ధన్యవాదాలు
ఈ పేజీలో లైవ్ అప్డేట్లు ముగిశాయి.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద నవంబర్ 1వ తేదీ మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియయ పునఃప్రారంభం కానుంది.
ఈ పేజీలో లైవ్ అప్డేట్లు ముగిశాయి.

తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద నవంబర్ 1వ తేదీ మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియయ పునఃప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో టీటీడీ ఈవోధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులతో కలిసి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. టోకెన్ల జారీ కౌంటర్లు, క్యూలైన్లు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగాతిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తామన్నారు. టోకెన్ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశామన్నారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని, నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. టోకెన్ల జారీ ప్రక్రియలో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దుకుంటూ క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచుతామని తెలిపారు. ఆధార్ నంబర్ ఆధారంగా టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్ పొందే అవకాశం ఉంటుందన్నారు.
తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గించడం కోసం డిసెంబర్ 1వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తామని, అక్కడే గదులు కేటాయిస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, ReutersCopyright
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సహా అనేక నగరాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా రష్యా క్షిపణి దాడులు చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.
నల్ల సముద్రంలో తన నౌకాదళంపై యుక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందంటూ రష్యా ఆరోపించిన తర్వాత ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే మొదటిసారి.
కీయెవ్ నగరంలో రెండు భారీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
కీయెవ్‌లో ప్రస్తుతం కరెంట్ సరఫరా నిలిచిపోయిందని స్థానికుడొకరు వెల్లడించారు.
మరోవైపు ఈశాన్య ఖార్కియెవ్ నగరంలోని మౌలిక సదుపాయాలకు నష్టం కలిగేలా రష్యా క్షిపని దాడులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఫొటో సోర్స్, ANI
పెర్త్‌లోని తన హోటల్ రూమ్ వీడియో లీక్ కావడంపై టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడాకారులు, సెలబ్రిటీలను కేవలం వినోద వనరుగా పరిగణించరాదని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో కోహ్లీ వ్యాఖ్యానించాడు.
కోహ్లి షేర్ చేసిన వీడియోలో, అతను లేని సమయంలో హోటల్ గదిలోకి ఎవరో ప్రవేశించి, ఆయన రూమ్ మొత్తాన్ని వీడియో తీశారు.
"అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూడాలని, వారిని కలవాలని కోరుకుంటారని నాకు తెలుసు. దీనిని నేను ఎప్పుడూ తప్పుబట్టను. కానీ, ఈ వీడియో బాధాకరంగా ఉంది. నా ప్రైవసీ గురించి భయంగా ఉంది’’ అని కోహ్లీ రాశాడు.
‘‘నా హోటల్ గదిలో కూడా నాకు ప్రైవసీ లేకపోతే, పర్సనల్ స్పేస్‌ను బయటకు ఇక ఎక్కడ ఆశించగలను’’ అన్నాడు కోహ్లీ.
‘‘ఈ రకమైన అబ్సెషన్, ప్రైవసీకి భంగం కలిగించే చర్యలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. దయచేసి వ్యక్తుల ప్రైవసీని గౌరవించండి. వారిని మీ వినోద వస్తువుగా పరిగణించవద్దు’’ అని కోహ్లీ రాశాడు.
కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా స్పందించాడు. "ఇది దారుణం. దీన్ని ఏ విధంగాను అంగీకరించలేం’’ అన్నాడాయన.
కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విరాట్ పోస్ట్‌ను షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారోను ఓడించి లులా డి సిల్వా అధ్యక్షుడయ్యారు.
బ్రెజిల్ రాజకీయాల్లో వామపక్షానికి, మితవాదపక్షానికి మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో వామపక్ష నేత లులా డిసిల్వా 50.9 శాతం ఓట్లు గెలుచుకున్నారు.
గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న మితవాద నేత బొల్సొనారోను ఓడించటానికి ఈ ఓట్లు సరిపోతాయి. ఆయనకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన ఇంకా తన ఓటమి గురించి మాట్లాడలేదు.
ఇద్దరు అభ్యర్థుల మధ్య కేవలం 21 లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే తేడా ఉండటం గమనార్హం.
అయితే.. ఈ ఎన్నికలతో బ్రెజిల్ సమాజంలో ఏర్పడిన చీలిక ఇప్పట్లో సమసిపోయేలా కనిపించటం లేదు.

ఫొటో సోర్స్, Reuters
మాజీ అధ్యక్షుడు డి సిల్వా జైలులో ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించటంతో 2018 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు.
బ్రెజిల్‌కు చెందిన ఒక నిర్మాణ సంస్థకు.. బ్రెజిల్ ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోబ్రాస్ కాంట్రాక్టులు ఇచ్చినందుకు గాను ముడుపులు తీసుకున్నారన్న కేసులో ఆయనను దోషిగా నిర్ధారించి జైలుకు పంపించారు. ఆ తీర్పును రద్దు చేసే వరకూ 580 రోజుల పాటు ఆయన జైలులో ఉన్నారు. ఆ తీర్పు రద్దయ్యాక తిరిగి రాజకీయాల్లోకి వచ్చిన లులా డి సిల్వా తాజా ఎన్నికల్లో గెలుపుతో ఖంగు తినిపంచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘నన్ను సజీవంగా సమాధి చేయటానికి వాళ్లు ప్రయత్నించారు.. నేను ఇక్కడ నిలిచాను’’ అని ఆయన తన విజయోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.
లులా డి సిల్వా 2023 జనవరి 1వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెజాన్ అడవి నరికివేతకు ముగింపు పలుకుతానని ఆయన చెప్పారు. దేశంలో ఆకలిని నిర్మూలించటం తన తక్షణ లక్ష్యమని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితర ప్రపంచ నేతలు లులా డి సిల్వాకు అభినందనలు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.