భారత్‌లో సోషల్ మీడియా వదంతులు: పెరుగుతున్న హత్యలు

భారత్‌లో దేశవ్యాప్తంగా మూకదాడులు పెరుగుతున్నాయి. వాట్సాప్, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న అసత్య వార్తలే దీనికి ప్రధాన కారణం. బీబీసీ విశ్లేషణ ప్రకారం 2014 ఫిబ్రవరి నుంచి 2018 జనవరి వరకు 31 మంది ఈ దాడుల్లో చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. బీబీసీ పరిశీలనకు రాని ఇలాంటి ఘటనలు మరెన్నో ఉన్నాయి.

పిల్లలను ఎత్తుకుని వెళ్లేవారు తిరుగుతున్నారనే తప్పుడు సమాచారం ప్రచారంలోకి రావడంతో అందరూ అప్రమత్తమవుతారు. తమ పరిసరాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు, వారిని అనుమానిస్తుంటారు. ఇలాంటి సమాచారం కారణంగా 25 మంది పురుషులు, నలుగురు మహిళలు, మరో ఇద్దరు మృతి చెందారు. బీబీసీ పరిశోధించిన ఆ ఘటనల క్రమం ఇదీ.

హత్య చేసేందుకు ప్రజల్ని పురికొల్పిన వాట్సాప్ వీడియో

2018 జూన్‌లో ఓ వీడియో వాట్సాప్‌లో వైరల్ అయ్యింది. దాని పరిణామాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆ వీడియోలో... మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపైనున్న ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్లుగా ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి చేరిన ఈ వీడియోలో ఆ ఘటన బెంగళూరులో జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది ఆ వీడియో. కిడ్నాపర్లనే అనుమానంతో దాదాపు 10 మందిని మూకలుగా ఏర్పడ్డ స్థానికులు చంపారు.

ప్రజల ఆగ్రహం, ఆందోళనల కారణంగా అసలు వాస్తవాలు బయటకు రాలేదు.

నిజానికి ఈ వీడియో పాకిస్తాన్‌లో రూపొందింది. పిల్లల రక్షణపై అవగాహన కల్పించేందుకు దీన్ని ఓ చైల్డ్ వెల్ఫేర్ గ్రూప్ తయారుచేసింది. కిడ్నాపర్‌గా ఉన్న వ్యక్తి తను ఎత్తుకెళ్లిన పిల్లాడిని తిరిగి అతని స్నేహితుల మధ్యలో వదిలి వెళ్లడం కూడా వీడియో చివరలో ఉంది. అంతేకాదు... కరాచీలో రోడ్డుపై ఆడుకునే పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఒక్క క్షణం పని, జాగ్రత్త అనే ఓ సందేశం కూడా ఉంది. కానీ ఇదంతా తీసేసి... కేవలం కిడ్నాప్ చేస్తున్న వీడియో భాగాన్ని మాత్రమే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

ఈ మూకదాడుల బాధితుల్లో చాలా మంది వేరే ప్రాంతాలవారే. వీరిలో కొందరు విదేశీయులు కావొచ్చు, లేదా కుటుంబాలను వదిలేసి ఒంటరిగా ఉంటున్నవారు కావొచ్చు. అస్సాంలోని గువాహటికి చెందిన నీలోత్పల్ దాస్, అభిజీత్ నాథ్ అనే ఇద్దరిపై అదే రాష్ట్రంలోని ఓ గ్రామంలో దాడి జరిగింది. వారు ఓ చోట ఆగి తాము వెళ్లాల్సిన ప్రదేశానికి దారి అడుగుతుండగా ఈ దాడి జరిగింది. స్థానికులు వాట్సాప్‌లో వైరల్ అయిన కిడ్నాప్ వీడియో చూడటం, వీరిద్దరినీ కిడ్నాపర్లుగా భావించడమే దీనికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీబీసీ అస్సాంకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది.

