You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లిన భారత్ క్షిపణి.. పొరపాటున పేలిందని రక్షణ శాఖ వివరణ

భారత్ ప్రమాదవశాత్తూ ఒక క్షిపణిని పేలిందని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలంలో 40వేల అడుగుల ఎత్తులో ధ్వని వేగానికి మూడు రెట్లు అధికమైన స్పీడ్‌తో 100 కి.మీ. దూరం ఈ క్షిపణి ప్రయాణించింది.

లైవ్ కవరేజీ

పద్మ మీనాక్షి

  1. పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లిన భారత్ క్షిపణి.. పొరపాటున పేలిందని రక్షణ శాఖ వివరణ

    భారత్ నుంచి సూపర్ సోనిక్ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకొచ్చిందని పాకిస్తాన్ సైన్యం గురువారం ప్రకటించింది.

    పాకిస్తాన్ సైన్యం ప్రకటనపై భారత రక్షణ శాఖ స్పష్టత ఇచ్చింది.

    సాంకేతిక లోపం వల్లనే ఈ క్షిపణి పేలిందని వివరించింది. అయితే, ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించామని వెల్లడించింది.

    ‘‘2022 మార్చి 9వ తేదీన రొటీన్ మెయింటెనెన్స్ సమయంలో సాంకేతికంగా లోపం ఉన్న ఒక మిస్సైల్ ప్రమాదవశాత్తూ పేలింది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. పాకిస్తాన్ భూభాగంలో ఈ క్షిపణి దిగినట్లు తెలిసింది. ఇలా జరగడం తీవ్ర విచారకరం. అయితే, ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం ఉపశమనకరం’’ అని కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

    పాకిస్తాన్ సైన్యం ఏం చెప్పింది?

    సూపర్ సోనిక్ క్షిపణి లాంటి వస్తువు ఒకటి తమ భూభాగంలో పడిందని, పాకిస్తాన్ వాయుసేన దీనిని పరిశీలిస్తోందని పాక్ సైన్యం ప్రకటించింది.

    ఇది పౌర విమానాలకు అత్యంత ప్రమాదకరమైనదని, దీనిపై భారత్ సమాధానం ఇవ్వాలని కోరింది.

  2. వైఎస్ జగన్: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల మార్పుకు సంకేతాలు ఇచ్చిన సీఎం, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వవస్థీకరణకు అంతా సిద్ధమవుతోంది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చారు.

    ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అవి ముగిసిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయి. ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

    దాంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రివర్గ పునర్వవస్థీకరణ ఉంటుందా లేక దానికి ముందే చేస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది.

    కొత్త జిల్లాల నుంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో కలిపి 25 మందికి అవకాశం ఉంటుంది.

    ప్రస్తుతం క్యాబినెట్ లో సీఎంతో పాటుగా మరో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, 18 మంది మంత్రులున్నారు. ఇటీవల క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఓ స్థానం ఖాళీగా ఉంది.

    దాంతో మంత్రివర్గం పునర్వవస్థీకరణ సందర్భంగా పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు జగన్ స్పష్టం చేశారు. కొత్తగా కొందరికి అవకాశం కల్పించబోతున్నారు.

    ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిలో 13 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది. కొత్తగా తీసుకోబోయే వారిని నూతన జిల్లాల ప్రాతిపదికన ఎంపిక చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. దానికి అనుగుణంగా జగన్ తన క్యాబినెట్ సహచరులను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం.

    అయితే కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేసిన తరుణంలో అన్ని జిల్లాలకు అవకాశం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని జిల్లాలకు ఛాన్స్ వస్తుందనేది ఆసక్తిగా మారింది.

    ఆశావాహుల ఎదురుచూపులు

    ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే పలువురు సీనియర్లు మంత్రివర్గంలో చోటు కోసం ఎదురుచూశారు.. కానీ జగన్ మాత్రం యువతకు ఛాన్స్ ఇచ్చారు.

