కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఎన్నికల సంఘం

ఒక ఎన్నికల సభలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం

    కేసీఆర్

    ఫొటో సోర్స్, FB/KCR

    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటలపాటు నిషేధం విధించింది.

    ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఈసీ ఈ చర్య తీసుకుంది. ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో జరిగిన ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ పైనా, ఆ పార్టీ నాయకులపైనా కేసీఆర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

    కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం

    ఫొటో సోర్స్, UGC

    దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేసీఆర్ వివరణ కోరింది. అయితే ఆయన ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని ఎన్నికల సంఘం, ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది.

    బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఆయన ఏ విధమైన ప్రచార కార్యక్రమాల్లో, మరే విధమైన ఎన్నికల కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదు. ప్రెస్‌మీట్లు పెట్టకూడదు.

  3. మణిపుర్-నగ్నంగా ఊరేగించిన కేసు: పోలీసు జీపులో కూర్చున్నా ఆ మహిళలకు రక్షణ ఎందుకు లభించలేదు?

  4. నిజమేమిటో త్వరలో తెలుస్తుంది:ప్రజ్వల్

    ప్రజ్వల్ రేవణ్ణ

    ఫొటో సోర్స్, @CTRAVI_BJP

    కర్ణాటకను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల వీడియోలపై హసన్ నియోజకవర్గ జనతాదళ్ (ఎస్) ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు.

    ప్రజ్వల్ రేవణ్ణ పై లైంగిక వేధింపులు, వందలాది సెక్స్ వీడియోలు తీశారని, బాధితులను బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. అనేక వీడియోలు వైరల్‌గా మారిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్ళారనే విషయం వెలుగులోకి వచ్చింది.

    అయితే ప్రజ్వల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘విచారణకు హాజరు కావడానికి ప్రస్తుతం నేను బెంగళూరులో లేను. నా న్యాయవాదుల ద్వారా బెంగళూరు సీఐడీతో టచ్‌లోనే ఉన్నాను. నిజమేమిటో త్వరలో తెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.

    ఇదిలా ఉంటే మంగళవారంనాడు ప్రత్యేక దర్యాప్తు బృందం జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణను తమ ముందు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చింది.

  5. టీ20 వరల్డ్ కప్-భారత జట్టు: ఎవరిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు?

  6. టీడీపీ- జనసేన కూటమి మేనిఫెస్టోలో ఏముందంటే..

    చంద్రబాబు, పవన్ కల్యాణ్

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ- జనసేన కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ పాల్గొన్నారు.

    ఈ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న కొన్ని హామీలు..

    • యువతకు 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
    • స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000
    • ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం
    • ప్రతి మహిళకి నెలకు రూ.1500 (19 సం. నుంచి 59 సం. వరకు)
    • ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు
    • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
    • ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌
    • పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్స్‌, పార్టనర్‌షిప్‌ (పి4) పథకాలు
    • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ
    • రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు
    • ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి
    • మెగా డీయస్సీ, ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌
    • ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటు
    • అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు
    • మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పున:ప్రారంభం-విస్తరణ
    • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు
    • ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్‌ కావడం కోసం డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు
    • ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం EWS రిజర్వేషన్ల అమలు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు
    • బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తాం.
    • బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
    • బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.
    • స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్‌
    • చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
    • తక్కువ జనాభాతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేటెడ్ పదవుల ద్వారా రాజకీయ భాగస్వామ్యం
    • స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం చేస్తాం.
    • రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పథకం పునరుద్ధరణ
    • అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు.
    • గొర్రెలు, మేకల పెంపకం యూనిట్‌లకు బీమా సౌకర్యం
    • చేనేత ఉత్పత్తులపై జీయస్‌టీ రీయంబర్స్‌
    • పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌
    • ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం
    • దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేలు గౌరవ వేతనం.
    • షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌
    • గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయింపు
    • స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంపు
    • ప్రత్యేక పథకం ద్వారా పి4 మోడల్‌లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు
    • అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు
    • ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పన
    • విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు
    • పండుగ కానుకలు, పెళ్లి కానుకల పునరుద్దరణ
    • సీపీయస్‌/జీపీయస్‌ విధానాన్ని పున:సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి
    • ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సి అమలు.. అలవెన్స్‌ పేమెంట్స్‌ పైన కూడా పున:పరిశీలన.. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌
    • తక్కువ జీతాలు పొందే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు
    • వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
    • పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు - ఇన్సూరెన్స్‌ సౌకర్యం - గోకులాల ఏర్పాటు - మేత కోసం బంజరు భూముల కేటాయింపు
    • గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు
    • ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న అయిదేళ్లలో రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి కాపుల సాధికారిత, అభివృద్ధి కోసం చర్యలు
    • కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత
    • కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి

