ఆంధ్రప్రదేశ్: మరో 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే 11 మంది అభ్యర్థుల పేర్లను జనసేన పార్టీ ఖరారు చేసింది. అంతకుముందు ఏడుగురి పేర్లను ప్రకటించారు. మొత్తంగా 18 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో మళ్లీ లైవ్ పేజీలో కలుసుకుందాం.

    నమస్తే. గుడ్ నైట్.

  2. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే

    మోదీ, సీఎం రమేష్

    ఫొటో సోర్స్, FACEBOOK/CMRAMESH

    బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి ఐదో జాబితా విడుదలైంది.

    ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే ఆరుగురు అభ్యర్థుల పేర్లు వెల్లడించింది.

    బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది.

    అభ్యర్థి పేరు - లోక్‌సభ స్థానం

    కొత్తపల్లి గీత- అరకు

    వరప్రసాద రావు -తిరుపతి (ఎస్సీ)

    సీఎం రమేష్- అనకాపల్లి

    పురందేశ్వరి -రాజమహేంద్రవరం

    కిరణ్ కుమార్ రెడ్డి -రాజంపేట

    భూపతిరాజు శ్రీనివాస వర్మ -నర్సాపురం

  3. మరో 11 స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన

    pawan kalyan

    ఫొటో సోర్స్, janasena

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే 11 మంది అభ్యర్థుల పేర్లను జనసేన పార్టీ ఖరారు చేసింది.

    అంతకుముందు రెండు విడతలలో 7 పేర్లను ఖరారు చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 18 అసెంబ్లీ సీట్లకు జనసేన అభ్యర్థులు ఖరారైనట్లయింది.

    అభ్యర్థులు వీరే..

    1) పిఠాపురం – పవన్ కల్యాణ్

    2) నెల్లిమర్ల – లోకం మాధవి

    3) అనకాపల్లి – కొణతాల రామకృష్ణ

    4) కాకినాడ రూరల్ – పంతం నానాజీ

    5) రాజానగరం - బత్తుల బలరామకృష్ణ

    6) తెనాలి - నాదెండ్ల మనోహర్

    7) నిడదవోలు - కందుల దుర్గేష్

    8) పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు

    9) యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్

    10) పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ

    11) రాజోలు - దేవ వరప్రసాద్

    12) తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్

    13) భీమవరం - పులపర్తి ఆంజనేయులు

    14) నరసాపురం - బొమ్మిడి నాయకర్

    15) ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు

    16) పోలవరం - చిర్రి బాలరాజు

    17) తిరుపతి - ఆరణి శ్రీనివాసులు

    18) రైల్వే కోడూరు - డా.యనమల భాస్కర రావు

  4. జాస్మిన్ పారిస్: 125 ఏళ్ల చరిత్రలో 20 మంది మగవాళ్లు మాత్రమే పూర్తిచేసిన అత్యంత కఠినమైన 100 మైళ్ల మారథాన్‌లో రికార్డ్ సృష్టించిన తొలి మహిళ

  5. మగవాళ్లకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరా? మహిళల నుంచి పురుషులు నేర్చుకోవాల్సిందేంటి?

  6. పంజాబ్: కల్తీ మద్యం ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య, సీఎం భగవంత్ మాన్‌పై బీజేపీ విమర్శలు

    Bhagwant Mann

    పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయినవారి సంఖ్య 21కి చేరింది.

    సంగ్రూర్ జిల్లాలోలని గుర్జన్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో చనిపోయినవారంతా దళితులే.

    కాగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఈ రోజు గుర్జన్ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను కలిశారు.

    ఇవి సాధారణ మరణాలు కావని, హత్యలని.. ఈ ఘటనకు కారణమైనవారికి వదిలిపెట్టబోమని ఆయన అన్నారు.

    ఈ ఘటనపై సమగ్ర నివేదిక కావాలని ఎలక్షన్ కమిషన్ పంజాబ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలను కోరింది.

    మరోవైపు బీజేపీ ఈ ఘటనపై స్పందిస్తూ సీఎం భగవంత్ మాన్‌పై విమర్శలు గుప్పించింది.

    పంజాబ్‌లో 21 మంది కల్తీ మద్యం తాగి చనిపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిల్లీలో నిద్రపోతున్నారంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

    ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సొంత జిల్లా అయిన సంగ్రూర్‌లో 21 మంది చనిపోతే ఆయన మాత్రం మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కోసం దిల్లీలో కూర్చున్నారని ఆయన అన్నారు.

  7. హోలీ: రంగు పడేముందు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

  8. మేఘా నుంచి రూ. 110 కోట్ల విరాళం తీసుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ చేయగలదా?

  9. నైజీరియా: కిడ్నాపర్ల చెర నుంచి 280 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుడు విడుదల

    నైజీరియా

    ఫొటో సోర్స్, Getty Images

    నైజీరియాలోని కురిగలో ఈ నెల 7న కిడ్నాపైన 280 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుడు విడుదలయ్యారు.

    కదూనా స్టేట్ గవర్నర్ ఉబా వారిని ఎలా విడిపించారన్న వివరాలు వెల్లడించలేదు. ప్రకటనలో,”ధైర్యం, ధృడసంకల్పంతో ఎవరినైనా ఎదుర్కొవచ్చని చూపినందుకు, భద్రతపై విశ్వాసం కలిగేలా చేసినందుకు నైజీరియా సైన్యానికి ప్రత్యేక ప్రశంసలు“ అని తెలిపారు.

