సంతాన లేమి: పిల్లలు పుట్టకపోతే సమస్య ఎక్కడో ఎలా తెలుసుకోవాలి?

    • రచయిత, ప్రతిభా లక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

ఒక సంవత్సరం వైవాహిక జీవితం తరవాత పిల్లలు పుట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా, గర్భం దాల్చక పోతే దాన్ని సంతాన లేమి అంటారు.

సంతాన లేమికి, పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన కారణాలు, హార్మోన్లు, ఇన్ఫెక్షన్లు ముఖ్య కారణాలు. అయితే, నేను వైద్యుల భాష వాడి ఇబ్బంది పెట్టను. ఎవరైనా సంతాన లేమితో ఇబ్బంది పడుతుంటే, ఏమి తెలుసుకోవాలి అనే కొన్ని విషయాలు మాత్రమే చర్చిస్తా.

సమస్య ఎక్కడ?

ఒక జంటకు సంతానం కలగకపోతే, ముందుగా దానికి సమస్య పురుషుడి దగ్గర ఉందా, లేదా స్త్రీ వద్దనా అని తెలుసుకోవాలి. పురుషుడి కారణాలు తెలుసుకోవడం చాలా తేలిక. అతని వీర్య పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. మూడు రోజులు శారీరికంగా కలవకుండా ఉండి (abstinence), ఏదైనా పరీక్ష కేంద్రంలో 'semen analysis' పరీక్ష చేస్తే తెలిసిపోతుంది.

అది నార్మల్ ఉంటే, దాదాపు సగం సమస్య లేనట్టే. కానీ అందులో ఏమైనా సమస్య ఉంటే, అది కణాల ఉత్పత్తిలోనా, ఆయుష్షులోనా, వేగంలోనా, లేదా ఏదైనా వ్యాధి లేక ఇన్ఫెక్షన్ వల్లనా అని తగిన పరీక్షలు జరిపి తెలుసుకొని, దానికి తగ్గ చికిత్స తీసుకోవచ్చు.

సమస్య పురుషుడిలో లేదు అని తెలిసాక, స్త్రీ సంబంధిత కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూడాలి.

నెలసరిని గమనించాలి..

స్త్రీ సంబంధిత కారణాలలో, అండం విడుదలలో సమస్య అయ్యి ఉండవచ్చు. లేక, పిండం ఏర్పడడంలో, లేదా దాని ఎదుగుదలలో సమస్య ఉండొచ్చు.

రుతుక్రమం సరిగ్గా ఉండే మహిళల్లో, నెలసరి ప్రారంభానికి, పద్నాలుగు రోజుల ముందు అండం విడుదల అవుతుంది. అది వీర్య కణాలతో కలిస్తే పిండంగా మారుతుంది. లేనప్పుడు, రుతుక్రమంలో రక్త స్రావం అవుతుంది.

కాబట్టి, నెలసరి మొదలయిన పదకొండు లేదా పన్నెండవ రోజు నుండి అండం ఎదుగుదలను గమనిస్తూ ' ovulation study' చేస్తారు.

అలాగే గర్భ సంచి లోపలి పొర (endometrium)లో పిండం ఏర్పడితే, దాని ఎదుగుదలకు దోహద పడేలా సిద్ధం అవుతుందా అని endometrial thickness కూడా గమనిస్తారు.

అండం విడుదల సమస్య అయితే...

అండం విడుదల అవ్వడం లేదు అని నిర్ధారణ అయితే, (anovulatory cycles), PCOS (అండాశయంలో నీటి బుడగలు), లేక థైరాయిడ్ వంటి ఏవైనా హార్మోన్ సమస్యలు దానికి కారణమా అని పరీక్షలు చేసి, వాటికి తగిన చికిత్స అందిస్తారు.

అలాంటి కారణాలు లేనప్పుడు, నెలసరి మొదలయిన రెండవ రోజు నుండి అండం ఎదుగుదలకు అవసరమైన మందులు ఇస్తారు. అండం విడుదల సమస్య అయితే, అది సరిపడా పరిమాణం చేరుకున్నాక ఇంజెక్షన్ ఇచ్చి, అది విడుదల అయ్యేలా చేస్తారు. ఇక అండం విడుదల అవుతుంది అని తెలిస్తే ఇంకొక సగం సమస్య లేనట్టే.