    తన క్యాబినెట్ లో తొలుత కేవలం ఐదుగురికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభం ఉండగా వారిలో ఇద్దరు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపించడంతో వారి స్థానంలో తీసుకున్న ఇద్దరు మంత్రులు సీదరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు కూడా తొలిసారిగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారయ్యారు.

    ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో బొత్స సత్యన్నారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.

    సీనియర్లలో చాలామందికి తొలి విడత అవకాశం రాకపోవడంతో అనేక మంది రెండున్నరేళ్ల పైబడి ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గంలో మార్పులు జరిగితే తమకు అవకాశం ఖాయమనే అంచనాతో పలువురు సీనియర్లున్నారు.

    రెండున్నరేళ్ల గడువు పెట్టిన జగన్

    2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత జూన్ 8న కొత్త క్యాబినెట్ ప్రమాణస్వీకారం జరిగింది. ఆ సందర్బంగా మంత్రివర్గ ఎంపిక గురించి సీఎం జగన్ ఆసక్తికర ప్రకటన చేశారు.

    తన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు రెండున్నరేళ్లు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత వారికి పార్టీ బాధ్యతలు అప్పగించి, కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇస్తామని వైసీఎల్పీ సమావేశంలో వెల్లడించారు.

    దానికి అనుగుణంగా గత ఏడాది చివరిలో మంత్రివర్గం మార్పులుంటాయనే అభిప్రాయం వినిపించింది. అయితే కరోనా సమయంలో మంత్రులకు తగిన అవకాశం రాలేదనే కారణంగా అదనంగా ఐదు నెలల పాటు అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తోంది.

    కొత్తగా మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం ఇస్తారనేదానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా జూనియర్లతో క్యాబినెట్ నింపుతారా లేక సీనియర్లకు చోటిస్తారా అనేది చూడాలి. కుల, ప్రాంతీయ సమీకరణాల్లో ఎలాంటి నిర్ణయాలుంటాయో చూడాలి.

    ప్రస్తుతం సీఎంతో కలిపి నలుగురు రెడ్లు, నలుగురు కాపులు, ఒక కమ్మ, ఒక మైనార్టీ, ఒక వైశ్య, నలుగురు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒకరు క్షత్రియ కాగా మిగిలిని వారు వెనుకబడిన తరగతులకు చెందిన వారున్నారు. వారిలో ముగ్గురు మహిళలుండగా ఆ ముగ్గురిలో ఇద్దరు, ఎస్సీ, ఒకరు ఎస్టీ నేత కావడం విశేషం.

  3. ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

    వైద్య పరీక్షల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

    ఆయన యశోద ఆస్పత్రి నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లారు.

    కేసీఆర్‌కు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు.

    కేసీఆర్‌కు సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేశారు.

    రొటీన్ పరీక్షల్లో భాగంగానే ఈ టెస్టులు చేసినట్లు కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు చెప్పినట్లు తెలంగాణ సీఎంవో పేర్కొంది.

  4. బ్రేకింగ్ న్యూస్, రష్యన్ దాడుల్లో ఇద్దరు యుక్రెయిన్ సైనికుల మరణం

    యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.

    లట్స్క్ నగరం పై జరిగిన దాడిలో ఇద్దరు యుక్రెయిన్ సైనికులు మరణించినట్లు స్థానిక అధికారి యూరి పొహుల్‌యాయికో తెలిపారు. లట్స్క్ , ఇవానో- ఫ్రాన్కివిస్క్ నగరాల్లోని వైమానిక స్థావరాల పై దాడులు చేసినట్లు రష్యా చెబుతోంది.

  5. రష్యా దాడులను ఖండించిన యుక్రెయిన్ అధ్యక్ష సలహాదారు

    రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడులను యుక్రెయిన్ అధ్యక్షుని సలహాదారు మిఖియాలో పోదోలియాక్ ఖండించారు.

