మనిచ్చారు.

ఇంధనం లేమి, బాంబు దాడులు జరుగుతాయనే భయం, బాంబు దాడుల్లో భవనాలు ధ్వంసం కావడం ఇలా అనేక కారణాలతో గాజాలోని సగానికిపైగా ఆసుపత్రులు పనిచేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది.

సుమారు 50 వేల మంది గర్భిణులు ఈ సంక్షోభంలో చిక్కుకుపోయారని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది.

ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, రోజుకు దాదాపు 180 ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పింది.

చాలామంది గర్భిణులకు సురక్షిత ప్రసూతి సేవలు అందడం లేదు. ఆసుపత్రులన్నీ బాంబుదాడుల్లో గాయపడినవారు, మృతులతో నిండిపోవడం, జనరేటర్లలో ఇంధనం లేకపోవడం, మందులతో పాటు ప్రాథమిక వైద్య సామగ్రి లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులకు కూడా సురక్షిత సేవలు అందట్లేదు.

ఇలాంటి వారిలో ఒలా అబు ఓలీ కూడా ఒకరు. ‘‘నా కుమారుని వయస్సు 2 వారాలు. యుద్ధం సమయంలో ఈ స్కూల్‌ శిబిరంలో ఇక్కడే వాడు పుట్టాడు’’ అని మజ్దీతో ఓలీ చెప్పారు.

ఓలీకు మరో కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా రఫాలో యూఎన్ నిర్వహిస్తోన్న వేర్వేరు స్కూల్ శిబిరాల్లో నివసిస్తున్నారు.

‘‘నా పిల్లలిద్దరూ అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ల పొట్టలు ఉబ్బినట్లుగా ఉన్నాయి. తీవ్రంగా డయేరియా వచ్చింది. పాలిచ్చిన ప్రతీసారి వాంతి చేసుకుంటాడు. నా ఇంకో కుమారుడిని మూడుసార్లు ఆసుపత్రికి తీసుకెళ్లి సెలైన్ పెట్టించాల్సి వచ్చింది. అయినప్పటికీ అతని పరిస్థితిలో ఏ మార్పూ లేదు’’ అని ఓలీ చెప్పారు.

గాజాలో నిరాశ్రయులుగా మారిన వారికి స్వచ్ఛమైన మంచినీరు దొరకడం పెద్ద సవాలు.

రోజువారీ అవసరాలన్నింటి కోసం ప్రతీ వ్యక్తికి కేవలం 3 లీటర్ల నీరు మాత్రమే అందుతుందని యూఎన్ చెప్పింది.

‘‘మాకు నీళ్లు లేవు. నా బిడ్డకు పాలు లేవు. టాయ్‌లెట్ల పరిస్థితి వర్ణనాతీతం. ఆ దుర్వాసనను భరించలేం. వాటిని వాడుకోవడం కోసం కూడా మా వంతు వచ్చేవరకు ఎదురుచూడాలి’’ అని ఓలీ తెలిపారు.

ఓలీ ఉన్న స్కూల్ శిబిరంలోనే వఫా యూసుఫ్ ఫఖ్రీ అహ్మద్ కూడా ఆశ్రయం పొందుతున్నారు.

‘‘నేను గర్భంతో ఉన్నా. నా కడుపులోని బిడ్డ గురించి ఆందోళనగా ఉంది. ప్రసవం దగ్గర పడుతోంది. నేను ఉంటున్న ఈ వాతావరణ పరిస్థితుల్ని చూస్తే వ్యాధులు వస్తాయోమోనని భయంగా ఉంది. కనీస అవసరాలకు కూడా ఇక్కడ నీళ్లు లేవు’’ అని వఫా చెప్పారు.

వఫా, ఉత్తర గాజా సరిహద్దు సమీపంలోని బీట్ హానూన్‌ ప్రాంతానికి చెందినవారు. భద్రతను వెదుక్కుంటూ ఆమె కూడా ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు వచ్చారు.

‘‘ముందు మేం అల్-మువాస్కర్ ప్రాంతంలోని ఒక స్కూల్‌కు వెళ్లాం. అయితే, అక్కడినుంచి వెళ్లిపోవాలని మాకు చెప్పారు. దీంతో మేం మరింత ముందుకు వచ్చాం. దారిలో ఒక్కోసారి బండ్లు, గాడిదల సహాయం తీసుకున్నాం. చాలావరకైతే మేం నడుచుకుంటూనే వచ్చాం’’ అని ఆమె చెప్పారు.

తాగడానికి మంచినీళ్లు కూడా లేవని, సముద్రపు నీరు తప్ప తమకు మరో అవకాశం లేదని ఆమె తెలిపారు.

తగినంతగా ఆరోగ్య రక్షణ వసతులు లేకపోవడంతో గాజాలో ప్రసూతి మరణాలు పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.

యుద్ధం కారణంగా గర్భిణీలు ప్రమాదకర పర్యావసనాలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఒత్తిడి కారణంగా గర్భస్రావాలు, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, కడుపులోనే శిశువు మరణించడం వంటి దారుణ పరిస్థితుల్ని గర్భిణులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

గాజా నగరానికి చెందిన అస్మా, తన ముగ్గురు పిల్లలతో కలిసి అల్ అక్సా ఆసుపత్రి ప్రాంగణంలోని ఒక టెంట్ కింద నివసిస్తున్నారు.

సెంట్రల్ గాజాకు చెందిన డెయిర్ అల్-బలాహ్‌లో అల్ అక్సా ఆసుపత్రి ఉంటుంది.

ఆమె కూడా గర్భిణి. ఇళ్లు వదిలి రాకముందే ఆమె గాజాలోని అల్-షిఫా ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్లారు.

‘‘నిరంతరం వచ్చే బాంబుల శబ్ధాల కారణంగా, అల్-షిఫాలోని చాలామంది మహిళలకు గర్భస్రావం అయింది. అక్కడి పరిస్థితిని ఎవరూ తట్టుకోలేరు. ముఖ్యంగా గర్భిణులు. నా కడుపులోని బిడ్డ గురించి చాలా ఆందోళన చెందాను. నాక్కూడా గర్భస్రావం అవుతుందేమోనని భయపడ్డా’’ అని అస్మా చెప్పారు.

రోజూ ఒళ్లు నొప్పులతో నిద్రలేవడం పరిపాటిగా మారింది. అపరిశుభ్ర వాతావరణంలో ఉండాల్సి వచ్చింది. తరచుగా మృతదేహాలను చూడాల్సి వచ్చింది’’ అని ఆమె తెలిపారు.

ఇక తాను అలసిపోయానని ఆమె అన్నారు. యుద్ధం ఆపాలని ఆమె కోరుతున్నారు.

‘‘యుద్ధాన్ని ఆపాలని వేడుకుంటున్నా. ఇంత బాధ అనుభవించడానికి చిన్నారులు చేసిన తప్పేంటి? ఇంకా ఈ లోకంలోని రాని నా బిడ్డ చేసిన తప్పేంటి? ’’ అని ఆమె ప్రశ్నించారు.

అదనపు రిపోర్టింగ్: మజ్దీ ఫతీ (గాజా), హనీన్ అబ్దీన్ (జెరూసలేం).

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)