SAvsIND: భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్, చివరి 2 ఓవర్లలో 6 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా

33 ఓవర్లకు భారత్ స్కోరు 153/4. మరో 11 బంతులు ముగిసేసరికి అదే స్కోరుకు మిగతా 6 వికెట్లను కోల్పోయి భారత్ 153కు ఆలౌట్ అయింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.

  2. SAvsIND: భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్, చివరి 2 ఓవర్లలో 6 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా

    కోహ్లీ

    ఫొటో సోర్స్, ANI

    దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ బ్యాట్స్‌మెన్‌లో ఆరుగురు డకౌట్ అయ్యారు.

    దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 34.5 ఓవర్లలో 153 పరుగులు చేసింది.

    ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలోనే భారత్ 6 వికెట్లను కోల్పోయింది.

    33 ఓవర్లకు భారత్ స్కోరు 153/4.

    మరో 11 బంతులు ముగిసేసరికి అదే స్కోరుకు మిగతా 6 వికెట్లను కోల్పోయి భారత్ 153కు ఆలౌట్ అయింది.

    చివరి ఆరు వికెట్లకు ఒక్క పరుగు కూడా జోడించలేకపోయింది.

    క్రికెట్

    ఫొటో సోర్స్, Getty Images

    దీంతో భారత్‌కు 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.

    రోహిత్ శర్మ (39), శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లి (46) రాణించారు.

    యశస్వీ జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ డకౌట్ అయ్యారు.

    కేఎల్ రాహుల్ 8 పరుగులు చేశాడు.

    దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ, నండ్రీ బర్గర్, లుంగీ ఎంగిడి తలా 3 వికెట్లు తీశారు.

  3. ఆలివ్ ఆయిల్: చెడు కొలెస్ట్రాల్‌‌ను దూరం చేసే ఈ నూనె ధర ఎందుకు పెరుగుతోంది... దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా?

  4. బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ జనరల్ ఖాసిమ్ సులేమానీ సమాధి వద్ద జంట పేలుళ్లు, 73 మందికి పైగా మృతి

    బాంబ్ బ్లాస్ట్

    ఫొటో సోర్స్, SOCIAL MEDIA

    ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసిమ్ సులేమానీ నాలుగో వర్ధంతి రోజున ఆయన సమాధికి సమీపంలో జరిగిన జంట పేలుళ్లలో 73 మందికి పైగా మరణించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

    ఈ పేలుళ్లలో 171 మంది గాయపడినట్లు ప్రభుత్వ మీడియా సంస్థ ఇరిబ్ తెలిపింది.

    కెర్మన్ నగరంలోని సాహెబ్ అల్ జమాన్ మసీదు సమీపంలో జరిగిన ఒక ఊరేగింపులో ఈ పేలుళ్లు సంభవించినట్లు ఇరిబ్ పేర్కొంది.

    దీన్నొక ‘‘ఉగ్రవాద దాడి’’ అని కెర్మన్ డిప్యూటీ గవర్నర్‌ను వ్యాఖ్యానించినట్లు ఇరిబ్ తెలిపింది.

    ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న ఒక వీడియో, నేల మీద అనేక శవాలు పడి ఉన్నట్లుగా చూపుతోంది.

    అమెరికా డ్రోన్ దాడిలో 2020లో మరణించిన జనరల్ సులేమానీ నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని వందలాది మంది బుధవారం ఆయన సమాధి వైపు ఊరేగింపుగా వెళ్తున్నట్లుగా సోషల్ మీడియా వీడియోలు చూపిస్తున్నాయి.

    సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని తర్వాత ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా జనరల్ ఖాసిమ్ సులేమానీని పరిగణించేవారు.

    రివల్యూషనరీ గార్డ్స్ ఓవర్సీస్ ఆపరేషన్స్ విభాగం ‘ ద క్వాడ్స్ ఫోర్స్’ కమాండర్‌గా ఆయన ఈ ప్రాంతం అంతటా ఇరాన్ పాలసీ రూపశిల్పిగా ఉండేవారు.

    క్వాడ్ ఫోర్స్ రహస్య మిషన్లకు ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. హమాస్, హెజ్బుల్లా సహా ఇతర సాయుధ గ్రూపులు, ప్రభుత్వ మిత్ర పక్షాలకు మార్గదర్శకత్వం, నిధులు, ఆయుధాలు, ఇంటెలిజెన్స్, లాజిస్టికల్ మద్దతును అందించేవారు.

    2020లో జనరల్ ఖాసిం హత్యకు ఆదేశించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సులేమానీని ‘‘ప్రపంచంలోని నంబర్‌వన్ టెర్రరిస్టు’’గా పేర్కొన్నారు.

  5. హమాస్ లీడర్ సలేహ్ అల్ అరూరీ: బేరూత్ బాంబు దాడిలో చనిపోయిన ఈ నాయకుడి చరిత్ర ఏంటి?