    "యుక్రెయిన్‌లో ప్రధాన నగరాలన్నీ తేరుకోలేని విధ్వంసానికి గురవుతున్నాయి. లట్స్క్‌లో జరిగిన పేలుళ్లతో రెండు బాయిలర్ హౌస్‌లను మూసేయాల్సి వచ్చింది. ఇవానో-ఫ్రాంకివిస్క్‌లో మూడు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దినిప్రోలో కూడా దాడులు కొనసాగుతున్నాయి" అని ఆయన ట్వీట్ చేశారు.

    "పౌరులు, ప్రధాన నగరాల పై రష్యా చేస్తున్న వినాశకరమైన యుద్ధం కొనసాగుతోంది" అని ఆయన అన్నారు.

  6. కేసీఆర్‌కు యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, యాదాద్రి పర్యటన వాయిదా

    తెలంగాణ సీఎం కేసీఆర్ గుండెకు సంబంధించిన పరీక్షల కోసం యశోద ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఆయన యాదాద్రి పర్యటన వాయిదా పడింది.

    కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

    ‘‘సీఎం కేసీఆర్‌కు ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నామని సీఎం వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. రొటీన్ పరీక్షల్లో భాగంగానే ముఖ్యమంత్రికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ చేస్తున్నం. ఈ పరీక్షల ఫలితాలను బట్టి ఏంచేయాలో చూస్తాం. వారు నిలకడగా ఉన్నారు. ఇది కేవలం ముందుజాగ్రత్తతో చేస్తున్న పరీక్షలు మాత్రమేనని ఎంవీ రావు అన్నారు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

    యశోద ఆసుపత్రికి కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, ఎంపీ సంతోష్ వెళ్లారు. అనంతరం కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు ఆసుపత్రికి చేరుకున్నారు.

    కాగా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు.

    ముఖ్యమంత్రి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసిందని, అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

  7. ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది: అమెరికా

    ఉత్తర కొరియా తన కొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ(ఐసీబీఎం)లోని కొన్ని భాగాలను ఇటీవల పరీక్షించిందని అమెరికా తెలిపింది. ఇది ఉద్రిక్తతలను పెంచడమేనని పేర్కొంది.

    ఫిబ్రవరి 26, మార్చి 4న నిర్వహించిన పరీక్షలు నిఘా శాటిలైట్ వ్యవస్థ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టినవని ఉత్తరకొరియా పేర్కొంది.

    అయితే, పూర్తిస్థాయి ఐసీబీఎం లాంచింగ్‌కు ముందు ఇవి ప్రయోగత్మకంగా పరీక్షించారని పెంటగాన్ చెబుతోంది.

    5,500 కిలోమీటర్ల కనీస రేంజ్ గల ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉత్తరకొరియా నుంచి అమెరికా చేరుకోగలవు. అణ్వాయుధ ప్రయోగాల కోసం వీటిని రూపొందిస్తున్నారు.

    ‘‘ఉత్తరకొరియా చేసిన రెండు పరీక్షలూ పూర్తి రేంజ్, పూర్తి సామర్థ్యం మేరకు చేపట్టనప్పటికీ భవిష్యత్తులో చేయబోయే పూర్తి రేంజ్ పరీక్షలకు ముందు అంచనా కోసం దీన్ని అంతరిక్ష ప్రయోగం ముసుగులో నిర్వహించినట్లుగా ఉంది’’ అని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

    ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు భంగం కలిగిస్తూ ఉద్రిక్తతలు పెంచేలా ఉత్తరకొరియా వ్యవహరిస్తోందని, దీన్ని అమెరికా ఖండిస్తోందని కిర్బీ అన్నారు.

    ఉత్తరకొరియా క్షిపణి వ్యవస్థ పరీక్షలను దక్షిణ కొరియా, జపాన్‌లు కూడా నిర్ధరించడంతో పాటు ఈ చర్యను ఖండించాయి.

  8. ఇప్పటి దాకా ఏం జరిగిందంటే...