పెరుగుతున్న ప్రాణాంతక వదంతులు

2018లో ఈ తరహా దాడుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బీబీసీ పరిశీలనలో తేలింది. ఈ రెండేళ్లలో 23 ఘటనల్లో హత్యలు జరగగా, వాటిలో 20 అంటే 86 శాతం దాడులు ఏప్రిల్-జులై మధ్యలోనే జరిగాయి.

YearDeaths
2015 |
2016 |
2017 |
2018 |

ఈ దాడులు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. సోషల్ మీడియా కారణంగా ఇవి 12 రాష్ట్రాలకు పాకాయి.

Compare states

ఫేక్ వీడియోలు, అసమగ్ర సమాచారం, మార్పిడి చేసిన సమాచార వ్యాప్తికి వాట్సాప్‌ ప్రధాన మూలం. కానీ ఇవి ఎక్కడి నుంచి పుట్టాయో తెలుసుకోలేకపోవడం నిజమైన సమస్య. మెసేజ్‌లను సులభంగా ఫార్వర్డ్ చేయగలిగే సౌలభ్యం కారణంగా ఈ వ్యాప్తి చాలా వేగంగా ఉంటోంది. ఫార్వర్డ్ చేసే సమయంలో ఒక్కోసారి, కొంత సమాచారం మిస్ కావచ్చు, లేదా సమాచారానికి సంబంధించిన సోర్స్, దాని రచయిత వంటి వివరాలు మిస్ కావచ్చు. సాధారణంగా ఎవరికైనా మెసేజ్‌లు స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి, వారికి చెందిన గ్రూపుల నుంచే ఎక్కువగా వస్తుంటాయి. దీంతో అవి నిజమా, అబద్ధమా అనేది పరిశీలించాలనే ఆలోచన వచ్చే అవకాశం చాలా తక్కువ.

ప్రస్తుతం వాట్సాప్‌కు 200 కోట్లమంది యాక్టివ్ యూజర్లున్నారు. 2020 నాటికి భారత్‌లో వాట్సాప్ యూజర్ల సంఖ్య 45 కోట్లకు చేరుతుందని అంచనా.

News image

తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌పైన 'ఫార్వర్డెడ్' అని చూపించడం, ఒకేసారి పరిమితికి మించిన సంఖ్యలో గ్రూపులకు ఫార్వర్డ్ చేయకుండా నిరోధించడం వంటివి ఇందులో ఉన్నాయి. యూజర్ల భద్రత తమకెంతో ముఖ్యమని వాట్సాప్ బీబీసీతో చెప్పింది.

Methodology

2014 ఫిబ్రవరి నుంచి 2018 జులై మధ్య వివిధ ఆంగ్ల పత్రికలు, ఆన్‌లైన్‌లో వచ్చిన 3 కోట్లకు పైగా వార్తలను ఈ పరిశోధన కోసం బీబీసీ విశ్లేషించింది.

నిర్దిష్ట కీవర్డ్స్ కోసం ఈ వార్తలను బీబీసీ స్కాన్ చేసింది. దీని ఆధారంగా ఈ వార్తలను ఆరు వేల కీలక ఘటనలుగా వర్గీకరించింది. తర్వాత కనీసం రెండు నమ్మదగిన సోర్సులు (ఒక న్యూస్ వెబ్‌సైట్, ఒక న్యూస్ ఏజెన్సీ) ద్వారా వీటన్నింటినీ, సాఫ్ట్‌వేర్ సాయం ఏమీ లేకుండా నేరుగా పరిశీలించింది.

ఏజెన్సీలో ఒక కథనానికి సంబంధించి ఎలాంటి వివరాలూ లభించకపోతే, దానికోసం కనీసం మూడు న్యూస్ వెబ్‌సైట్లలో పరిశోధించింది. ఈ అసత్య సమాచారం కారణంగా ఎంత మంది మరణించారనే దానిపైనే ఈ పరిశోధన ప్రధానంగా దృష్టి పెట్టింది.