భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 7 కిలోమీటర్ల పొడవైన లఖ్‌పత్ కోట గురించి మీకు తెలుసా?

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 7 కిలోమీటర్ల పొడవైన లఖ్‌పత్ కోట గురించి మీకు తెలుసా?

ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో చివరి గ్రామంలోని నిర్మానుష్య లఖ్‌పత్ కోట కథ ఇది.

కళ్లెదుట మసిబారిన చరిత్ర ఇది. కచ్‌లోని లఖ్‌పత్ ఇది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని లఖ్‌పత్ కోటలో గురునానక్ జ్ఞాపకాలే కాదు, సూఫీ సన్యాసుల గుర్తులూ ఉన్నాయి.

లఖ్‌పత్ గురించి స్థానిక లోకల్ గైడ్ ఉస్మాన్ మరిన్ని విషయాలు చెప్పారు.

‘‘లక్షలను సృష్టించేవాడు లఖ్‌పత్.. ఇక్కడ రావు లఖ్‌పత్ ఉండేవారు. ఈ రెండింటి వల్లా దీనికి ఈ పేరొచ్చింది. లక్షల ఆదాయం వచ్చేది కాబట్టి.. కచ్‌ను రావ్ లఖ్‌పత్ పాలించారు కాబట్టి ఆ రెండు పేర్ల మీదా ఈ కోటను అలా పిలుస్తారు. ఇక్కడ అన్ని కులమతాలకు చెందినవారూ ఉండేవారు. గురునానక్ ఇక్కడికొచ్చారు. సూఫీ సన్యాసులు వచ్చారు. జమాదార్ ఫతే మహమ్మద్ ఏడు కిలోమీటర్ల పరిధిలో ఈ కోటను నిర్మించారు’’ అని ఉస్మాన్ భాయ్ వివరించారు.

ఏ రాజ్యాలూ దీనిపై దండెత్తలేదని, అందుకే ఈ కోటను కువారా అంటారని ఆయన తెలిపారు.

‘‘ఆ కాలంలో వేరే రాజ్యాల వాళ్లు దండెత్తి తమ సంపద దోచుకెళ్తారేమో అని ఇక్కడి వ్యాపారులకు కంటి మీద కునుకు ఉండేది కాదు. అందుకే వారికి రక్షణగా ఈ కోటను నిర్మించారు’’ అని చెప్పారు.

ఈ కోట నుంచి పాకిస్తాన్ కనిపిస్తుంది. ముందుకు వెళ్తే సింధ్ ప్రాంతం వస్తుంది. ఆ తర్వాత కరాచీ వస్తుంది. గురునానక్ ఇక్కడి నుంచే, ఇదే దారి మీదుగా మక్కా వైపు వెళ్లారు. ఇక్కడ ఆయన బస చేశారని చెబుతారు.

‘‘ఇక్కడి నుంచి గురునానక్ మక్కా మదీనా మత ప్రచారానికి వెళ్లారు. రెండుసార్లు వచ్చి వెళ్లారు. ఇక్కడే ఆగారు. మా గ్రామంలో మొదటి నుంచీ అన్ని మతాలనూ విశ్వసించేవాళ్లు. అన్ని వేడుకలను కలిసి చేసుకుంటాం. హిందువులవి ఐదారు ఇళ్లున్నాయి. మా పండుగలకు వాళ్లొస్తే, వాళ్ల పండుగలకు మేం వెళ్తుంటాం’’ అని ఉస్మాన్ భాయ్ తెలిపారు.

ఏళ్ల క్రితం ఇక్కడ నది ప్రవహించేది. వ్యాపారం జరిగేది, సందడి ఉండేది. 1819లో భూకంపం రావడంతో ఇక్కడ ప్రవహించే నది తన ప్రవాహ దిశను మార్చుకుంది. అప్పటినుంచీ ఈ లఖ్‌పత్ కోట నిర్మానుష్యంగా ఉంది. అభిషేక్ బచ్చన్, కరీనాకపూర్ సినిమా రెఫ్యూజీ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఆ సినిమాలోని చాలా సీన్లలో అభిషేక్ బచ్చన్, కరీనాకపూర్ ఇదే దారిలో వెళ్తారు. ఆ ఇద్దరి తారల కెరీర్ ఎంతో ముందుకెళ్లారు. లఖ్‌పత్‌లోని ఈ కోట ఇక్కడే ఇలాగే ఉంది.

ఇక్కడ ఉన్న పీర్ గౌస్ మహమ్మద్ సమాధిని 18వ శతాబ్దంలో నిర్మించారని ఉస్మాన్ భాయ్ చెప్పారు.

‘‘మురీద్ అనే ఆయన అనుచరులు దీన్ని కట్టారు. అప్పట్లో సముద్రం కూడా దగ్గర్లోనే ఉండేది. ఇక్కడ చెరువుల లాంటివి ఉండేవి. అందుకే దీన్ని కాస్త ఎత్తైన చోటులో కట్టారు. దీని గుమ్మటం కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రాంతాల నుంచి దీన్ని చూడ్డానికి వస్తుంటారు’’ అని వివరించారు.

సింద్ నుంచి వలసలు, రాకపోకలు, వ్యాపారం సాగేవని భుజ్‌లోని ప్రాగ్‌మహల్ మ్యూజియం స్థాపకులు దల్‌పత్ భాయీ దానిధారియా తెలిపారు.

‘‘ఆ ప్రాంతమంతా రాతా చోఖా అనే ఎర్ర రంగు బియ్యం ఉండేవి. అవి సమృద్ధిగా దొరికేవి. లఖ్‌పత్ దారి మీదుగానే చాలా మంది వచ్చారు. లఖ్‌పత్ కోటను రక్షణ కోసం నిర్మించారు’’ అని చెప్పారు.

‘‘ఆ రాజ్యం ఆదాయం ఒక రోజుకు లక్ష కోరీలు అంటే లక్ష నాణేలు ఉండేవి. లక్ష కోరీల ఆదాయం వల్లే దానికి లఖ్‌పత్ అనే పేరొచ్చింది. ఫతే మహ్మద్ ఈ ఏడు కిలోమీటర్ల పరిధిలో కోట కట్టించాడని చెబుతారు’’ అని వివరించారు.

ఒకప్పుడు సంపదకు నిలయంగా ఉన్న ఈ కోట ఒక పుస్తకంలా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఎన్నో కథలు పేజీలు తిప్పడం కోసం వేచిచూస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)