ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా 2019లో తనకు లభించిన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తున్నానని ప్రకటించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం
మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని పేరు ‘జై భారత్ నేషనల్ పార్టీ'. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆయన తెలిపారు.
విజయవాడలో మీడియా సమావేశంలో తన కొత్త పార్టీ ఏర్పాటు వివరాలను ఆయన తెలిపారు.
అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం తీసుకుని పార్టీ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజల ఆదరణ దక్కుతుందని విశ్వసిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2019 ఎన్నికలకు ముందు ఐపీఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానంలో జనసేన తరపున పోటీచేసిన ఆయన, మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఓటమి తర్వాత లక్ష్మీనారాయణ జనసేనకు దూరమయ్యారు. ఆయన గత నాలుగేళ్లుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారని లక్ష్మీనారాయణ చెప్పారు.
‘‘ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నా. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో పార్టీని పెడుతున్నాం. మా పార్టీ పెట్టిన పార్టీ కాదు, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ’’ అని ఆయన చెప్పారు.
ఇంటర్నేషనల్ రెజ్లర్ బజరంగ్ పునియా 2019లో తనకు లభించిన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తున్నానని ప్రకటించారు.
ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ.. భారత కుస్తీ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల ఫలితాలపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ నాలుగేళ్ల కిందట తనకు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కు ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్‌లో) వేదికగా లేఖ విడుదల చేశారు.
భారత కుస్తీ సమాఖ్య ఎన్నికలలో సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా గెలవడంతో నిరసనగా మరో రెజ్లర్ సాక్షి మలిక్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించారు.
సాక్షి మలిక్, వినేశ్ ఫోగట్, మరికొందరు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ దిల్లీలో కొద్ది వారాల పాటు నిరసన తెలిపారు.
బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని, సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వీరు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. ఆ నిరసనలలో మహిళా రెజ్లర్లతో పాటు పునియా కూడా ఉన్నారు.
‘‘దేశంలో రెజ్లర్ల పరిస్థితిని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మహిళా రెజ్లర్లు ఈ ఏడాది ప్రారంభంలో నిరసన తెలిపిన విషయం మీకు తెలుసు. ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇవ్వడంతో నిరసనలు విరమించాం. కానీ, నెలలు గడిచినా బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో మళ్లీ నిరసనలు తెలిపాం. న్యాయం కోరుతూ మా పతకాలను గంగలో కలపాలని అనుకున్నాం. అప్పుడు కేంద్రం మరోసారి మాకు హామీ ఇచ్చింది. కానీ, ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలలో సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో సమాఖ్య మళ్లీ బ్రిజ్ భూషణ్ గుప్పిట్లోకే వెళ్తోంది. ఆ ఫలితాలను భరించలేక ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించారు. నా పద్మశ్రీ కూడా వెనక్కు తీసుకోండి’’ అంటూ ప్రధాని మోదీకి పునియా లేఖ రాశారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్‌కి తగిన కథ దొరకడం లేదని ఆయన అభిమానులు బాధ పడిపోతున్నారు. ప్రశాంత్ నీల్‌కు ప్రభాస్ లాంటి హీరో దొరికితే అద్భుత సినిమా తెరకెక్కుతుందని అభిమానులు ఆశించారు.
ఇన్ని అంచనాల మధ్య సలార్ వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రభాస్ కటౌట్‌కి తగిన కథ దొరికిందా? ఈసారైనా ప్రభాస్ అభిమానులు సంతృప్తిగా థియేటర్ల నుంచి బయటకు వస్తారా?
అమెరికన్ యాక్టర్ విన్ డీజిల్ మాజీ వ్యక్తిగత మాజీ సహాయకురాలు ఆస్తా జొనాసన్ లైంగిక దాడి ఆరోపణలతో ఆయనపై కేసు వేశారు. 2010లో ఫాస్ట్ ఫైవ్ సినిమా షూటింగ్ సమయంలో ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు.
విన్ డీజిల్‌గా పాపులర్ అయిన మార్క్ సింక్లెయిర్ తరఫు న్యాయవాది దీనిపై స్పందిస్తూ డీజిల్ ఈ ఆరోపణలను ఖండించారని చెప్పారు.
విన్ డీజిల్ తనను గోడకు నొక్కిపెట్టి పట్టుకుని హస్త ప్రయోగం చేసుకున్నారని ఆమె తన లా సూట్‌లో ఆరోపించారు.
తనపై లైంగిక దాడి జరిగిన కొన్ని గంటల తరువాత ఆ కంపెనీ నుంచి తనను అన్యాయంగా తొలగించారని ఆమె ఆరోపించారు.
మంగళవారం లాస్ ఏంజెలెస్ కోర్టులో దాఖలు చేసిన ఈ కేసులో ఆమె.. ఫాస్ట్ ఫైవ్ సినిమా చిత్రీకరణ సమయంలో అట్లాంటాలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో ఇదంతా జరిగినట్లు ఆమె తెలిపారు.
