You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం’ - ఏపీ సీఎం చంద్రబాబు
అచ్యుతాపురం సెజ్‌లోని 'ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్'లో జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పు ఎవరిదని తేలినా వదిలిపెట్టబోమని, చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కంపెనీ రెడ్ కేటగిరీలో ఉందని తెలిపారు. ఓ కంపెనీ భద్రతలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏ విధంగా ఉంటుందో ఈ ప్రమాదం నిదర్శనమని అన్నారు.
రెడ్ కేటగిరీలో ఉన్న ఇండస్ట్రీలన్నీ కూడా భద్రతపరంగా ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని, లోపాలు సరిచేసుకోవాలని చెప్పారు. ప్రజల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలన్నారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఈ రోజే నష్టపరిహార చెక్కులను పంపిణీ చేయాలని చెప్పామన్నారు.
అచ్యుతాపురం సెజ్‌లో గత ఐదు సంవత్సరాల్లో 119 ప్రమాదాలు జరిగాయని, అందులో 120 మంది మృతి చెందినట్లు చెప్పారు.
అచ్యుతాపురం ప్రమాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. పరిశ్రమలలో సేఫ్టీ ఆడిటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
అధికారంలోకి వచ్చిననాటి నుంచి పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ చేయమని చెబుతూనే ఉన్నానని ఆయన తెలిపారు. ఈవిషయంలో కంపెనీ యాజమాన్యాలు భయపడుతున్నాయని, వాళ్లకు వివరించాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ గురించి సెప్టెంబర్‌లో చర్చించాలనుకున్నాం. కానీ, ఈ నెల చివరలోనే ఈ విషయంపై కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతాను'' అని పవన్ అన్నారు.
సేఫ్టీ ఆడిటింగ్ జరిగితే పరిశ్రమలు మూతపడతాయోమోనని యజమానులు ఆందోళన చెందుతున్నారని, దీని గురించి వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.
‘’ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొనసాగుతున్న ఈ రసాయనిక కర్మాగారానికి ఇద్దరు యజమానులు ఉన్నారు. వీరి మధ్యన విభేదాలు ఉండటంతో సేఫ్టీ ఆడిట్ చేయించలేదు’’ అని పవన్ తెలిపారు.
‘సేఫ్టీ ఆడిట్ జరగకపోవడమే కారణం’
‘‘అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం దురదృష్టకరం. ఈ ప్రాంతంలోనే ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని’’ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
‘’బాధితులను కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. చాలా కాలంగా సేఫ్టీ ఆడిట్ జరగకపోవడమే ప్రమాదానికి కారణం. థర్డ్ పార్టీతో కూడా ఆడిట్ చేయించాలనుకున్నాం. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెజ్ యాజమాన్యాలు, పారిశ్రామిక వేత్తలు, స్టీల్ ప్లాంట్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ సంస్థలతో సమావేశం నిర్వహించి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చించారు. ఈ ప్రమాదంలో యాజమాన్యంతో పాటు అధికార వ్యవస్థకు కూడా బాధ్యత ఉంది’’ అని కొణతాల తెలిపారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో పలువురు చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. పీఎంవో సోషల్ మీడియాలో హ్యాండిల్‌లో ఈ విషయం తెలియజేశారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేలు ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించారు.
కోటి పరిహారం అందించాలి: జగన్
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మాకంపెనీలో జరిగిన ప్రమాదంలో పలువురు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)