ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జగన్ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని చంద్రబాబు ఆరోపించారు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. జై వంశీ అంటూ నినాదాలు చేస్తూ కొందరు టీడీపీ కార్యాలయంలో సామాగ్రి ధ్వంసం చేశారు.
అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దాంతో గన్నవరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్ఆర్‌సీపీకి మద్ధతు పలుకుతున్నారు. అప్పటి నుంచి నిత్యం ఆయన టీడీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
దీనికి టీడీపీ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ఇరు పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి.
ఈ నేపథ్యంలో వంశీ అనుచరులుగా భావిస్తున్న కొందరు టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని వల్లభనేని వంశీ మీడియాతో అన్నారు.
మరోవైపు టీడీపీ కార్యకర్తలే రెచ్చగొట్టారని, ఎమ్మెల్యే వంశీని బూతులు తిట్టడమే కాకుండా, పోలీసులపై కూడా దాడికి దిగారని వైఎస్సార్సీపీ గన్నవరం నాయకులు వెంకటేశ్వర రావు విమర్శించారు. టీడీపీ నేతల తీరు మూలంగానే గన్నవరంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.
ఈ ఘర్షణలో పోలీసులకు కూడా స్పల్ప గాయాలయ్యాయి. గన్నవరం సీఐ కనకారావు గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. తాము భద్రత కల్పించిన కారణంగానే పరిస్థితి అదుపు తప్పకుండా ఉందని వారు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఖాళీ అవుతున్న స్థానాల్లో అధికార వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిసజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న 16 సీట్లతో పాటుగా రెండు గవర్నర్ కోటాలో ఖాళీ స్థానాలకు కలిపి మొత్తం 18 మంది అభ్యర్థులను విడుదల చేశారు.
స్థానిక సంస్థల కోటా:
నర్తు రామారావు(శ్రీకాకుళం)
కుడుపూడి సూర్యనారాయణ(తూర్పు గోదావరి)
వంక రవీంద్రనాథ్(పశ్చిమ గోదావరి)
కవురు శ్రీనివాస్(పశ్చిమ గోదావరి)
మెరుగు మురళీధర్(నెల్లూరు)
సిపాయి సుబ్రహ్మణ్యం(చిత్తూరు)
పొన్నరెడ్డి రామసుబ్బారెడ్డి(కడప)
మధుసూధన్(కర్నూలు)
ఎస్ మంగమ్మ(అనంతపురం)
ఎమ్మెల్యే కోటా:
పెనుమత్స సూర్యనారాయణ రాజు(విజయనగరం)
పోతుల సునీత(ప్రకాశం)
బొమ్మి ఇజ్రాయేల్(బీఆర్ అంబేడ్కర్ కోనసీమ)
జయమంగళం వెంకటరమణ(ఏలూరు)
మర్రి రాజశేఖర్(పల్నాడు)
చంద్రగిరి ఏసురత్నం(గుంటూరు)
కోల గురువులు(విశాఖ)
గవర్నర్ కోటా:
కుంభ రవిబాబు(అల్లూరి జిల్లా)
కర్రి పద్మశ్రీ(కాకినాడ జిల్లా)
సినీనటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి.
జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న తండ్రి చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్, విజయసాయి రెడ్డిలతో పాటు ఇతర కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా పోయిన నెల 27వ తేదీన కుప్పంలో నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆ తరువాత ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేర్పించారు.
కొద్దిరోజులుగా అక్కడ చికిత్స పొందుతూ ఉన్న ఆయన, శనివారం రాత్రి చనిపోయారు.
ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను చేర్చుతూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాల్మీకి బోయ, ఖాయితీ లంబాడ(మథుర)లతో పాటు మరో 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో తీర్మానించారు.
ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని ఆదివాసీలు ముట్టడించారు.
రాళ్లు విసరడంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఐటీడీఏ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేయడంతో, సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ ఆందోళన అనంతరం ఆదివాసీలు ధర్నాకు దిగారు. ఆదివాసీల ఆందోళనతో ఆదిలాబాద్-మంచిర్యాల రోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు.
