బీబీసీ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో మళ్ళీ లైవ్ పేజీలో కలుసుకుందాం.
నమస్తే. గుడ్ నైట్.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కృతజ్ఞతలు చెప్పారు. శాంతి ఒప్పందానికి భారత్ ఇస్తున్న మద్దతుపై జెలియన్‌స్కీ స్పందించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో మళ్ళీ లైవ్ పేజీలో కలుసుకుందాం.
నమస్తే. గుడ్ నైట్.
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తమకు సమాచారం అందిందని ఆప్ నేత, దిల్లీ మంత్రి అతిషి వెల్లడించారు. ఆయన జైలు నుంచైనా పాలన సాగిస్తారని మేం ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాం. దిల్లీ సీఎంగా ఆయనే ఉంటారని ఆమె చెప్పారు.
సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఈ కేసును అత్యవసరంగా విచారించాలని సుప్రీంను కోరుతున్నామని ఆమె తెలిపారు.
ఇక గురువారం దిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లనుంచి రక్షణ కల్పించడానికి దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
గురువారం సాయంత్రం ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని సోదాలు ప్రారంభించారు.
అసలేంటి కేసు?
దిల్లీ ఎక్సైజ్ పాలసీ: 2021-22లో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. దిల్లీలో అంతకు ముందు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేది. ప్రభుత్వంలోని కొందరు ముడుపులు తీసుకొని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరేలా విధానాలను తీసుకొచ్చారనేది ఆరోపణ.
2021 నవంబరులో ఎక్సైజ్ పాలసీ 2021-22ను అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో మద్యం అమ్మకాల నుంచి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది.
2022 జులైలో కొత్తగా నియమితులైన దిల్లీ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్, కొత్త మద్యం విధానంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆయన సలహా మేరకు అప్పటి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.
ఆ తరువాత 2021-22 మద్యం విధానాన్ని రద్దు చేసి అంతకు ముందు ఉన్నట్లుగా ప్రభుత్వమే దుకాణాలు నడపడం మొదలుపెట్టింది.
ఈడీ అధికారులు దిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారని, ఆయన ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లపై ఉపశమనం ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
ఈ విషయంపై ఆప్ నేత, మంత్రి అతిషీ మాట్లాడుతూ ఈడీ రెండేళ్ళపాటు విచారణ జరిపి కూడా ఒక్కరూపాయిను కూడా చూపెట్టలేకపోయారని ఎక్స్‌లో విమర్శించారు.
దిల్లీ ప్రభుత్వ పాత మద్యం విధానానికి సంబంధించి కిందటేడాది అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా ఈడీ 9సార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసింది.
అయితే ఈ సమన్లు అక్రమమంటూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు.
ఈ సమన్లనుబీజేపీ ప్రయోజనాల కోసమే పంపుతున్నారని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.
మరోపక్క కేజ్రీవాల్ అరెస్టవుతారనే భయాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్ అరెస్టయ్యారు.
ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవితను కూడా ఈనెల 15వ తేదీన హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది.
ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు అందచేసినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇందులో బాండ్లకు అనుబంధంగా ఉండే ఆల్ఫా న్యుమరిక్ నెంబర్లు కూడా ఉన్నాయని పేర్కొంది.
మార్చి 18న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు ఎస్‌బీఐ ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ సమాచారంలో, వాటిని ఎవరు కొన్నారు, బాండ్ విలువ, దాని నెంబర్, ఏ పార్టీ ఆ బాండ్‌ను క్యాష్ చేసుకుంది, రాజకీయ పార్టీల బ్యాంకు ఖాతాల చివరి లావాదేవీలు ఉన్నాయి. . ఈ వివరాలను పరిశీలిస్తే ఎన్ని బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయో తెలిసిపోతుంది.
ఈ సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీం కోర్టు ప్రకటించింది.
ఏప్రిల్ 12, 2019 నుంచి రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అందుకున్న విరాళాల వివరాలను సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే.
తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడంపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఆరోపణలు గుప్పించింది. రాజకీయ పార్టీలకన్నింటికీ సమాన అవకాశాలు దక్కాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు.
గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, అజయ్ మాకెన్ పాల్గొన్న ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలు చేసింది.
