ఆన్‌లైన్ పోర్న్ వల్ల మహిళలపై
    హింస పెరుగుతోందా?

    News imageNews imageNews image

    ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్(అశ్లీల) వెబ్‌సైట్ ‘పోర్న్‌హబ్’. భారత్‌లో తన మార్కెట్ అత్యంత వేగంగా పెరుగుతోందని ఆ సంస్థ చెబుతోంది.

    అమెరికా, బ్రిటన్‌ల తర్వాత ఈ వెబ్‌సైట్‌ను అత్యధికంగా చూస్తున్న మూడో పెద్ద దేశం భారత్. ఇక్కడ పోర్న్‌హబ్‌లో వీడియోలను ఎక్కువగా మొబైల్ ఫోన్లలోనే చూస్తున్నారు.

    చౌకగా స్మార్ట్‌ఫోన్లు, డేటా అందుబాటులోకి రావడంతో భారత్‌లో అశ్లీల వీడియోలు చూడటం సులభమైంది.

    చాలామంది భారతీయ యువకులకు అశ్లీల వీడియోలు చూడడంద్వారానే మొదటిసారి సెక్స్‌తో పరిచయం ఏర్పడుతోంది.

    మనిషిలోని కుతూహలానికి అవి సమాధానాలు ఇవ్వగలిగినా, అవి వ్యక్తులను అయోమయంలో కూడా పడేస్తాయి. మరీ ముఖ్యంగా నిపుణులతో తయారు చేయించిన పోర్న్ వీడియోలు, పిల్లలతో నీలి చిత్రాలు, ప్రతీకార నీలిచిత్రాలు, అత్యాచార వీడియోలు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తాయి.

    చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్నామనే ముసుగులో కొందరు ఉద్యమకారులు, పాత్రికేయుల ద్వారా అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో నా స్మార్ట్ ఫోన్‌కు వచ్చింది.

    అందులో డజను మంది మగవాళ్ళు 16 ఏళ్ళ అమ్మాయి బట్టలను చించడానికి ప్రయత్నిస్తున్నారు.

    నీలిచిత్రాలు షేరింగ్, వీక్షించడం, రేప్ వీడియోలు చూడడం వల్ల భారతీయ పురుషులపై పడే ప్రభావం గురించి, ఆందోళన కలిగించే ఈ ధోరణి గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

    అత్యాచార వీడియోలు

    News image

    బీహార్‌లోని జహనాబాద్‌లో తీసిన ఓ వీడియో వైరల్ అయింది. నిందితులైన టీనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ఆ అబ్బాయిల గ్రామంలో ఆందోళన వ్యక్తమైంది. ఊరి పెద్దలంతా ఇంటర్నెట్ వల్లే ఇలా జరుగుతోందని నిందించారు.

    సుజోయ్ ప్రసాద్‌కి అక్కడ కిరాణా దుకాణం ఉంది. బాలికపై జరిగిన అత్యాచారం వీడియో తనకూ చేరిందని ఆయన చెప్పారు. రెండేళ్ళ కిందట స్మార్ట్‌ఫోన్లు తమ గ్రామంలోకి వచ్చాయని, అప్పుడు చాలామంది యువకులకు వాటినెలా ఉపయోగించాలో కూడా తెలిసేది కాదన్నారు.

    ‘మా అబ్బాయి ప్రవేశ పరీక్షల తేదీలు చూసుకోవడానికి ఫోన్ వాడేవాడు. కానీ, ఇక్కడ 90 శాతం మంది యువకులు అన్ని రకాల వీడియోలు చూడడానికి ఫోన్లు వాడుతున్నారు’ అని ఆయన వివరించారు.

    భారత్‌లో వాట్సాప్‌ను 25 కోట్ల మందికి పైగా వాడుతున్నారు. ప్రపంచంలో ఈ యాప్‌కి అతి పెద్ద మార్కెట్ ఈ దేశమే.

    ఏకాంతంగా పోర్న్ చూడడం భారత్‌లో చట్టబద్ధమే. కానీ, ఆ వీడియోలను రూపొందించడం, షేర్ చేయడం (ఇతరులకు పంపడం) చట్ట విరుద్ధం.

    ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం పెరగకముందు చిన్నచిన్న దుకాణాల్లో గుట్టుగా దొరికే రేప్ వీడియోలు, పోర్న్ వీడియోలను జనం చూసేవారు.

