You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం
ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చినా వృద్ధిలో భారీగా తగ్గుదల నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్ వరకు జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం నమోదైంది.
లైవ్ కవరేజీ
ఆంధ్రప్రదేశ్: కోచింగ్ సెంటర్లుగా ఫైర్ స్టేషన్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల శిక్షణ
హలో ఆల్! గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కల్వకుంట్ల కవితపేరు
దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రిమాండ్ రిపోర్ట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు చేర్చింది.
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అమిత్ అరోరాను దిల్లీలోని రౌస్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఆమె పేరు ఉంది.
కాగా అమిత్ అరోరాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించింది.
అయితే, ఈ కుంభకోణానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కవిత వివిధ సందర్భాలలో చెప్పారు.
ఆధారాలు నాశనం చేసేందుకు గాను అమిత్ అరోరా 11 సార్లు ఫోన్ మార్చడం/ధ్వంసం చేయడం చేశారని.. అలాగే ఈ కేసులో ఆరోపణలున్న మరికొందరు గత ఏడాది కాలంలో వినియోగించిన లేదా ధ్వంసం చేసిన డిజిటల్ డివైస్‌ల(సీడీఆర్ ఐఎంఈఐ విశ్లేషణ ఆధారంగా) నంబర్లు, వారి పేర్లు అంటూ ఒక జాబితా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అందులో కల్వకుంట్ల కవిత పేరు ఉంది.
ఎన్డీ టీవీకి రవీశ్ కుమార్ రాజీనామా
ఎన్డీ టీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్ రాజీనామా చేశారు.
ఆ చానల్‌లో ప్రసారమయ్యే ‘హమ్ లోగ్’, రవీశ్ కీ రిపోర్ట్, దేశ్ కీ బాత్, ప్రైం టైమ్ వంటి కార్యక్రమాలకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించారు.
రెండు సార్లు రామ్‌నాథ్ గోయెంకా అవార్డు, ఒకసారి రామన్ మెగసెసే అవార్డును ఆయన అందుకున్నారు.
ఎన్డీటీవీ అదానీ గ్రూప్ చేతికి వెళ్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్: ఎల్‌ఈడీ వెలుగుల్లో చామంతి పూల సాగు
చంద్రబాబు: నన్ను, లోకేశ్‌ను చంపేస్తారని వైసీపీ నేతలు అంటున్నారు, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం
తనను, తన కుమారుడు లోకేశ్‌ను చంపేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు.
ఏలూరు జిల్లాలోని దెందులూరులో బుధవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ప్రారంభిస్తామని టీడీపీ అంటే లండన్ బాబు దెందులూరులో హడావిడి చేశారన్నారు.
లండన్ బాబుని శాశ్వతంగా లండన్ పంపిస్తా.. ఎవరితో పెట్టుకుంటున్నావో మర్చిపోకు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకా కేసు సుప్రీం కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకు వెళ్లడం జగన్‌కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.
అత్యున్నత ధర్మాసనం చెప్పినా సీఎం నోరు విప్పకుండా ఉన్నారంటే రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు.
కేంద్రాన్ని మెప్పించి పోలవరానికి అన్ని అనుమతులు తీసుకువస్తే జగన్ సీఎం అయ్యాక రివర్స్ టెండర్ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేసారంటూ ఆరోపించారు.
హైదరాబాద్: స్కూలు బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - నిందితుల అరెస్ట్
2022-23 ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(జులై నుంచి సెప్టెంబర్ వరకు) భారతదేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు అంచనాలు 6.3 శాతంగా ఉన్నట్లు కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంతో పోల్చితే ఇది తక్కువ.
గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉంది.
అలాగే, ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చినా వృద్ధిలో భారీగా తగ్గుదల నమోదైంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్ వరకు జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం నమోదైంది.
అదానీ చేతికి NDTV: దేశంలోని అగ్రస్థాయి న్యూస్ నెట్‌వర్క్‌ను గౌతమ్ అదానీ ఎలా నడపనున్నారు
అఫ్గానిస్తాన్‌లో స్కూలుపై బాంబు దాడి 10 మందికి పైగా మృతి
ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని ఓ పాఠశాలలో బాంబు పేలడంతో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తాలిబాన్ పాలకులు వెల్లడించారు.
సమాంగన్ ప్రావిన్స్‌లోని అయ్‌బాక్‌లో ఉన్న ఈ పాఠశాలపై బాంబు దాడి జరగడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు కూడా.
అయితే, మరణాల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. స్థానిక అధికారులు ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో 16 మంది చనిపోయినట్లు చెప్పారు.
అయితే, దాడికి తామే కారణమని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు.
