You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ పేలుడు: ఘటనా స్థలానికి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ ఏం చెప్పారంటే..
(ఈ కథనంలోని అంశాలు కలచివేయొచ్చు.)
దిల్లీలో,ఎర్రకోట సమీపంలో నవంబర్ 10 సాయంత్రం జరిగిన కారు పేలుడులో 8 మంది చనిపోయారు. మృతులను ఆస్పత్రి, పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి.
సహాయక చర్యల్లో భాగంగా, ఘటనా స్థలికి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ మొహమ్మద్ అసద్ వార్తా సంస్థ పీటీఐతో అక్కడి పరిస్థితి గురించి కొన్ని వివరాలు వెల్లడించారు.
నవంబర్ 10 రాత్రి.. పీటీఐతో మాట్లాడుతూ, సంఘటనా స్థలానికి వెళ్లేప్పటికి కనీసం నాలుగు మృతదేహాలు రోడ్డుపై కనిపించినట్లు అంబులెన్స్ డ్రైవర్ అసద్ తెలిపారు.
"మృతదేహాల పక్కన ఉన్న వాహనాలు కాలిపోయాయి" అని ఆయన చెప్పారు.
"నేను, మరికొందరు అంబులెన్స్ డ్రైవర్లు మృతదేహాలను సేకరించి ఆసుపత్రికి తీసుకెళ్లాం."
కారు వివరాలు ట్రేస్ చేస్తున్న అధికారులు
పేలుడు జరిగిన కారు కదలికలను ట్రేస్ చేసేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
పేలుడు జరగడానికి ముందు ఆ వాహనం ఎర్రకోట సమీపంలో కొన్ని గంటల పాటు ఉందని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
ఎరుపు రంగు హ్యుందాయ్ i20 సమీపంలోని కార్ పార్కింగ్‌లో ఉందని, పేలుడు జరిగిన మెట్రో స్టేషన్‌కు సమీపంలోని జంక్షన్ వైపు నెమ్మదిగా కదిలినట్లు చెబుతున్నారు.
అయితే, వీటిని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. బీబీసీ కూడా స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
హై అలర్ట్ : సీఐఎస్ఎఫ్
"దిల్లీ పేలుడు నేపథ్యంలో దిల్లీ మెట్రో, ఎర్రకోట, ప్రభుత్వ భవనాలు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంతో సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లోని సీఐఎస్ఎఫ్-గార్డు సంస్థలు హై అలర్ట్‌లో ఉన్నాయి" అని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో తెలిపింది.
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భద్రతా సిబ్బందిని సిద్ధంగా ఉంచామని సీఐఎస్ఎఫ్ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)