    అయితే, చాలామంది దుకాణదార్లు ఇప్పుడా వ్యాపారం లేదని చెబుతున్నారు. దగ్గర్లోని పట్టణంలో నేను మాట్లాడిన కొంతమంది 15, 16 ఏళ్ళ అబ్బాయిలు కూడా దీనిని నిర్థారించారు.

    ఓ కోచింగ్ సెంటర్ దగ్గర ఈ అబ్బాయిలను కలిశాను. వారిలో చాలామంది అమ్మాయిలను అవమానించే వీడియోలను, అత్యాచార వీడియోలను తరచుగా చూస్తామని చెప్పారు.

    పదకొండో తరగతి చదువుతున్న ఒకబ్బాయి తాను 25- 30 వీడియోలు చూశానని, ఇలాంటి క్లిప్పింగులు వచ్చినపుడు అందరూ షేర్ చేసుకుంటామని చెప్పాడు.

    “మా క్లాసులో పిల్లలు చాలామంది ఈ వీడియోలు కలిసి చూస్తారు. ఒకోసారి ఒంటరిగా చూస్తారు. అందరూ చూస్తారు. కాబట్టి తప్పు అనిపించదు” అని మరో అబ్బాయి చెప్పాడు.

    అలాంటి అనేక వీడియోల్లో జహనాబాద్ వీడియో ఒకటి. ఈ ధోరణి అందోళన కలిగిస్తోందని బీహార్ ఎంపీ రంజీత్ రంజన్ అన్నారు.

    రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళా ఎంపీల్లో ఆమె ఒకరు.

    ఈ వీడియోలు ఆమె ఫోన్‌కూ వచ్చాయి. ఒకటి కాదు, ఆరేడు వచ్చాయి. ‘‘ఇలాంటి వీడియోలు తీయడానికి కొందరు పోటీపడుతున్నారు. అమ్మాయిల పట్ల గౌరవం, మర్యాద ఉన్నవాళ్లెవరూ అలాంటి పనులు చేయరు. మహిళలను గౌరవించేవాళ్లు ఆ వీడియోలు కనిపించగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు’’ అని ఆమె అన్నారు.

    News image

    వీడియోల ప్రభావం

    News image

    రంజిత్ రంజన్ మాటలు సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారుతున్నాయో చెబుతున్నాయి. మహిళలు స్వేచ్ఛగా తీసుకునే నిర్ణయాలకు గౌరవం లేదని చెబుతున్నాయి.

    ఈ సమస్యలను గురించి చర్చ ఉండదు – దీనివల్ల తరచుగా అవమానపడే, భయపడే బాధితులకు సహాయం, మద్దతు లభించదు.

    ఉత్తర భారతదేశంలో నలభైయ్యేళ్ళ గీతతో మాట్లాడినపుడు భయం వల్ల దుష్పరిణామాలుంటాయనీ, చివరికి మృత్యవు కూడా సంభవించవచ్చనీ నాకు తెలిసింది.

    వాట్సాప్ లో అత్యాచార వీడియో వైరల్ అయినపుడు గ్రామీణ భారతంలో నిరుపేదరాలైన తల్లి, ఆశ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంది.

    ఆమె తన మీద దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయాలనుకుంది. కాని గ్రామపెద్దలు, సర్పంచ్, పోలీసులు అందరూ ఆమెనే తప్పుపట్టారు.

    ఇది కేవలం గ్రామీణ సమస్య కాదు. పట్టణాల్లో కూడా వేగంగా పెరుగుతున్న ధోరణి ఇది. పిల్లలపై జరిగే అత్యాచార వీడియోలు కూడా బాగా వస్తున్నాయి.

    హైదరాబాదులో లైంగిక హింస, స్త్రీల అక్రమ రవాణా వంటి సమస్యలపై పోరాడే ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ కు 2015లో ఇటువంటి రెండు వీడియోలు వచ్చాయి. వాటిని ఓ మహిళ వాట్సాప్ లో షేర్ చేశారు.

    ఒక వీడియోలో పన్నెండేళ్ళ బాలికను ఎనిమిదిమంది రేప్ చేయడం ఉంది. రెండోదానిలో యువతిపై అత్యాచారం జరిగింది, ఆమె బోయ్ ఫ్రెండ్ కొట్టారు, మూడో వ్యక్తి ఇదంతా మొబైల్ ఫోన్లో రికార్డు చేస్తున్నాడు.

