వంట గ్యాస్ కొరతతో నగరాలు వీడి సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులు

ఫొటో సోర్స్, Abhishek Dey/BBC
- రచయిత, అభిషేక్ దే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
దిల్లీలోని ఓ మురికివాడలో పక్కపక్క ఇళ్లల్లో నివసించే శకుంతలాదేవి, షకీబా బీబీ ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటి నుంచి వచ్చి గ్యాస్ సిలిండర్ కోసం షాపులన్నీ వెతుకుతున్నారు.
మూడు వారాల నుంచి వాళ్లకు గ్యాస్ సిలిండర్ దొరకడంలేదు.
''మా ఇంట్లో ఇంకొన్నిరోజుల్లో గ్యాస్ అయిపోతుంది. ఆలోపు గ్యాస్ దొరక్కపోతే మేం మా గ్రామాలకు తిరిగి వెళ్లాల్సివస్తుంది'' అని శకుంతల చెప్పారు.
శకుంతల, షకీబాతో పాటు వాళ్ల ఇంటిచుట్టుపక్కల ఉండే మరికొందరు అక్కడికి సమీపంలోని మధ్యతరగతి ఇళ్లల్లో పనిచేస్తున్నారు. వాళ్లు నెలకు దాదాపు 15వేల రూపాయలు సంపాదిస్తారు. గడచిన దశాబ్దకాలంలో ఉత్తరప్రదేశ్, తూర్పు బిహార్ నుంచి వారంతా దిల్లీకి వలసవచ్చారు.
శకుంతల, షకీబాతో పాటు వలస కార్మికులుగా అక్కడ నివసిస్తున్నవాళ్లంతా సిలిండర్ వేటలో ఉన్నారు.

‘అన్ని చోట్లా ఇదే పరిస్థితి’
మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల అంతర్జాతీయంగా నౌకాయానికి కలిగిన ఇబ్బందులు భారత్‌లో వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగించాయి. చాలామందికి ఎల్పీజీ సిలిండర్లు దొరకడం లేదు. భారత్‌లో ఎక్కువమంది ఇవే వాడతారు.
భారత్ ఎల్పీజీ దిగుమతులపై ఎక్కువగా ఆధాపడుతుంది. ఈ రవాణా ఎక్కువగా హార్ముజ్ జలసంధి మీదుగా జరుగుతుంది. భారత నౌకల రవాణాకు ఇరాన్ అనుమతిస్తున్నప్పటికీ ఇంకా అనిశ్చిత పరిస్థితులే ఉన్నాయి. చాలా నౌకలు జలసంధి దగ్గర నిలిచిపోనున్నాయి.
ఎల్పీజీకి ఎలాంటి కొరతాలేదని ప్రభుత్వం చెబుతోంది. దేశీయంగా ఉత్పత్తిని పెంచామని, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి మరిన్ని దిగుమతులు చేసుకుంటున్నామని తెలిపింది. భయాందోళనకు గురై గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది.
వంట గ్యాస్‌ను కొనేందుకు వలస కార్మికులు ఎక్కువమంది అనధికార నెట్‌వర్క్‌లపై ఆధారపడతారు.
దిల్లీలో దాదాపు 30మంది వలస కార్మికులతో బీబీసీ మాట్లాడింది. పరిస్థితి మెరుగుపడకపోతే తాము తమ గ్రామాలకు తిరిగి వెళ్లాల్సివస్తుందని వారు చెప్పారు.
రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లో జనం రద్దీగా ఉన్న దృశ్యాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో పరిస్థితి ఒకేలా ఉందని తెలియజేస్తున్నాయి. ఈ నగరాల్లో పెద్దసంఖ్యలో వలస కార్మికులు నివసిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టెక్స్టైల్స్, ఆభరణాలు, సెరామిక్స్ పరిశ్రమల మూసివేతతో చాలామంది కార్మికులు ఇళ్లకు తిరిగి వెళ్లాల్సివస్తోంది.