    కిడ్నాపైన వారిలో 8 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు.

    బందిపోట్లుగా పిలిచే కిడ్నాపర్లు గతకొన్నేళ్లుగా వాయువ్య నైజీరియా ప్రాంతంలో వేలమంది పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. డిమాండ్ చేసిన సొమ్ము ప్రభుత్వం నుంచి అందాక వారిని విడుదల చేస్తున్నారు.

    అయితే, ఈసారి రూ.5.76 కోట్లు (6,90,000 డాలర్లు) డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. అయితే, గడువుకన్నా ముందే కిడ్నాపైన వారు విడుదలయ్యారు.

    ఎలా జరిగింది?

    ఈ నెల 7వ తేదీ ఉదయం సెకండరీ స్కూల్‌లో ప్రేయర్ జరుగుతున్న సమయంలో డజన్ల కొద్దీ సాయుధులు బైక్‌లపై పాఠశాలలోకి ప్రవేశించి 187 మంది విద్యార్థులను, స్థానిక ప్రైమరీ స్కూల్ నుంచి 125 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు.

    వారిలో 25 మందిని విడిచిపెట్టడగా,14 ఏళ్ల వ్యక్తి తుపాకీ కాల్పుల్లో మరణించాడు.

  10. విశాఖపట్నం బీచ్‌లో సముద్రంపై తేలాల్సిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఎందుకు పక్కన పెట్టేశారు?

  11. నరేంద్ర మోదీ: 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ నాలుగు హామీలను నెరవేర్చారా?

  12. కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు డబ్బులిచ్చిన బీజేపీ ఎంపీ.. ఆయన ఎవరు? ఎంత ఇచ్చారు?

  13. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల అరెస్ట్, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    ఫోన్ ట్యాపింగ్ కేసు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ హోదా గల ఇద్దరు అధికారులు అరెస్టయ్యారు.

    హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అదనపు డీసీపీ తిరుపతన్న, భూపాలపల్లి అదనపు ఎస్పీ ఎన్.భుజంగరావులను మార్చి 23 రాత్రి అరెస్టు చేసినట్లు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్ తెలిపారు.

    అరెస్టయిన వీరిద్దరూ గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన వారే.

    తిరుపతన్న ఇంతకుముందు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు ఎస్పీగా పనిచేశారు. భుజంగరావు ఇంటెలిజెన్స్ వి‌‍భాగం అదనపు ఎస్పీగా చేశారు. వీరిద్ధరిని పోలీసులు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేశారు. వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

    ‘‘విచారణలో భాగంగా వీరిద్దరూ నేరాన్ని అంగీకరించారు. గతంలో ఇంటెలిజెన్స్ వి‌భాగంలో పనిచేస్తున్న క్రమంలో కుట్ర పూరితంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్‌ను తయారు చే‌‍శారు. వారి కదలికలపై చట్ట విరుద్ధంగా ని‌ఘా ఉంచి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఒప్పుకొన్నారు.స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డీఎస్పీ డి.ప్రణీత్ రావు మరికొందరితో కలిసి కుట్రలకు పాల్పడినట్లు తేలింది. అలాగే ప్రభుత్వ ఆస్తులు (హార్డ్ డిస్కులు) ధ్వంసం చేసినట్లూ అంగీకరించారు’’ అని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.

    ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావు అరెస్టు కాగా, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకరరావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ ఛానల్ ఎండీ అరువెల శ్రవణ్ రావులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

    రెండు రోజుల కింద శ్రవణ్ కుమార్ ఇంట్లో సోదాలు కూడా చేశారు.

  14. మాస్కో కన్సర్ట్ హాల్ దాడి: బాధ్యులను పట్టుకున్నామన్న పుతిన్

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, SPUTNIK/KREMLIN POOL/EPA-EFE/REX/SHUTTERSTOCK

    కన్సర్ట్ హాల్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

    మాస్కో పరిసర ప్రాంతంలోని క్రాస్నోగోర్స్క్ నగర శివార్లలో ఉండే క్రోకస్ సిటీ హాల్‌ అనే కన్సర్ట్ హాల్‌లో రాక్ సంగీత ప్రదర్శన ప్రారంభం కావడానికి ముందు ఈ ఘటన జరిగింది.

    ఇందులో 133 మంది మరణించగా, 140 మంది గాయపడ్డారు.

    ఘటనకు బాధ్యులుగా భావిస్తూ మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. అందులో ఆయుధాలతో యుక్రెయిన్‌ వైపు పారిపోతున్న నలుగురు ఉన్నారని తెలిపారు.

    ఇది ముమ్మాటికి ఉగ్రవాద దాడేనని రష్యా విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. అయితే, ఈ దాడిలో తమ ప్రమేయం లేదని యుక్రెయిన్ ప్రకటించింది.

    ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్‌లోని ఒక వర్గం బాధ్యత వహించింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాపై ఇదే అతిపెద్ద దాడి అని బీబీసీ రష్యన్ సర్వీస్ ఎడిటర్ స్టీవ్ రోసెన్‌బర్గ్ అన్నారు.

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.