    స్వయంగా అత్యాచార బాధితురాలైన సునీత 24 గంటల్లో ‘షేమ్ ది రేపిస్ట్’ ప్రచారాన్ని ఆరంభించారు. ఆ వీడియోలను బాధితులను గుర్తించకుండా మూసేసి, నేరం చేసిన వారి బొమ్మలు బాగా కనిపించేలా హైలైట్ చేసి పోస్ట్ చేశారు.

    ఈ ప్రచారం వివాదాస్పదంగా మారింది. బాధితుల రక్షణ కోసం వీడియోలను పంపకూడదని స్త్రీవాదులు కూడా దీన్ని విమర్శించారు.

    సునీత తన ప్రచారాన్ని ఆపేసినా, జనం ఆమె వీడియోలను పంపుతూనే ఉన్నారు.

    దీనిపై దర్యాప్తు చేయవలసిందని సునీత సుప్రీంకోర్టుకు రాశారు. ‘‘రేప్, గ్యాంగ్ రేప్ ల వీడియోలకు పెద్ద మార్కెట్ ఉందని దర్యాప్తులో తేలింది.

    మొదటి వీడియోని అప్లోడ్ చేసిన వ్యక్తిని కూడ వాళ్ళు పట్టుకొన్నారు. అతని దగ్గర మరో 489 వీడియోలు దొరికాయి. దీనితో ఈ సమస్య విస్తృతి అర్థమైంది మాకు.’’

    కొన్ని కేసుల్లో, చాలా ప్లాట్ ఫాంల నుంచి వీడియోలు తీసేయించడం సునీతకు సాధ్యమైనా, ఇంటర్నెట్ నుంచి దేన్నైనా పూర్తిగాతీసేయడం అసాధ్యమని ఆమె గుర్తించారు.

    చాలామందితో మాట్లాడిన తర్వాత, పోర్న్, రేప్ వీడియోలు సులభంగా షేర్ చేసుకోగలగడం సమస్యకు కారణమైతే, మరింత సవాలుగా నిలిచేది వాటిని చూడాలనే కోరిక అని తేలింది.

    పోర్న్ మార్కెట్

    News image

    ఈ కోరికను, దాని ప్రభావాన్ని అర్థం చేసుకోడానికి ‘పోర్నిస్థాన్, భారతదేశంలో పోర్న్ అంటు వ్యాధి నుంచి బయటపడటమెలా’ అనే పుస్తకం రాయడానికి నెలల తరబడి ఆదిత్య పరిశోధన జరిపారు.

    అయితే పోర్నిస్థాన్ కూడ ఎక్కువగా పోర్న్ తో ఆదిత్య సొంత అనుభవాలతో ప్రేరితమైనదే.

    ఆదిత్య ఎన్నో పోర్న్ వీడియోలు చూసేవాడు. ముందు సెక్సీ వీడియోలు చూసేవాడు. తర్వాత మరింత హింసాత్మక వీడియోలు చూడడం మొదలుపెట్టి, ఇంక మానలేకపోయాడు.

    తర్వాత అతను తన స్వంత సంబంధాలలో కూడా అదికావాలనుకున్నాడు. కొంతకాలానికి పోర్న్ వల్ల తప్ప, గర్ల్ ఫ్రెండ్ వల్ల ప్రేరితం కాలేనిస్థితికి వచ్చాడు.
    అప్పుడే అతనికి ఏదో తప్పుందని అర్థమైంది. అది అతనిలో మార్పుకి కారణమైంది. అయితే ఇదంతా సాధారణంగా జరిగేదేనని అతనంటున్నాడు.

    ఆదిత్య నాకిలా చెప్పాడు, ‘‘ఇండియన్ పోర్న్ గురించి వెతికితే దొరికేది నిజజీవిత పోర్న్ ఫిల్మ్. దానిలో అమ్మాయికి తనను ఎవరో చిత్రీకరిస్తున్నారని తెలియదు. ఇవి ఫోనుతో, వెబ్కామ్‌తో చిత్రీకరిస్తారు. రేప్ వీడియోలు, రేప్ పోర్నోగ్రఫీ బాగా పాపులర్ అయ్యాయి.”