అయితే బీజేపీ దీనిని తిప్పికొట్టింది. కాంగ్రెస్ పార్టీ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక వ్యవహారాలు మాట్లాడుతోందని విమర్శించింది.
ఇక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సోనియాగాంధీ మాట్లాడుతూ ఇది తీవ్రమైన అంశమని, ఇది కాంగ్రెస్ ను మాత్రమే కాకుండా మొత్తం దేశాన్నే ప్రభావితం చేస్తుందన్నారు.
మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఇది సిగ్గుచేటైన విషయమని, దేశానికి అప్రదిష్ట తీసుకు వచ్చే చర్య అని అభివర్ణించారు.
‘‘మన దేశం గడిచిన 70 ఏళ్ళుగా స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరుపుకున్న దేశంగా పేరు సంపాదించుకుంది. ఇప్పుడా పేరు ప్రశార్థకంగా మారుతోంది’’ అని ఖర్గే చెప్పారు.
‘‘కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా నిర్వీర్యం చేసేందుకు ప్రధాన మంత్రి వ్యవస్థీకృతంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన సొమ్మును స్తంభింపచేసి, మా ఖాతాల నుంచి బలవంతంగా డబ్బు లాక్కుపోయారు’’ అని చెప్పారు.
ఇలాంటి గడ్డు పరిస్థితులలో కూడా ఎలక్షన్ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
మరోపక్క రాహుల్ గాంధీ కూడా ఎన్నికలలో సమానస్థాయిలో పోటీ పడకుండా కాంగ్రెస్ పార్టీ పై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందని చెప్పారు.
‘‘ ద్వేషాన్ని నింపుకున్న దుష్టశక్తి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసింది’’ అని ఆయన ట్వీట్ చేశారు.
తప్పుదోప పట్టించే వ్యాపార ప్రకటన కేసులో పతంజలి ఆయుర్వేద కంపెనీ, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు.
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తాము మరోసారి ఈ విధంగా చేయబోమని చెప్పారు.
కోర్టు ధిక్కారం నోటీసుకు స్పందించనందుకు ఏప్రిల్ 2న పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకులు స్వామి రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలు కోర్టు ముందు హాజరుకావాలని జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ ఆదేశించింది.
కోర్టు ధిక్కారం నోటీసుకు ఎందుకు స్పందించ లేదో తెలుపాలని పతంజలి ఆయుర్వేదను కోర్టు కోరింది.
ఈ కేసు పతంజలి ఆయుర్వేద మెడిసిన్లకు సంబంధించి ప్రసారమైన తప్పుడు వ్యాపార ప్రకటనలకు సంబంధించినది.
కోర్టు తీవ్రంగా స్పందించిన తర్వాత పతంజలి కంపెనీ ఈ క్షమాపణ చెప్పింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం తనతో మాట్లాడారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ వెల్లడించారు.
మరోవైపు తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు మోదీ ట్వీట్‌లో వెల్లడించారు.
ఏదైన సమస్య పరిష్కరించుకునేందుకు దౌత్యం, చర్చలే మార్గమన్న భారత్ వైఖరిలో ఎలాంటి మార్పులేదని ఆ ఇద్దరు నేతలకు చెప్పినట్లు తెలిసింది.
మరో కొన్ని రోజుల్లో స్విట్జర్లాండ్‌లో ప్రపంచ అధినేతలతో సదస్సు జరగబోతున్న తరుణంలో రష్యా, యుక్రెయిన్ ముఖ్య నేతలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు.
గత రెండు సంవత్సరాలుగా రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా ఈ సదస్సు జరగబోతుంది.
భారత్ కూడా ఈ సదస్సులో పాల్గొనాలని యుక్రెయిన్ కోరుకుంటోంది. దీని కోసం వచ్చే వారం యుక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రి కులేబా భారత్‌కు వస్తున్నారు.
శాంతి ఒప్పందానికి భారత్ మద్దతు ఇస్తున్నందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు జెలియన్‌స్కీ.
స్విట్జర్లాండ్‌లో జరగబోయే తొలి శాంతి సదస్సుకు భారత్ హాజరు కావడం తమకెంతో ముఖ్యమని జెలియన్‌స్కీ చెప్పారు. ఈ సదస్సులో భారత్ పాల్గొంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.