యుక్రెయిన్ రష్యాకు జీవన్మరణ సమస్య: పుతిన్

యుక్రెయిన్‌లోని యుద్దభూమిలో జరిగే సంఘటనలు రష్యాకు జీవన్మరణ సమస్య అని, ఇది విధిని నిర్ణయించగలదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.

    గుడ్ నైట్.

  2. యుక్రెయిన్ రష్యాకు జీవన్మరణ సమస్య: పుతిన్

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్ రష్యాకు జీవన్మరణ సమస్య అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా మీడియాతో పుతిన్ మాట్లాడుతూ, యుక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతుందో రష్యాకు జీవన్మరణ ప్రశ్న అని అన్నారు.

    స్టేట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. యుక్రెయిన్‌లోని యుద్దభూమిలో జరిగే సంఘటనలు రష్యాకు జీవన్మరణ సమస్య అని, ఇది విధిని నిర్ణయించగలదని అన్నారు.

    ఇటీవల పుతిన్ ఒక అమెరికన్ షో హోస్ట్‌కు రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రశ్నకు పుతిన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

    ఈ ఇంటర్వ్యూలో పుతిన్ రష్యా చరిత్ర గురించి సుదీర్ఘంగా మాట్లాడారు, యుక్రెయిన్ ఉనికిపై ప్రశ్నలు లేవనెత్తారు.

    కాగా, తూర్పు యుక్రెయిన్‌లోని అవదివ్కా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా తెలిపింది. యుద్ధరంగంలో వెనుకబడిన తరువాత, యుక్రెయిన్ తన దళాలను ఇక్కడి నుంచి ఉపసంహరించుకోవడం ప్రారంభించింది.

  3. రాజ్‌కోట్ టెస్ట్: భారత్ చేతిలో 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘోర పరాజయం

    ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా

    ఫొటో సోర్స్, Getty Images

    ఇంగ్లండ్ జట్టు భారత జట్టు చేతిలో ఘోర పరాజయం పాలైంది. మరొక రోజు ఆట మిగిలి ఉండగానే ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు ఆలౌటైంది.

    557 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ జట్టు ఈ దశలోనూ భారత బౌలర్లకు పోటీ ఇవ్వలేకపోయింది.

    ఓవర్ నైట్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తద్వారా ఇంగ్లండ్ జట్టు ముందు 557 లక్ష్యాన్ని ఉంచింది.

    రెండో ఇన్నింగ్స్‌లో యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించగా, 91 పరుగుల వద్ద శుభ్‌మాన్ గిల్ రనౌట్ అయ్యాడు.

    తన కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 68 పరుగులు చేశాడు.

    ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం ఉన్నా దాదాపు రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి బయటపడే అవకాశం ఆ జట్టుకు ఉన్నా, భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు.

    ఇంగ్లండ్ స్కోరు బోర్డు మందకొడిగా నడుస్తుండగా, ఆ జట్టు బ్యాటర్లు ఒక్కొక్కరు పెవీలియన్ ముఖం పట్టారు. ఒక దశలో 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు వంద పరుగుల లోపే ఆలౌటవుతుందని అంతా భావించారు. చివరకు రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగుల వద్ద ఇంగ్లండ్ బ్యాటింగ్ కథ ముగిసింది.

    రెండో ఇన్నింగ్‌లో మార్క్ ఉడ్ 33, బెన్‌ఫోక్స్, టామ్ హార్ట్లీ‌లు చెరో 16 పరుగులు చేయగా, బెన్‌స్టోక్స్ 15, జాక్ క్రాలీ 11 పరుగులు చేశారు.

    భారత జట్టులో రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2, అశ్విన్, బుమ్రాలు చెరో వికెట్ తీసి ఇంగ్లండ్ పతనాన్ని ఖాయం చేశారు.

    ఈ సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమానంగా ఉండగా, ఈ విజయంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.

    స్కోర్ వివరాలు

    భారత్:తొలి ఇన్నింగ్స్ 445 , రెండో ఇన్నింగ్స్ 430/4 డిక్లేర్డ్

    ఇంగ్లండ్: తొలి ఇన్నింగ్స్ 319, రెండో ఇన్నింగ్స్ 122

  4. పదేళ్ళ మోదీ పాలన రామరాజ్యమే : బీజేపీ తీర్మానం

    BJP

    ఫొటో సోర్స్, @BJP4India

    పదేళ్ళ మోదీ పాలన రామరాజ్యమని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశం అభివర్ణించింది.

    రెండు రోజులపాటు జరగనున్న జాతీయ కౌన్సిల్ సమావేశాలలో మొదటిరోజు ఈమేరకు ఓ తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించింది.

    మోదీ రామరాజ్య పాలన 2047 నాటికి అభివృద్ధి చెందిన ఇండియా అనే లక్ష్యాన్ని సాధించడానికి ఉపకరిస్తుందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

    ‘‘పదేళ్ళ మోదీ పాలన రామ రాజ్య ఆదర్శాన్ని చేరుకోవడానికి సాక్ష్యంగా నిలిచింది.’’ అని తెలిపింది.

    ‘‘బానిస మనస్తత్వానికి దూరంగా ఉండాలి. దేశ వారసత్వాన్ని చూసి గర్వపడాలి. జాతి నిర్మాణానికి కట్టుబడి ఉండాలి. ఐక్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ నిజాయితీగా తన విధులు నిర్వర్తించాలి. అని ప్రధాని నేతృత్వంలో దేశం ఐదు ప్రతిజ్ఞలను తీసుకుందని’’ ఆ తీర్మానంలో గుర్తు చేశారు.

  5. కనీస మద్దతు ధరపై ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం అంగీకరిస్తుందా? నేడు రైతులతో నాలుగో విడత చర్చలు

    రైతులు

    ఫొటో సోర్స్, ANI

    కనీస మద్దతు ధర కోసం రోడ్డెక్కి, హరియాణా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద నిరసనకు దిగిన అన్నదాతలు ఈరోజు (ఆదివారం) కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు. కనీస మద్దతు ధర పై ఆర్డినెన్స్ తీసుకు రావాలని రైతులు అంతకుముందు డిమాండ్ చేశారు.

    ‘‘ప్రభుత్వం కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలనుకుంటే వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలి’’ అని రైతుల ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కి చెందిన సర్వణ్ సింగ్ పాందర్ చెప్పారు.

    ‘‘ప్రభుత్వం ఎప్పడునుకుంటే అప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావచ్చు, కానీ ఆ పని ఎందుకు చేయడం లేదు’’ఆర్డినెన్స్ తీసుకువస్తే ఆరునెలల్లోపు దానిని చట్టరూపంలోకి తేవాల్సి ఉంటుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ (సిద్ధ్‌పూర్) నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చెప్పారు.

    ప్రభుత్వానికి, రైతుల మధ్య నాలుగో విడత చర్చల సందర్భంగా ఈ ఆర్డినెన్స్ డిమాండ్ తెరపైకి వచ్చింది. కనీస మద్దతు ధర సహా అనేక సమస్యల పరిష్కారానికి రైతులు దిల్లీ దిశగా నినాదాలతో ప్రదర్శనగా సాగుతున్నారు. ప్రస్తుతం వారిని పంజాబ్, హరియాణా మధ్య శంభు సరిహద్దు వద్ద నిలిపివేశారు.