    ఈ హామీలతో పాటు ఇంకా అనేక రకాల హామీలను ఈ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

  7. ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా... ఇక నుంచి ఇది తప్పనిసరి

  8. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర తగ్గింపు

    గ్యాస్ సిలిండర్లు

    ఫొటో సోర్స్, ANI

    వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను చమురు మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి.

    ఒక్కో సిలిండర్‌‌పై 19 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది.

    ప్రస్తుతం దిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1745.50గా ఉందని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

    గత నెలలో కూడా 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.30.50 తగ్గించారు.

    అంతర్జాతీయ చమురు ధరలను బట్టి వాణిజ్య, గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెలా ఒకటవ తేదీన సవరిస్తూ ఉంటాయి.

  9. అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థుల నిరసనలు ఎందుకు?

  10. కొలంబియా యూనివర్సిటీలోకి ప్రవేశించిన న్యూయార్క్ పోలీసులు

    న్యూయార్క్ పోలీసులు

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న కొలంబియా యూనివర్సిటీ ప్రాంగణంలోకి న్యూయార్క్ పోలీసులు ప్రవేశించారు. పాలస్తీనాకు మద్ధతుగా ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

    గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా, పాలస్తీనియన్లకు మద్దతు ఇస్తూ కొలంబియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు.

    క్యాంపస్‌లో ఉన్న హామిల్టన్ హాల్‌ను నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఆక్రమించారు.

    పరిస్థితి అదుపు తప్పడంతో, పోలీసులు హామిల్టన్ హాల్‌లోకి ప్రవేశించి విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు.

    క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించిన తర్వాత, తమ వద్ద మరో మార్గం లేదని యూనివర్సిటీ తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.

    కొలంబియా యూనివర్సిటీలోకి వెళ్తున్న పోలీసులు

    ఫొటో సోర్స్, Reuters

    యూనివర్సిటీ ప్రకటన

    ‘‘రాత్రి 9 గంటల తర్వాత న్యూయార్క్ పోలీసులు యూనివర్సిటీ అభ్యర్థన మేరకు క్యాంపస్‌లోకి ప్రవేశించారు. క్యాంపస్‌లో భద్రతను పునరుద్ధరించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం.

    నిరసనకారులు వారి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తూ, ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లడంపై మేం విచారం వ్యక్తం చేస్తున్నాం. హామిల్టన్ హాల్‌ను ఆక్రమించి, ధ్వంసం చేశారని మేం గుర్తించాం. అందుకే,మా వద్ద మరో మార్గం లేక, పోలీసులను పిలిపించాం.

    కొలంబియా యూనివర్సిటీ భద్రతా సిబ్బందిని భవనం నుంచి బయటికి పంపించారు. మా టీమ్‌లోని ఒకర్ని బెదిరించారు. మా కమ్యూనిటీ భద్రతను మేం ప్రమాదంలో పెట్టదలుచుకోలేదు’’ అని యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది.

    నిరసనకారులు బయటికి తీసుకొచ్చిన పోలీసులు

    ఫొటో సోర్స్, Getty Images

    హామిల్టన్ హాల్ నుంచి నిరసనకారులను బయటకు తీసుకొచ్చిన పోలీసులు

    హామిల్టన్ హాల్ నుంచి నిరసనకారులందర్ని బయటకు తీసుకొచ్చినట్లు న్యూయార్క్ పోలీసు విభాగం బీబీసీకి ధ్రువీకరించింది.

    ఈ క్యాంపస్ బిల్డింగ్‌ను నిరసనకారులు 24 గంటల ముందు తమ అదుపులోకి తీసుకున్నారు.

    అయితే, ఎంత మందిని అరెస్ట్ చేశారన్న విషయాన్ని మాత్రం న్యూయార్క్ పోలీసులు చెప్పలేదు.

    అమెరికా వార్తా సంస్థ ఎన్‌బీసీ వివరాల ప్రకారం, 100 మంది వరకు అరెస్ట్ అయ్యుంటారని తెలుస్తుంది.