ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖపట్నం వేదికగా బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఘన విజయం సాధించింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు కలెక్టర్లు, ఐదుగురు ఎస్పీలను, ఒక ఐజీని బదిలీ చేసి, ఎన్నికల విధుల నుంచి తప్పించిన భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ), వారి స్థానంలో కొత్త అధికారులను నియమిస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది. వీరు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది.
కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డీకే బాలాజీ, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు.
ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లుగా ఉన్న పి.రాజబాబు, ఎం.గౌతమి, పి.లక్ష్మీశాలను, ప్రకాశం ఎస్పీగా ఉన్న పరమేశ్వర్‌ను, పల్నాడు ఎస్పీగా ఉన్న రవిశంకర్ రెడ్డిని, చిత్తూరు ఎస్పీగా ఉన్న పి.జాషువాను, అనంతపురం ఎస్పీగా ఉన్న కె.కె.ఎన్. అన్బురాజన్‌ను, నెల్లూరు ఎస్పీగా ఉన్న కె.తిరుమలేశ్వర్‌ను ఏప్రిల్ 2న ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
వీరితోపాటు గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న జి.పాలరాజును ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించింది.
పాలరాజు స్థానంలో ఇప్పుడు సర్వశ్రేష్ట త్రిపాఠి గుంటూరు రేంజ్ ఐజీగా నియమితుడయ్యారు.
పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్ గరికపాటి, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్,చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారుల్లో వీరిని సిఫార్సు చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది.
టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్‌లో వందల ఉద్యోగాలను తీసేయనున్నట్లు ప్రకటించింది.
అమెజాన్ వెబ్ సర్వీసు(ఏడబ్ల్యూఎస్) ఎదుగుతోందని, మొత్తం కంపెనీ రెవెన్యూలో 14 శాతం దీని నుంచే వస్తున్నట్లు తన తాజా ఆర్థిక నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ, అమెజాన్ ఈ ఉద్యోగాల కోతను ప్రకటించింది.
అలాగే, అన్ని స్టోర్ల నుంచి సెల్ఫ్ చెకవుట్ సిస్టమ్ అంటే జస్ట్ వాకవుట్‌ను కూడా తొలగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
తాజా ఉద్యోగాల కోతతో సేల్స్, మార్కెటింగ్, గ్లోబల్ సర్వీసెస్‌లో వందల ఉద్యోగాలపై ప్రభావం పడనుందని పేర్కొంది. తన ఫిజికల్ స్టోర్లలో టెక్నాలజీ టీమ్‌లో మరికొందరిపై ఈ ప్రభావం ఉండనుందని తెలిపింది.
‘‘ఈ నిర్ణయాలు క్లిష్టమైనవే. కానీ, మా వినియోగదారులకు వినూత్నతను అందించేందుకు పెట్టుబడులు, కొత్త నియామకాలు కొనసాగించేందుకు, సరైన రీతిలో వనరుల వినియోగానికి ఇది అవసరం’’ అని ఏడబ్ల్యూఎస్ అధికార ప్రతినిధి బీబీసీకి తెలిపారు.
చందమామపై సరికొత్త ప్రామాణిక సమయాన్ని అభివృద్ధి చేయాలని శ్వేత సౌధం నాసాను ఆదేశించింది.
చంద్రునిపై ఉన్న విభిన్న గురుత్వాకర్షణ క్షేత్ర బలం కారణంగా భూమితో పోల్చుకున్నప్పుడు అక్కడ సమయం వేగంగా ఉంటుంది.
చంద్రునిపై సమయం భూమి కంటే ప్రతిరోజూ 58.7 మైక్రోసెకన్ల ముందు ఉంటుంది.
చూడటానికి ఇది పెద్ద తేడాగా అనిపించకపోయినా అంతరిక్ష నౌకలను కచ్చితత్త్వంతో నడపడంపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపుతుంది.
చంద్రునిపైకి చేరుకునేందుకు జరిగే ప్రయత్నాలకు ఈ సరికొత్త ప్రామాణిక సమయం సాయపడుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
2026లో మానవ సహిత మిషన్‌ను చంద్రునిపైకి పంపే సమయానికల్లా ఈ ప్రామాణిక సమయం నిర్థరణ కావాలని అమెరికా కోరుకుంటోంది.
ప్రస్తుతం చంద్రునికి సొంత టైమ్ జోన్ లేకపోవడం వల్ల అన్ని మిషన్లకు యూనివర్సల్ టైమ్(యూటీసీ)ను వాడుతున్నారు.
రోజురోజుకు చంద్రుని మీదకు చేపట్టే మిషన్ల సంఖ్య పెరుగుతున్నందున యూటీసీ మీద ఎక్కువ కాలం ఆధారపడలేమని స్పేస్ ఏజెన్సీలు చెబుతున్న మాట.
స్పేస్‌క్రాఫ్ట్స్ వంటివి సమర్థవంతంగా పని చేయాలంటే కచ్చితమైన సమయం చాలా ముఖ్యం.
దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలని కోరుతూ దాఖలైన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది.
సీఎం పదవిలో కొనసాగాలా?లేదా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించింది.
దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.
విశాఖపట్నం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఘన విజయం సాధించింది.
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది.
సునీల్ నరైన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు.
సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ రఘువంశీ 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు సాధించాడు.
ఆండ్రీ రసెల్ (41), రింకూ సింగ్ (26) కూడా రాణించడంతో కేకేఆర్ జట్టు భారీ స్కోరు చేసింది.
అనంతరం దిల్లీ జట్టు 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
కెప్టెన్ రిషభ్ పంత్ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), స్టబ్స్ (32 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.
వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.