    పశ్చిమ యుక్రెయిన్‌లో రష్యన్ దాడులు పెరిగాయి. రష్యాకు మద్దతిస్తున్న యుక్రెయిన్ వేర్పాటువాదులు వోల్నోవాకా నగరాన్ని చేజిక్కించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ చెప్పినట్లు ఆర్‌ఐఏ వార్తా సంస్థ తెలిపింది.

    మరియుపూల్ నగరానికి ఉత్తరంగా ఉన్న ఈ నగరం వ్యూహాత్మకంగా కీలకమైనది.

    లట్స్క్ నగరంలో వైమానిక స్థావరాల పై దాడులు జరిగినట్లు నగర మేయర్ ధృవీకరించారు.

    దినిప్రో నగరంలో జరిగిన దాడుల్లో ఒక వ్యక్తి మరణించినట్లు యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ (ఎస్ ఈ ఎస్) తెలిపింది.

    పశ్చిమ యుక్రెయిన్‌లో ఇవానో- ఫ్రాంకివిస్క్ నగరంలో పేలుళ్లు జరిగినట్లు నగర మేయర్ ధృవీకరించారు.

    యుక్రెయిన్‌లో రసాయన, జీవాయుధాలు తయారవుతున్నాయని రష్యా చేస్తున్న ఆరోపణలను యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్స్కీ ఖండించారు. రష్యా గనుక యుక్రెయిన్ పై రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లైతే రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

    రష్యా చేసిన ఆధారరహిత వాదనలను చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

    రష్యన్ సేనలు నెమ్మదిగా కీయెవ్ వైపు కదులుతున్నట్లు చూపిస్తున్న శాటిలైట్ చిత్రాలు లభించాయి. పుతిన్ సేనలు నెమ్మదిగా యుక్రెయిన్ నగరాలను చుట్టుముడుతున్నాయి. మరియుపూల్ లాంటి నగరాల్లో ఆహారనిల్వలు నిండుకున్నాయి.

    టర్కీలో రష్యా, యుక్రెయిన్ విదేశీ వ్యవహార మంత్రుల మధ్య జరిగిన సమావేశం ఆశాజనక ఫలితాలు సాధించలేదు. త్వరలో కాల్పుల విరమణ జరిగే ఆశ ఉన్నట్లు కనిపించటం లేదని ఇరు దేశాల నాయకులు అన్నారు.

    లట్స్క్‌ , దినిప్రో నగరాల పై పేలుళ్లు జరిగినట్లు యుక్రెయిన్ టీవీ, మీడియా కథనాలు చెబుతున్నాయి. లట్స్క్‌లో వైమానిక స్థావరాల పై దాడులు జరిగినట్లు నగర మేయర్ ధృవీకరించారు.

    "ప్రజలందరినీ సురక్షిత స్థలాల్లోకి చేరమని కోరుతూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అలాగే, స్థానికులెవరూ ఫోటోలు, చిరునామాల లాంటి సమాచారాన్ని పోస్ట్ చేయవద్దని కోరారు.

    యుక్రెయిన్ నుంచి 242మంది భారతీయులు శుక్రవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు.

  9. బ్రేకింగ్ న్యూస్, వోల్నోవాకా నగరాన్ని చేజిక్కించుకున్న యుక్రెయిన్ వేర్పాటువాదులు - ఆర్‌ఐఏ వార్తా సంస్థ

    పశ్చిమ యుక్రెయిన్‌లో రష్యన్ దాడులు పెరిగాయి. రష్యాకు మద్దతిస్తున్న యుక్రెయిన్ వేర్పాటువాదులు వోల్నోవాకా నగరాన్ని చేజిక్కించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ చెప్పినట్లు ఆర్‌ఐఏ వార్తా సంస్థ తెలిపింది.

    మరియుపూల్ నగరానికి ఉత్తరంగా ఉన్న ఈ నగరం వ్యూహాత్మకంగా కీలకమైనది.

  10. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు వెళ్ళమని పిలుపునిచ్చిన లట్స్క్ మేయర్

    లట్స్క్ నగరంలో వైమానిక స్థావరాల పై దాడులు జరిగినట్లు నగర మేయర్ ధృవీకరించారు.