  6. వర్చువల్ కిడ్నాప్ అంటే ఏంటి... ఈ కిడ్నాపర్లు విదేశాలలోని విద్యార్థుల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

  7. SAvsIND: సిరాజ్‌కు 6 వికెట్లు, 92 ఏళ్ల తర్వాత టెస్టుల్లో అత్యల్ప స్కోరు చేసిన దక్షిణాఫ్రికా

    సిరాజ్

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ ధాటికి దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది.

    9 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లను పడగొట్టి దక్షిణాఫ్రికాను అతి తక్కువ స్కోరుకు కట్టడి చేశాడు.

    1932 తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికా చేసిన అత్యల్ప స్కోరు ఇదే.

    భారత్‌పై ఇతర జట్లు చేసిన అతి తక్కువ స్కోరు కూడా ఇదే.

    కేప్‌టౌన్ వేదికగా బుధవారం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

    కానీ, సిరాజ్ చెలరేగడంతో 5 పరుగులకు మొదటి వికెట్, 8 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది.

    తర్వాత బుమ్రా కూడా రాణించడంతో 15 పరుగులకే దక్షిణాఫ్రికా తొలి నాలుగు వికెట్లను పొగొట్టుకుంది.

    ఓపెనర్లు ఎయిడెన్ మార్క్‌రమ్ (2), కెప్టెన్ డీన్ ఎల్గర్ (4), టోనీ డీ జార్జీ (2), ట్రిస్టాన్ స్టబ్స్ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు.

    డేవిడ్ బెండింగ్‌హమ్ (12), కైల్ (15)లను కూడా సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు.

    భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 2, ముకేశ్ కుమార్ 2 వికెట్లు తీశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. తిన్నది ఒంటబట్టడానికి 7 చిట్కాలు.. పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం

  9. తెలంగాణ: రేవంత్ రెడ్డి చెప్పిన ‘మెగా డీఎస్సీ’ ఎప్పుడు, మొత్తం ఖాళీలెన్ని, రిక్రూట్మెంట్‌లో ఉన్న చిక్కులేంటి?

  10. హిండెన్‌బర్గ్ నివేదికపై విచారణకు ‘సిట్’ అవసరం లేదన్న సుప్రీంకోర్టు.. సెబీ విచారణ కొనసాగిస్తే చాలని వెల్లడి, ఉమాంగ్ పొద్దర్, బీబీసీ ప్రతినిధి

    గౌతమ్ అదానీ

    ఫొటో సోర్స్, Reuters

    హిండెన్‌బర్గ్ నివేదికపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అవసరం లేదని, సెబీ విచారణ కొనసాగిస్తే చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    ఈ కేసు మీద విచారణకు సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదని న్యాయస్థానం చెప్పింది.

    హిండెన్ బర్గ్ నివేదికపై దాఖలైన 24 కేసుల్లో పెండింగ్‌లో ఉన్న రెండు కేసుల్ని మూడు నెలల్లోపు పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.

    సెబీ నియంత్రణాధికార పరిధిలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.

    హిండెన్‌బర్గ్ నివేదిక- అదానీ గ్రూప్ వ్యవహారాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు 2023లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ సప్రే నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

    అయితే గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలకు అవసరమైన ఆధారాలు ఏమీ లభించలేదని సప్రే కమిటీ 2023 మేలో ప్రకటించింది. దీంతో కమిటీ రాజీ పడిందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేయాలని కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

    సుప్రీంకోర్టు

    ఫొటో సోర్స్, Getty

    హిండెన్ బర్గ్ నివేదికలో ఏముంది?

    అదానీ గ్రూప్ దశాబ్దాలుగా స్టాక్ మ్యానిపులేషన్‌తో పాటు అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ 2023 జనవరిలో నివేదిక వెలువరించింది. ఈ నివేదిక వచ్చిన తర్వాత అదానీ గ్రూపులోని లిస్టెడ్ కంపెనీలు తమ మార్కెట్ విలువలో దాదాపు 120 బిలియన్ డాలర్లు (రూ. 9,93,768 కోట్లు) నష్టపోయాయి.

    హిండెన్‌బర్గ్ నివేదికను ‘భారత్‌పై దాడి’ అని అభివర్ణించిన అదానీ గ్రూపు, తమపై వచ్చిన ఆరోపణలు దురుద్దేశపూర్వకమని, అవాస్తవాలని కొట్టి పారేసింది.

    హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన ‘టోటల్ ఎనర్జీస్’ అనే ‘ఆయిల్ అండ్ గ్యాస్’ సంస్థ, పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే వరకు అదానీ గ్రూపుతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం చేసుకున్న 4 బిలియన్ డాలర్ల (రూ. 33,129 కోట్లు) ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

    అప్పటికే ఎనర్జీ ప్రాజెక్టుల కోసం వారు, అదానీ గ్రూపులో 3 బిలియన్ డాలర్ల (రూ.24,847 కోట్లు) కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టారు.

