2023: డిసెంబర్ 31 లోపు ఈ పనులు చేయండి, కొత్త సంవత్సరంలో ఇబ్బందులు ఉండవ్

2023 సంవత్సరం ముగియడానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది.

2024 మొదలైన వెంటనే బ్యాంకులు, ఆదాయపు పన్ను, పెట్టుబడులు, ఇతర డాక్యుమెంట్లకు సంబంధించిన అనేక కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి.

పలు అంశాలలో మార్పులు చేర్పులకు డిసెంబర్ 31, 2023 ఆఖరు తేదీ.

కాబట్టి, ఈ తేదీలోపు మార్పులకు సంబంధించిన ఈ పనులను చేయండి.

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్

2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2023-24) మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయకపోతే, దానిని డిసెంబర్ 31 వరకు ఫైల్ చేసుకునే అవకాశం ఉంది.

అప్పటిలోగా మీరు రిటర్న్స్ దాఖలు చేయకపోతే, ఇంకా ఆలస్యం చేస్తే రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే దానికి కూడా గడువు డిసెంబర్ 31, 2023 వరకు ఉంటుంది.

లాకర్ రూల్స్ మారాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి కూడా గడువు డిసెంబర్ 31, 2023.

ఒకవేళ లాకర్‌ను వాడుకుంటున్న వ్యక్తి ఈ కొత్త అగ్రిమెంట్‌పై సంతకం చేయకపోతే లాకర్‌ను ఫ్రీజ్ చేస్తారు.

ఆగస్టు 2021, ఆగస్టు 18న ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీన్ని పూర్తి చేయడానికి డిసెంబర్ 31, 2023 వరకు గడువు ఇచ్చింది.

చాలా బ్యాంకులు కస్టమర్ల హక్కులు సహా కొత్త నిబంధనలతో అగ్రిమెంట్‌ను సిద్ధం చేశాయి. వీటిపై కస్టమర్లు సంతకం చేయాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డ్ మార్పులు

ఆధార్ కార్డ్‌లో ఏవైనా మార్పులు చేయాలనుకునే వారు ఎటువంటి రుసుము లేకుండా చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2023.

జనవరి 1, 2024 నుండి దీనికి రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

డీమాట్ అకౌంట్లలో నామినీ పేర్లు

ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారికి, నామినేషన్ (డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్ ఖాతాదారు తరపున నామినీ పేరు) అప్‌డేట్ చేయడానికి ది సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చివరి తేదీని జూన్ 30, 2024 వరకు పొడిగిస్తున్నట్లు డిసెంబర్ 27న ప్రకటించింది.

అంతకు ముందు చివరి తేదీ డిసెంబర్ 31, 2023.

కొత్త సిమ్‌కు డిజిటల్ కేవైసీ

సిమ్‌ కార్డుల కోసం పేపర్ ఆధారిత కేవైసీ (నో యువర్ కస్టమర్)ని రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకటించింది.

జనవరి 1 నుండి కొత్త సిమ్ కార్డ్‌ పొందడానికి కస్టమర్‌లు ఇకపై ఫామ్స్ నింపాల్సిన పని లేదు. డిజిటల్‌గా పూరిస్తే సరిపోతుంది.

కొత్త సిమ్‌ తీసుకోవడానికి ఆధార్ ఎనబుల్డ్ డిజిటల్ కేవైసీ ప్రక్రియ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.

సామాన్యులకు అర్ధమయ్యేలా పాలసీ రూల్స్

పాలసీదారుల టెక్నికల్ సమస్యలను పరిష్కరించడంలో పాలసీ నిబంధనలు, షరతులను మెరుగైన పద్ధతిలో అర్ధం చేసుకోవడానికి వీలుగా బీమా కంపెనీలు పాలసీలోని ముఖ్యమైన ఫీచర్లను జనవరి 1, 2024 నుంచి బీమా కంపెనీలు నిర్ణీత ఫార్మాట్ అందించాలి.

ఈ కండీషన్లను వివరంగా అందించడానికి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను సవరించింది.

పార్సిల్స్ పంపడం ఇక ఖరీదైన పని

బ్లూ డార్ట్‌తో సహా ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ బ్రాండ్‌లను నిర్వహిస్తున్న డీహెచ్‌ఎల్ గ్రూప్, జనవరి 1 నుంచి పార్సెల్‌ ధరలను 7 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

దీని కారణంగా కస్టమర్లు షిప్పింగ్ కంపెనీ ద్వారా పంపాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది.

కార్ల ధరలు పెరుగుతాయి.

ద్రవ్యోల్బణం ఒత్తిడి, కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మెర్సిడెస్, ఆడి వంటి కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

కొత్త సంవత్సరంలో ఈ కంపెనీల కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)