యుక్రెయిన్: మరియుపూల్ రోడ్లపై ట్యాంకులు, నగరం మధ్యకు చేరిన యుద్ధం
యుక్రెయిన్ రేవు నగరం మరియుపూల్‌లో భీకర పోరాటం జరుగుతోంది. రష్యా ఇక్కడ వరసగా దాడులు చేస్తోంది.
నగరంలో కొనసాగుతున్న భీకర పోరు వల్ల బాంబు దాడులకు గురైన థియేటర్ శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కష్టంగా మారిందని మరియుపూల్ నగర మేయర్ చెప్పారు.
యుద్ధం ఆగినప్పుడే సహాయ సిబ్బంది శిథిలాలు తొలగించడానికి వీలవుతుందని మేయర్ వాదిన్ బాయ్‌షోంకో తెలిపారు.
థియేటర్ ఉన్న ప్రాంతాన్ని పౌర నివాస ప్రాంతంగా చెప్పినప్పటికీ దానిపై రష్యా బాంబులు ప్రయోగించిందని యుక్రెయిన్ అధికారులు చెప్పారు. కానీ రష్యా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.
రష్యా సైన్యం మరియుపూల్‌ను చుట్టుముట్టింది. నగరంలో విద్యుత్, తాగునీరు, గ్యాస్ సరఫరా ఆగిపోయింది.
రష్యా నగరంలోకి మానవతా సాయం అందించే దారులు కూడా మూసివేసింది. దాదాపు మూడు లక్షల మంది ఇప్పటికీ నగరంలోనే ఉన్నారు.
యుక్రెయిన్ చెప్పిన వివరాల ప్రకారం ఆస్పత్రులు, చర్చిలు, లెక్కలేనన్ని నివాస ప్రాంతాలపై రష్యా బాంబు దాడులు జరిపింది. నగరంలో 80 శాతం భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఇక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చలేమని స్థానిక అధికారులు భావిస్తున్నారు.యుక్రెయిన్, రష్యా అప్‌డేట్స్ కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.