    ఆదిత్యతో కలిసి ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి యువకులని కలిసి, వాళ్ళు మొదటిసారి ఎప్పుడు పోర్న్ చూశారో, వారికి ఎటువంటి పోర్న్ ఇష్టమో తెలుసుకోవాలనుకున్నాను.

    ‘‘నాకు 12 ఏళ్ళు. ఫోనులో మొదటిసారి పోర్న్ చూశాను.ఇంటెన్స్ హార్డ్కోర్ (అన్నీ వివరంగా చూపించే) పోర్న్ చూస్తాను.’’

    ‘‘నాకు 11 ఏళ్ళు. మొబైల్ లో చూశాను. హార్డ్ కోర్, ముగ్గురు కలిసి చేసే పోర్న్ చూస్తాను.’’

    ‘‘నాకు 12 ఏళ్ళు. నా ఫ్రెండ్ మొబైల్ లో చూశాను. హింసాత్మక తీవ్ర (ఇంటెన్స్) పోర్న్ చూస్తాను.’’

    దీన్ని ప్రాతినిధ్య నమూనాగా తీసుకోలేం.అయితే ఒక విషయం అర్థమైంది. హార్డ్ కోర్ పోర్న్ ఎక్కువగా చూస్తారని.

    ఆదిత్య ఆశ్చర్యపోలేదు. ‘‘జనం ఏం చూస్తున్నారని నేను పరిశోధించినపుడు, ఈ విపరీత అంశాన్ని చూస్తున్నారని గుర్తించాను. దాన్ని ప్రయివేటుగా చూస్తారు.దాని వల్ల దుష్పరిణామాలుండవు.’’

    ఒకబ్బాయి పోర్న్ చూసినందుకు తనకేమీ అపరాధభావన లేదని, ఇదంతా ఎదుగుదలలో భాగమని చెప్పాడు.

    మరొకరు ఇది సంతోషాన్నిచ్చిందని, అలాగే ‘లైంగిక విద్య’ కూడా లభించిందని అన్నారు.

    లైంగిక విద్య

    News image

    పుణెకు చెందిన ఫ్యాషన్ రచయిత, డిజైనర్ యాండీ బర్వే తనకు సెక్స్ గురించి మొదటిసారి పోర్న్ ద్వారానే అవగాహన కలిగిందని అన్నారు. తర్వాత పోర్న్ చూడడం వ్యసనంగా మారింది.

    ఆయనెంతగా ప్రభావితుడయ్యాడంటే నిజజీవితంలో కూడా పోర్న్ స్టార్ లా ప్రవర్తించేందుకు ప్రయత్నించేవాడు.

    యాండీ నాకిలా చెప్పాడు, ‘‘మన శరీరాలు ఆ చిత్రాల్లో చూపించే లాంటివికాదు, అలా పనిచేయలేవు కూడా, కాని ఆ విషయం అర్థమయ్యే లోపు నా శరీరానికి హానిచేసే ఎన్నో భంగిమలు నేను ప్రయత్నించి చూశాను.’’

    యాండీ అనారోగ్యం పాలయ్యాడు. హెపటైటిస్ ఎ కూడ వచ్చింది. మళ్ళీ ఆరోగ్యవంతుడు కావడానికి బోలెడంత డబ్బు, ఎంతో శ్రద్ధ అవసరమైనాయి.

    పోర్న్ చూడడం ద్వారా లైంగిక కార్యాన్ని గురించి తెలుసుకోవడమంటే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిల్మ్ సిరీస్ చూస్తూ డ్రైవింగ్ చేయడమెలాగో నేర్చుకోవడం లాంటిదని సెక్సాలజిస్టు, న్యూరో సైకియాట్రిస్ట్ డా.శ్వేతాంక్ బన్సాల్ అంటారు.

    ఇదెలా ఉండాలో అనే దాని గురించి మీ దృక్పథాన్ని పోర్న్ పూర్తిగా మార్చేస్తుంది. అవాస్తవమైనవి ఆశించేలా చేస్తుంది.

    ఇప్పుడు ఎనిమిది, తొమ్మిదేళ్ళ వయస్సు పిల్లలు తన దగ్గరికి వస్తారని డా. బన్సాల్ చెబుతున్నారు. ‘‘తమ పిల్లలు పోర్న్ చూసి కుంగుబాటుకు, మనోవ్యాకులతకు లోనవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.’’

    భారతదేశంలో కౌమార విద్యాకార్యక్రమం ఉంది కాని అదికొద్దిమందికే ప్రయోజనం కలిగించింది.

    మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ 2007లో కౌమార విద్యా కార్యక్రమాన్ని ఆరంభించింది. అయితే తర్వాత చాలామంది తల్లిదండ్రులు ఇది అశ్లీలంగా ఉందని ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఆపేసింది.

    ఆ పిమ్మట ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సహాయంతో 2009లో దీనిని మళ్ళీ ఆరంభించారు.

    దీనిలో కౌమారంలో వచ్చే మార్పులు, జెండర్, లైంగికతలను గురించిన అపోహలు, శరీరాకృతి, హింస, హెచ్ ఐవి ఇన్ఫెక్షన్, మాదక ద్రవ్యాల వాడకం వంటివి ఉన్నాయి.

    కాని దీని అమలు సవాలుగానే ఉంది. బీహార్ లో జహనాబాద్ పాఠశాల ప్రిన్సిపాల్ కనీసం ఈ కార్యక్రమం గురించి విననేలేదు అని నాకు తెలిసింది.

    బాలికా కన్యావిద్యాలయ కేవలం అమ్మాయిల పాఠశాల. పక్కనే అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకునే పాఠశాల ఉన్నా తల్లిదండ్రలు తమ కూతుర్లను ఈ పాఠశాలలోనే చేరుస్తారని ప్రిన్సిపాల్ రవీంద్రకుమార్ చెప్పారు.

    చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో అమ్మాయిలు అంతగా మాట్లాడుకోరు.అందువల్ల కూడా కుతూహలం పెరిగే అవకాశం ఉంది.

    జహనాబాద్‌లో నేను చూసిన కోచింగ్ సెంటర్లో వంద మంది విద్యార్థులున్నారు. అమ్మాయిలు ఒక చోట, అబ్బాయిలు ఒకచోట విడిగా కూర్చున్నారు.

    లైంగిక విద్య అవసరం ఉందని రవీంద్రకుమార్ అంగీకరించారు. ‘‘ఈ విషయాలు పాఠశాలలోనే చెప్పాలి. తండ్రులు ఈ విషయాలు చెప్పలేరు.తల్లులు ఇంట్లోనేఉంటారు కాబట్టి వారికి వర్తమాన విషయాలు తెలియవు. ప్రభుత్వం ఆదేశిస్తే మేము తప్పనిసరిగాఅమలు చేస్తాం.”

    సెక్స్ ఎడ్యుకేషన్ (లైంగిక విద్య) అంటే కేవలం శరీరం గురించి,లైంగిక సంబంధాలగురించి సమాచారమివ్వడమేకాదు, స్త్రీల పట్ల పురుషుల వైఖరుల్లో లోతైనస్థాయిల్లో గాఢమైన ప్రభావాన్ని కలిగించడం కూడ అని రంజీత్ రంజన్ అన్నారు.

    ఆమె ఇలా అన్నారు, ‘మనం ఎంతో ప్రగతిశీలంగా ఉన్నామని అనుకోవచ్చు. కానీ, సెక్స్ ఎడ్యుకేషన్ లేకుండా, ఈ వీడియోలు వ్యాపిస్తూ ఉంటే,ఆడవాళ్ళని వస్తువులుగా చూడాలనే ఆలోచన మొదలై, వాళ్ళు వినోదానికి పనికొస్తారనే దృష్టి ఏర్పడుతుంది. దీని పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.’

    అందుకని పోర్న్ నిషేధించడమొకటే దీనికి సమాధానమా?

    పోర్న్‌పై నిషేధం

    News image

    ఇటీవల హింసాత్మక పోర్నోగ్రఫీ ఉన్న వెబ్‌సైట్లను నిషేధించమని ఉత్తరాఖండ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

    డెహ్రాడూన్ లో యువకులు తమ మొబైల్ లో పోర్న్ చూసి ఒక బాలికపై సామూహిక అత్యాచారం జరిపారనే సంఘటన రిపోర్టు రావడంతో ఇలా కోరడం జరిగింది. అబ్బాయిలను అరెస్టుచేశారు. కేసు దర్యాప్తు జరుగుతోంది. హింసాత్మక పోర్న్ అందుబాటులో ఉండడంవల్ల మహిళల మీద ఇంకా హింస పెరుగుతుందని దీన్ని నిసేధించమని ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.

