You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా చేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి

భారతీయ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ప్రకాశ్ సింగ్ బాదల్ ఒకరు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీ దళ్ ఓటమి తర్వాత ఆయన రాజకీయాల నుంచి వైదొలిగారు.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

  2. సూడాన్​ నుంచి నౌకలో భారతీయుల తరలింపు

    సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య పోరాటం కారణంగా సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుంచి తరలించే పనులు వేగవంతమయ్యాయి.

    278 మంది ప్రయాణికులతో ఐఎన్‌ఎస్ సుమేధ నౌక సూడాన్ పోర్ట్ నుంచి మంగళవారం బయలుదేరింది. ఇది సౌదీ అరేబియాలోని జెడ్డా వైపు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

    10 రోజుల క్రితం సూడాన్ సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య వివాదం చెలరేగింది. అక్కడ సుమారు 3,000 మంది భారతీయులు చిక్కుకుపోయారని అంచనా.

    ఘర్షణలు తగ్గకపోవడంతో ఇండియా ఈ వారం ప్రారంభంలో భారతీయులను రక్షించడానికి ఆపరేషన్ కావేరీని ప్రారంభించింది.

  3. హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

    సుచిత్రా కె. మొహంతి

    బీబీసీ కోసం

    2019 పరువు నష్టం కేసులో తనకు సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినట్టు ఆయన న్యాయవాది కిరీట్ పన్వాలా బీబీసీకి చెప్పారు.

    ‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్‌ను సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పడిన తర్వాత రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

    ఈ తీర్పుపై రాహుల్ దాఖలు చేసిన అప్పీలును ఏప్రిల్ 20న సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టు‌ను ఆశ్రయించారు.

  4. హైదరాబాద్‌లో భారీ వర్షం, ట్రాఫిక్‌‌కు అంతరాయం

    అమరేంద్ర యార్లగడ్డ

    బీబీసీ ప్రతినిధి

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

    దాదాపు గంట పాటు ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. దీనివల్ల కాలనీలలోని రహదారుల్లో వరద నీరు చేరింది.

    వర్షం కారణంగా వివిధ కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

    ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌కు అంతరాయం ఏర్పడింది.

    ఎల్బీనగర్, అల్వాల్, మల్కాజిగిరి, పంజాగుట్ట, ఏఎస్ రావు నగర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, బహదూర్పుర, చాంద్రాయణగుట్ట, పురానాపూల్, రాయదుర్గం, ముషీరాబాద్, చిక్కడపల్లి, గాంధీనగర్, వనస్థలిపురం, కాచిగూడ, విద్యానగర్ ప్రాంతాల్లో వర్షం పడింది.

    హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లోనూ వర్షం కురిసింది.

  5. తంగరాజు సుప్పయ్యను సింగపూర్‌లో ఉరి తీశారు... ఐక్యరాజ్యసమితి వద్దన్నా పట్టించుకోని అధికారులు

  6. నరోడా అల్లర్లు: ‘పనులన్నీ పక్కన పెట్టి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది’

  7. మహిళా రెజ్లర్ల నిరసన: WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

  8. పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి

    భారతీయ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు.

    మొహాలీ ఫోర్టిస్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కొడుకు పీఏ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు.

    ఆయన వయసు 95 సంవత్సరాలు. కొంత కాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు.

    పంజాబ్‌‌కు బాదల్ ఐదుసార్లు ముఖ్యమంత్రిగాపనిచేశారు. 1996 నుంచి 2008 వరకు శిరోమణి అకాలీ దళ్‌కు అధ్యక్షులుగా కూడా సేవలందించారు.

    1970లో 43 ఏళ్లకే ముఖ్యమంత్రి కావడంతో, భారత దేశంలో ఒక రాష్ట్రానికి అత్యంత పిన్న వయసులో ఈ పదవి చేపట్టిన నేతగా బాదల్ అప్పట్లో పేరుగాంచారు.

    1979 నుంచి 1980 మధ్యలో కేంద్రంలో చౌధరి చరణ్ సింగ్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. పంజాబ్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

    1927లో డిసెంబర్ 8న బఠిండా జిల్లాలోని అబ్దుల్ ఖురానా గ్రామంలో బాదల్ జన్మించారు. ఆయన తల్లి సుందరి కౌర్, తండ్రి రఘురాజ్ సింగ్.

    తొలుత బాదల్ సివిల్ సర్వీసెస్‌లోకి వెళ్లాలనుకున్నారు. కానీ, అకాలీ నాయకుడు గియాని కర్తార్ సింగ్ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు.

    1947 నుంచి బాదల్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రిలాగానే బాదల్ గ్రామానికి సర్పంచ్ అయ్యారు. ఆ తర్వాత లంబి బ్లాక్ సమితికి ఛైర్మన్ అయ్యారు.

    2007 నుంచి 2012 వరకు, 2012 నుంచి 2017 వరకు పంజాబ్ రాష్ట్రానికి వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసి బాదల్ రికార్డు సృష్టించారు.

    2017 అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీ దళ్ ఓటమి తర్వాత ఆయన రాజకీయాల నుంచి వైదొలిగారు.

  9. భారత్‌లో ఆఫ్రికన్ చీతాల మరణం వెనక మిస్టరీ ఏమిటి?

