You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఒడిశా రైలు ప్రమాదం: మృతదేహాలు ఉంచిన స్కూల్‌ భవనం కూల్చివేత

బాలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారిని ఉంచేందుకు ఈ భవన ప్రాంగణాన్ని తాత్కాలిక మార్చురీగా ఉపయోగించారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్‌ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. మరిన్ని వార్తలతో శనివారం ఉదయం కలుద్దాం.

  2. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్: మెరుగైన స్థితిలో ఆస్ట్రేలియా

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 296 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా 44 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.

    ఉస్మాన్ ఖ్వాజా(13 పరుగులు), డేవిడ్ వార్నర్(1), స్టీవ్ స్మిత్(34), ట్రావిస్ హెడ్(18) ఔట్ అయ్యారు.

    ప్రస్తుతం మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్ క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, మ్యాచ్‌లో భారత్ కన్నా బాగా మెరుగైన స్థితిలో ఉంది.

    భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే(129 బంతుల్లో 89 పరుగులు; 11 ఫోర్లు, ఒక సిక్సర్), శార్దూల్ ఠాకూర్ (109 బంతుల్లో 51 పరుగులు; ఆరు ఫోర్లు), రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48 పరుగులు; ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు.

    రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ సహా మరెవ్వరి వ్యక్తిగత స్కోరూ 15 పరుగులు దాటలేదు.

    ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలండ్, కామెరాన్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు.

  3. ఒడిశా రైలు ప్రమాదం: మృతదేహాలు ఉంచిన స్కూల్‌ భవనం కూల్చివేత

    బాలాసోర్‌లోని బహానాగలో ఒడిశా రైలు ప్రమాద బాధితుల మృతదేహాలను ఉంచిన పాఠశాల భవనాన్ని అధికార యంత్రాంగం కూల్చివేస్తున్నట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    బాలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారిని ఉంచేందుకు ఈ భవన ప్రాంగణాన్ని తాత్కాలిక మార్చురీగా ఉపయోగించారు.

    దీంతో, తమ పిల్లల్ని ఆ స్కూల్‌కు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడకపోతుండటంతో దీనిని కూల్చివేస్తున్నట్లు ఏఎన్ఐ రిపోర్టు చేసింది.

    ‘‘కలెక్టర్ ఈ భవనాన్ని సందర్శించారు. భయపడటానికి ఏమీ లేదు. ఇక్కడ ఆత్మలనేవి లేవు. అవన్నీ మూఢనమ్మకాలే. అయినప్పటికీ, ఈ భవనాన్ని కూల్చి వేసి, కొత్తది నిర్మించనున్నాం’’ అని ఒక టీచర్ చెప్పారని ఏఎన్‌ఐ తెలిపింది.

  4. రహస్య పత్రాల కేసులో డోనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు

    డోనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తరువాత రహస్య పత్రాల నిర్వహణకు సంబంధించి తాజాగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

    అమెరికా మీడియా నివేదికల ప్రకారం, 76 ఏళ్ల డోనాల్డ్ ట్రంప్‌‌పై అనధికారికంగా రహస్య పత్రాలను తన వద్ద ఉంచుకున్నారన్న అభియోగంతో పాటు మరో ఏడు అభియోగాలు కూడా నమోదయ్యాయి.

    ట్రంప్‌పై ఆరోపణలు రావడం ఇది రెండోసారి. మరోవైపు, ట్రంప్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

    దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా వెబ్‌సైట్ 'ట్రూత్ సోషల్‌'లో స్పందించారు.

    "అమెరికా మాజీ అధ్యక్షుడికి ఇలాంటివన్నీ ఎదురవుతాయని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది అమెరికాకు చీకటి రోజు. ఒక దేశంగా మనం వేగంగా దిగజారిపోతున్నాం. కానీ, మనమంతా కలిసి మళ్లీ అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుదాం" అని రాశారు.

    ఈ కేసులో వచ్చే మంగళవారం మియామీలోని ఫెడరల్ కోర్టుకు హాజరుకావాలని సమన్లు ​​జారీ చేసినట్లు కూడా ఆయన చెప్పారు.

  5. ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్: ఆస్ట్రేలియా 469 పరుగులు, 151 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పేలవంగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

    ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే (29 నాట్ అవుట్), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎస్ భరత్ (5 నాట్ అవుట్) ఉన్నారు.

    ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టు ఇంకా 318 పరుగుల వెనుకబడి ఉంది. భారత్‌కు ఫాలో ఆన్ ప్రమాదం కూడా ఉంది.

    మొదట బ్యాటింగ్‌కి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించారు.

    ఆరో ఓవర్‌లో 15 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ కాగా, ఆ తర్వాతి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ కూడా 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

    ఛెతేశ్వర్ పుజారా 14 పరుగుల వద్ద ఔట్ కాగా, విరాట్ కోహ్లి కూడా 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

    ఆ తరువాత అజింక్యా రహానే, రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జడేజా 48 పరుగులు చేసి ఔటయ్యాడు.

    అంతకుముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (163 పరుగులు), స్టీవెన్ స్మిత్ (121 పరుగులు) సెంచరీలు చేశారు.

    భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు, శార్దూల్ ఠాకూర్, షమీ రెండేసి వికెట్లు తీశారు.

  6. నమస్కారం

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్‌పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి