యుక్రెయిన్: ‘నా కాళ్లను చూసుకుంటే, వేళ్లు కనిపించలేదు. పాదమంతా దెబ్బతిని, రక్తం కారుతోంది'

    • రచయిత, జేమ్స్ వాటర్‌హౌస్
    • హోదా, బీబీసీ యుక్రెయిన్ ప్రతినిధి

"నా కాళ్లను చూసుకుంటే, వేళ్లు కనిపించలేదు. పాదమంతా దెబ్బతిని, రక్తం కారుతూ ఉంది’’ అంటూ సెర్హి తన ఆవేదనను వ్యక్తంచేశారు.

అంతకుముందు ఎంతో ఆరోగ్యంతో, సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే సెర్హికి ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు లేదు. నడిచేందుకు కాలు లేదు.

యుక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిలో ఆయన సర్వం కోల్పోయారు. సెర్హి జీవితం క్షణాల్లో మారిపోయింది.

యుక్రెయిన్‌లో 1,74,000 చదరపు కిలోమీటర్ల భూభాగం మందుపాతరలతో (ల్యాండ్ మైన్స్‌తో) నిండిపోయింది. మందుపాతరలున్న ప్రాంతం ఇంగ్లండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌ కంటే కూడా ఎక్కువే.

యుక్రెయిన్‌లో మిగిలిన అన్ని ప్రాంతాలతో పోలిస్తే ఖార్కీవ్ ప్రాంతంలో అత్యధిక ల్యాండ్‌మైన్లను గుర్తించారు. యుద్ధంతో తీవ్రంగా ప్రభావితమైన ఖార్కీవ్ ప్రాంతంలో ప్రజలకు ప్రమాద సంకేతాలు కనిపిస్తూనే ఉంటాయి.

రష్యాకు సరిహద్దులో ఉన్న ఈశాన్య యుక్రెయిన్‌లో ఖార్కీవ్ ఉంది. గత ఏడాది కాలంగా ఈ ప్రాంతం యుద్ధంతో అట్టుడికింది.

2022 ఫిబ్రవరి 24న ఖార్కీవ్ ప్రాంతంలో పూర్తి తరహా దాడులకు దిగిన రష్యా, ఈ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది.

మే నాటికి యుక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరాన్ని రష్యా కోల్పోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ నాటికి యుక్రెయిన్ కౌంటర్ అటాక్‌తో రష్యా కంగుతింది.

యుద్ధ రంగంలోకి దిగిన రష్యన్ సైనికులు తమ స్థానాలను కాపాడుకునేందుకు, యుక్రెయిన్ సైన్యాన్ని ఆపేందుకు ఆ ప్రాంతంలో ల్యాండ్‌మైన్లను అమర్చారు. ఆ తర్వాత వాటిని అక్కడే విడిచిపెట్టి వెళ్లారు.

బాలక్లియాలో చిన్న పట్టణంలోని ఒక అపార్ట్‌మెంట్ బ్లాక్‌కు పక్కనే ఉన్న స్థలంలో ఆరు ల్యాండ్‌మైన్లను ఓలెక్సాండర్ రెమెనెట్స్ టీమ్ వెలికితీసింది.

‘‘నా కుటుంబం రోజూ ఉదయాన్నే నాకు కాల్ చేసి, చూసుకుని నడవమని చెబుతుండేది’’ అని ఓలెక్సాండర్ చెప్పారు.

గత ఏడాది కాళ్లు పోగొట్టుకున్న వారిలో ఆయన ఒకరు.

మేం వారితో మాట్లాడిన ఒక్కరోజు తర్వాత ఆయన టీమ్‌లోని మరో సభ్యుడు ల్యాండ్‌మైన్ వల్ల గాయాల పాలయ్యారు.

సెప్టెంబర్ నుంచి కేవలం ఖార్కీవ్ నగరంలోనే 121 మంది పౌరులు గాయాల పాలయ్యారని, 29 మంది చనిపోయారని స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది.

ఆ ప్రాంతంలో 55 వేలకు పైగా పేలుడు పదార్థాలను గుర్తించారు.

ఓలెక్సాండర్ లాంటి డీమైనర్లను స్థానిక అధికారులు అక్కడ ‘‘హీరో’’లుగా అభివర్ణించారు.

కానీ, వారు సమస్య స్థాయికి తగ్గ ప్రయత్నం చేయలేకపోయామని చాలా బాధపడ్డారు.

ఆ రోజు సెర్హి పైకి ఎగిరి పడ్డారు

సెర్హి తన స్నేహితుడు కారును చిన్న క్రేన్‌తో లోడ్ చేసేందుకు సాయపడేటప్పుడు, దగ్గర్లోని నేరేడు పండు చెట్టుపై అంతగా దృష్టిసారించలేదు.

దాని దగ్గరకి సెర్హి అడుగులు వేసినప్పుడు, తనకు తాను పైకి ఎగిరి వెనక్కి పడ్డారు.

