టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ కుట్ర ముమ్మాటికీ బీజేపీదే: మంత్రి కేటీఆర్

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ శాఖ కాదని.. అది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న కనీస అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. నేటి లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ ఇంతటితో సమాప్తం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ కుట్ర ముమ్మాటికీ బీజేపీదే: మంత్రి కేటీఆర్

    కేటీఆర్

    ఫొటో సోర్స్, fb/KTRTRS

    బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

    టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలకు కేటీఆర్ ఇలా స్పందించారు.

    పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ శాఖ కాదని.. అది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న కనీస అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని, నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలను చేస్తున్నారన్నారు.

    యువత ఉద్యోగాల ప్రిపరేషన్ పక్కనపడేయాలన్న దుర్మార్గుడు బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగుల పట్ల తమ నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే వంద సార్లకు పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లోనూ 13 సార్లు ప్రశ్నా పత్రాలు అయ్యాయని, మరి ప్రధాని మోదీని రాజీనామా చేయాలని బండి సంజయ్ అడగ్గలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

    ధరణి పోర్టల్, టీఎస్పీఎస్సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం సహించబోనని హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలో అబాసు పాలై, పరువునష్టం కేసు ఎదుర్కొంటున్నారన్నారు.

    ఈసారి కూడా తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

    టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం మెరుపువేగంతో సిట్‌ను నియమించి, బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందని కేటీఆర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయాలని కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇది బాధాకరమైన నిర్ణయం అయినప్పటికీ తప్పలేదని.. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కేటిఆర్ అన్నారు.

    ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపించి మొత్తం పబ్లిక్ సర్వీసు కమిషన్‌నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ క్రియాశీల కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందని, తన రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి పేపర్‌ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదే అని ఆరోపించారు.

    శరవేగంగా చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే బీజేపీ ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడినట్టు మంత్రి కేటిఆర్ ఆరోపించారు.

  3. Ind vs Aus: తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం

    క్రికెట్

    ఫొటో సోర్స్, Getty Images

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    ముంబయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని భారత్ 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

    భారత్ తరఫున అత్యధికంగా 75 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ నాటౌట్‌గా నిలిచాడు.

    అంతకుముందు భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

  4. Ind vs Aus: భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఇరుజట్లకు ఎందుకంత ముఖ్యమైనది?

  5. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

    రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, revanthofficial

    తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష పత్రాల లీక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

    పరీక్ష పత్రాల లీక్ పట్ల ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందని, ‘సిట్’తో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదని, అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో యువతను పదేపదే మోసం చేస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు.

    రేవంత్ రెడ్డి లేఖలోని ముఖ్యాంశాలు:

    ‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే పేపర్ లీక్‌లు జరిగి, పరీక్షలు రద్దు చేసే దుస్థితి ఏర్పడింది. తప్పు చేసింది ప్రభుత్వమైతే నిరుద్యోగులకు శిక్ష వేస్తున్నారు.

    నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగ యువతను ఇప్పటికే మోసం చేశారు. ఎన్నికల ముందు ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేశారు. కానీ, నియామకాల్లో పారదర్శకత లోపించింది.

    పరీక్షలు రద్దు చేసి చేతులు దులుపుకోకుండా కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

    కీలక నిందితులకు బీఆర్ఎస్,బీజేపి పార్టీలతో సంబంధాలు ఉన్నాయన్న కీలక విషయం కప్పిపుచ్చేందుకే పరీక్షలు రద్దు చేశారన్న భావన కలుగుతోంది.

    30 లక్షల మంది యువతతో ముడిపడి ఉన్న ఈ అంశంపై రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే కమిషన్ సభ్యులపై చర్యలు లేవని, కనీసం ముఖ్యమంత్రి నుంచి ప్రకటన కూడా లేకపోవడంతో యువత మానసిక స్థైర్యం కోల్పోంది’’ అని రేవంత్ అన్నారు.

    పేపర్ లీకేజీ అంశంలో సాంకేతిక పొరపాట్లతో లీక్ జరిగిందంటున్నారు కాబట్టి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, టీఎస్‌పీఎస్సీ బోర్డుపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.

  6. ప్రధాని మోదీ కార్యాలయం సీనియర్ అధికారినంటూ జెడ్- ప్లస్ భద్రతను వాడుకున్న వ్యక్తి అరెస్ట్

  7. ఊతకర్ర సాయంతో బ్యాక్‌ఫుట్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసే క్రికెటర్లు

  8. సినిమా రివ్యూ: ఫ‌లానా అబ్బాయి.. ఫ‌లానా అమ్మాయి ఏం చేశారంటే..

  9. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  10. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ

    టీఎస్‌పీఎస్సీ / TSPSC

    ఫొటో సోర్స్, BHANU PRAKASH BJYM/FACEBOOK

    గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది.