    హిండెన్‌బర్గ్ వంటి సంస్థలు చట్టబద్ధంగా పనిచేస్తున్న అమెరికాలో కొన్నాళ్లుగా ఈ చర్చ నడుస్తోంది. ఇలాంటి కంపెనీలను ఇష్టపడేవారు ఉన్నారు. అలాగే వీటిని ద్వేషించే వారు కూడా ఉన్నారు.

    హిండెన్‌బర్గ్ ఒక సంచలనాత్మక శీర్షికతో తన నివేదికను విడుదల చేసింది. 'కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద మోసం' అనే శీర్షికతో నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక అబద్ధం అని అదానీ గ్రూప్ పేర్కొంది.

    హిండెన్‌బర్గ్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు అదానీ నివేదికతో సహా 19 నివేదికలను వారు విడుదల చేశారు. అందులో అత్యంత ప్రముఖమైనది 2020 సెప్టెంబర్‌లో విడుదలైన నివేదిక. అమెరికా ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ 'నికోలా' గుట్టును ఈ నివేదిక బయటపెట్టింది. 2015లో నికోలా కంపెనీ ఏర్పాటైంది.

  11. ఆంధ్రప్రదేశ్‌: 23వ రోజుకు చేరిన అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    అంగన్‌‌వాడీ కార్యకర్తల ఆందోళన

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె 23వ రోజుకు చేరుకుంది.

    ఈ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టాలని యూనియన్ పిలుపు ఇచ్చింది.

    పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్లను ముట్టడిస్తామని అంగన్‌వాడీలు చెబుతున్నారు.

    ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. అంగన్‌వాడీలను అరెస్టు చేస్తోంది. యూనియన్ నాయకులు అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

    పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో ఇప్పటికే వందల మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టులు చేశారు.

    కలెక్టరేట్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు.

    సీఎం పర్యటన నేపథ్యంలో కాకినాడలో పలువురు సీపీఎం, సీఐటీయూ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

    అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె

    ఫొటో సోర్స్, UGC

  12. బేరూత్‌ పేలుడులో హమాస్ డిప్యూటీ లీడర్ సలేహ్ అల్ అరూరీ మృతి, రఫీ బెర్గ్, గ్రేమీ బేకర్, బీబీసీ న్యూస్

    సలేహ్ అల్ అరూరీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సలేహ్ అల్ అరూరీ

    లెబనాన్‌లోని బేరూత్‌ శివారులో జరిగిన పేలుడులో హమాస్ డిప్యూటీ లీడర్ సలేహ్ అల్ అరూరీ మృతి చెందారు.

    హమాస్ నాయకులపై జరిపిన సర్జికల్ స్ట్రైక్‌లో సలేహ్ అల్ అరూరీ మరణించినట్లు ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

    ఈ దాడిని హమాస్ ఖండించింది.

    ఇది లెబనాన్ సార్వభౌమాధికారం మీద దాడి చేయడమే అని హెజ్బొల్లా ఆరోపించింది.

    “మమ్మల్ని కూడా యుద్ధంలోకి లాగేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది” అని లెబనాన్ ప్రధానమంత్రి అన్నారు.

    ఉత్తర బేరూత్‌లో జరిగిన డ్రోన్ దాడిలో హమాస్ రాజకీయ విభాగం డిప్యూటీ లీడర్ అరూరీతో పాటు ఇద్దరు హమాస్ కమాండర్లు, మరో నలుగురు వ్యక్తులు మరణించినట్లు లెబనాన్ మీడియా ప్రకటించింది.

    హమాస్ సాయుధ దళం ఖస్సామ్ బ్రిగేడ్స్‌లో అల్ అరూరీ కీలక నేత. హమాస్ నాయకుడు అల్ హనియాకు సన్నిహితుడు.

    హమాస్–హెజ్బొల్లా మధ్య సంబంధాలు, సంప్రదింపుల విషయంలో అరూరీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

    ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనా అనే అంశంపై ఇజ్రాయెల్ ప్రతినిధి మార్కె రెగెవ్ నర్మగర్భంగా స్పందించారు.

    “ఇది ఎవరు చేసినా ఒక విషయం సుస్పష్టం. ఇది లెబనాన్ మీద జరిగిన దాడి కాదు. ఇది హెజ్బొల్లా మీద దాడి కూడా కాదు. హమాస్ నాయకత్వం మీద సర్జికల్ స్ట్రైక్ ఎవరు చేసినా అది హమాస్ మీద ఆగ్రహంతో చేసిందే. అదైతే సుస్పష్టం” అని చెప్పారు.

  13. హలో!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.