You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ రాష్ట్ర సమితి: విజయానికి 7 ప్రధాన కారణాలు
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికల నిర్ణయం ఫలించింది. ఈ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ప్రధానంగా 7 అంశాలు దోహదం చేశాయి. అవేంటో చూద్దాం.
- టీఆర్ఎస్ గెలుపులో గ్రామీణ ఓటర్లు, రైతులు కీలకపాత్ర వహించారు. రైతుల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రజల్లోకి విసృతంగా వెళ్లాయని చెబుతున్నారు. అలాగే, 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టులు వ్యవసాయదారులకు ఉపయోగపడేలా చేపట్టడం టీఆర్ఎస్ గెలుపునకు సహకరించాయి.
- మిషన్ భగీరథ ప్రాజెక్టు.. అంటే ఇంటింటికీ నల్లా తీసుకురావడం అధికార పార్టీ చాలా వరకు కలిసొచ్చింది. మరో ప్రభుత్వం వస్తే ఈ పథకం ముందుకు సాగుతుందా అన్న అనుమానాలు ప్రజల్లో రేకెత్తాయి. ఇవీ టీఆర్ఎస్‌కు మేలు చేశాయని చెప్పొచ్చు.
- వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌ల పెంపు, సబ్సిడీతో గొర్రెలు, బర్రెల పంపిణీ తదితర పథకాలు టీఆర్ఎస్‌కు గ్రామాల్లో ఆధిక్యం తీసుకొచ్చేలా చేశాయి. ఈసారి ఎన్నికల్లో అర్భన్ నియోజకవర్గాల్లో కంటే గ్రామీణ నియోజకవర్గాల్లో పోలింగ్ భారీగా నమోదైంది. ఈ భారీ పోలింగ్ టీఆర్ఎస్‌కు అనుకూలించింది.
- సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చినా కేసీఆర్ వారికే మళ్లీ సీట్లు కేటాయించారు. తనను చూసి ఓటు వేస్తారని కేసీఆర్ నమ్మారు. సిట్టింగ్‌ల మీద వ్యతిరేకత ఉన్నా అది వారు ఓడిపోయే స్థాయిలో కనిపించలేదు. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలుపొందారు.
- ఉద్యమ నేతగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్ చరిష్మా ఈ ఎన్నికల్లో కూడా పనిచేసింది. దాదాపు 100 నియోజకవర్గాల్లో అన్నీ తానై ప్రచార బాధ్యతలు మోశారు.
- నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులను కూడా టీఆర్ఎస్ ఆకట్టుకుందని ఈ ఫలితాల సరళిని చూస్తే అర్థం అవుతుంది. హైదరాబాద్ నగరం, ఆంధ్రా ప్రజలు స్థిరపడిన పలు ప్రాంతాల్లో ప్రజాకూటమి కంటే టీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంది.
- టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం, లక్ష ఉద్యోగాలు, కేజీ టూ పీజీ విద్య, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ తదితర పథకాలు సరిగా అమలుకాకపోయినప్పటికీ ఓటర్లు వాటిని పెద్దగా పట్టించుకోకుండా టీఆర్ఎస్‌ను ఆదరించారని ఈ విజయం నిరూపిస్తోంది. టీడీపీతో జతకట్టడం కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం చేసిందనిపిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. ఫలితం మహాకూటమి పరాజయం పాలైంది.
ఇవి కూడా చదవండి
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్లో వీరి ఓట్లు ఎవరికి?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- తెలంగాణ ఎన్నికలు: 'మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)