    2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రలిమ్స్ పరీక్షతో పాటు, 2023 జనవరి 22న జరిగిన ఏఈఈ పరీక్షను, ఫిబ్రవరి 26న నిర్వహించిన డీఏవో పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

    రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

    TSPSC

    ఫొటో సోర్స్, TSPSC

  11. తెలంగాణ: టీపీఎస్‌సీ పేపర్ల లీక్ వ్యవహారంలో ప్రతిపక్షాల నిరసనలు

    వైఎస్ షర్మిల

    ఫొటో సోర్స్, UGC

    తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్‌సీ) పేపర్ల లీక్ వ్యవహారం మీద ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి.

    టీపీఎస్‌సీ కార్యాలయం వద్దకు బయలుదేరిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    హైదరాబాద్‌లోని బీఎస్‌పీ కార్యాలయంలో దీక్షకు దిగిన ఆ పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.

    ఇక అసెంబ్లీ గన్‌పార్క్ వద్ద నిరసనకు దిగిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. గన్‌పార్క్ నుంచి టీపీఎస్‌సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన బండి సంజయ్, ఈటల రాజేందర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

    ఫొటో సోర్స్, RS Praveen Kumar/Twitter

    బండి సంజయ్

    ఫొటో సోర్స్, UGC

  12. అమెరికా డ్రోన్: రష్యా జెట్ ఢీ కొన్న ఫుటేజీ విడుదల

  13. అవినాశ్ రెడ్డి పిటిషన్ మీద తెలంగాణ హై కోర్టు ఉత్తర్వులు

    వైఎస్ అవినాశ్ రెడ్డి

    ఫొటో సోర్స్, YS Avinash Reddy/Facebook

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వేసిన పిటిషన్‌ మీద తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చింది.

    తదుపరి విచారణ మీద స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అలాగే అరెస్టు చేయవద్దని తాము చెప్పలేం అని కూడా హై కోర్టు తెలిపింది.

    అయితే అవినాశ్ రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆయన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోలను రికార్డు చేయాలని కూడా కోర్టు తెలిపింది.

    సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్ రెడ్డిని హై కోర్టు ఆదేశించింది.

  14. తెలంగాణ: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం

    ఏవీఎన్ రెడ్డి

    ఫొటో సోర్స్, Naraparaju Ramchander Rao/Facebook

    హైదరాబాద్‌‌‌‌-రంగారెడ్డి-మహబూబ్‌‌నగర్‌‌ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్​ రెడ్డి గెలిచారు.

    ఆయనకు బీజేపీ మద్దతు ఇచ్చింది. పీఆర్‌టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై ఏవీఎన్​రెడ్డి విజయం సాధించారు.

    ‘‘తెలంగాణ చరిత్రలో తొలిసారి టీచర్ల స్థానంలో ఎమ్మెల్సీని బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతకు ఇది నిదర్శనం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది.

    నవంబరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల మూడ్‌ను ఇది తెలియజేస్తోంది’’ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. హైదరాబాద్: స్వప్న‌లోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం... ఆరుగురు మృతి

  16. ఆంధ్రప్రదేశ్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల స్థానాల్లో వైసీపీ, పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ ముందంజ

    ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

    ఫొటో సోర్స్, I & PR AP

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలకు మిశ్రమ ఫలితాలు దక్కుతున్నాయి. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ పాగా వేసింది. తూర్పు, పశ్చిమ రాయలసీమ రెండు స్థానాలను ఆ పార్టీ ఖాతాలో వేసుకుంది. తొలిసారిగా టీచర్ నియోజకవర్గాల్లో బరిలో దిగిన ఆ పార్టీకి ఈ విజయాలు సంతృప్తినిస్తాయి.

    కానీ కీలకమైన పట్టభద్రుల స్థానాల్లో వైసీపీ వెనుకబడి ఉంది. మూడు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌కి తొలి రౌండ్లలో ఆధిక్యం లభించింది.

    స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల్లో నాలుగుకి నాలుగు సీట్లు తనఖాతాలో వేసుకున్న వైసీపీ, రెండు ఉపాధ్యాయ సీట్లలోనూ పాగా వేయగలిగింది. ఉమ్మడి చిత్తూరు-నెల్లూరు- ప్రకాశం జిల్లాల తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డిని 1,000 ఓట్ల తేడాతో ఆయన ఓడించారు.

    అనంతపురం- కర్నూలు-కడప పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ బలపరిచిన ఎంవీ రామచంద్రారెడ్డి గెలిచారు. తన సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డిని 169 ఓట్ల తేడాతో ఓడించారు.

    ఇక పట్టభద్రుల స్థానంలో మాత్రం టీడీపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఉత్తరాంధ్ర స్థానంలో మూడు రౌండ్ల తర్వాత టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు దాదాపు 13వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన విజయం వైపు దూసుకుపోతున్నారు.మరో 5 రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది.

    తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో కంచర్ల శ్రీకాంత్ రెండు రౌండ్ల తర్వాత మెజార్టీ ఓట్లు సాధించారు. రెండోస్థానంలో వైసీపీ అభ్యర్థి ఉన్నారు.

    పశ్చిమ రాయలసీమలో మాత్రం పట్టభద్రుల నియోజకవర్గంలో హోరాహోరీ పోరు సాగుతోంది. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

  17. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా సమాచారం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  18. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ కుట్ర ముమ్మాటికీ బీజేపీదే: మంత్రి కేటీఆర్