You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మీ టీలో ఉప్పుందా? బ్రిటన్, అమెరికా మధ్య దౌత్య జోక్యం వరకు వెళ్లిన ఈ తాజా వివాదం ఏమిటి
- రచయిత, జేమ్స్ గ్రెగోరి
- హోదా, బీబీసీ
ఉదయాన్నే నిద్ర లేవగానే ఓ కప్పుడు వేడి వేడి టీ తాగకపోతే చాలామందికి రోజు గడవదు.
టీ అనగానే పాలు, చక్కెర, టీ పొడే గుర్తుకొస్తాయి ఎవరికైనా.
లేదంటే కొందరు అల్లం టీ తాగుతారు. మరికొందరు బెల్లం టీ తాగుతారు.
కానీ టీ రుచి మెరుగ్గా ఉండటానికి చిటికెడు ఉప్పు కలపాలంటూ ఓ అమెరికా శాస్త్రవేత్త చేసిన పరిశోధన బ్రిటన్‌లో చాలామందిని అసంతృప్తికి గురిచేసింది.
టీ తాగడం బ్రిటన్ సంస్కృతిలో ఓ భాగం.
అక్కడి ప్రజలందరూ ప్రతిరోజూ కనీసం 100 మిలియన్ కప్పుల టీ తాగుతారు.
అయితే బ్రిటన్‌కు సుమారు 5 వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో ఉన్న ఓ సైంటిస్టు మాత్రం చక్కని తేనీరు తయారు చేయాలంటే కొంచెం ఉప్పు కూడా కలపాలంటూ చేసిన పరిశోధనాత్మక ప్రతిపాదన ఇప్పడు బ్రిటన్ ప్రజలకు కోపం తెప్పిస్తోంది.
ప్రొఫెసర్ మిషెల్ ఫ్రాంకిల్ చేసిన ఈ పరిశోధన చివరకు అమెరికా రాయబారం కార్యాలయం స్పందించాల్సినంత వరకు వెళ్లింది.
ఈ పరిశోధనపై బ్రిటన్‌లోని అమెరికా రాయబారం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘బ్రిటన్ జాతీయ పానీయమైన టీలో ఉప్పు కలపాలనే ఊహకు కూడా అందని భావన అమెరికా అధికారిక విధానం కాదు అని మేం యూకే ప్రజలకు స్పష్టం చేయదలచుకున్నాం’’ అని ట్విటర్ వేదికగా తెలిపింది.
అయితే ఈ రెండు దేశాల మధ్య టీ కారణంగా వివాదం ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు.
1773లో బ్రిటన్ విధించిన పన్నలుకు వ్యతిరేకంగా బోస్టన్‌లో 300 డబ్బాల తేయాకును సముద్రంలో పారవేసిన ఘటన చరిత్రలో బోస్టన్ టీ పార్టీగా నిలిచిపోయింది.
ఈ కీలక ఘట్టం అమెరికా విప్లవాన్ని మరింత తీవ్రం చేసింది.
పెన్సిల్వేనియాలోని బ్రైన్ మావర్ కళాశాలలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మిషెల్ ఫ్రాంకిల్ ‘‘దౌత్యపరమైన జోక్యానికి కారణమవ్వాలని నేనస్సలు అనుకోలేదు’’ అని బీబీసీకి చెప్పారు.
‘‘నేను ఉదయం నిద్రదలేచేసరికి నా ఈమెయిల్ బాక్స్ నిండిపోతుందని అసలు ఊహించలేదు. టీలో ఉప్పు కలపాలనే ఆలోచన గురించి ప్రజలు తెగ మాట్లాడుకుంటున్నారు’’ అని తెలిపారు.
ఉప్పెందుకు కలపాలి?
టీలో ఉప్పు కలపడమనేది కొత్త ఆలోచనేమీ కాదు. ఈ విషయం 8వ శతాబ్దం నాటి చైనా తాళపత్ర గ్రంథాలలో ఉంది. వీటి ఆధారంగా చక్కని టీ తయారీ విధానాన్ని ప్రొఫెసర్ మిషెల్ ఫ్రాంక్ విశ్లేషించారు.
దీనిని కొత్తగా ఎలా అర్థం చేసుకోవచ్చా అని ఓ రసాయన శాస్త్రవేత్తగా ఆలోచించాను అని ప్రొఫెసర మిచెల్ చెప్పారు.
టీని మరిగించినప్పుడు కొద్దిగా చేదు రుచి వస్తుంది. దీనిని పోగొట్టాలంటే చిటికెడు ఉప్పు కలిపితే సరిపోతుందని ఆమె వివరించారు.
‘‘ఇది పంచదార కలపడం లాంటికాదు. ఉప్పు కలపమనేసరికి, తమ టీ ఉప్పుగా ఉంటుందని జనం భయపడుతున్నట్టున్నారు.’’ అని చెప్పారు.
