వరల్డ్ కప్: న్యూజీలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో భారత్ విజయం, 95 పరుగులు చేసిన కోహ్లీ

రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ రాణించడంతో భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. వరల్డ్ కప్: న్యూజీలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో భారత్ విజయం, 95 పరుగులు చేసిన కోహ్లీ

    క్రికెట్

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచకప్‌లో భాగంగా న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు.

    రోహిత్ శర్మ (46) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ రాణించడంతో భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.

    భారత్ బ్యాటర్లలో కోహ్లీ 95 పరుగులు, శ్రేయాస్ అయ్యర్(33 పరుగులు), రవీంద్ర జడేజా (39 పరుగులు) చేశారు.

    ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి వెళ్లింది.

    అంతకు ముందు టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

    బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది, ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్ (130 పరుగులు), రచిన్ రవీంద్ర (75 పరుగులు) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.

    అయితే, కివీస్ బ్యాటర్లలో వీరిద్దరు తప్ప మిగతావారు పెద్దగా పరుగులు చేయలేదు. డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్‌లు డకౌటయ్యారు. దీంతో 50 ఓవర్లలో న్యూజీలాండ్ 273 పరుగులకే ఆలౌటైంది.

    భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు చెరొక వికెట్ తీశారు.

  3. తెలంగాణ: కోలాటమాడుతూ, పాటలు పాడుతూ ఘనంగా బతుకమ్మ సంబురాలు

  4. గాజా ప్రజలను కాపాడండి: ఐక్యరాజ్య సమితిలో కన్నీరు పెట్టుకున్న పాలస్తీనా ప్రతినిధి

  5. ‘ది మ్యాన్ విత్ ఎక్స్‌రే ఐస్’: విదేశీయుల మతి పోగొట్టిన భారతీయ మెజీషియన్

  6. వరల్డ్ కప్: న్యూజీలాండ్‌తో మ్యాచ్‌లో భారత్ లక్ష్యం 274 పరుగులు

    భారత్ న్యూజీలాండ్

    ఫొటో సోర్స్, Getty Images

    వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ న్యూజీలాండ్ జట్ల మధ్య ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు భారత్ ముందు 274 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది.

    భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆది నుంచి వికెట్లు పడకుండా నిలకడగా ఆడిన న్యూజీలాండ్ బ్యాటర్లు మొదటి పది ఓవర్ల తర్వాత విజృంభించి ఆడారు.

    ఒక దశలో 34 ఓవర్లకు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన న్యూజీలాండ్ జట్టు 178 పరుగులతో పటిష్టంగా కనిపించింది.

    కానీ, తరువాతి 95 పరుగులు సాధించే క్రమంలో 8 వికెట్లు కోల్పోయింది. దీంతో 50 ఓవర్లలో న్యూజీలాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

    న్యూజీలాండ్ జట్టులో డారిల్ మిషెల్ 127 బంతుల్లో 130 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రచిన్ రవీంద్ర 87 బంతుల్లో 75 పరుగులు చేసి వెనుదిరిగాడు. వీరిద్దరు తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయలేదు. డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్‌లు డకౌటయ్యారు.

    ఆరంభంలో న్యూజీలాండ్ బ్యాటింగ్ శైలి చూశాకా జట్టు స్కోర్ 300 దాటుతుందనుకున్నా, చివర్లో వరసగా వికెట్లు పడిపోవడంతో స్కోరు మందగించింది.

    భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు చెరొక వికెట్ తీశారు.

    న్యూజీలాండ్ బ్యాటర్ లాకీ ఫెర్గ్యూసన్ రనౌట్ అయ్యాడు.

  7. టెన్నిస్ ఆటగాళ్ల చేతి ఎముక మిగతా వారికంటే ఎందుకు పొడవు ఉంటుంది?

  8. ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ ఏనాటిది, ఎలా మొదలైంది? 9 పదాల్లో సంక్లిష్ట చరిత్ర

  9. క్రికెట్ వరల్డ్ కప్ - ఇండియా Vs న్యూజిలాండ్: 2019లో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

  10. తెలంగాణ ఎన్నికలు: 52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా, గజ్వేల్‌లో కేసీఆర్ వర్సెస్ ఈటల

    ఈటల రాజేందర్

    ఫొటో సోర్స్, Eetala Rajender

    తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. మొత్తం 52 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు.

    బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీ హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మీద పోటీకి నిలబెడుతోంది.

    గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మీదున్న సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు మళ్ళీ అదే స్థానాన్ని కేటాయించింది.

    ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఈసారి కరీంనగర్, కోరుట్ల అసెంబ్లీ స్థానాల్ల ో బరిలోకి దిగుతున్నారు.

    పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు తొలి జాబితాలో లేదు.

    ఇదీ బీజేపీ అభ్యర్థుల జాబితా:

    బీజేపీ తెలంగాణ

    ఫొటో సోర్స్, BJP

    bjp

    ఫొటో సోర్స్, BJP

    bjp

    ఫొటో సోర్స్, BJP

  11. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

    రాజాసింగ్

    ఫొటో సోర్స్, RAJASINGH/FB

    ఫొటో క్యాప్షన్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

    మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 2022లో బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.

    అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంటున్నారు.

    రాజాసింగ్ సస్పెన్షన్

    ఫొటో సోర్స్, BJP

    ఫొటో క్యాప్షన్, బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ విడుదల చేసిన ప్రకటన

    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ ప్రకటించింది.

    ఆదివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

    సస్పెన్షన్ ఎత్తివేయడంతో రాజాసింగ్ మళ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  12. గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేయలేదు- కెనడా

    ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, పేలుళ్లు సంభవించిన అల్ అహ్లీ ఆసుపత్రి వద్ద పరిస్థితి

    అక్టోబర్ 17న గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రి వద్ద సంభవించిన పేలుళ్లకు ఇజ్రాయెల్‌కు సంబంధం లేదని కెనడా రక్షణ శాఖ తెలిపింది. ఘటనపై దర్యాప్తు జరిపిన కెనడా రక్షణ శాఖ, ఈ వివరాలు తెలియజేసింది.

    ఆసుపత్రిపై రాకెట్ దాడి జరిగిందని వెల్లడించింది. అయితే ఈ రాకెట్లు ప్రయోగించింది మాత్రం ఇజ్రాయెల్ సైన్యం కాదని తెలిపింది.

    పాలస్తీనా ప్రయోగించిన రాకెట్లు మిస్ ఫైర్ అయిన కారణంగానే ఆసుపత్రి వద్ద పేళుల్లు జరిగి ఉండొచ్చని ఫ్రెంచ్ మిలటరీ ఇంటెలిజెన్స్ ప్రకటించింది. ఒకరోజు తర్వాత విడుదలైన కెనడా నివేదికలో కూడా ఇదే ఉంది.

    అమెరికా కూడా ఈ పేలుళ్లకు ఇజ్రాయెల్‌కు సంబంధం లేదని తెలిపింది.

    20 ట్రక్కుల సాయం సముద్రంలో నీటి చుక్క- ఐక్యరాజ్య సమితి

    రఫా క్రాసింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఈజిప్ట్ నుంచి తెరుచుకున్న రఫా క్రాసింగ్, గాజా స్ట్రిప్‌లోకి వచ్చిన ట్రక్కులు

    గాజాలో వెంటనే మానవతా కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.

    ఐక్యరాజ్య సమితిలోని ప్రపంచ ఆహార సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో గాజాలోని పరిస్థితిని ’విపత్తు’గా వర్ణించాయి.

    ఘర్షణ మొదలైన రెండు వారాలవుతోంది. శనివారం 20 ట్రక్కుల మనవాతా సాయం గాజాకు చేరింది. ఈ సాయాన్ని సముద్రంలో నీటి చుక్క వేయడంతో పోల్చారు అక్కడి సభ్యులు.

    ఘర్షణ ప్రారంభం కాకముందు రోజుకు 500 ట్రక్కులు గాజాకు చేరేవని యాక్షన్ ఎయిడ్ పాలస్తీనా అధికార ప్రతినిధి అన్నారు.

