You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా, మోదీ వారణాసి నుంచే.. తెలంగాణలో 9 సీట్లకు అభ్యర్థుల ప్రకటన

లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో మొత్తం 195 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని ఈ జాబితాలో వెల్లడించారు. తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. తెలంగాణలో బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో ప్రకటించిన అభ్యర్థులు వీరే..

    కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, మల్కాజ్‌గిరి - ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి, హైదరాబాద్ - డాక్టర్ మాధవి లత, చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ - భరత్, భువనగిరి బూర నర్సయ్యగౌడ్‌లకు టికెట్ ఇచ్చారు.

  3. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, వారణాసి నుంచే పోటీ చేస్తున్న ప్రధాని మోదీ

    లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో మొత్తం 195 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తారని జాబితాను విడుదల చేసిన బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే తెలిపారు.

    ఈ జాబితాలో 34 మంది మంత్రులు, స్పీకర్, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మొదటి జాబితాలో 28 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు. షెడ్యూల్ కులాల నుంచి 27, గిరిజనుల నుంచి 18, ఓబీసీల నుంచి 57 మందికి టికెట్లు ఇచ్చారు.

    గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ, కాంతీ నుంచి సువేందు అధికారి, ఫతేపూర్ నుంచి సాథ్వీ నిరంజన్ జ్యోతి, మధుర నుంచి హేమా మాలిని పోటీ చేస్తున్నారు.

    ఉత్తర్ ప్రదేశ్‌లో 51 సీట్లు, పశ్చిమబెంగాల్ 20, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్‌లో 15, కేరళలో 12 సీట్లకు, తెలంగాణలో 9 సీట్లకు, అస్సాంలో 11 సీట్లకు, ఝార్ఖండ్‌లో 11, ఛత్తీస్‌గఢ్‌లో 12, దిల్లీలో 5 సీట్లకు, జమ్ముకశ్మీర్ 2, ఉత్తరాఖండ్ 3, అరుణాచల్ ప్రదేశ్ 2, గోవా 1, త్రిపుర 1, అండమాన్ నికోబార్ 1, డామన్-డయ్యూ 1 సీటుకు అభ్యర్థులను ప్రకటించారు.

  4. కత్తి మింగడమనే కళ వైద్య రంగాన్ని ఎలా మార్చింది?

  5. 'పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్‌లో నిరుద్యోగం రెండు రెట్లు ఎక్కువ': రాహుల్ గాంధీ

    పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్‌లో నిరుద్యోగం రెండింతలు ఉందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

    రాహుల్ గాంధీ భారత్‌ న్యాయ్‌ యాత్ర శనివారం రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌‌లో కొనసాగింది.

    అక్కడి బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ ''భారత్‌లో నిరుద్యోగం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ దేశాల కంటే రెండింతలు ఉంది. నరేంద్ర మోదీ నోట్ల రద్దు, జీఎస్టీని అమలు చేయడం, ఎక్కువగా ఉపాధి కల్పించే చిన్న వ్యాపారాలు మూతపడటం వల్లే ఇలా జరిగింది’’ అని అన్నారు.

    ''ఈ రోజు భారత్‌లోని ప్రతి రంగంలో ఐదుగురి గుత్తాధిపత్యం ఉంది. విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్ రంగం, ఇలా దేశంలోని మొత్తం మార్కెట్‌ అదానీ చేతుల్లో పెట్టారు. భారత సంపద మొత్తాన్ని ముగ్గురు, నలుగురు పెట్టుబడిదారులు స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా అత్యధికంగా ఉపాధి కల్పించే చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి" అని రాహుల్ అన్నారు.

    దేశంలో ఎక్కడికి వెళ్లినా నిరుద్యోగ యువత వీధుల్లో కనిపిస్తున్నారని, దేశంలోని 10-15 మంది పెట్టుబడిదారులకు నరేంద్ర మోదీ రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేశారని, రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని రాహుల్ ఆరోపించారు.

    కేంద్రంలో 'ఇండియా కూటమి' అధికారంలోకి వస్తే ఎంఎస్‌పీకి చట్టబద్ధమైన హామీ ఇస్తామని ఆయన అన్నారు.

