You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లోక్‌సభ ఎన్నికలు 2024: 13 రాష్ట్రాలు, 88 స్థానాలలో రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ, హేమమాలిని సహా మరెందరో ప్రముఖులు...
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. మొత్తం 13 రాష్ట్రాలలో 88 సీట్లలో పోలింగ్ మొదలైంది.
రెండో దశలో రాహుల్ గాంధీ, అరుణ్ గోవిల్, హేమమాలిని, శశిథరూర్ లాంటి ఉద్ధండులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రెండో దశలో మొత్తం 15.88 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 1.67 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్లమంది మహిళలు ఉండగా 5929మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.
ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని..?
రెండో దశ పోలింగ్‌లో అస్సాంలో 5 సీట్లు, బిహార్ 5 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 3 స్థానాలు, జమ్ము కశ్మీర్‌లో 1, కర్ణాటకలో 14 సీట్లు , కేరళలో మొత్తం 20 స్థానాలు, మధ్యప్రదేశ్‌లో 7, మహారాష్ట్రలో 8, మణిపుర్‌లో 1, రాజస్థాన్‌లో 13, త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్‌లో 8, పశ్చిమబెంగాల్‌లో 3 సీట్లు ఉన్నాయి.
రెండోదశలో కీలక స్థానాలు
రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో వాయనాడ్ నుంచి బరిలోకి దిగారు. రెండోసారి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేఠితో పాటు వాయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలలో అమేఠిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. కానీ వాయనాడ్ నుంచి గెలిచారు. ఇక్కడ ఆయనకు రికార్డుస్థాయులో మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఆయన వాయనాడ్‌లో సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా, బీజేపీ నేత కె. సురేంద్రన్‌ను ఎదుర్కొంటున్నారు.
అన్నీరాజా సీపీఐ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు. ఆమె సీపీఐ కార్యదర్శి డీ. రాజా భార్య. భారత మహిళా జాతీయ సమాఖ్యకు ఆమె కార్యదర్శిగానూ ఉన్నారు. ఇక సురేంద్రన్ బీజేపీకి కేరళ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఓం బిర్లా: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా రాజస్థాన్‌లోని కోట నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గత పదేళ్ళుగా లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ప్రహ్లాద్ గంజ్‌ను ఎదుర్కొంటున్నారు. ప్రహ్లాద్ గతంలో బీజేపీలోనే ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు.
శశి థరూర్: రెండోదశలో పోలింగ్ జరుగుతున్న కేరళలోని తిరువనంతపురంపైనే అందరికళ్ళు ఉన్నాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పాతకాపు శశిథరూర్ పోటీ చేస్తున్నారు. ఆయన 2009 నుంచి ఈ నియోజకవర్గంలో గెలుస్తూనే ఉన్నారు. ఈసారి ఆయనకు పోటీగా బీజేపీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖరన్‌ను బరిలోకి దింపింది. సీపీఐ నుంచి పన్నియన్ రవీంద్రన్ పోటీ చేస్తున్నారు.
హేమమాలిని: మథుర నియోజకవర్గం నుంచి సినీనటి హేమమాలిని పోటీ చేస్తున్నారు. మధుర నుంచి రెండుసార్లు గెలిచిన ఈ పాతతరం నటిపై బీజేపీ మరోసారి నమ్మకం ఉంచింది. 2014లో ఆమె ఆర్ఎల్‌డీ అభ్యర్థి జయంత్ చౌధురి, 2019లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్‌డీ కూటమి అభ్యర్థి నరేంద్రసింగ్‌ను ఓడించారు.
ఈసారి ఆర్ఎల్‌డీ బీజేపీతో జత కట్టింది. ప్రస్తుతం హేమమాలిని కాంగ్రెస్ అభ్యర్థి ముకేష్ దంగార్‌ను ఎదుర్కొంటున్నారు.
అరుణ్‌గోయల్ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నియోజవకర్గంపై కూడా చాలామందికి ఆసక్తి ఉంది. ఇక్కడ నుంచి టీవీ రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్‌గోయల్ పోటీచేస్తున్నారు. గతంలో మూడుసార్లు ఎంపీగా గెలిచిన రాజేంద్రన్ అగర్వాల్‌ను కాదని బీజేపీ ఈసారి అరుణ్‌కు టిక్కెట్ ఇచ్చింది. ఇక్కడ సమాజ్‌వాది పార్టీ రెండుసార్లు అభ్యర్థులను మార్చి చివరగా సునీత వర్మను రంగంలోకి దించింది. బీఎస్పీ తరపున దేవ్ వ్రత్ త్యాగీ పోటీచేస్తున్నారు.
భూపేష్ బఘేల్: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈసారి రాజనంద్‌గాన్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ సంతోష్ పాండేపై పోటీ చేస్తున్నారు.
తేజస్వీ సూర్య: బీజేపీకి కంచుకోట అయిన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి తేజస్వీ సూర్య రంగంలోకి దిగారు. 2019 ఎన్నికలలో ఆయన ఇక్కడి నుంచి గెలిచారు. తాజా ఎన్నికలలో మరోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి సౌమ్యారెడ్డి పోటీ చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సౌమ్యారెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె తండ్రి రామలింగ కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
పప్పుయాదవ్: బిహర్‌లోని పుర్ణియా లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ పప్పుయాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. పప్పు యాదవ్ తన జన్ అధికార పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కానీ ఈ సీటు అలయన్స్‌లో భాగంగా ఆర్జేడీకి వచ్చింది. ఆర్జేడీ తరపున బీమా భారతి అభ్యర్థిగా నిలబడ్డారు. జనతాదళ్ యునైటెడ్ నుంచి సంతోష్ కుష్వా పోటీ చేస్తున్నారు. దీంతో ఈసారి భారీ ఎత్తున ఓట్లు చీలిపోతాయని భావిస్తున్నారు.
వైభవ్ గహ్లోత్ : రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్ కాంగ్రెస్ పార్టీ తరపున జలోర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానాన్ని ఇప్పటికే బీజేపీ వరుసగా 4 సార్లు గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి:
- నెజాక్ యూడా: ఇజ్రాయెల్ ఆర్మీలో అమ్మాయిలకు దూరంగా మసలే ఈ సైనికుల పటాలంపై అమెరికా ఆంక్షలు విధిస్తుందా?
- లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి, దీన్ని తాగితే శరీరానికి ఏమవుతుంది?
- బ్రాయిలర్ చికెన్ సంతాన సమస్యలకు దారితీస్తుందా? కొన్ని అపోహలు, వాస్తవాలు
- కంటి చికిత్సకు వెళ్లాలనుకున్న వీరప్పన్‌ను సినీ ఫక్కీలో పోలీసులు ఎలా బోల్తా కొట్టించారు? ఆఖరి క్షణాల్లో జరిగిన డ్రామా ఏంటి?
- ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలలో సమస్య ఉన్నట్లే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)