You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు జట్టు ప్రకటన, కేఎల్ రాహుల్‌ స్థానం పదిలం

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. కుటుంబ కారణాల రీత్యా తొలి వన్డేకు రోహిత్ దూరం కాగా, అతని స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. లాన్ బౌల్స్ అనే ఆట ఉందని కూడా చాలా మందికి తెలియదు, ఆ నలుగురు అమ్మాయిలు గోల్డ్ కొట్టారు

  3. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

    తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ జాతీయ మహిళా కమిషన్ ఈ నోటీసులు ఇచ్చింది.

    గవర్నర్ బిల్లులు అన్నింటినీ పెండింగులో పెట్టారని అనుచిత పదజాలంతో పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై వివరణ కోరింది.

    ఫిబ్రవరి 21 తేదీ ఉదయం 11:30 గంటలకు విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డిని ఆదేశించింది.

    ఈ మేరకు ఫిబ్రవరి 14న ఆయనకు నోటీసులు జారీ చేసింది.

  4. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన, కేఎల్ రాహుల్‌ స్థానం పదిలం

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చివరి రెండు టెస్టులు, ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కోసం బీసీసీఐ, భారత జట్టును ప్రకటించింది.

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టులు జరుగుతాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా, భారత్ ఆ రెండింటిలో విజయం సాధించింది.

    భారత జట్టులో పెద్దగా మార్పులేమీ జరగలేదు. పేలవ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు బోర్డు మరో అవకాశం ఇచ్చింది. అతను జట్టులో కొనసాగుతున్నాడు.

    జైదేవ్ ఉనాద్కట్‌కు కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

    గాయం కారణంగా 2022 డిసెంబర్ నుంచి ఆటకు దూరంగా ఉన్న పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు.

    ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. కుటుంబ కారణాల రీత్యా తొలి వన్డేకు రోహిత్ దూరం కాగా, అతని స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

    టెస్టు సిరీస్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, గిల్, పుజారా, కోహ్లి, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, షమీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్, ఉనాద్కట్.

    వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సుందర్, చహల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మలిక్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ఉనాద్కట్.

  5. రవీంద్ర జడేజా: టెస్టు క్రికెట్‌లో సూపర్ ఆల్‌రౌండర్‌గా అవతరిస్తున్నాడా?

  6. నందమూరి తారకరత్న: మరో మూడు రోజుల్లో పుట్టినరోజు, ఇంతలోనే...

  7. క్యాన్సర్ పేషెంట్ తనకు తెలియని భాషలో అనర్గళంగా మాట్లాడారు... ఇదెలా సాధ్యం?

  8. చైనా: ఫిలిప్పీన్స్ నేవీపై డ్రాగన్ లేజర్ ప్రయోగం... ఈ లేజర్ ఆయుధాలతో సైనికుల చూపు పోతుందా?

  9. సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    సికింద్రాబాద్ కంటోన్మెట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు జి. సాయన్న ఆదివారం మరణించారు.

    గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల షుగర్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.

    అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

    ఆయన కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    కొన్నేళ్లుగా సాయన్న, మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన షుగర్ లెవెల్స్‌తోపాటు గుండె పల్స్ రేట్ తగ్గడంతో కుటుంబ సభ్యులు ఆయనను యశోద ఆసుపత్రిలో చేర్పించారు.

    అప్పటికే కిడ్నీ, ఇతర అవయవాలపైన ప్రభావం పడినట్లు వైద్యులు తెలిపారు.

    ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్టుతో ఆయన కన్నుమూశారు.

    సాయన్న 1994 నుంచి 2009 మధ్యకాలంలో టీడీపీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మరోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

    తర్వాత టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2018లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2015లో టీటీడీ బోర్డు మెంబర్‌గానూ పనిచేశారు.

    ఆయన అకాల మరణం పట్ల తెలంగాణ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు సంతాపం ప్రకటించారు.

    సికింద్రబాద్ కంటోన్మెంట్ ప్రజల మేలు కోసం ఎప్పుడూ తపించే ఆయన మృతి బాధాకరమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఆయన మృతిపై బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.

    ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

  10. గౌతమ్ అదానీపై ఆరోపణలు చేసిన 'హిండెన్‌బర్గ్' నాథన్ ఆండర్సన్ హీరోనా, విలనా?

  11. IND vs AUS: రెండో టెస్టులో ఆసీస్‌పై భారత్ ఘనవిజయం

    దిల్లీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మన్స్‌లో రోహిత్ శర్మ 31 పరుగులు, విరాట్ కోహ్లీ 20 పరుగులు చేశారు.

    వందో టెస్టు ఆడుతున్ చతేశ్వర్ పుజారా 31 పరుగులు, శ్రీకర్ భరత్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

    అంతకుముందు వికెట్ కోల్పోయి 61 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టును రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ఉచ్చులో బిగించారు.

    లంచ్‌కు ముందే కేవలం 113 పరుగులు చేసి కంగారూ జట్టు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్స్‌లో అత్యధికంగా ట్రావిస్ హెడ్ 43 పరుగులు, లబుషేన్ 35 పరుగులు సాధించారు.

    భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా ఏడు కీలక వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.

    ఆసీస్ నిర్ధేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  12. మహిళల టీ20 ప్రపంచ కప్: భారత్, పాకిస్తాన్ జట్లలో సెమీ ఫైనల్‌కి చేరేదెవరు? నిర్ణయించే అంశాలేమిటి?