బ్రెజిల్‌లోని సావో పౌలోను ముంచెత్తిన భారీ వర్షాలతో వరదలు, కొండ చరియలు విరిగి పడి 36 మంది మృతి చెందినట్లు అధికారులు చెప్పారు.
ఈ వర్షాలు, వరదల కారణంతో కొన్ని నగరాలు తప్పనిసరి పరిస్థితుల్లో వార్షిక కార్నివాల్ ఉత్సవాలను కూడా రద్దు చేసుకున్నాయి.
వరదలకి ఇళ్లు కొట్టుకుని పోవడంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు వీడియోలు చూపిస్తున్నాయి.
బాధితులను చేరుకునేందుకు, నీటితో బ్లాక్ అయిన రోడ్లను క్లియర్ చేసేందుకు సహాయక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
ఆదివారం కొన్ని ప్రాంతాల్లో 600 మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. ఈ నెలలో కురిసే వర్షానికి రెండింతలు ఎక్కువగా ఇక్కడ వర్షం పడింది.
‘‘సహాయక సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. వరదలతో చాలా ప్రాంతాలు అస్తవ్యస్థంగా మారాయి’’ అని భారీ వర్షాలతో ప్రభావితమైన సావో సెబాస్టియానో నగర మేయర్ ఫెలిప్ ఆగస్టో అన్నారు.
బాధితులను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
నగరంలో చాలా మంది ప్రజలు తప్పిపోయారని, 50 ఇళ్లు ఈ వర్షాలకు కొట్టుకుని పోయినట్లు మేయర్ తెలిపారు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నట్టు చెప్పారు.
సావో సెబాస్టియానోలో 35 మంది చనిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒక బాలిక కూడా ఈ వరదల్లో చనిపోయినట్టు ఉబటుబా చెప్పారు. వందలాది మంది ప్రజలు ఆశ్రయం కోల్పోవడంతో, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
‘‘దురదృష్టశాత్తు ఈ వరద ప్రభావిత మరణాలు పెరిగే అవకాశం ఉంది’’ సివిల్ డిఫెన్స్ అధికారి చెప్పారు.
228 మంది ఆశ్రయం కోల్పోయారని,ఉత్తర సావో పౌల్‌లో తీర ప్రాంతాలకు చెందిన 338 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు చెప్పారు.
మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నేడు భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
గ్రూపు దశలో టీమిండియాకు ఇదే చివరి మ్యాచ్.
గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు సెమీఫైనల్ చేరడానికి మరో అడుగు దూరంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే 6 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే మంగళవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై భారత జట్టు సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
సాయంత్రం 6:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జేఎన్‌యూ క్యాంపస్‌లో తాము నిర్వహించిన కార్యక్రమానికి వామపక్షాలకు చెందిన విద్యార్థులు భంగం కలిగించారని, శివాజీ ఫొటోపై దాడికి పాల్పడ్డారని ఏబీవీపీ ఆరోపించింది.
మీడియా కథనాల ప్రకారం, ఏబీవీపీకి చెందిన విద్యార్థులే ఆ దాడి చేశారని వామపక్షాలు ఆరోపించాయి.
సోషల్ మీడియాతో పాటు వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలలో శివాజీ ఫొటో నేలపై పడి ఉండటం, దాని చుట్టూ నిలబడి ఉన్న విద్యార్థులు నినాదాలు చేయడం కనిపిస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఏబీవీపీ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.
‘‘వామపక్షాలు, జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ కార్యాలయంలోని శివాజీ ఫొటో నుంచి దండను తీసేసి, ఫొటోను కిందపడేశారు. అక్కడ ఉన్న ఇతర గొప్ప వ్యక్తుల ఫొటోలను కూడా విసిరేశారు. దీన్ని మేం ఖండిస్తున్నం. బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఏబీవీపీ ట్వీట్‌లో పేర్కొంది.