    దీని కన్నా ముందు, 2015లో సునీతాకృష్ణన్, మరో లాయరు సుప్రీంకోర్టుకి వెళ్ళినపుడు కూడా కోర్టు ప్రభుత్వానికి ఈ సిఫారసు చేసింది.

    ఆ సమయంలో ఐటి నిపుణుడు సురేశ్ శుక్ల 857 వెబ్ సైట్ల జాబితాను కోర్టుకు సమర్పించారు. పోర్న్ నిషేధానికి ఆ జాబితా ఆధారమైంది.

    అయితే, జనం నిరసనలు వ్యక్తం చేయడంతో ఆ నిషేధాన్నికొన్ని రోజుల్లోనే వెనక్కి తీసుకున్నారు. ఆ వెబ్ సైట్ల జాబితా తయారీ ఏ విధంగా జరిగిందో బహిర్గతం చేయలేదనేది ఒక వాదన.

    నేను దీని గురించి సురేశ్ శుక్లను అడిగినపుడు, ఆయన సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ‘‘మేము హైట్రాఫిక్ (జనం ఎక్కువగా చూస్తున్న)వెబ్ సైట్లు ఎంపికచేశాం. కొన్ని ఇతర దేశాల్లో వాళ్ళు చూసేవి. ఇది మరీ శాస్త్రీయమైన ఎంపిక కాదు కాని, అన్నీ పోర్నోగ్రఫీనే.’’

    సురేష్ శుక్లా తయారు చేసిన జాబితా డిఫాల్ట్ పోర్న్ బ్లాక్ లిస్ట్ అయింది. ఇటీవల నిషేధానికి కూడా ఆధారమైంది. సురేష్ తయారు చేసిన జాబితాలోవి 83 సైట్లు అన్నీ బ్లాక్ అయ్యాయి. అయితే, ఇంటర్నెట్లో ప్రాక్సీ వెబ్ సైట్లు తయారుచెయ్యడమెంత సులభమో తెలిసిందే గనుక, నిషేధాన్ని అమలుచేయడం ప్రశ్నగానేమిగిలింది. మరో సమస్య ఏమిటంటే హింసాత్మక లైంగిక అంశాలు సోషల్ మీడియా ద్వారా షేర్అవుతున్నాయి. అది పోర్న్ వెబ్ సైట్ల నిషేధ పరిధిలోకి రాదు.

    ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియాకు రాజేశ్ ఛారియా ప్రెసిడెంటు. ఈ సంస్థలే బ్లాక్ లిస్ట్ చేసిన సైట్లను బ్లాక్ చేయాల్సినవి.

    నిషేధం వల్ల పెద్ద ప్రయోజనం లేదని రాజేష్ అ0భిప్రాయం. ‘‘ఈ రోజుల్లో పోర్నోగ్రఫీ. పిల్లలపై అత్యాచారాలు,హింస డెస్క్ టాప్లో చూడడం లేదు. ఫోన్లోనే చూస్తున్నారు. పిల్లల పోర్నోగ్రఫీని బ్లాక్ చేయాలంటే,వాట్సాప్‌ను నిషేధించమని నేను సూచించాను.అయితే భారతదేశమంతటా వ్యాప్తిలో ఉన్న అప్లికేషన్‌ను నిషేధించడం కష్టం.”

    ఇటువంటి వాటిని షేర్ చేయడంలో వాట్సాప్ప్రాబల్యాన్ని కాదనలేం. అయితే ఈ వ్యాప్తిని అరికట్టడానికి ఏం చేస్తున్నారని వారిని మేం ప్రశ్నించాం.

    సాంకేతిక పరిష్కారాలు
    News image

    వాట్సాప్ మాకు ఈ ప్రకటన పంపింది. ‘‘భారతదేశంలో మా వినియోగదార్ల భద్రత గురించి వాట్సాప్ శ్రద్ధ తీసుకుంటోంది. ఈ భయంకరమైన రేప్ వీడియోలకు, పిల్లల పోర్నోగ్రఫీకి మా ప్లాట్ ఫారంలో చోటు లేదు. లక్షలాది మంది ప్రజలకు ప్రైవేటు కమ్యూనికేషన్‌ను విశ్వసనీయంగా చేరవేస్తుంది వాట్సాప్. అయితే, కొందరు మా సేవలను హానికరమైన అంశాల వ్యాప్తికి ఉపయోగించడం విషాదకరం.”