    మోదీ ప్రభుత్వం దేశంలోని 73 శాతం జనాభాను అట్టడుగుకు పడేసిందని, వారిపై ఆర్థిక, సామాజిక వివక్ష చూపుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

  6. బోర్సూక్: ఈ రొట్టె వాసన చనిపోయిన వారిని చేరుతుందంట.. పెళ్లి, పండుగ, సంవత్సరీకం ఏదైనా అక్కడ ఇదే నైవేద్యం

  7. లాలూ ప్రసాద్ యాదవ్: ‘మోదీ ఈసారి గెలవరనే నేను అనుకుంటున్నా’

  8. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్: భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా?

  9. బెంగళూరులో పేలుళ్లు: రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

    బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఐఈడీ పేలుళ్ల ఘటనపై విచారణ ప్రారంభించినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ విచారణలో చాలా బృందాలు చేపడుతున్నాయని, చాలా క్లూలను సేకరించినట్లు చెప్పారు.

    ఎన్‌ఎస్‌జీ, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్థానిక పోలీసులు ఈ విచారణలో పాల్గొంటున్నాయి.

    ఈ కేసు భద్రతాపరమైన అంశాలు, సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి ఊహాగానాలను ప్రచారం చేయొద్దని మీడియాకు పోలీసులు అభ్యర్థించారు. విచారణకు సహకరించాలని కోరారు.

    ‘మాస్క్, క్యాప్ ధరించిన ఒక వ్యక్తి బస్సులో ఇక్కడికి వచ్చి, టైమర్‌ను ఫిక్స్ చేసి, పేలుడు జరిపాడు. ఉప ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి ఘటనా స్థలిని నిన్న సందర్శించారు. ఇవాళ నేడు కూడా ఘటనా స్థలానికి, ఆస్పత్రికి వెళ్తాను. విచారణ సీరియస్‌గా చేపడుతున్నాం. ఈ ఘటనపై బీజేపీ రాజకీయాలు చేయకుండా ఉండాలి. మంగళూరు బ్లాస్ట్‌కు, బెంగళూరు పేలుళ్లకు సంబంధం లేదు. ఈ పేలుళ్లపై విచారణ చేపడుతున్నాం. రిపోర్టు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం’’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు.

    శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఐఈడీ పేలుళ్లలో మహిళతో సహా 9 మంది గాయపడ్డారు. మహిళకు 40 శాతం శరీరం కాలిపోయింది. ఆమెను ఐసీయూలో చేర్చారు.

    ఐదు సెకన్ల గ్యాప్‌లో రెండు పేలుళ్లు జరిగాయి. తొలి పేలుడు మధ్యాహ్నం 12:55:32 ప్రాంతంలో, రెండో పేలుడు 12:55:37 ప్రాంతంలో జరిగాయి. బెంగళూరులో ఐటీ హబ్‌గా పేరున్న ఈ ప్రాంతానికి చాలా మంది యువత తినడానికి, తాగడానికి వస్తుంటారు.

  10. ఇజ్రాయెల్ జరిపిన బాంబుల దాడిలో ఏడుగురు బందీలు చనిపోయారన్న హమాస్

    గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడిలో ఏడుగురు బందీలు చనిపోయారని హమాస్ చెప్పింది. ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల వల్ల ఈ బందీలు మరణించారని తెలిపింది. దీంతో, చనిపోయిన బందీల సంఖ్య 70కి మించిపోయి ఉండొచ్చని హమాస్ తెలిపింది.

    ఈ బాంబు దాడిలో పలువురు తమ ఫైటర్లు కూడా చనిపోయినట్లు పేర్కొంది. హమాస్ ఈ క్లయిమ్‌ను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. ఈ విషయంపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. హమాస్ కూడా దీనికి బలమైన ఆధారాలను చూపలేదు.

    దక్షిణ ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న భీకర దాడి చేసిన హమాస్, 253 మందిని తన బందీలుగా తీసుకెళ్లింది. హమాస్ జరిపిన ఆ దాడిలో 1200 మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతోంది.

    బందీలుగా తీసుకెళ్లిన వారిని విడిపించేందుకు, హమాస్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ ప్రస్తుతం గాజా స్ట్రిప్‌పై ప్రతిదాడులు చేస్తుంది.

    ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడుల వల్ల గాజాలో ఇప్పటి వరకు 30 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    తాత్కాలిక విరమణ ఒప్పందం కింద నవంబర్‌లో హమాస్ 105 మంది ఇజ్రాయెల్ బందీలను విడిపించింది. దీనికి బదులుగా 240 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.

  11. బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    నమస్తే.

    తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.