    "ప్రజలందరినీ సురక్షిత ప్రదేశాలకు వెళ్ళమని కోరుతూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అలాగే, స్థానికులెవరూ ఫోటోలు, చిరునామాల లాంటి సమాచారాన్ని పోస్ట్ చేయవద్దని కోరారు.

    మరో వైపు వైమానిక స్థావరానికి దగ్గరగా ఉన్న ఒక ప్లాంట్‌లో మంటలు చెలరేగుతున్నట్లు యుక్రెయిన్ ఐసీటీవీ చానెల్ రిపోర్ట్ చేసింది. దినిప్రోలో మూడు పేలుళ్లు చోటు చేసుకున్నట్లు యుక్రెయిన్ మీడియా చెబుతోంది.

    అందులో ఒకటి రెండంతస్తుల షూ ఫ్యాక్టరీ పై జరిగింది. మిగిలిన రెండు పేలుళ్లు కిండర్ గార్డెన్ స్కూల్ దగ్గర, ఒక బహుళ అంతస్తు దగ్గర జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

    దినిప్రో నగరంలో జరిగిన దాడుల్లో ఒక వ్యక్తి మరణించినట్లు యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ (ఎస్ ఈ ఎస్) తెలిపింది.

    ఈ దాడులను రష్యా ధృవీకరించింది.

    పశ్చిమ యుక్రెయిన్ లో బాంబు దాడులు జరిగినట్లు నివేదికలొచ్చాయి. ఇవానో- ఫ్రాంకివిస్క్ నగరంలో పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

    ఈ దాడులను ఇవానో- ఫ్రాంకివిస్క్ నగర మేయర్ ధృవీకరించారు.

  11. వ్యూహాత్మక కేంద్రాల పై దాడి చేస్తున్న రష్యా

    రష్యా జరిపిన పేలుళ్లలో లట్స్క్‌లోని వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్థానికులు తెలిపినట్లు బీబీసీ యుక్రెయిన్ రిపోర్ట్ చేసింది.

    రష్యా ఒక ఫ్యాక్టరీ పై కూడా దాడి చేసినట్లు నివేదికలొచ్చాయి.

    ఈ ఫ్యాక్టరీలో కొన్ని రకాల ఫైటర్ జెట్ ఇంజన్లకు మరమ్మతులు చేస్తారు. ఈ ఫ్యాక్టరీ రష్యా లక్ష్యంగా చేసుకున్న వ్యూహాత్మక కేంద్రాల్లో ఒకటని బీబీసీ యుక్రెయిన్ చెబుతోంది.

  12. పెంపుడు కుక్కను వదలని కేరళ అమ్మాయి

    యుక్రెయిన్ నుంచి చాలామంది భారతీయ విద్యార్థులు తమ పెంపుడు పిల్లులు, కుక్కలను తీసుకొని భారత్‌కు వచ్చారు.

    భారత్‌కు చెందిన 20 ఏళ్ల ఆర్య ఆల్డ్రిన్ కూడా యుక్రెయిన్ నుంచి సైబీరియన్ హస్కీ జాతికి చెందిన తన పెంపుడు కుక్క జైరాను తీసుకొని భారత్‌కు వచ్చారు.

    ''నా హస్కీని అక్కడ వదిలి వస్తే... అప్పుడు నేను స్వార్థంగా ఆలోచించినట్లు అవుతుంది'' అని ఆమె అన్నారు.

    అందుకే వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలోనూ 5 నెలల పెంపుడు కుక్కను వెంట తీసుకొని ఆమె కేరళకు చేరుకున్నారు.

    రొమేనియా సరిహద్దుకు ప్రయాణిస్తోన్న బస్సులో జైరాను భద్రంగా పట్టుకొని కూర్చొన్న ఆర్య ఫొటో వైరల్ కావడంతో ఆమె వార్తల్లో నిలిచారు. పూర్తి కథనం కోసం ఈ లింక్ పై క్లిక్చేయండి.

