సంక్రాంతి తేదీ మారుతూ ఉంటుంది, ఎందుకు? శివాజీ కాలంలో ఈ పండుగ ఎప్పుడు జరుపుకొనేవారు?

మకర సంక్రాంతి పండుగను తెలుగువారు ఒక్కోసారి జనవరి 15న, కొన్నిసార్లు జనవరి 14న జరుపుకుంటారు. ఎందుకు?

2024లో సంక్రాంతి జనవరి 15న, 2025లో జనవరి 14న జరుపుకున్నారు. 2026లో మళ్లీ జనవరి 15న ఈ పండగ వచ్చింది.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అయితే, కొన్నిసార్లు జనవరి 14వ తేదీ సాయంత్రమే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఒకవేళ సూర్యాస్తమయం తర్వాత మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే మరుసటి రోజును ‘ఉత్తరాయణ పుణ్యకాలం’ ప్రారంభంగా పరిగణిస్తారు. అలా వచ్చిన ఏడాదిలో జనవరి 15వ తేదీన సంక్రాంతిని జరుపుకుంటారని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ సోమన్ చెప్పారు.

భారత్‌లో సంప్రదాయ క్యాలెండర్‌ ప్రకారం సూర్యుని సంచారం ఆధారంగా జరుపుకొనే ఏకైక పండుగ మకర సంక్రాంతి.

అయితే, సూర్యుని ఆధారంగా రూపొందిన ఇంగ్లిష్ క్యాలెండర్ (గ్రెగోరియన్) ప్రకారం, ఈ తేదీ మారకూడదు. కానీ, సంక్రాంతి తేదీ మారుతూ వస్తోంది. ఇకపై కూడా మారుతూనే ఉంటుంది.

21వ శతాబ్దం చివరి దశలో సూర్యుడు జనవరి 15న మకరరాశిలోకి ప్రవేశిస్తాడని సీనియర్ సైన్స్ రచయిత మోహన్ ఆప్టే తన పుస్తకం ‘మాలా ఉత్తర్ హవయ్’‌లో పేర్కొన్నారు.

ఛత్రపతి శివాజీ కాలంలో మకర సంక్రాంతిని జనవరి 8 లేదా 9వ తేదీల్లో జరుపుకొని ఉండొచ్చునని ఆయన అందులో రాశారు.

శివాజీ కాలంలో భారత్‌లో ఎవరూ గ్రెగోరియన్ క్యాలెండర్‌ను వాడలేదు.

సంక్రాంతి పండుగ తేదీల్లో మార్పులపై ఖగోళ శాస్త్రజ్ఞుడు మయూరేశ్ ప్రభుణే బీబీసీతో మాట్లాడారు.

‘‘అంతరిక్షంలో ఏదీ స్థిరంగా ఉండదు. మకర రాశి సంక్రమణ తేదీ మారుతూ ఉంటుంది. 2080 నాటికి వసంత్ సంక్రాంతి, భారతీయ సంక్రాంతి మధ్య 25 డిగ్రీల అంతరం ఉంటుంది. మేషారంభంలో మళ్లీ సంక్రాంతి జనవరి 15న వస్తుంది’’ అని చెప్పారు.

తర్వాత జనవరి 16కు సంక్రాంతి మారుతుంది.

సంక్రాంతికి, ఉత్తరాయణానికి మధ్య సంబంధం

జనవరి 14న ఏం జరుగుతుంది? అని అడగగానే ఆ రోజున ఉత్తరాయణం మొదలవుతుందని అందరూ చెప్పేస్తారు. అందుకే ఈ రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో సంక్రాంతి పండుగను, గుజరాత్‌లో ఉత్తరాయణాన్ని వేడుకగా జరుపుకుంటారు.

కానీ, ఇక్కడొక ఆశ్చర్యకర సంగతి గురించి చెప్పుకోవాలి.

1728కి ముందే ఉత్తరాయణం, మకర సంక్రాంతి ఒకే రోజున రావడం ఆగిపోయింది. అప్పట్లో డిసెంబర్ 22న ఉత్తరాయణం వచ్చేది. డిసెంబర్ 22ను ‘అతి చిన్న రోజు’గా పరిగణిస్తారు. అంటే ఏడాదిలో ఆ రోజున పగలు సమయం అత్యంత తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది.

దీని తర్వాత రోజు నుంచి పగటి సమయం పెరుగుతుంది. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తాడు.

దీని ప్రకారం చూసుకుంటే ఉత్తరాయణానికి, మకర సంక్రాంతికి మధ్య 22 రోజుల తేడా ఉంది. అయితే ఈ రెండు రోజుల మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని గమనించడం చాలా ముఖ్యం. ఈ అంతరం ఇంకా పెరుగుతూనే ఉంటుంది.

ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. భూమి తన అక్షం మీద నిట్టనిలువుగా కాకుండా తూర్పుకు 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి తన కక్ష్యలో భూభ్రమణం (తన చుట్టు తాను తిరగడం) చెందుతూ ఉంటుందని భౌగోళిక శాస్త్రంలో మనం చదువుకున్నాం.

భూమి సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చే మార్గాన్ని కక్ష్య అంటారు. ఈ కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. భూపరిభ్రమణం, భూమి అక్షం వంగి ఉండటం వల్ల రుతువులు ఏర్పడతాయి.

పూర్వకాలంలో ఒక తోకచుక్క, భూమిని ఢీకొట్టడం వల్ల భూమి అక్షం వంగి ఉండొచ్చునని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు డాక్టర్ కరణ్ జానీ అభిప్రాయపడ్డారు.

‘ప్రొసెషనల్ మోషన్’ అంటే ఏమిటి?

ఈ 23.5 డిగ్రీల వంపు కూడా స్థిరంగా ఉండదు. గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది. ఇది ఒక చక్రాన్ని పూర్తి చేయడానికి 26 వేల సంవత్సరాలు పడుతుంది. దీన్ని ప్రొసెషనల్ మోషన్ అని పిలుస్తారు. అంటే భూమి ఏకకాలంలో మూడు రకాలుగా తిరుగుతుంటుంది. ఒకటేమో తన చుట్టు తాను (భూభ్రమణం), రెండోది సూర్యుని చుట్టూ (భూపరిభ్రమణం), మూడోది దాని సొంత ఏటవాలు అక్షం చుట్టూ.

భూమి 23.5 డిగ్రీల కోణం వంగి సూర్యుని చుట్టూ తిరుగుతుండటం వల్ల కొన్ని నిర్ధిష్ట సమయాలకి ఉత్తర భాగం సూర్యునికి దగ్గరగా ఉంటుంది. మరికొన్నిసార్లు దక్షిణభాగం సూర్యుని సమీపానికి వస్తుంది.

మార్చి నుంచి జూన్ వరకు భూమధ్యరేఖ, కర్కటక రేఖల మధ్య ఉండే భాగం సూర్యుడికి ఎదురుగా వస్తుంది. ఈ నెలల్లో సూర్యుడి కిరణాలు ఇక్కడ లంబంగా ప్రసరించడం వల్ల వేడి అధికంగా ఉంటుంది. ఈ కాలాన్ని వేసవి కాలం అంటారు.

ఈ సమయంలో సూర్యుడి కిరణాలు దక్షిణార్థగోళంలో ఏటవాలుగా పడతాయి. అందువల్ల చలి అధికంగా ఉంటుంది. దీన్ని శీతాకాలం అంటారు.

భూమి దక్షిణార్థగోళం డిసెంబర్ 21 లేదా 22న సూర్యుని వైపుకు తిరగడం మొదలవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)