తేనీరు ప్రియులైన బ్రిటన్ ప్రజలు తన పరిశోధనపై ముందుగానే తీర్పులు ఇవ్వకుండా విశాల దృక్పథంతో ఉండాలని ఆమె కోరారు.
ఆమె పరిశోధన ‘ ది కెమిస్ట్రీ ఆఫ్ టీ’ పుస్తకరూపంలో వెలువడింది.
దీనిని రాయల్ సొసపైటీ ఆఫ్ కెమిస్ట్రీ ప్రచురించింది.
‘‘నేను దీనిని నా వంటింట్లో తయారుచేసి చూశాను’’ అని ఆమె వివరించారు.
ప్రొఫెసర్ మిషెల్ ఫ్రాంక్‌కు చిన్నప్పటి నుంచి టీ అంటే ఇష్టం.
ఆమె తన తల్లి నుంచి పదో ఏట నుంచే టీ తయారుచేయడం నేర్చుకున్నారు.
టీ బ్యాగులా, తేయాకా?
మంచి టీ తయారుచేయడానికి సంబంధికి ఎవరికివారికి సొంత పద్ధతులు ఉంటాయి.
అయితే చక్కని టీ కోసం టీ బ్యాగులు బదులుగా తేయాకులు వాడటం మంచిదని ఆమె సూచిస్తారు.
దీనిని బాగా కలియబెట్టడం వల్ల పాలు, నీళ్ళు బాగా కలుస్తుంటాయంటారు ఆమె.
ఒక్కోసారి టీ పైన తేలియాడే తెట్టులాంటి అవశేషాలను తొలగించడానికి కొద్దిగా నిమ్మరసం కూడా కలపాలంటారు ఆమె.
అలాగే టీ ఎక్కువసేపు వేడిగా ఉండటానికి పొట్టివైన గట్టి మగ్గులు వాడాలని సూచిస్తారు.
అలాగే మగ్గులో పాలను వేడిచేశాకా డికాక్షన్ కలపాలంటారు.
కానీ వీటిల్లో అతి ముఖ్యమైన సలహా ఏమిటంటే.. మైక్రోవేవ్‌లో టీ వేడి చేయవద్దని చెపుతారు.
‘‘మైక్రోవేవ్‌లో వేడి చేయడమనేది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. అలాగే అది రుచిని కూడా ఇవ్వదు’ అంటారు మిషెల్ ఫ్రాంక్.
అయితే మైక్రోవేవ్‌లో టీ వేడిచేయడమనే మాట యూకేలో కొత్తగా అనిపించినా అమెరికాలో ఇది సర్వసాధారణం.
‘అమెరికన్లకు కొన్ని భయంకరమైన టీ తయారీ అలవాట్లు ఉన్నాయి’ అంటారు ప్రొఫెసర్ ఫ్రాంకిల్.
‘‘అమెరికాలోని ఫ్యాన్సీ రెస్టారెంట్ల కన్నా ఐర్లాండ్‌లోని సాధారణ టీ షాపులలో చక్కని టీ దొరుకుతుంది’’ అని చెప్పారు.
‘‘బహుశా ప్రజలకు మంచి టీ ఎలా తయారుచేయాలో తెలియక పోవడంవల్లే ఇలా జరుగుతుండొచ్చు. మీకు టీ తాగే అలవాటు లేకపోతే మీరు తయారుచేసిన టీ తాగిన వారికి ఎంతటి భయంకరమైన అనుభవం కలుగుతుందో మీరు ఊహించలేరు’’ అంటారామె.
బ్రిటన్‌కు రావడాన్ని తాను ఇష్టపడతానని, అక్కడ తనకు మంచి టీ దొరుకుతుందని అంటారీ ఫ్రొఫెసర్.
బ్రిటిష్, అమెరికా టీ సంబంధాల సంగతేంటి?
కానీ అమెరికా రాయబార కార్యాలయం మాత్రం ప్రొఫెసర్ ఫ్రాంకిల్ సలహాలతో ఏకీభవించడంలేదు.
యూఎస్ రాయబార కార్యాలయం ట్విటర్ వేదికగా చేసిన ప్రకటనలో తాము టీని మైక్రోఓవెన్‌లో తయారుచేస్తామని ముక్తాయించింది.
అయితే యూకే మంత్రి మండలి మాత్రం టీని కెటిల్లోనే తయారుచేస్తామని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
- మధ్యయుగాల నాటి ప్రజలు ఇలా చెక్క బీరువాలలో తలుపులు వేసుకుని పడుకునేవారు... ఎందుకలా?
- ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబంధాలు మారుతున్నాయా?
- అయోధ్య రామాలయం: ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్ భిన్నంగా ఎందుకు ఉంటుంది?
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- ఈ ఎనిమిది కాళ్ల వింత జీవి ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా తట్టుకుని జీవిస్తుంది... ఏమిటి దీని బలం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)