  13. బ్రేకింగ్ న్యూస్, లట్స్క్, దినిప్రో నగరాల పై తొలిసారి పేలుళ్లు

    యుక్రెయిన్ వాయువ్య దిశలో ఉన్న లట్స్క్, తూర్పు దిశలో ఉన్న దినిప్రో నగరాల పై పేలుళ్లు జరిగినట్లు యుక్రెయిన్ టీవీ, మీడియా కథనాలు చెబుతున్నాయి.

    ఈ రెండు నగరాల్లో పేలుళ్లు జరిగినట్లు నివేదికలొచ్చాయి. ఈ నగరాల పై పేలుళ్లు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.

    ఈ పేలుళ్లు జరగడానికి ముందు యుక్రెయిన్‌లో చాలా నగరాల్లో వైమానిక దాడులను సూచిస్తూ సైరెన్లు వినిపించాయి.

  14. యుక్రెయిన్ నుంచి దిల్లీ చేరిన 242మంది భారతీయులు

    యుక్రెయిన్ నుంచి 242మంది భారతీయులు శుక్రవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. వీరిని పోలండ్ నుంచి తీసుకునివచ్చారు.

    "యుక్రెయిన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన చివరి ప్రయాణికులం మేమే" అని ప్రేరణ అనే విద్యార్థి చెప్పారు. ఆమె గత కొన్ని రోజులుగా సుమీలో చిక్కుకుని, శుక్రవారం ఉదయమే భారత్ చేరుకున్నారు.

    "కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాతే మేము బయటపడగలిగాం. అంతకు ముందు వరకు బాంబు దాడులు జరుగుతున్న శబ్దాలు విపరీతంగా వినిపించేవి. కానీ, మేము భారతీయ రాయబార కార్యాలయం పై నమ్మకం పెట్టుకున్నాం. బస్సులు, రైళ్ల ద్వారా మేము సురక్షితంగా బయటపడేందుకు భారత ప్రభుత్వం సహాయం చేసింది" అని ప్రేరణ చెప్పారు.

  15. వినాశకరమైన సూక్ష్మజీవులను ధ్వంసం చేయమని సూచించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

    యుక్రెయిన్‌లో పరిశోధనల నిమిత్తం పరిశోధనశాలల్లో ఉంచిన వినాశకరమైన సూక్ష్మజీవులను ధ్వంసం చేయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వీటి వ్యాప్తి వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగే అవకాశముందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలియచేశారు.

    యుక్రెయిన్‌లో జంతువులు, మనుషుల్లో వచ్చే కోవిడ్-19 లాంటి ప్రమాదరమైన జబ్బుల గురించి అధ్యయనం చేసే ప్రజారోగ్య పరిశోధనశాలలున్నాయి. గతంలో ఇక్కడ అధ్యయనాలు జరిపేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సహకారం కూడా లభించింది.

    రష్యాకు పశ్చిమ దేశాలకు మధ్య జరుగుతున్న ప్రచారయుద్ధంలో ఈ పరిశోధన శాలలు కేంద్రంగా మారాయి. అమెరికా సహాయంతో యుక్రెయిన్ జీవ, రసాయన కేంద్రాలను నిర్వహిస్తోందని రష్యా ఆరోపిస్తోంది.

    అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనను యుక్రెయిన్ పాటించిందా లేదా, యుక్రెయిన్ పరిశోధనశాలల్లో ఎటువంటి సూక్షజీవులు, విషకారకాలున్నాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు..

  16. "రసాయన ఆయుధాలను ఎక్కడ ప్రయోగిస్తారు?" - జెలియెన్‌స్కీ

    అమెరికా సహాయంతో యుక్రెయిన్ రసాయన, జీవాయుధాలను తయారుచేస్తోందని రష్యా చేస్తున్న ఆరోపణలను యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ తిప్పి కొట్టారు.

