ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత ప్రభుత్వం ఏటా ప్రకటించే జాతీయ క్రీడా అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు బాడ్మింటన్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ఎంపిక చేసింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
బిగ్ బాస్7 విజేత పల్లవి ప్రశాంత్‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
గజ్వేల్ పరిధిలోని ప్రశాంత్ స్వగ్రామం కొలుగూరుకు వెళ్లిన పోలీసులు, ఆయనతోపాటు సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.
బిగ్ బాస్ ఫలితం ప్రకటించిన ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లో ఉన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, పోలీసు వాహనం ధ్వంసం అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌ను ఏ1గా, ఆయన సోదరుడిని ఏ2గా చేర్చారు.
అయితే, పోలీసులు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ తమకు ఇవ్వలేదని ఆయన తరపు లాయర్లు అంటున్నారు.
ఇటీవల జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మహమ్మద్ షమీ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు.
భారత ప్రభుత్వం ఏటా అందజేసే జాతీయ క్రీడా అవార్డుల్లో భాగంగా 2023 సంవత్సరానికి 26 మంది క్రీడాకారులను ఎంపిక చేసింది.
అర్జున అవార్డుకు మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు.
బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డిలను మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు ఎంపిక చేశారు.
పారా ఆర్చర్ శీతల్ దేవీ సహా మొత్తం 26 మంది క్రీడాకారులకు అవార్డులు అందజేయనున్నారు.
ఈ అవార్డుల ప్రధానం జనవరి 9వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది.
ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది భారత ప్రభుత్వం.
బాడ్మింటన్ ప్లేయర్లైన చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డిలను మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు ఎంపిక చేసినట్లుగా వార్తాసంస్థ పీటీఐ ఎక్స్ వేదికగా తెలిపింది.
తెలంగాణలో గత పదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఆర్థిక సవాళ్లను అధిగమించే దిశలో శ్వేతపత్రం విడుదల మొదటి అడుగు. గత ప్రభుత్వం వనరుల్ని సరిగా ఉపయోగించలేదు. రోజూవారీ ఖర్చులకు ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సి రావడం చాలా దురదృష్టకరం. అందుకే పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ప్రజలకు తెలియాలని శ్వేత పత్రం విడుదల చేస్తున్నాం. దీనిపై సభలో చర్చ జరగాలి’’ అని అన్నారు.
అయితే, 42 పేజీల నివేదికను 4 నిమిషాల ముందు ఇచ్చి చర్చించమనడం సరికాదని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ముందే సభ్యులకు శ్వేతపత్రం కాపీ ఇస్తే దానిపై సన్నద్ధంగా ఉండేవాళ్లని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్‌లో ఇలా మళ్లీ జరగకుండా చూడాలని కోరారు. అనంతరం అరగంట పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు.
కోవిడ్-19 సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ మాట్లాడుతూ, ఇది అందరూ సమష్టిగా పనిచేయాల్సిన తరుణమని అన్నారు.
కోవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అయితే, భయాందోళన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఆసుపత్రుల సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, పర్యవేక్షణ పెంచాలని, ప్రజలకు అవగాహన కల్పించడం చాలా కీలకమని అన్నారు.
ప్రతీ మూడు నెలలకు ఒకసారి అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించారు.
అన్ని రాష్ట్రాలకు అవసరమైన సహాయం కేంద్రం నుంచి అందుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ఆరోగ్యం విషయంలో రాజకీయాలు చేయకూడదని వ్యాఖ్యానించారు.
శీతాకాలం వాతావరణ పరిస్థితులతో పాటు పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తగు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
దాదాపు మూడేళ్ల క్రితం యూఎస్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిలో ట్రంప్‌కు ప్రమేయం ఉన్నందున వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన అనర్హుడంటూ కోర్టు వ్యాఖ్యానించింది.
అధ్యక్ష పదవి పోటీలో ఉన్న నాయకుడిపై అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ మూడో సెక్షన్‌ను ఉపయోగించి అనర్హత వేటు వేయడం ఇదే మొదటిసారి.
4-3 మెజార్టీతో కొలరాడో సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, దీనిపై అప్పీల్ చేస్తామని ట్రంప్ వర్గీయులు తెలిపారు.
మార్చి 5న జరిగే ప్రైమరీ ఎలక్షన్‌కు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుంది. ఆ రోజున రిపబ్లికన్ ఓటర్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. కాబట్టి వచ్చే నవంబర్‌లో కొలరాడోలో జరిగే సాధారణ ఎన్నికల మీద ఈ తీర్పు ప్రభావం ఉండొచ్చు.
యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌నకు అవకాశమిచ్చిన కొలరాడో న్యాయస్థానం, వచ్చే నెల వరకు ఈ ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
కోవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1ను "ఆసక్తికర వేరియంట్"గా మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అభివర్ణించింది. ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం, ఇది ప్రజల ఆరోగ్యానికి కలిగించే ప్రమాదం తక్కువే అని పేర్కొంది.
ఇతర వేరియంట్లతో పోలిస్తే జేఎన్.1 రకం కరోనా వైరస్ మానవ రోగ నిరోధక వ్యవస్థలోకి సులభంగా చొచ్చుకుపోగలదని ఇద్దరు నిపుణులు చెప్పినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
అయితే, ఈ కొత్త రకం వైరస్ తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని నిరూపించే ఆధారాలేమీ లేవని వారు చెప్పినట్లు రాయిటర్స్పేర్కొంది.
‘‘ఈ వేరియంట్‌తో ఎక్కువ కరోనా కేసులు నమోదు కావొచ్చు. కానీ, దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉండదు’’ అని జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని వైరాలజిస్ట్ ఆండ్రూ పెకోజ్ చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.
అందుబాటులో ఉన్న టీకాలు ఈ కొత్త వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
కేరళలో ఈ కొత్త రకం వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 79 ఏళ్ల మహిళలో తొలిసారిగా ఈ వేరియంట్‌ను గుర్తించారు.
కొత్త వేరియంట్ కచ్చితమైన కేసుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసంఈ లింక్‌పైక్లిక్ చేయండి.