You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
''పేలుడు శబ్దం వినగానే పడిపోయాను'': దిల్లీ పేలుడు ఘటనపై ప్రత్యక్షసాక్షులు ఏం చెబుతున్నారంటే..
దేశరాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో మెట్రోస్టేషన్ గేట్ నెంబర్ 1వద్ద నిలిపి ఉన్న కారులో పేలుడు సంఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. వారుచెప్పిన వివరాల ప్రకారం
‘‘పేలుడు జరిగినప్పుడు నేను షాపులో ఉన్నాను. హఠాత్తుగా పెద్ద పేలుడు జరిగింది. అలాంటి శబ్దం నేనిప్పటివరకూ వినలేదు. పేలుడు శబ్దం వినగానే నేను మూడుసార్లు పడిపోయాను. తర్వాత చుట్టుపక్కల ఉన్న అందరూ పరిగెత్తడం ప్రారంభించారు’’ అని వలీ ఉర్ రహమాన్ అనే మరో స్థానిక షాపు యజమాని ఏఎన్ఐకు చెప్పారు.
‘‘భవనం కిటికీలు కదిలిపోయాయి’’
రాజ్‌ధర్ పాండే అనే స్థానికుడు మాట్లాడుతూ ‘‘మా మేడపైనుంచి మంటలను చూశాం. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామని కిందికి దిగి వచ్చాం. చాలా గట్టిగా పేలుడు శబ్దం వినిపించింది. బిల్డింగ్ కిటికీలు కదిలిపోయాయి. మా ఇల్లు గురుద్వారా దగ్గర ఉంది’’ అని ఏఎన్ఐకి చెప్పారు.
తాము దగ్గరకు వెళ్లిచూసేసరికి, రోడ్డుపై శరీర భాగాలు పడిఉన్నాయని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న స్థానికుడు ఒకరు ఏఎన్ఐకి చెప్పారు. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదని, కొన్ని కార్లు దగ్దమయ్యాయని తెలిపారు.
కారు పేలుడు జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యక్ష సాక్షి పేలుడులో కొంతమంది గాయపడ్డారని పీటీఐ వార్తా సంస్థకు ధృవీకరించారు.
ఇర్ఫాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ, "నేను దర్యాగంజ్ లో ఉన్నాను, అక్కడ చాలా పెద్ద పేలుడు జరిగింది. కారు స్టీరింగ్ కూడా అవతలి వైపు ఎగిరిపోయింది. ఇది చాలా శక్తిమంతమైనపేలుడు, నేను దానిని వర్ణించలేను’’ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)