  10. వడదెబ్బ: ఎండలో ఆ సమయంలో ఎక్కువసేపు ఉంటే కోమాలోకి వెళ్లిపోతామా?

  11. సూడాన్: ఇంటిపై క్షిపణి దాడి, పారిపోతుంటే రాకెట్ దాడి.. ఇన్ని గండాలను దాటి ఆ కుటుంబం ఎలా బయటపడింది?

  12. గుండెదానం కోసం ఎదురుచూస్తున్న ఆరేళ్ల చిన్నారి

  13. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టు ప్రకటన, రహానేకు చోటు

    ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో పాల్గొనే భారత జట్టును మంగళవారం ప్రకటించారు.

    ఐపీఎల్‌లో అదరగొడుతున్న అజింక్యా రహానేకు ఈ జట్టులో చోటు దక్కింది.

    రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. మరోవైఫు, గాయం కారణంగా జట్టుకు దూరమైన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు.

    లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

    భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్.

  14. సతి: భర్త చితి మీదే భార్యను ఆహుతి చేసే దురాచారంపై భారత్ ఎలా గెలిచింది?

  15. లైంగిక వేధింపులపై రెజ్లర్ల పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ రెజ్లర్లు చేసిన విజ్జప్తిని సుప్రీంకోర్టు విచారణ స్వీకరించాల్సిన కేసుల జాబితాలో చేర్చింది.

    రెజ్లర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవని సుప్రీం కోర్టు పేర్కొన్నట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

    ఈ కేసు శుక్రవారం నాడు విచారణకు రానుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు పంపినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    మరోవైపు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామని ఆరోపణలు చేసిన ఏడుగురు మహిళా రెజ్లర్ల పేర్లను జ్యుడీషియల్ రికార్డులలో చేర్చరాదని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. వారి ఐడెంటిటీని కాపాడేందుకు ఈ ఆదేశాలిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

  16. వృద్ధుల‌కు క‌ళ్ల‌ద్దాలు, ఊతక‌ర్ర‌, వీల్ చైర్.. ఉచితంగా ఇచ్చే ప‌థ‌కం గురించి తెలుసా?

  17. వాస్తవాధీన రేఖ వెంట శాంతి కోసం చైనా, భారత్‌ల మధ్య 18వ రౌండ్ చర్చలు

    వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తత నెలకొన్న రెండు ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం భారత్, చైనాల మధ్య 18వ రౌండ్ చర్చలు ఆదివారం జరిగాయి.

    ఈ చర్చలు చాలా వివరంగా జరిగినట్లు సమాచారం. ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు చైనా రక్షణ మంత్రి భారత్‌కు వస్తున్న తరుణంలో ఈ చర్చలు జరిగాయి.

    గల్వాన్‌లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ తర్వాత చైనా రక్షణ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.

    2020 ఏప్రిల్‌లో గల్వాన్‌లో ఘర్షణ తర్వాత ఇరు దేశాల సీనియర్ సైనిక కమాండర్ల మధ్య జరిగిన ​​18వ రౌండ్ చర్చలు ఇవి.

    రెండు దేశాల సరిహద్దులు కలిసే చైనాలోని చుసుల్-మోల్డో ప్రాంతంలో ఈ చర్చలు జరిగాయి.

    "పశ్చిమ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖకు ఆనుకుని ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై, శాంతి పునరుద్ధరణ కోసం రెండు దేశాల మధ్య వివరణాత్మక చర్చ జరిగింది. తద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలకు మరింత ఊతం లభిస్తుంది’’ అని ఒక భారత్ ఒక ప్రకటనలో తెలిపింది.

    ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ప్రస్తుత చర్చలతో సర్దుకుంటుందని చైనా నిపుణులు భావిస్తున్నారు.

    సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు చైనా, భారత సైన్యం మధ్య చర్చలు జరుగుతున్నాయని విలేఖరుల సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు.

  18. కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే

  19. పాకిస్తాన్: స్వాత్ లోయలోని తీవ్రవాద నిరోధక శాఖ ఆఫీసులో పేలుడు, 15 మంది మృతి

    పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో ఉన్న తీవ్రవాద నిరోధక శాఖ భవనంలో జరిగిన పేలుడులో 15 మంది మృతి చెందారు.

    53 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    మృతిచెందిన వారిలో ఎక్కువమంది పోలీసు సిబ్బంది ఉన్నారు. పేలుడు కారణంగా తీవ్రవాద నిరోధక శాఖ భవనం ధ్వంసం అయింది.

    శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే పనులు కొనసాగుతున్నాయి.

    ఈ పేలుడు తీవ్రవాద చర్య కాదని స్వాత్ లోయ పోలీసులు చెప్పారు.

    పాత సీటీడీ కార్యాలయంలో పేలుడు సంభవించిందని స్థానిక విలేఖరులకు పోలీసులు తెలిపారు. ఇందులో తీవ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు చెప్పే ఆధారాలేవీ లేవని వారు చెప్పారు. షాట్ సర్క్యూట్ కారణంగా ఆయుధాలకు మంటలు అంటుకున్నాయని వెల్లడించారు.

    స్వాత్ లోయలో తీవ్రవాద నిరోధక చర్యలను తీసుకుంటున్నారు.దీని కారణంగా ఇక్కడ భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 2012లో ఈ లోయలోనే నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌పై తీవ్రవాదులు దాడి చేశారు.