  13. మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించనున్న అమెరికా

    తహాడ్ వ్యవస్థ
    ఫొటో క్యాప్షన్, THAAD వ్యవస్థ పనితీరు

    ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ కారియర్, షిప్స్, జెట్ విమానాలను ఇజ్రాయెల్‌కు మద్దతుగా తూర్పు మధ్యదరా ప్రాంతంలో మోహరించింది అమెరికా.

    తాజాగా మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కూడా మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి పంపుతున్నట్లు పెంటగాన్ వెల్లడించింది.

    మధ్య ప్రాచ్యంలో ఇటీవల ఇరాన్‌, మద్దతు దేశాల చర్యలు ఎక్కువైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పెంటగాన్ ఒక ప్రకటనలో తెలిపింది.

    ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో ఇరాక్, సిరియాల్లోని అమెరికా దళాలపై దాడులు పెరిగాయి.

    టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) గా పిలిచే ఈ వ్యవస్థ, శత్రు దేశాలు ప్రయోగించిన మిసైల్స్‌ గుర్తించి, చివరిదశలో వాటిని నిలువరించేందుకు బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగిస్తుంది.

    “మిసైల్స్‌ను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం” యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లియోడ్ అస్టిన్ చెప్పారు. అయితే ఎన్ని మిసైల్స్‌ను పంపుతున్నారో మాత్రం వెల్లడించలేదు.

  14. తెలంగాణ: కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్

    మేడిగడ్డ బరాజ్

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, కుంగిన మేడిగడ్డ బరాజ్

    మేడిగడ్డ బరాజ్‌కు చెందిన ఒక పిల్లర్ కుంగిపోయిందని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్ఈ వెంకటేశ్వర్లు బీబీసీతో అన్నారు.

    శనివారం రాత్రి పెద్ద శబ్దం రావడంతో తమ ఇంజనీర్లు వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించారని ఆయన చెప్పారు. పిల్లర్ కుంగిన ప్రాంతం మహారాష్ట్ర పరిధిలోకి వస్తుందని వివరించారు.

    తెలంగాణ-మహారాష్ట్రలను కలుపుతూ గోదావరి నదిపై దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ బరాజ్‌కు మొత్తం 85 గేట్లున్నాయి. దీని నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు. పిల్లర్ కుంగిపోవడంతో గత రాత్రి నుంచే గేట్లను ఎత్తి నీటిని చాలా వరకు వదిలినట్లు తెలుస్తోంది.

    మేడిగడ్డ బరాజ్ ప్రాంతం

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్

    అయితే, ఆనకట్ట కుంగుబాటు గురించి ఎల్ అండ్ టీ కంపనీ డిజైనింగ్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలిస్తున్నారని ఎస్ఈ వెంకటేశ్వర్లు బీబీసీకి తెలిపారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అన్నది కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

    తెలంగాణలో మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్, మహారాష్ట్ర వైపు సిరోంచా పోలీస్ స్టేషన్లలో తమ ఇంజనీర్లు దీనిపై ఫిర్యాదు చేశారని కూడా వెంకటేశ్వర్లు చెప్పారు. అయితే, బరాజ్‌కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన అన్నారు.

  15. అమెరికాలో పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రదర్శనలు

    ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, లాస్ ఏంజిల్స్ నగరంలో ప్రదర్శనలు

    గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా అమెరికాలో ప్రదర్శనలు జరుగుతున్నాయి.

    లాస్ ఏంజెల్స్, బ్రూక్లిన్ నగరాలతోపాటు పలు ప్రాంతాల్లో పాలస్తీనియన్లకు మద్దతు ప్రకటిస్తూ నిరసనకారులు ప్లకార్డులతో ప్రదర్శనలు చేపట్టారు.

    ‘ఇప్పటికైనా మౌనం వీడి, పాలస్తీనా ప్రజల కోసం నోరు విప్పండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు.

    ఇజ్రాయెల్ గాజా ఘర్షణలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, బ్రూక్లిన్‌లో మద్దతు దారుల ప్రదర్శనలు
  16. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.