You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం: ‘తిరుమలలో దర్శనం కాలేదని మా పొలంలోనే గుడి కట్టాం’.. ఎవరీ హరి ముకుంద పండా?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఈ ఘటన జరిగింది.
అయితే, ఈ ఆలయం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉందని, అసలు ఆలయం గురించి ప్రభుత్వానికి సమాచారం లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
ఇంతకీ ఈ ఆలయం ఎవరు కట్టారు? ఎవరి నిర్వహణలో ఉంది?
'తిరుమల దర్శనం సరిగా జరగలేదని గుడినే కట్టిన భక్తుడు'
పలాసలో నివాసముంటున్న హరిముకుంద పండా అనే భక్తుడు ఈ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. నాలుగు నెలల కిందటే ఆలయాన్ని ప్రారంభించారు. ఇంతకీ పండా ఈ ఆలయం ఎందుకు నిర్మించారు?.
తిరుమల ఆలయానికి వెళ్లిన తనకు దేవుడి దర్శనం సరిగా జరగలేదని, దీంతో పలాసలోని తన వ్యవసాయ భూమిలో ఏకంగా వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు హరిముకుంద పండా గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
తిరుమలలో దేవుడి కోసం "గంటలపాటు క్యూలో నిల్చుని, లోపలికి వెళ్లాక వెంటనే బయటికి తోసేశారు. అయ్యా, అయ్యా దర్శనం కొద్దిగా అయ్యా, ఒక్క నిమిషం అన్నా ఒప్పుకోలేదు. తోసేస్తున్నారు. ఏం చూస్తాం, నాకు ఏమీ కనిపించలేదు'' అని పండా అన్నారు.
కేవలం దర్శనం సరిగా కాలేదని గుడి కట్టడమేంటి? అని బీబీసీ పండాను ప్రశ్నించగా, "శ్రీనివాసుడంటే మాకు గొప్ప. ఆర్నెల్లకో, ఏడాదికోసారి దేవుడి దర్శనం కోసం వెళ్లేవాడిని, చాలా బాగా జరిగేది. దాంతో అనేక సంవత్సరాల తరువాత చివరగా పదేళ్ల కిందట వెళ్లాను. అప్పటికి అంతా మారిపోయింది. దేవుడు, గుడి కనపడటం లేదు. చాలా బాగా మారిపోయింది. సరే అని నేనూ మా గుమాస్తా వెళ్లాం, దర్శనం టికెట్ తీసుకున్నాం. క్యూ లైన్ 9 గంటలకు మొదలైనా 2 గంటల వరకు కూడా లోపలికి వెళ్లలేకపోయాం. తీరా లోపలికి వెళ్లాక, దేవుడి దర్శనం సరిగా కాలేదు, బయటికి తోసేశారు. వచ్చాక మా అమ్మకు విషయం చెప్పాను. దర్శనం బాగా జరగలేదని, బాధపడినట్లు చెప్పాను. అప్పుడు, ఇక్కడే గుడి కడదాం మన జాగాలోనే అన్నారు'' అని చెప్పారు.
'మా అమ్మ భూమి రాసిచ్చారు'
"అమ్మ ఈ గుడి కోసం 12 ఎకరాల 40 సెంట్ల భూమి శ్రీనివాసుడి పేరు మీద రాసిచ్చారు. ఆ భూమిని మా పిల్లలు కూడా అనుభవించడానికి లేదు. సొంత జాగాలో మా డబ్బుతో గుడి నిర్మించాం. తిరుపతి నుంచే 9 అడుగుల 9 అంగుళాల దేవుడి విగ్రహం తెచ్చాం. శ్రీదేవి, భూదేవిని కూడా అక్కడి నుంచే తెచ్చాం. వాస్తు ప్రకారం, వేదశాస్త్ర పండితుల సూచనలతో ఏకశిల రాయితో విగ్రహాన్ని చేయించాం'' అని పండా చెప్పారు.
ఎవరినీ చందాలు, విరాళాలు అడగలేదని, వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయంతోనే గుడి నిర్మించినట్లు పండా చెప్పారు.
తిరుమల దర్శనానికి వెళ్లిన చాలామందికి తనలాంటి పరిస్థితే ఎదురవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
"ప్రజలు ఎలా వెళ్తున్నారు, ఎలా దర్శనం చేసుకుంటున్నారో నాకు ఆశ్చర్యం వేస్తోంది. అక్కడికి వెళితే ఎంపీ లేదా ఎమ్మెల్యే, మంత్రి లేఖ ఉందా అని అడుగుతారు. నేను ఎక్కడి నుంచి తేగలను. దేవుడెవ్వరికీ కనపడటం లేదు'' అని పండా అన్నారు.
'భక్తులు పూజించాలనే కట్టాం'
పండాకు పలాసలో వంద ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులోనే కొంత భూమిలో గుడి నిర్మించారు. ఈ గుడి నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.
ఈ ఆలయంలో మూలవిరాట్ తిరుమల విగ్రహాన్ని పోలి ఉంటుంది. రాజస్థాన్ నుంచి అనేక ఏకశిల విగ్రహాలను తెచ్చారు. రామాయణ, భాగవత, మహాభారతాలను ఆలయ గోడలపై విగ్రహాల రూపంలో పెట్టించారు. భక్తుల కోసం వసతి గృహాలు, కల్యాణ మండపాలు కూడా నిర్మించారు.
గుడి "అందరూ చూడాలి, ఆనందించాలి, పూజించాలని కట్టాం'' అని పండా అన్నారు.
తన కొడుకు దిల్లీలో మెడిసిన్ చదివారని, ఆయనే తన తర్వాత గుడి బాధ్యతలు చూసుకుంటారని పండా తెలిపారు.
తొక్కిసలాటపై ఏమన్నారు?
ప్రస్తుత ప్రమాదం గురించి హరిముకుంద పండాను శనివారం స్థానిక మీడియా ప్రశ్నించగా, ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు.
సాధారణంగా ఆలయానికి 2 వేల మంది భక్తులు వస్తారని, ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పండా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)