    ‘‘అందువల్లే ఇటువంటి సమస్యలను రిపోర్టు చేయడం సులభం చేశాం. మేం తగిన చర్యలు తీసుకుంటాం, అకౌంట్లను నిషేధిస్తాం. భారతదేశంలో చేసే న్యాయపరమైన అభ్యర్థనలకు మేం ప్రతిస్పందిస్తాం, నేరాల దర్యాప్తులో సహకరిస్తాం.’’

    అటువంటి వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయినవాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో నుంచి ప్రైవసీ క్లాజును ఉపయోగించి తొలగించవచ్చు.

    కిస్లే చౌధరి స్వయం ప్రకటిత ఎథికల్ హ్యాకర్.

    ఆయన ఇండియన్ సైబర్ ఆర్మీ వ్యవస్థాపకుడు. ఇది వ్యక్తులకు హెల్ప్ లైన్ ద్వారా సాంకేతిక సలహాలనిస్తుంది. ఢిల్లీ పోలీసులకి సైబర్ నేర దర్యాప్తు యూనిట్లలోను సహకరిస్తుంది. కిస్లే చెప్పిన దానిని బట్టి తన అనుమతిలేకుండా తన వీడియోను అప్ లోడ్ చేశారని బాధితురాలు ఫిర్యాదు చేస్తే అది ఆమె ప్రైవసీని అతిక్రమించినట్టే. కాబట్టి దానిని వెంటనే తొలగించవచ్చు.

    అయితే అది కూడ ఉల్లంఘనకు వీలైనదే.

    సైబర్ క్రైం బాధితులకి శాశ్వత పరిష్కారం లేదనికిస్లే అంటారు. ‘‘మొదటిసారి అప్ లోడ్ చేసినవారు మళ్ళీ దాన్ని అప్ లోడ్ చేయవచ్చు. ఆ వీడియో చూసిన వారెవరైనా దాన్ని డౌన్లోడ్ చేసికొని ఉండవచ్చు. వాళ్ళు మళ్ళీ దాన్ని అప్ లోడ్ చేయవచ్చు. ఈ ప్రక్రియలో కొంతడబ్బు సంపాదించవచ్చు.’’

    సైబర్ నేరాల యూనిట్లలో పనిచేసే పోలీసు అధికారులకితగిన శిక్షణ లేకపోవడం వల్ల కూడ సాక్ష్యాల సేకరణలో అలసత్వం జరిగి చాలాకేసులువీగిపోతాయని కిస్లే అభిప్రాయపడుతున్నారు.

    ఇంటర్నెట్ నుంచి దేన్నీ శాశ్వతంగా తీసి వేయలేని అశక్తత ప్రధాన సమస్యగానే ఉంటోంది, ప్రత్యేకించి ఎక్కువమంది ఈ వెసలుబాటు కావాలని అనుకుంటున్నారు. కానీ, ఇది ఇప్పటికీ రిష్కారం లేని సమస్యే.

    పరిష్కారం ఏమిటి?

    News image

    ఈ కోరికను గుర్తించకపోవడం మనం చేస్తున్నపెద్ద తప్పు అని పరోమిత వోహ్రా అంటున్నారు.

    ఆమె ‘ఏజెంట్స్ ఆఫ్ ఇష్క్’ అనే వెబ్ సైట్‌ను నడుపుతున్నారు. దానికి ట్యాగ్ లైన్ ‘వియ్ గివ్ సెక్స్ ఎగుడ్ నేమ్’. (సెక్స్ కి మేం మంచి పేరు తెచ్చిపెడతాం.)

    పరోమిత దేశవ్యాప్తంగా అన్ని రకాల నేపథ్యాల నుంచి, లైంగికతల నుంచి వచ్చిన వారి నుంచి, అభిప్రాయాలు సేకరిస్తారు; ఆమె పాటలు, వీడియోలు రికార్డు చేసి షేర్ చేస్తారు. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటాన్ని ప్రోత్సహించడానికి ఇలా చేస్తారు.

    హింసాత్మక లైంగిక అంశాలను చూసి, ఆనందించడానికి హింసాత్మక ప్రవర్తన ఒకటే మార్గమని జనం నమ్ముతారని, సున్నితత్వానికి తావివ్వరని, స్త్రీ అనుమతికి ఏమాత్రం ప్రాముఖ్యమివ్వరని ఆమె అభిప్రాయం.

