మహిళల క్రికెట్ వరల్డ్ కప్ INDvsWI: వెస్టిండీస్‌పై భారత్ విజయం

న్యూజీలాండ్‌లోని హామిల్టన్‌లో జరుగుతున్న విమెన్స్ వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌పై భారత జట్టు 155 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 317 పరుగులు చేయగా లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 162 పరుగులకే ఆలవుట్ అయింది.

భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లు తీశారు.

స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీలు

భారత్ 318 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ స్మృతి మందనతోపాటు హర్మన్‌ప్రీత్ కూడా సెంచరీలు కొట్టారు.

స్మృతి మంధన కేవలం 119 బాల్స్‌లోనే 123 రన్లు కొట్టారు. మరోవైపు హర్మన్‌ప్రీత్ 107 బాల్స్‌లో 109 రన్లు కొట్టారు.

స్మృతి మంధన 13 ఫోర్లు, రెండు సిక్సులు కొట్టారు. అయితే, వెస్టిండీస్ బౌలర్ కార్నెల్ వేసిన 43వ ఓవర్‌లోని రెండో బాల్‌కు స్మృతి క్యాచ్ ఇచ్చారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ మిథాలీ రాజ్.. బ్యాటింగ్ ఎంచుకున్నారు.

స్మృతి మంధన, యాస్తికా భాటియా ఓపెనర్లుగా దిగారు. అయితే, ఆరో ఓవర్‌లోని మూడో బాల్‌కు యాస్తికా బౌల్డ్ అయ్యారు. అప్పటికి ఆమె 31 రన్లు కొట్టారు.

మరోవైపు మిథాలీ రాజ్ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. తొమ్మిదో ఓవర్‌లోని మూడో బాల్‌కు ఆమె అవుట్ అయ్యారు. పది ఓవర్లకు భారత్ 2 వికెట్లు కోల్పోగా.. 62 రన్లు చేసింది.

స్మృతికి తోడుగా దీప్తి శర్మ కాసేపు క్రీజులో నిలబడగలిగారు. అయితే, 13వ ఓవర్లో దీప్తి అవుట్ అయ్యారు. అప్పటికి ఆమె 15 రన్లు కొట్టారు. ఆ సమయంలో భారత జట్టు కాస్త ఇబ్బందుల్లో పడినట్లు అనిపించింది.

20వ ఓవర్లో క్రీజులోకి అడుగుపెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మంధనకు మద్దతుగా నలిచారు. వీరిద్దరూ చెరో సెంచరీ కొట్టారు.

40వ ఓవర్‌లో స్మృతి సెంచరీ కొట్టారు. మాథ్యూ వేసిన రెండో బాల్‌కు ఫోర్ కొట్టి ఆమె సెంచరీని పూర్తి చేశారు. 41వ ఓవర్లో మొదటి మూడు బాల్స్‌కు మూడు ఫోర్లు కొట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

అయితే, 43వ ఓవర్లో మందన అవుట్ అయ్యారు. అప్పటికి ఆమె 123 రన్లు కొట్టారు. మొత్తంగా భారత జట్టు స్కోరు అప్పటికి 262. స్మృతి తర్వాత హర్మన్‌ప్రీత్ క్రీజులో నిలబడగలిగారు. మణికట్టుకు గాయమైనప్పటికీ ఆమె మంచి ప్రదర్శన ఇచ్చారు. 47వ ఓవర్లో ఆమె సెంచరీ పూర్తిచేశారు.

ఇది వరల్డ్ కప్‌లో హర్మన్‌ప్రీత్ రెండో సెంచరీ. ప్రస్తుతం వంద బాల్స్‌లో ఆమె సెంచరీని పూర్తిచేశారు.

అయితే, హర్మన్‌ప్రీత్‌కు అటువైపు ఆడిన రీచా ఘోష్ ఐదో వికెట్‌గా అవుటయ్యారు. కేవలం 5 రన్లు తీసిన తర్వాత ఆమె అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన పూజా వస్త్రాకర్ కొన్ని మంచి షాట్లు కొట్టారు. మొత్తంగా వీరు స్కోరును 300కు తీసుకెళ్లారు.

48వ ఓవర్లో పూజ, 49 ఓవర్లో హర్మన్‌ప్రీత్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఝులన్ గోస్వామి కూడా వికెట్ కోల్పోయారు. మొత్తంగా 50 ఓవర్లకు 8 వికెట్లను కోల్పోయిన భారత్ 317 రన్లు కొట్టింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)