You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆస్ట్రేలియా: సముద్రం నుంచి బీచ్‌లోకి కొట్టుకొచ్చిన ఆ వింత వస్తువు ఏంటి?
- రచయిత, ఆంటోనెట్ రాడ్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ ఆస్ట్రేలియలోని ఓ బీచ్‌కు గుర్తు తెలియని వస్తువొకటి కొట్టుకు వచ్చింది. గోపురం ఆకారంలో ఉన్న ఈ వస్తువును చూసి పోలీసులు అలర్ట్ అయ్యారు.
పెర్త్ నగరానికి ఉత్తరాన 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రీన్‌హెడ్ బీచ్‌లో స్థానికులు ఈ భారీ లోహపు వస్తువును గుర్తించారు.
ఈ గుర్తు తెలియని వస్తువు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందోనని ఆస్ట్రేలియాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇది ఏ కమర్షియల్ విమానానికి చెందిన భాగం కాకపోవచ్చని కూడా వారు భావిస్తున్నారు.
దీనిని ప్రమాదకరమైన వస్తువుగా ప్రకటించిన పోలీసులు, ప్రజలు దీని దగ్గరికి వెళ్లొద్దని హెచ్చరించారు.
‘‘ఈ ఆబ్జెక్టు ఎక్కడిదో, ఏమిటో తెలుసుకోవడానికి మేం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పని చేస్తున్నాం. తద్వారా ఇక్కడి కమ్యూనిటీకి భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వస్తువు ఎలా ఉంది ?
సిలిండర్ ఆకారంలో ఉన్న ఈ వస్తువు సుమారు 2.5 మీ. వెడల్పు, 2.5మీ. నుంచి 3మీ. వరకు పొడవు ఉంటుందని గ్రీన్‌హెడ్ బీచ్ సమీపంలో నివసిస్తున్నవారు చెప్పినట్లు ఆస్ట్రేలియ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ సిలిండర్ ఆకారాన్ని చూడటానికి స్థానికులు శనివారం రాత్రి నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారని, ఏబీసీ న్యూస్ చానెల్ రిపోర్ట్ చేసింది. ఈ సందడిని గొప్ప సోషల్ ఈవెంట్ అంటూ స్థానికులు అభివర్ణిస్తున్నట్లు ఏబీసీ పేర్కొంది.
"ఇది ఒక అందమైన రాత్రి. ఇంత రాత్రిపూట కూడా పిల్లలు ఇక్కడ ఇసుకలో ఇళ్లు కట్టుకుంటూ ఆడుకుంటున్నారు’’ అని స్థానికుడు ఒకరు ఏబీసీ న్యూస్‌తో అన్నారు.
‘‘గత ఏడాది కాలంలో హిందూ సముద్రంలో పడిపోయిన ఏదైనా రాకెట్‌కు సంబంధించిన ఆయల్ ట్యాంక్ కావచ్చు’’ అని ఏవియేషన్ నిపుణుడు జెఫ్రీ థామస్ అన్నారు.
ఏదైనా విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం నుంచి ఈ భారీ సిలిండర్ పడిపోయే అవకాశం ఉందని ఆస్ట్రేలియన్ అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఇదేంటో తెలుసుకునేందుకు ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలను సంప్రదిస్తున్నట్లు తెలిపింది.
ఎంహెచ్ 370 విమానమా?
ఈ సిలిండర్ ఆకారపు వస్తువు మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానానిది కావచ్చన్న ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. ఈ విమానం 239 మంది ప్రయాణికులతో 2014లో మిస్సయింది.
అయితే, ఇది ఆ విమానానికి చెందిన వస్తువు కాకపోవచ్చని ఏవియేషన్ నిపుణుడు జెఫ్రీ థామస్ అన్నారు.
"ఇది బోయింగ్ 777 విమానంలో ఏ భాగం కాదు. ఆ విమానం తొమ్మిదేళ్ల కిందట మిస్సయ్యింది. అందువుల్ల ఆ విమానపు శకలం కావచ్చని అనుమానం రావడం సహజం’’ అని జెఫ్రీ అన్నారు.