    అందుకనే పరోమిత అనుమతిని గురించి వివరిస్తూవీడియోలు తీశారు. ఎందుకంటే అనుమతి లేకుండా చేసినపుడే సెక్స్ హింసాత్మకంగా మారుతుంది.

    పరోమిత ఇలా అంటారు, ‘అనుమతి – యస్ అంటే యస్ అని గాని, నో అంటే నో అనిగాని చెప్పేంత సులభమైనది కాదు. నిజజీవితంలో కొన్నిసార్లు ఏదీ నిర్ధారించుకోలేని దీర్ఘ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఏదైనా కావచ్చు. ఇది యస్ (అంగీకారం) కావచ్చు. నో (అనంగీకారం) కావచ్చు.

    ఈ సంభాషణకు చాలా సమయం పడుతుంది. ఎనిమిది, తొమ్మిదేళ్ళ పిల్లలు తన దగ్గరకు వస్తారని డాక్టర్ బన్సాల్ చెప్పిన విషయం మనం గుర్తుంచుకుని, తొందరగా దీన్ని మొదలుపెట్టాలి.

    ఆన్ లైన్లో ఏజెంట్స్ ఆఫ్ ఇష్క్ కు చాలాదూరంగా ,పుణెలోని ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్ ’అనే సంస్థ తక్కువ ఆదాయ కమ్యూనిటీ యువకులకు ఏడాది పొడుగునా వర్క్ షాపులు నిర్వహిస్తోంది. పోర్న్ చూడడం గురించే కాకుండ, వర్క్ షాపులలో చాలాకౌమార సమస్యల పై దృష్టి కేంద్రీకరిస్తారు. దైనందిన జీవితానికి సంబంధించిన వాటిని అంటే ఇంటి పని ఎవరు చెయ్యాలి, అమ్మాయిలకు జీవిత నిర్ణయాలు తీసుకునేస్వేచ్ఛ ఉండడం, వారితో మెలిగే పద్ధతి, తమపై జరిగే హింసకు అమ్మాయిలు ఏ విధంగాను బాధ్యులు కారని మొదలైన అంశాలు ఉంటాయి.

    అక్కడ ఒక ఏడాది గడిపిన ఇద్దరు అబ్బాయిలతో నేను మాట్లాడాను. వాళ్ళలో ఒకబ్బాయి అదివరకు ఇంటి పని ఆడవాళ్ళే చేయాలని అనుకున్నానని,కాని ఇప్పుడు బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం తానూ చేస్తున్నానని, దానితో తన సోదరికి ఆడుకోవడానికి సమయం దొరుకుతోందనిచెప్పాడు.

    మరొక అబ్బాయి తన స్నేహితులు ఆడపిల్లలను కొట్టడంచూసేవాణ్ణని, తాను కూడ అలా చేయాలనుకున్నాను అన్నాడు. కాని తర్వాత హేళన వ్యాఖ్యలు, అమ్మాయిలనుఏడిపించడం, వంటివి కూడ హింసేనని తెలిసిందని చెప్పాడు. అమ్మాయిలకు ఇష్టమైనపుడు చేయడం ఓకే అని లేకపోతే అంగీకారం లేనట్టేనని అన్నాడు.

    ఈ చిన్న చర్యలు పెద్ద సవాలు పరిష్కారానికి ఆరంభాలు. భారతదేశంలో మొబైల్ ఫోన్లలో హానికరమైన లైంగిక విషయాలు వ్యాప్తి చెందకుండా ఆపటానికి, మనకి ఉపకరణాలెన్నో కావాలి: సాంకేతిక పరిష్కారాలు, సెక్స్ ఎడ్యుకేషన్, మరింతగా దీని గురించి మాట్లాడడం.

    అంతేకాకుండా, మహిళల పట్ల మన వైఖరుల్లో మౌలికమైన మార్పురావడం అవసరం. ఒక పిల్లవాడు ఏవేవి హింస పరిధిలోకి వస్తాయని తెలుసుకోవడంతో ఈ మార్పు మొదలు కావచ్చు.

    కథనం: దివ్య ఆర్య
    చిత్రాలు: పునీత్ బర్నాలా
    ఫొటోలు: కాషిఫ్ సిద్దిఖీ
    షార్ట్ హ్యాండ్: షాదాబ్ నజ్మీ