    "మేము రసాయన దాడికి సిద్ధమవుతున్నామని ఆరోపించారు" అని జెలియెన్‌స్కీ వీడియో ప్రసంగంలో అన్నారు. "ఇది నాకు చాలా విచారాన్ని కలిగిస్తోంది. రష్యా ఇతరుల పై చేస్తున్న ఆరోపణలను గమనిస్తే, రష్యా చేస్తున్న ప్రణాళికలు తెలుసుకోవచ్చు" అని అన్నారు.

    "రసాయన దాడులకు సిద్ధమవుతున్నామని చేస్తున్న ఈ ఆరోపణలేంటి?" అని ప్రశ్నించారు. "యుక్రెయిన్‌లో అమ్మోనియా, ఫాస్ఫరస్ వాడి రసాయన ఆయుధాలు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారా? మీరు మమ్మల్నింకేమి చేయాలనుకుంటున్నారు?"

    "మా భూభాగం పై రసాయన లేదా సామూహిక వినాశనాన్ని చేకూర్చే ఆయుధాలు తయారవ్వలేదు" అని ఆయన అన్నారు.

    గురువారం ప్రభుత్వ సహాయంతో 40,000 మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు చెప్పారు. దీంతో, గత రెండు రోజుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారి సంఖ్య 100,000కు చేరిందని అన్నారు.

    దాడులను ఎదుర్కొంటున్న నగరాల్లో ప్రజలకు యుక్రెయిన్ సేనలు అత్యవసర సహాయం, ఆహారం, ఔషధాలు సరఫరా చేశాయని తెలిపారు. మరియుపూల్, వోల్నోవఖా నగరాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు.

  17. యుక్రెయిన్ సంక్షోభం: కీయెవ్‌ను చేజిక్కించుకునే దిశగా రష్యా సేనలు

    యుక్రెయిన్‌ను చేజిక్కించుకునేందుకు రష్యన్ సేనలు రాజధాని కీయెవ్ వైపు కదులుతున్నట్లు తెలిపే శాటిలైట్ చిత్రాలు కనిపించాయి.

    ఈ చర్య రష్యా యుక్రెయిన్ రాజధానిని చేజిక్కించుకునే ప్రయత్నాల పునరుద్ధరణకు సంకేతం పలుకుతోంది.

    అంతకు ముందు ఆంటోనోవ్ ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపించిన రష్యన్ కాన్వాయ్ ప్రస్తుతం కీయెవ్ పరిసర ప్రాంతాలకు చేరినట్లు మక్సర్ టెక్నాలజీస్ చెబుతోంది.

    రష్యన్ సేనలు యుద్ధ సామాగ్రిని లుబియాంకా చుట్టు పక్కల ప్రాంతాల్లో సిద్ధం చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోందని మక్సర్ చెబుతోంది.

    గత 24 గంటల్లో రష్యన్ సేనలు కీయెవ్‌కు 5 కిలోమీటర్ల దగ్గరకు చేరినట్లు ఒక సీనియర్ యూఎస్ డిఫెన్స్ అధికారి తెలిపారు.

  18. యుక్రెయిన్‌, రష్యా సంక్షోభం 16వ రోజుకు చేరుకుంది.

    మరియుపూల్‌లో కనీసం 1,207 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ నగర డిప్యూటీ మేయర్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరం బయట ఉన్న స్మశాన వాటికలను చేరుకోవడం కష్టం కాబట్టి, 47 మందికి సామూహిక ఖననం నిర్వహించినట్లు సెర్గి ఓర్లోవ్ తెలిపారు.

    మరియుపూల్ నగరంలోని ఇళ్లపై మళ్లీ బాంబులు పడుతున్నాయని సిటీ కౌన్సిల్ టెలిగ్రాంలో తెలిపింది.

    యుక్రెయిన్ పౌరులు తమ దేశం కోసం అవిరామంగా పోరాడుతున్నారని, ముఖ్యమైన ప్రాంతాల్లో రష్యన్ సైన్యాన్ని తిప్పికొడుతున్నారని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ చెప్పారు.

    ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.