రాష్ట్రపతి చేతుల మీదుగా నిఖాత్ జరీన్‌కు అర్జున అవార్డు ప్రదానం
తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖాత్ జరీన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డు ప్రదానం చేశారు.
ఈ మేరకు బుధవారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ‘నేషనల్ స్పోర్ట్స్ అండ్ అడ్వంచర్ అవార్డ్స్ 2022’ కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్జేసీ ప్రభాకర్ రెడ్డి సంస్థకు చెందిన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రభాకర్ రెడ్డి సంస్థలకు చెందిన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగాయన్నది ఆరోపణ. ఈ వ్యవహారంపై ఈడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే దివాకర్ రోడ్ లైన్స్, ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డిలకు సంబంధించిన రూ. 22.1 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
కిమ్ జోంగ్ తన కుమార్తెను ఎందుకు పరిచయం చేశారు, ఆయన ప్లాన్ ఏమిటి?
ఇంగ్లండ్ ప్లేయర్లకు వైరల్ ఇన్ఫెక్షన్... అనిశ్చితిలో పాక్‌తో తొలి టెస్ట్
పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ నిర్వహణ అనిశ్చితిలో పడింది.
పాకిస్తాన్ చేరుకున్న ఇంగ్లండ్ క్రికెటర్లలో 14 మంది వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఈసీబీ తెలిపింది.
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య రేపు తొలి టెస్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి మీద ఈసీబీతో చర్చలు జరుపుతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
దాదాపు 17ఏళ్ల తరువాత పాకిస్తాన్ గడ్డ మీద తొలిసారి టెస్ట్ సిరీస్ జరుగుతోంది.
పాకిస్తాన్: ఆత్మాహుతి దాడిలో ఇద్దరు మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో గల బాలెలీలో పోలియో వ్యాక్సిన్లు వేసే బృందానికి భద్రత కల్పిస్తున్న పోలీసు వాహనం మీద ఆత్మాహుతి దాడి జరిగింది.
ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా 24 మంది గాయపడ్డారు.
ఈ దాడి కోసం 20 నుంచి 25 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
ఈ దాడి చేసింది తామేనని నిషేధిత తీవ్రవాద సంస్థ తహరిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది.
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఈ దాడిని ఖండించారు. ఈ దేశంలో పోలియోను అంత మొందించేందుకు రేయింబవళ్లు పోరాడుతున్న సిబ్బంది ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని ఆయన అన్నారు.
భారత్ X న్యూజీలాండ్: ఫలితం తేలని మూడో వన్డే... 1-0తో సిరీస్ న్యూజీలాండ్ కైవసం
భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేకు వాన అంతరాయం కలిగించడంతో ఫలితం తేలలేదు.
దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-0తో న్యూజీలాండ్ గెలుచుకుంది.
మూడో వన్డేలో తొలుత టాస్ గెలిచిన న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ 18 ఓవర్లలో 104 పరుగుల చేసి ఒక్క వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో వాన రావడంతో మ్యాచ్‌ను ఆపేశారు.
వాన ఆగకపోవడంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేక రద్దు చేశారు.
తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. రెండో వన్డే వాన వల్ల ఆగింది.
బ్రేకింగ్ న్యూస్, చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మరణం
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ చనిపోయారు.
బుధవారం మధ్యాహ్నం ఆయన చనిపోయినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
1989లో బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్ నిరసనలను క్రూరంగా అణచివేయడం ద్వారా జియాంగ్ జెమిన్ అధికారంలోకి వచ్చారు.
తనను రేప్ చేసిన వారిని విడుదల చేయడం మీద సుప్రీం కోర్టుకు బిల్కిస్ బానో
తనను రేప్ చేసిన 11 మందిని శిక్ష ముగియక ముందే విడుదల చేయడం మీద బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఆ 11 మంది శిక్షా కాలం మీద నిర్ణయం తీసుకునేలా ఈ ఏడాది మేలో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇచ్చిన అనుమతులను సమీక్షించాలంటూ ఆమెను కోర్టును కోరారు.
2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను రేప్ చేయడంతోపాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేశారనే కేసులో 11మందికి జీవితకాల కారాగార శిక్ష విధించారు.
అయితే ఇటీవలే వారిని సత్పవర్తన కింద గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.
బ్రేకింగ్ న్యూస్, భారత్ X న్యూజీలాండ్: వానతో ఆగిన మ్యాచ్
న్యూజీలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వాన అంతరాయం కలిగించింది.
ఆట ఆగిపోయే నాటికి న్యూజీలాండ్ 18 ఓవర్లకు 104 పరుగులు చేసింది. ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 219 పరుగులు చేసింది.