‘‘జేఎన్‌యూఎస్‌యూ కార్యాలయంలో ఏబీవీపీ విద్యార్థులు శివాజీ ఫొటోను పెట్టారు. ఫొటో పెట్టడం కోసం జేఎన్‌యూఎస్‌యూ నుంచి అనుమతి తీసుకోవాలి. అయినప్పటికీ అక్రమంగా ఏబీవీపీ ఫొటోను పెట్టింది. అప్పుడు విద్యార్థులు వచ్చి ఫొటోను తీసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది’’ అని ఎన్‌ఎస్‌యూఐకి చెందిన ఒక విద్యార్థి వెల్లడించినట్లు వార్తా సంస్థ ఎన్ఎన్‌ఐ పేర్కొంది.
ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ దిల్లీ నివాసంపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరినాట్లు పోలీసులు చెప్పారు.
రాజధాని నగరంలోని అశోకా రోడ్‌లో గల ఒవైసీ నివాసం దగ్గరకు ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో దుండగలు చేరుకుని రాళ్లు విసిరారని, ఒవైసీ ఇంటి కిటికీలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.
ఈ రాళ్ల దాడిపై అసదుద్దీన్ దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ సారథ్యంలోని పోలీసుల బృందం ఒవైసీ ఇంటికి చేరుకుని ఆధారాలను సేకరించింది.
‘‘నేను రాత్రి 11:30 గంటల సమయంలో నా ఇంటికి తిరిగి వచ్చాను. అప్పటికే ఇంటి కిటికీల అద్దాలు పగిలి ఉండటం, నేల మీద రాళ్లు పడి ఉండటం కనిపించింది. సాయంత్రం 5:30 సమయంలో అల్లరిమూక ఒకటి ఇంటి మీద రాళ్లు విసిరినట్లు మా ఇంటి పనిమనిషి నాకు చెప్పారు’’ అని ఒవైసీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.
తన నివాసంపై ఇలాంటి దాడి జరగటం ఇది నాలుగో సారి అని కూడా ఒవైసీ పేర్కొన్నారు.
‘‘అత్యధిక భద్రత గల ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. నా ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతంలో తగినన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో దృశ్యాలను పరిశీలించి నిందితలును తక్షణమే అరెస్ట్ చేయాలి’’ అని ఒవైసీ తన ఫిర్యాదులో కోరారు.
ఫ్రెంచ్ పసిఫిక్ ప్రాంతమైన న్యూ కాలిడోనియాలో ఆస్ట్రేలియా పర్యాటకుడు ఒకరు షార్క్ దాడిలో మృతి చెందారు. ఈ ప్రాంతం ఆస్ట్రేలియాకు తూర్పుగా 1,200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
నౌమియాలోని ఒక పాపులర్ బీచ్‌లో ఆదివారం నాడు ఇతర పర్యాటకుల కళ్ల ముందే ఈ భయానక ఘటన చోటు చేసుకుంది.
మృతుడి వయసు 59 ఏళ్లుగా అధికారులు చెప్పారు. బీచ్‌లో ఒడ్డు నుంచి 150 మీటర్ల దూరం సముద్రంలోకి వెళ్లినపుడు ఆయనపై షార్క్ దాడి చేసిందని తెలిపారు.
ఆయన కాళ్లు, చేతుల మీద షార్క్ పలుమార్లు దాడి చేసి కరిచింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. సమీపంలో సెయిలింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆయనను ఒడ్డుకు తీసుకువచ్చారు. అత్యవసర సహాయ సిబ్బంది ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
చాటూ-రాయల్ బీచ్ సమీపంలో వారం రోజుల వ్యవధిలో ఇది మూడో షార్క్ దాడి ఘటన.
షార్క్ దాడి జరిగినపుడు చాలా మంది జనం బీచ్‌లోని నీళ్లలో ఉన్నారని, ఆ దాడి చూసి భయభ్రాంతులై ఒడ్డుకు పరుగులు తీశారని స్థానిక మీడియా తెలిపింది.
అధికారులు ఈ ప్రాంతంలోని చాలా బీచ్‌లను మూసివేశారు. సమీప జలాల్లో షార్క్‌లను గుర్తించి పట్టుకోవాలని ఆదేశాలిచ్చారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.