39 ఏళ్ల తర్వాత మళ్లీ పెను వరదల్లో చిక్కుకున్న నగరం, వర్ష బీభత్సం 9 ఫోటోల్లో...

    • రచయిత, అనహిత సచ్‌దేవ్
    • హోదా, బీబీసీ న్యూస్

కోల్‌కతాలో గత 39 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు 10 మందికి పైగా చనిపోయారు.

వీరిలో తొమ్మిది మంది నిలిచిన వాన నీళ్లలో కరెంట్ ప్రవహించడం వల్ల విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.

సోమవారం రాత్రి నుంచి కోల్‌కతా నగరం, దాని శివారు ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు వాననీటితో జలమయం అయ్యాయి.

అనేక కీలక రోడ్లు నీళ్లలో మునిగిపోగా, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కోల్‌కతాలో దుర్గా పూజకు ప్రజలు సన్నద్ధం అవుతున్న వేళ ఈ వరదలు నగరంలో పోటెత్తాయి.

నగరంలో 24 గంటల వ్యవధిలో 251.4మి.మీ వర్షపాతం కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1986 తర్వాత కోల్‌కతాలో ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారి.

అలాగే గత 137 ఏళ్లలో ఈ రీజియన్‌లో ఒకేరోజు కురిసిన ఆరో అత్యధిక వర్షపాతం కూడా ఇదే.

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.

నగరంలో రానున్న కొన్ని రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇంతటి వర్షాన్ని తానెప్పుడూ చూడలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వానల వల్ల జరిగిన ప్రాణనష్టానికి చింతిస్తున్నట్లు, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

9 మంది కరెంట్ షాక్‌తో చనిపోవడంతో, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి అధికారులు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

నగరంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)