  13. క్రికెట్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన పదేళ్ల తర్వాత మళ్లీ మహిళల ఐపీఎల్‌లో బరిలోకి దిగుతున్న తెలుగు క్రీడాకారిణి స్నేహ దీప్తి

  14. సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు..13 మంది మృతి

    సిరియా రాజధాని డమాస్కస్, దాని పరిసర ప్రాంతాలపై క్షిపణి దాడి జరిగింది. ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన ఈ క్షిపణి దాడిలో దాదాపు 13 మంది మరణించారని సిరియా ప్రకటించింది.

    ఈ దాడిలో 28 మంది గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. స్థానిక టీవీ ప్రసారం చేసిన వీడియోలో 10 అంతస్థుల భవనం దెబ్బతిన్న స్థితిలో కనిపిస్తోంది.

    ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లతో నివాస సముదాయాలను నిర్మించారు. ఈ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది.

    ఈ దాడిపై స్పందించడానికి ఇజ్రాయెల్ నిరాకరించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.

    ఇరాన్, హిజ్బుల్లా తిరుగుబాటుదారులతో సంబంధం ఉన్న సిరియా ప్రాంతాలపై ఇజ్రాయెల్ తరచుగా దాడులు చేస్తుంటుంది. అయితే, ఇజ్రాయెల్ దాని చర్యలను అధికారికంగా వెల్లడించిన సందర్భాలూ తక్కువ.

  15. తుర్కియే భూకంపం: అక్రమ నిర్మాణాల అనుమతులిచ్చిన 100 మంది అధికారుల అరెస్ట్

  16. తారక రత్నకు చంద్రబాబు, లోకేష్ నివాళులు

    సినీ నటుడు తారక రత్న భౌతికకాయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితర నేతలు సందర్శించి నివాళులర్పించారు.

    శనివారం నాడు బెంగళూరులోని ఆస్పత్రిలో కన్నుమూసిన తారక రత్న భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయానికి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలించారు.

    అక్కడ తారక రత్న భౌతికకాయాన్ని చంద్రబాబు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.

  17. INDvsAus: రెండో ఇన్సింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలిన ఆసీస్

    దిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది.

    రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్ ధాటికి లంచ్‌కు అరగంట ముందే పర్యటక జట్టు ఆలౌట్ అయింది.

    ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్స్‌లో అత్యధికంగా ట్రావిస్ హెడ్ 43 పరుగులు, లబుషేన్ 35 పరుగులు సాధించారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా ఏడు కీలక వికెట్లు తీసుకుని సత్తా చాటాడు.

    అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.

    అనంతరం 115 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్సింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

    కేఎల్ రాహుల్ ఒకే పరుగు చేసి లయన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. లంచ్ సమయానికి భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది.

    క్రీజులో రోహిత్ శర్మ (12), చతేశ్వర పుజారా (1) ఉన్నారు.

  18. హైదరాబాద్ శివారులో గ్యాంగ్ రేప్.. వివాహిత మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం, అమరేంద్ర, బీబీసీ ప్రతినిధి

    హైదరాబాద్ శివారులో గ్యాంగ్ రేప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పీరం చెర్వు వద్ద ఒక వివాహిత మహిళను ఇద్దరు నిందితులు అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

    నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం (ఈ నెల 18వ తేదీ) దారుణం జరిగింది.

    పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ వివాహిత పీరం చెర్వు వద్ద ఒక అపార్టుమెంట్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు. ఆమె ఈ నెల 17న పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కారులో వచ్చి ఆమెకు పరిచయం చేసుకున్నాడు.

    తనకు పెళ్లి కాలేదని, ఇంట్లో వండి పెట్టడానికి ఒక మహిళ కావాలని చెప్పాడు. ఆమె ఫోన్ నంబరు ఇవ్వాలని అడిగాడు.

    తనకు ఫోన్ నంబరు చెప్పడం రాదని చెప్పింది. ఆమె ఫోన్ తీసుకుని తన ఫోన్‌కు మిస్డ్ కాల్ ఇచ్చుకుని నంబరు తీసుకున్నాడు.

    ఆ తర్వాత రోజు (ఈ నెల 18) ఉదయం ఆమెకు ఫోన్ చేశాడు. కారులో తన స్నేహితుడితో కలిసి వచ్చి ఆమెను ఎక్కించుకుని కిస్మత్ పురా సమీపంలోని ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లారు.

    ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని స్విచ్ఛాప్ చేశారు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశారు.

    సాయంత్రం సమయంలో గండిపేట వద్ద వదిలివెళ్లారు. ఆ సమయంలో ఆమె వద్ద ఉన్న బంగారం లాక్కొని పారిపోయారు.

    మద్యం మత్తు నుంచి తేరుకున్న తర్వాత ఆ మహిళ తన భర్తకు విషయం చెప్పారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

    నార్సింగి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు పరిసీలిస్తున్నారు. నిందితులు పంజగుట్టకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. పూర్తి వివరాలు కేసు దర్యాప్తు అనంతరం చెబుతామని పోలీసులు మీడియాకు చెప్పారు.

  19. లుపస్: సింగర్ సెలీనా గోమెజ్‌కు నయం కాని ఆటో ఇమ్యూన్ వ్యాధి... ఏమిటీ వ్యాధి? లక్షణాలు ఎలా ఉంటాయి?

  20. తారక రత్న మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

    సినీ నటుడు తారక రత్న మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

    ‘‘శ్రీ నందమూరి తారక రత్న గారి అకాల మరణం విచారం కలిగించింది. సినిమా, వినోద రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, అభిమానుల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఓం శాంతి’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.