ఫొటో సోర్స్, Abhishek Dey/BBC
‘నెలరోజులుగా కట్టెల పొయ్యే ఆధారం’
పరిస్థితిని గమనిస్తున్నామని, ఎప్పుడు తిరిగి రావాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే వెళ్లిపోయిన వాళ్లు చెప్పారు.
''గ్యాస్ దొరకడం లేదు. స్థానికంగా రెస్టారెంట్లు కూడా మూతపడ్డాయి. రోజుకు రెండు సార్లు అన్నం దొరకడం కష్టమైపోయింది. అందుకే ఇంటికి తిరిగి వెళ్లా'' అని అశోక్ యాదవ్ అనే వ్యక్తి బీబీసీతో ఫోన్లో చెప్పారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందినవారు. దిల్లీలోని ఓ క్యాటరింగ్ సంస్థలో ఆయన పనిచేశారు.
వ్యాపారాల కన్నా ఇళ్లకు గ్యాస్ అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని గత నెల ప్రభుత్వం రిఫైనరీలను కోరింది. దీంతో చాలా రెస్టారెంట్లు మెనూలో ఆహారపదార్థాలను తగ్గించాయి. కొన్ని రెస్టారెంట్ల నిర్వాహకులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కొనలేక తాత్కాలికంగా మూసివేశారు.
గ్యాస్ కొరత వల్ల కట్టెలు, కిరోసిన్, బొగ్గువంటివాటి వైపు ప్రజలు మళ్లాల్సివస్తోంది.
దిల్లీలో నిత్యం హడావుడిగా ఉండే ఓ మార్కెట్లో సుశీలాదేవికి చిన్న టీ షాపు ఉంది. ఆమె షాపులోనూ, ఇంట్లోనూ కట్టెలు ఉపయోగిస్తున్నారు.
''నాలుగు వారాలనుంచి నాకు గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు. కట్టెల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కట్టెలు ఎక్కువకాలం ఉపయోగించలేం. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే నేను ఉత్తరప్రదేశ్‌లోని మా గ్రామానికి తిరిగి వెళ్లాల్సివస్తుంది'' అని ఆమె చెప్పారు.
తమ గ్రామాల్లో ఉంటే పస్తులుండాల్సిన అవసరం రాదని సుశీలాదేవికి పొరుగున ఉండే పుష్పా దేవి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘వలస కార్మికులు తిరిగి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి’
ప్రస్తుతం పరిస్థితి మరీ అంత అధ్వాన్నంగా లేదని నిపుణులు అంటున్నారు.
''కానీ వలస కార్మికులు తిరిగి ఇళ్లకు వెళ్లడం ఇలాగే కొనసాగితే చిన్న, మధ్యస్థాయి సంస్థలు ముఖ్యంగా కార్మికులపై ఎక్కువగా ఆధారపడే నిర్మాణ, టెక్స్టైల్స్, తయారీ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది'' అని భారతీయ పరిశ్రమల సమాఖ్యకు చెందిన పారిశ్రామిక సంబంధాల కమిటీ కో-చైర్మన్ అరవింద్ గోయల్ చెప్పారు.
2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 5 కోట్ల 40 లక్షలమంది వలస కార్మికులున్నారు. అయితే అసలు వలసల సంఖ్య ఇంకా చాలా ఎక్కువని, ఆ జనగణన తర్వాత వారి సంఖ్య మరింతగా పెరిగిఉండొచ్చని విశ్లేషకులంటున్నారు. బాగా ఆలస్యమైన తాజా జనగణన గత వారం మొదలయింది.
ఈ కార్మికుల్లో చాలామందికి ఇప్పటికే వంట గ్యాస్ దొరకడం కష్టంగా ఉంది. ఎల్పీజీ సిలిండర్లు కావాలంటే గుర్తింపు, చిరునామా డాక్యుమెంట్లు ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. సంబంధిత డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సిలిండర్లు ముందుగానే బుక్ చేసుకుంటారు.

ఫొటో సోర్స్, EPA
‘మార్కెట్లో సిలిండర్ ధర రూ.3,500’
అసంఘటిత రంగంలో పనిచేసే వలస కార్మికులకు వాళ్లు నివసించే చోట ఇలాంటి సరైన డాక్యుమెంట్లుండవు.
''తరచూ అనేక ప్రాంతాలకు మారే వలస కార్మికుల దగ్గర అప్డేట్ చేసిన డాక్యుమెంట్లుండవు. కొందరు ఓనర్లు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేందుకు నిరాకరిస్తారు. దీంతో వలసవచ్చిన నగరంలో సరైన డాక్యుమెంట్లు పొందడం కష్టమవుతుంది'' అని దిల్లీలో ట్రేడ్ యూనియనిస్ట్ అయిన రాజేశ్ కుమార్ చెప్పారు.
చాలామంది కార్మికులు అనధికారం కాని పద్ధతులు, కేంద్రాలపైనే ఆధారపడతారు. అక్కడ 14.2కేజీల సాధారణ సైజ్‌కు బదులు అంతకన్నా చిన్న సిలిండర్లు అమ్ముతారు. వాటిని నింపి ఇస్తారు.
యుద్ధం మొదలయినదగ్గరినుంచి అలాంటి కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలినవారు ఎప్పటి ధర కన్నా దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇళ్లల్లో వాడే సిలిండర్‌కు రూ. 3,500 వరకు తీసుకుంటున్నారు.. చిన్న సిలిండర్లు నింపడానికి రూ. 1600 కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు.
''చాలా మంది వలస కార్మికులు అంత మొత్తం పెట్టలేరు'' అని రాజేశ్ కుమార్ చెప్పారు.
ప్రత్యామ్నాయాలు పరిమితంగా ఉండడం సమస్యలను మరింతగా పెంచింది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇక ముందు ఇలా ఉండకపోవచ్చు’
మురికివాడల్లోని చిన్న గదుల్లో కట్టెలు లేదా బొగ్గుతో వంటచేయడం సురక్షితం కాదు. కరెంటు కనెక్షన్లను వారు షేర్ చేసుకుంటుంటారు. చవకగా దొరికే ఎలక్ట్రిక్ స్టవ్‌లను ఈ పరిస్థితుల్లో వాళ్లు ఉపయోగించలేరు. సురక్షితమైన ప్రత్యామ్నాయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి.
ఈ పరిస్థితులతో కొందరు ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
బిహార్‌లోని ఛాప్రా పట్టణానికి తిరిగి వెళ్లేముందు రామ్‌నరేశ్ యాదవ్ రెండు వారాల క్రితం తన ఆటోరిక్షాను అమ్మేశారు.
''నా సంపాదనతో కుటుంబాన్ని పోషించడం ఇప్పటికే కష్టంగా మారింది. ఇప్పుడు ఈ గ్యాస్ కొరత వచ్చింది. పరిస్థితులు మెరుగుపడకపోతే నా పిల్లలను గ్రామంలోని పాఠశాలల్లో చేర్పించాల్సివస్తుంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
పరిస్థితి మెరుగుపడుతుందని మరికొందరు ఆశాభావంతో ఉన్నారు.
సంక్షోభం ముగిస్తే పరిస్థితులు మెరుగుపడతాయని బ్రిజ్ కుమార్ చెప్పారు. దిల్లీలో ఆయన సరకు బళ్లు లాగుతారు. ఇటీవలే దేవ్‌ఘర్ దగ్గరలోని స్వగ్రామానికి ఆయన తిరిగొచ్చారు.
తాజాగా ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకోవడంతో పరిస్థితులు మెరుగుపడొచ్చని భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