ఆ రోజు హోటల్ గదిలో 56 ఏళ్ల సింక్లెయిర్ తనను రేప్ చేయడానికి యత్నించారని, తాను సమ్మతించడం లేదని చెప్పినప్పటికీ ఆయన ఏమాత్రం వినలేదని ఆమె తన దావాలో పేర్కొన్నారు.
దాంతో ‘నేను అరుస్తూ అక్కడే ఉన్న బాత్రూమ్ వైపు పరుగెత్తాను’ అని చెప్పిన ఆమె.. ఆ తరువాత ఆయన తనను గోడకు అదిమిపెట్టి హస్తప్రయోగం చేసుకున్నారని ఆరోపించారు.
ఈ సంఘటన జరిగిన కొన్ని గంటలకు సింక్లెయిర్స్ సోదరి, ప్రొడక్షన్ కంపెనీ ‘వన్ రేస్ ఫిలిమ్స్’ నిర్వాహకురాలు సమంతా విన్సెంట్ తనను పిలిచి ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పారన్నారు.
సమంతా విన్సెంట్, ప్రొడక్షన్ కంపెనీలపైనా ఆస్తా జొనాసన్ దావా వేశారు.
లైంగిక దాడితో పాటు లింగ వివక్ష, ప్రతీకారం, మానసిక క్షోభకు గురిచేయడం వంటి ఆరోపణలు చేశారామె.
సుమారు 9 రోజుల పాటు పనిచేసిన ఈ ఉద్యోగి 13 ఏళ్ల కిందట జరిగిందంటూ ఇప్పుడు ఆరోపణలు చేస్తుండడం తాను తొలిసారి వింటున్నానని విన్ డీజిల్ న్యాయవాది బ్రయాన్ ఫ్రీడ్‌మన్ అన్నారు.
పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్లకు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి సభ్యులు శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘సేవ్ డెమొక్రసీ’ పేరుతో ఆందోళన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో పాటు రాహుల్ గాంధీ, ఇండియా కూటమిలోని ఇతర సభ్యులు పాల్గొన్నారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో 146 మంది ఎంపీలు ఎప్పుడూ సస్పెన్షన్‌కు గురికాలేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని ఆయన సూచించారు
ఇప్పుడు జరుగుతున్నదంతా దేశ భవిష్యత్‌కు ఏమాత్రం మంచిది కాదని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆందోళన చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తప్పించి ‘ఇండియా’ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్ స్మృతి మంధాన అర్ధసెంచరీ చేసింది.
భారత్ ఓవర్‌నైట్ స్కోరు 89/1తో శుక్రవారం రెండోరోజు ఆటను మొదలుపెట్టింది. జట్టు స్కోరు 108 పరుగుల వద్ద స్మృతి మంధాన హాఫ్ సెంచరీని అందుకుంది.
ఆమె 68 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేశారు. ఆమెతో పాటు స్నేహ్ రాణా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు తొలి రోజు ఆటలో భారత బౌలర్లు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేశారు.
పూజ వస్త్రాకర్ 4, స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా 77.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో తహ్లియా మెక్‌గ్రాత్ (50) అర్ధసెంచరీ చేసింది. బేత్ మూనీ (94 బంతుల్లో 40; 2 ఫోర్లు), కెప్టెన్ అలిస్సా హీలీ (75 బంతుల్లో 38;4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
ప్రాగ్‌లోని ఒక యూనివర్సిటీలో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందగా, 25 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
ఆధునిక చెక్ రిపబ్లిక్ చరిత్రలో ఇది ఘోరమైన దాడిగా వారు అభివర్ణించారు.
రాజధాని నగరంలో చారిత్రక కేంద్రమైన చార్ల్స్ యూనివర్సిటీలో కాల్పులకు దిగిన 24 ఏళ్ల యువకుడిని కాల్చి చంపినట్లు పోలీసులు చెప్పారు.
కాల్పుల సమయంలో ఎవరూ బయటకు రావొద్దని, గదుల్లోనే ఉండాలని యూనివర్సిటీ సిబ్బందికి చెప్పారు.
జాన్ పాలె స్క్వేర్‌లోని యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ బిల్డింగ్‌లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సాయుధుడు కాల్పులు మొదలుపెట్టారు.
అనంతర పరిణామాలకు సంబంధించి బయటకు వచ్చిన ఒక వీడియోలో కొందరు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భవనంలోని పై అంతస్థుల నుంచి కిందకు దూకుతుండటం కనిపించింది. కాల్పులు శబ్ధాలు కూడా వీడియోలో రికార్డు అయ్యాయి.
పర్యాటక ప్రదేశమైన ఆ ప్రాంతం నుంచి భయంతో ప్రజలు పారిపోతున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది.
కాల్పులకు దిగిన యువకుడు యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అని గురువారం సాయంత్రం చెక్ రిపబ్లిక్ పోలీస్ చీఫ్, హోం మంత్రి చెప్పారు.
ఏ ఉద్దేశంతో అతను కాల్పులు జరిపాడో ఇంకా తెలియదని, మరోవైపు అనుమానితుడి తండ్రి కూడా గురువారం చనిపోయి కనిపించారని తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసంఈ లింక్‌పైక్లిక్ చేయండి.