You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్: సన్న జీవుల శ్రద్ధాంజలి
రోజు వారీ జీవితంలో పెళ్లి, చావు... ఈ రెండింటికి ఉన్న విలువ చెప్పనవసరం లేదు. పెళ్లి వార్త చేరకపోయినా చావు కబురు మాత్రం తప్పక చేరాలన్నది ఓ ఆనవాయితీ.
ఐతే, అందుకు నేడు ఫోన్లు బాగా ఉపకరిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఫేస్‌బుక్ వాల్స్‌పై ఆ చేదు వార్త పోస్టు చేయక తప్పడమూ లేదు. అంతకన్నా ముఖ్యం, మరణానంతరం తమ వాడకట్టు ప్రజలకు సదరు విషయాన్ని దండోరా వేసి చెప్పినట్లు తెలియజెప్పడంలో తక్షణం కానవస్తున్నది ఈ స్టాండ్ పోస్ట్.
ఇది వర్చువల్ రియాలిటీ కాదు, సిసలైన రియాలిటీ పోస్టు.
రెండు బండ రాళ్ళ మధ్య ఒక కర్ర నిలబెట్టి, దానికి అట్ట ముక్కకు అతికించిన సదరు వ్యక్తి ఫోటో, ఆ ఫొటోకు ఒక పూలదండ వేయడం నేడు కూడలిలో అగుపించే సజీవ సంతాప సూచిక. తెలంగాణలో అందులోనూ హైదరాబాద్‌లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది.
మారుతున్న జీవన విధానంలో నలుగురికి చావు కబురు చేర్చడంలో మనల్ని ఆకర్షిస్తున్న మాస్ మీడియా ఇది.
పత్రికల్లో obituary కాలంలోనో, జిల్లా ఎడిషన్‌లో దశదిన కర్మ ప్రకటనగానో రేపో మాపో ప్రకటన ఇచ్చి బంధుమిత్రులందరికీ ఆ కాలం చేసిన వ్యక్తి కబురు చెప్పడానికి సమయం పడుతుంది. నిజానికి అంత శక్తీ స్థోమతా లేని జన సామాన్యానికి త్వరగా ముందు తమ వాడకట్టు వారికి తక్షణం సమాచారం చేర్చడానికి అందుబాటులోకి వచ్చిన మాధ్యమం ఇది.
అది ఫోటో కావొచ్చు లేదా కలర్ జిరాక్స్ కాపీ (ఫోటో కాపీ) కావొచ్చు, దాన్ని సమీపంలోని ఏదో ఒక జిరాక్స్ షాపులో లేదా డిజిటల్ షాపులో నాలుగు కాపీలు తీయించి, వాటిని అట్ట ముక్కలకు అతికించి, రెండు మూడు బండ రాళ్ళ మధ్య ఒక కర్ర ఉంచి నిలబెడితే - అదే కూడలిలో నాలుగు వాడలకు సంతాప సూచిక, శ్రద్ధాంజలి. ఘనమైన నివాళి.
తమలోని వారొకరు ఇక లేరన్న నిజాన్ని తెలుసుకునేందుకు, నాలుగు రోడ్ల కూడలిలో అర్పించే కడపటి నివాళి ఇది.
చిత్రమేమిటంటే, ఇది అందుబాటులోకి రావడానికి ముఖ్య కారణం ఫొటో. ఛాయా చిత్రం. అవును. ఆ చిత్తరువు ఒకటి ఉన్నందునే, దాని ఫొటో కాపీ తీసిచ్చే సౌకర్యం జనసామాన్యానికి చేరువ కావడం వల్లా ఇలా 'కూడలి శ్రద్ధాంజలి' మన దైనందిన జీవితంలో ఇప్పుడొక భాగం అయింది.
రోడ్డు మధ్యలో ఇలా ఉంచడం వల్ల పాదచారులు, వాహనదారులకు కాస్త ఇబ్బంది ఉన్నా ఇది సెంటిమెంట్‌తో కూడుకున్న వ్యవహారం కావడంతో పోలీసులు, ఇతరులు చూసీచూడనట్టు వెళ్తున్నారు.
ఫొటోలు, కథనం: కందుకూరి రమేష్‌బాబు, బీబీసీ కోసం
ఇవి కూడా చదవండి:
- హరప్పా నాగరికతలో పురాతన ‘దంపతుల’ సమాధి చెప్తున్న చరిత్ర
- మీ ఏడాది సంపాదనను మీ సీఈఓ ఓ పూటలో సంపాదించేస్తున్నారు
- స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల తెలివితేటలు పెరుగుతాయా? తగ్గుతాయా?
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు?
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- గూగుల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్: భావి నగరాలకు నమూనా అవుతుందా?
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)