You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు విధించిన కోర్టు

సౌమ్య విశ్వనాథన్‌ను 2008లో దిల్లీ వసంత్ కుంజ్‌లోని నెల్సన్ మండేలా మార్గ్‌లో కాల్చి చంపేశారు. కారులో ఆమె మృతదేహం లభ్యమైంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. కేరళ: కాలేజీ మ్యూజిక్ ప్రోగ్రాంలో తొక్కిసలాట, నలుగురు మృతి

    కేరళలో జరిగిన ఒక కాలేజీ మ్యూజిక్ ప్రోగ్రాంలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మరణించారు. కొచ్చిలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్)లో శనివారం ఈ ఘటన జరిగింది.

    కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తాసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. కొచ్చిలోని కలమసేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.

    క్యాంపస్‌లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో సింగర్ నికితా గాంధీ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో 60 మంది గాయపడినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

  3. ‘ఒక్క సిగరెట్ ముక్క 48 బోట్లను తగులబెట్టింది’...విశాఖ హార్బర్ ప్రమాదం కేసును ఛేదించామన్న పోలీసులు

  4. జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు విధించిన దిల్లీ కోర్టు

    జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో నలుగురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ దిల్లీలోని సాకేత్ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఈ కేసులో అక్టోబర్ 18న ఐదుగురిని దోషులుగా నిర్ధరించింది కోర్టు.

    రవికపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్ కుమార్‌లకు జీవిత ఖైదు విధించగా, వారికి సహకరించిన అజయ్ సేథీకి మూడేళ్ల శిక్ష విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. ఈ ఐదుగురు 2009 నుంచి జైల్లోనే ఉన్నారు.

    సౌమ్య విశ్వనాథన్‌ను 2008లో దిల్లీలో వసంత్ కుంజ్‌లోని నెల్సన్ మండేలా మార్గ్‌లో కాల్చి చంపేశారు. కారులో ఆమె మృతదేహం లభ్యమైంది.

    అసలేం జరిగింది?

    సంఘటన జరిగిన రోజు ఆఫీసులో మాలెగావ్, మోడెస్సా పేలుళ్లపై రిపోర్టును సిద్ధం చేసే పనిలో ఉండటంతో సౌమ్య ఇంటికి వెళ్లడం చాలా ఆలస్యం అయింది.

    పని ముగించుకొని కారులో ఆమె సెంట్రల్ దిల్లీలోని తన కార్యాలయం నుంచి వసంత్ కుంజ్‌లో గల ఇంటికి వెళుతుండగా దుండగులు ఆమెను వెంబడించి హత్య చేశారు.

    సౌమ్య హత్యకు దోపిడీనే కారణమని పోలీసుల విచారణలో తేలింది. పదిహేనేళ్లకు దోషులకు శిక్ష పడింది.

    అయితే శిక్షతో సంతృప్తి చెందామని చెప్పడం లేదు కానీ, ఏం జరిగినా అది మంచికేనని సౌమ్య తల్లి మాధవీ విశ్వనాథన్ వార్తాసంస్థ ఏఎన్ఐ‌తో తెలిపారు.

  5. జైళ్లలోని 39 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టిన ఇజ్రాయెల్

    హమాస్ చెర నుంచి బందీల విడుదల ఒప్పందంలో భాగంగా పాలస్తీనాకు చెందిన 39 మంది ఖైదీలను తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విడుదల చేసింది.

    దీనికంటే ముందు హమాస్ తన చెరలోని 13 మంది బందీలను విడుదల చేసింది. వీరిని గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెడ్ ‌క్రాస్‌కు అప్పగించారు. వీరిని గాజా-ఈజిప్టు సరిహద్దులకు తరలించారు.

    ఇజ్రాయెల్ విడుదల చేసిన 39 మంది ఖైదీల్లో 24 మంది మహిళలు, 15 మంది టీనేజ్ బాలురు ఉన్నారు. వీరిని ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని బీటునియా చెక్‌పాయింట్ మీదుగా తీసుకెళ్లి విడుదల చేశారు.

    రాళ్లు రువ్వడం నుంచి హత్యాయత్నం వరకూ అనేక నేరాల్లో వీరు నిందితులుగా ఉన్నారు.

    కొందరిని ఇప్పటికే దోషులుగా నిర్ధరించగా, మరికొందరిపై విచారణ జరగాల్సి ఉంది.

    ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 300 మంది మహిళలు, మైనర్ల నుంచి వీరిని ఎంపిక చేశారు.

    విడుదలైన వారిలో పావు వంతు మంది మాత్రమే దోషులుగా ఉన్నారు. మిగతా వారంతా నిందితులే. వీరి మీద ఉన్న అభియోగాలపై విచారణ పూర్తి కావాల్సి ఉంది.

    ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

    ఖతార్ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా నాలుగు రోజుల్లో 50 మంది బందీలు విడుదలవుతారని భావిస్తున్నారు.

    అలాగే, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న దాదాపు 150 మంది పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారైంది. వీరిలో మహిళలు, పిల్లలు ఉన్నారు.

  6. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.