అప్పుడు, విడుదలయిన అండం గర్భసంచి వరకు fallopian tubes ద్వారా చేరుకోవడంలో ఏమైనా సమస్య ఉందా అని చూడాలి.

ఆ నాళ మార్గములో ఏదైనా అడ్డంకి (టీ.బీ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల కలుగవచ్చును.) ఉందా అని తెలుసుకోవడం కోసం hysterosalpingogram (HSG) పరీక్ష చేస్తారు. నెలసరి ఆగిపోయిన తరవాత, రుతుక్రమంలో ఏడవ లేక ఎనిమిదవ రోజు ఈ పరీక్ష చేస్తారు. కొన్ని సార్లు HSG పరీక్షలో పంపించే dye వల్ల కూడా మార్గం తెరుచుకోవచ్చు.

ఒకటి లేక రెండు నాళాలలో ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకొని, దానికి తగ్గట్టు చికిత్స చేస్తారు. ఒక దాంట్లో బ్లాక్ ఉంటే పెద్దగా సమస్య కాదు. రెండిటిలో సమస్య ఉంటే మాత్రం, ఇతర చికిత్సలు అవసరం అవుతాయి.

గర్భసంచిలో సమస్య ఉంటే..

అండం ఉత్పత్తి, విడుదల, రవాణాలో ఇబ్బంది లేకపోతే పిండం గర్భ సంచిలో కూర్చోవడంతో సమస్య ఉంది అని అర్థం. అప్పుడు దానికి తగిన హార్మోన్ మందులు ఇస్తారు.

అలాగే గర్భ సంచి లోపలి పొర మందం సరిగ్గా లేకపోయినా, దానిని పెంచడానికి తగిన మందులు అందిస్తారు. గర్భం దాల్చిన కొన్ని వారాలకే గర్భస్రావం జరగడానికి జన్యు పరమైన కారణాలు ఉండవచ్చు.

మేనరికం ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. లేదా rubella, toxoplasma, CMV, Herpes (TORCH group) వంటి ఇన్ఫెక్షన్లు కారణం అవ్వొచ్చు. తక్కువ శాతం మహిళల్లో కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు కారణం అవుతాయి.

ఒక్కోసారి ఒత్తిడితో కూడా

కొన్ని సందర్భాల్లో స్త్రీ, పురుషుడు ఇద్దరిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భం దాల్చడంతో ఆలస్యం, ఇబ్బంది కలగడం చూస్తుంటాం.

సంతాన లేమికి చాలా సాధారణ కారణం కేవలం ఒత్తిడి. మన మానసిక స్థితి, ఒత్తిడి మన హార్మోన్ల మీద చాలా ప్రభావం చూపిస్తుంది.

దానిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. పొగాకు, మద్యం, అధిక బరువు, తక్కువ బరువు, అనారోగ్యకర జీవన శైలి వంటివి కూడా సంతాన లేమికి కారణాలు.

కేవలం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు రోజూ ఒకటి ఇవ్వడం వల్ల కూడా ఎన్నో సందర్భాలలో మహిళలు గర్భం దాల్చడం జరుగుతుంది.

మందులు, ఇంజెక్షన్లు, IUI, IVF, వంటి అధునాతన చికిత్సా విధానాలు ప్రయత్నించిన తరవాత కూడా గర్భం దాల్చని జంటలు కృంగు బాటుకు గురి అవ్వకుండా, కుటుంబంలో గొడవలతో ఇబ్బంది పడకుండా, అనాధ పిల్లలను దత్తతు తీసుకొని ఒక పాపకి లేక బాబుకి మెరుగైన జీవితాన్ని అందించగలిగితే మంచిది.

వారికి తల్లితండ్రులు లేని లోటు, వీరికి పిల్లలు లేని లోటు తీరిపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)