మిస్సయిన ఎంహెచ్ 370 కథేంటి?
2014 మార్చిలో మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైంది. ఇందులో సిబ్బందితో కలిపి 239 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ విమానం జాడ లభించలేదు. ఈ విమాన ప్రమాదం ప్రపంచంలోనే ఒక రహస్యంగా మిగిలిపోయింది.
ఎంహెచ్ 370లో 122 మంది చైనా దేశస్థులు ఉన్నారు. ఈ విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్ చేరాల్సి ఉంది.
ఈ విమానం కనిపించకుండా పోవడంతో అనేక రకాల కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పైలట్ హైజాక్ చేసి విమానాన్ని ఆధీనంలోకి తీసుకుని, గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ దగ్గర మలుపు తీసుకునేటప్పుడు రాడార్ సాంకేతికతను నిలిపివేసి ఉంటారని కూడా అన్నారు.
ఎంహెచ్ 370 కోసం ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు నిర్వహించిన సముద్రగర్భంలో గాలింపు చర్యలు అక్టోబర్ 2017లో ముగిశాయి.
ఆ తర్వాత విమానం కోసం ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదని ఆ సంస్థ బీబీసీతో చెప్పింది.
అప్పట్లో ఈ విమానాన్ని వెతకడం కోసం బ్రిటీష్ ఏరోనాటికల్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే తీవ్రంగా కృషి చేశారు.
‘‘ఈ విమానం కోసం సుమారు 120,000 చదరపు కిలోమీటర్ల మేర గాలించారు. అది కేవలం గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది కాదు. గడ్డివాములో అంతకన్నా చిన్నదైన వస్తువును వెతకడం లాంటిది. అది చాలా కష్టంతో కూడుకున్న పని" అని గాడ్‌ఫ్రే అన్నారు.
సముద్రంలో తరచూ ఇలాంటి వింత వస్తువులు
ఈ ఏడాది జపాన్ తీరంలోకి కూడా ఒక వింత వస్తువు కొట్టుకొచ్చింది. ఈ పెద్ద లోహపు గోళం (మెటల్ బాల్)ను క్రేన్ సహాయంతో తొలగించారు.
బీచ్‌లో ఒక అసాధారణ వస్తువు ఉన్నట్లు ఈ వారం ప్రారంభంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది.
ఆ తర్వాత, అది ఒక గాడ్జిల్లా గుడ్డు అని, పడవలు నీటిపై తేలియాడేలా చేసే ఒక నిర్మాణం (మూరింగ్ బాయ్) అని, అంతరిక్ష వస్తువు అయ్యుండొచ్చు అని ఇలా పలు ఊహాగానాలు మొదలయ్యాయి.
బాంబ్ స్క్వాడ్ కూడా దీన్ని పరిశీలించింది. అధికారులు ఈ మెటల్ బాల్ ఎక్స్‌రే తీశారు. తర్వాత ఇది ప్రాణాంతక వస్తువు కాదని తేల్చారు. అంతేకానీ, నిజానికి ఆ వస్తువు ఏంటి? అనేది ఇంకా తెలియలేదు.
మెటల్ బాల్‌ను బీచ్ నుంచి తొలగించారు.
గత ఏడాది మేలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం సమీపంలో ఉన్న సున్నపల్లి సీ హార్బర్‌కు ఒక బంగారు రథం కొట్టుకు వచ్చింది. అప్పట్లో దీని గురించి అంతా ఆశ్చర్య వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి
- హైటెక్ బెగ్గింగ్: ఆన్లైన్లో సాయం అడుక్కునేవారి నుంచి 70 శాతం కమీషన్ తీసుకుంటున్న టెక్ సంస్థ
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుడుగు ఏంటి?
- BBC Investigation: మహిళల నగ్న చిత్రాలతో వ్యాపారం చేస్తున్న రహస్య ప్రపంచం గుట్టురట్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)