‘‘నేను తొలుత టైర్ పేలిందని అనుకున్నాను’’ అని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సెర్హి గుర్తుకు చేసుకున్నారు. ‘‘నేను కాలిని చూసుకున్నప్పుడు, కాళ్ల వేళ్లు కనిపించలేదు. తర్వాత పాదం చూసుకుంటే, అది కూడా పూర్తిగా దెబ్బతిని, రక్తం కారుతూ ఉంది’’ అని చెప్పారు.

ఈ యుద్ధంలో తన ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు సెర్హి చెప్పారు.

‘‘నేను చాలా ఆరోగ్యంగా, రెండు కాళ్లతో నడిచేవాడిని. సొంతంగా కారు డ్రైవ్ చేసుకునే వాణ్ని. అన్ని పనులు నేనే చూసుకునేవాడిని.’’

కానీ క్షణాల్లో ఉండేందుకు ఇల్లు, నడిచేందుకు కాలు కోల్పోయానని చెబుతూ ఆయన తన బాధను పంచుకున్నారు.

యూరి కుజ్నెత్సోవ్ సంరక్షణలో సెర్హి ఉన్నారు. 2022లో రష్యా దాడి ప్రారంభించినప్పుడు కూడా ఆయన పని చేస్తూనే ఉన్నారు.

ఇజ్యుమ్ ఆస్పత్రిలో పనిచేసేందుకు మిగిలిన ఏకైన డాక్టర్ ఇతనే. ప్రతి వారం తాను ల్యాండ్‌మైన్ వల్ల గాయాల పాలైన వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

దురదృష్టవశాత్తు, చాలా కేసుల్లో అనుకోని ఈ ప్రమాదాలు ప్రజల జీవితాల్ని విషాదకరంగా మారుస్తున్నాయని ఆయన తెలిాపారు.

‘‘శరీరంలో ఏదో ఒక అవయవాన్ని కోల్పోవడం లేదా ఇతర గాయాలు పాలు కావడం దారుణమైన పరిస్థితి కాదు. ఎందుకంటే, గత వారం మైన్‌ను వెలికితీసిన ఇద్దరు పేషెంట్లు మా వద్దకు వచ్చారు. ఒకరు ఇక్కడున్నారు. మరొకరు చనిపోయారు’’ అని డాక్టర్ తెలిపారు.

యూరి ఆస్పత్రి చాలా వరకు ఈ యుద్ధం వల్ల దెబ్బతింది. కారిడార్‌తో పాటు కిటికీలు కూడా పాడయ్యాయి. ఈ ఆస్పత్రి చుట్టూ ల్యాండ్‌మైన్ సంకేతాలే ఉన్నాయి.

యుద్ధం ప్రారంభానికి ముందు, ప్రతి ఒక్కరి లాగానే తాము కూడా జీవితంలో కొన్ని మెటీరియల్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లమని యూరి అన్నారు. ఇప్పుడు తమకు జీవితమంటే ఏంటో పూర్తిగా అర్థమైందన్నారు. శాంతి, ఆరోగ్యం మాత్రమే మనం దృష్టిసారించాల్సినవని చెప్పారు.

2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తి స్థాయిలో దాడి ప్రారంభించినప్పటి నుంచి 724 మంది మందుపాతరల వల్ల ప్రభావితమయ్యారని, వారిలో 226 మంది చనిపోయినట్లు గత వారం యుక్రెయిన్ ఆర్థిక మంత్రి చెప్పారు.

ల్యాండ్‌మైన్లు అత్యధికంగా కలిగి ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా ఇజ్యుమ్, దాని పరిసర ప్రాంతం ఉంది.

అక్రమంగా యాంటీ పర్సనల్ మైన్లను యుక్రెయిన్ ఇక్కడ వాడుతోందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. తాము అంతర్జాతీయ చట్టాలను అనుసరిస్తున్నామని యుక్రెయిన్ చెబుతోంది.

యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి దిగినప్పుడు రష్యా ఇలాంటి డివైజ్‌లను వాడిందని హ్యుమన్ రైట్స్ వాచ్ అంతకుముందు ఆరోపించింది.

దేశాలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలిచ్చే ప్రపంచ బ్యాంకు, డీమైనింగ్ చేసేందుకు యుక్రెయిన్‌కు 37.4 బిలియన్ డాలర్లు అవసరమవుతుందని చెప్పింది.

డీమైనింగ్ కోసం తమకు సాయం చేయాలని ఇతర దేశాలను యుక్రెయిన్ అడుగుతోంది. ఇలా చేయడం ద్వారా వీటిని తొలగించేందుకు దశాబ్దాల కాలం పట్టదని అంటోంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మైన్లను తొలగించేందుకు ఎలా 70 ఏళ్ల కాలం పట్టిందో తెలుపుతూ, తమ దేశంలో మైన్ల తొలగింపుకు సాయం చేయాలని అర్థిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)