పాకిస్తాన్: ముంచెత్తిన వరదలు, 300 మందికి పైగా మృతి.. 9 ఫోటోలలో

వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ముంచెత్తిన ఆకస్మిక వరదలతో గడచిన 48 గంటల్లో 307మంది మరణించారు. 23మంది గాయపడ్డారు.

రక్షణ కోసం వెళ్లిన ప్రభుత్వ హెలికాప్టర్ కూడా కూలిపోయి ఐదుగురు మృతి చెందారు.

ఖైబర్ పఖ్తుంఖ్వా విపత్తు నిర్వహణా సంస్థ (పీడీఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 48 గంటలలో భారీవర్షాలు, వరదల కారణంగా వివిధ జిల్లాల్లో మృతుల సంఖ్య 307కు పెరిగింది.

మృతులలో 279మంది పురుషులు, 15మంది మహిళలు, 13మంది పిల్లలు ఉన్నారని తెలిపింది.

మారుమూల ప్రాంతాలలో , అనేక మృతదేహాలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల అక్కడికి చేరుకోవడం కష్టంగా మారింది.

గురువారం ప్రారంభమైన వరదలు పాకిస్తాన్‌లోని బునేర్, బజౌర్, బట్టాగ్రామ్‌లతో సహా అనేక జిల్లాల్లో విధ్వంసం సృష్టించడంతో ఈ ప్రాంతాన్ని విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. గడ్జీ తహసీల్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని.. బునేర్ జిల్లా రెస్క్యూ టీం రిపోర్ట్ ఇన్‌చార్జ్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు.

ఆగస్టు 21 వరకు దేశంలోని వాయువ్య ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలిపింది.

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.

సహాయ సామాగ్రిని తీసుకెళ్తున్న ప్రాంతీయ ప్రభుత్వ ఎమ్ఐ-17 హెలికాప్టర్ ఆ ప్రాంతంలో కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు సిబ్బంది మరణించారని పెషావర్‌లోని ముఖ్యమంత్రి సచివాలయం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది.

స్వాత్, బునేర్, బజౌర్, టోర్ఘర్, మన్సెహ్రా, షాంగ్లా, బట్టగ్రామ్ జిల్లాలు వర్షాలు, వరదల వల్ల ఎక్కువగా నష్టపోయాయని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (పీడీఎమ్ఏ) పేర్కొంది.

భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల బజౌర్, బట్టగ్రామ్ జిల్లాలు ఎక్కువగా నష్టపోయాయని ఏజెన్సీ ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)