యుక్రెయిన్‌కు భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన అమెరికా చట్టసభ

రష్యాతో యుద్ధంలో పోరాతుడుతున్న యుక్రెయిన్‌కు సాయంగా 61 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్ దిగువ సభ ఆమోదం తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. ఆంధ్రప్రదేశ్: మరో 9మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

    కాంగ్రెస్ జాబితా

    ఫొటో సోర్స్, AICC

    లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ కోసం మరో 9మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. గతంలో 5 గురు పేర్లను విడుదల చేయగా తాజాగా విడుదల చేసిన జాబితాతో 14 మంది పేర్లను ఖరారు చేసినట్లయింది.

    శ్రీకాకుళం నుంచి డాక్టర్ పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం(ఎస్సీ రిజర్వుడ్) నుంచి జంగా గౌతమ్, మచిలీపట్నం నుంచి గొల్లు కృష్ణ, విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్, ఒంగోలు నుంచి సుధాకర రెడ్డి, నంద్యాల నుంచి లక్ష్మీ నరసింహ యాదవ్, అనంతపురం నుంచి మల్లికార్జున్, హిందూపూర్ నుంచి సమద్ షహీన్ లు పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

  3. KKRvsRCB: ఉత్కంఠభరిత పోరులో బెంగళూరుపై కోల్‌కతా విజయం

    కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఈడెన్‌గార్డెన్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

    ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కడవరకు పోరాడినా, చివర్లో చేతులు ఎత్తేసింది.

    223 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 221 పరుగులకు ఆలౌటయింది.

    చివరి ఓవర్‌కు వచ్చేసరికి, రెండు వికెట్లు మిగిలి ఉండగా, మూడు బంతుల్లో 9 పరుగులు సాధించాల్సిన తరుణంలో ఆర్సీబీ బ్యాటర్ కరణ్ శర్మ సిక్స్ కొట్టడంతో లక్ష్యం 2 బంతుల్లో 3 పరుగులకు తగ్గి పోయింది.

    సరిగ్గా అదే సమయంలో మరుసటి బంతికి కరణ్ శర్మ మిచెల్ స్టార్క్ బౌలింగ్ ‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో లక్ష్యం ఒక వికెట్ చేతిలో ఉండగా, ఒక్క బంతిలో 3 పరుగులుగా మారింది.

    అయితే చివరి బంతికి రెండో పరుగు తీయడానికి ప్రయత్నించిన లాకీ ఫెర్గ్యూసన్ రనౌట్ కావడంతో కోల్‌కతాను విజయం వరించింది.

    బెంగళూరు జట్టులో విల్ జాక్స్ 55, రజత్ పటీదార్‌ 52 పరుగులతో అర్ధసెంచరీలు దాటగా, దినేశ్ కార్తీక్ 25, సుయశ్ ప్రభుదేశాయ్ 24, కరణ్ శర్మ 20 పరుగులు చేశారు.

    అంతకు ముందు నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 50 పరుగులు, ఫిల్ సాల్ట్ 48 పరుగులు చేయగా, ఆండ్రీ రస్సెల్ 27, రింకూసింగ్, రమణ్ దీప్‌లు చెరో 24 పరుగులు చేశారు.

  4. హమాస్ చీఫ్‌ను కలిసిన తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్

    తుర్కియే, హమాస్

    ఫొటో సోర్స్, TURKISH PRESIDENT PRESS OFFICE HANDOUT/EPA-EFE/REX/SHUTTERSTOCK

    గాజాపై ఇజ్రాయెల్ దాడుల నడుమ.. పాలస్తీనా ప్రజలంతా ఏకం కావాలని తుర్కియే అధ్యక్షుడు రెచెప్ తయ్యప్ ఎర్దోవాన్ పిలుపునిచ్చారు.

    తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌లో హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హానియాతో శనివారం సాయంత్రం రెండున్నర గంటలపాటు ఎర్దోవాన్ చర్చలు జరిపారు.

    అయితే, ఈ సమావేశాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కార్ట్జ్ ఖండించారు. ఎర్దోవాన్‌కు ఇది సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యలు చేశారు.

    తుర్కియే ప్రభుత్వానికి ఎప్పటినుంచో హమాస్‌, ఇస్మాయిల్ హానియాలతో మంచి సంబంధాలు ఉన్నాయి.

    ప్రస్తుతం ఇస్మాయేల్ తుర్కియేకు వెళ్లడంతో.. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య తుర్కియే మధ్యవర్తిత్వం వహించనుందనే వాదనలు ఊపందుకున్నాయి.

  5. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు, ఒక మావోయిస్టు మృతి

    అడవిలో భద్రతా సిబ్బంది

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

    బీజాపూర్ జిల్లా భైరాంగఢ్‌లోని కేష్‌కుటుల్ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

    ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు జరగడం ఈ వారంలో ఇది రెండోసారి. ఇటీవల బస్తర్ ప్రాంతంలోని కాంకేర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు, ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయారు.

  6. యుక్రెయిన్‌కు భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు అమెరికా చట్టసభ ఆమోదం

    అమెరికన్ కాంగ్రెస్

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యాతో యుద్ధంలో పోరాతుడుతున్న యుక్రెయిన్‌కు సాయంగా 61 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్ దిగువ సభ ఆమోదం తెలిపింది.

    దీంతో, అమెరికాకు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా ఆక్రమణను ఎదుర్కోవడంతో పాటు, వేల మంది ప్రాణాలను కాపాడేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

    యుక్రెయిన్ ప్యాకేజీతో పాటు, ఇజ్రాయెల్‌కు సైనిక సాయం కింద 26.4 బిలియన్ డాలర్లు, గాజాకు మానవతా సాయం 9.1 బిలియన్ డాలర్లు, తైవాన్‌కు 8.1 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇచ్చేందుకు అమెరికా సభ ఆమోదించింది.

  7. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసంఈ లింక్‌నుక్లిక్ చేయండి.