You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కమలా హారిస్: 'మా ఊరి బిడ్డ అమెరికాలో చరిత్ర సృష్టించింది'

అధ్యక్షుడిగా జో బైడెన్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలిగా వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్న కమలా హారిస్ తల్లిగారి ఊరు తమిళనాడులోని ఓ చిన్న పల్లె. ఆమె గెలిచారని తెలియగానే ఆదివారం తెల్లవారుజామున ఆ ఊరిలో పండుగ వాతావరణం కనిపించింది. కమలాకు శుభాకాంక్షలు తెలిపే రంగవల్లులు, ఆలయాల్లో పూజలతో ఆ ఊరంతా సందడే సందడి.

లైవ్ కవరేజీ

  1. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రోజు ఏం చేశారు?

    నేను గత నాలుగేళ్ళుగా డోనల్డ్ ట్రంప్‌ను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను. మంచి - చెడు కాలాల్లో ఆయనతోనే ఉన్నాను. కానీ, నవంబర్ 7న ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన రోజు లాంటిది నేను అంతకు ముందెప్పుడూ చూడలేదు.

    బ్లాక్ జాకెట్, డార్క్ ట్రౌజర్, తెల్ల 'మాగా' (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) టోపీ ధరించిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఉదయం 10 గంటల కంటే కొన్ని నిమిషాల ముందు వైట్ హౌస్ నుంచి బయటికొచ్చారు. అంతకు ముందు వరకూ ఆయన 'ఎన్నికల్లో మోసాలు జరిగాయని' ట్వీట్లు చేస్తూనే గడిపారు.

    ఇప్పుడు, ఆయన గాలి నెడుతున్నట్టుగా కాస్త ముందుకు వాలి నడుస్తున్నారు. ఒక నల్లటి కారులో ఎక్కిన ట్రంప్ వర్జీనియా, స్టెర్లింగ్‌లోని ట్రంప్ నేషనల్‌లో తన గోల్ఫ్ క్లబ్‌కు బయల్దేరారు. అది వైట్‌హౌస్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సమయంలో గాలి తనకు అనుకూలంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. అదొక అందమైన రోజు, గోల్ఫ్ ఆడ్డానికి చక్కటి రోజు. ఈ రోజును ఆయన క్లబ్‌లో గడపబోతున్నారు.

    కానీ, ఆయన కోసం పనిచేసేవారు కాస్త అంటీముట్టనట్లు ఉండడం కనిపించింది. జూనియర్ సిబ్బందిలో ఒకరిని నేను 'ఎలా ఉన్నారు' అని అడిగాను. ఆమె 'బాగున్నా' అన్నారు. చిన్నగా నవ్వి, చూపులు తిప్పుకున్నారు. తన పోన్ చూసుకుంటున్నారు.

  2. 'కమలా హారిస్ మా ఊరి బిడ్డ'

    అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణ చోటు చేసుకుంది. తమిళనాడులోని తులసేంద్రపురంలో కమలా హారిస్ తాతగారు జన్మించారు. ఎక్కువగా రైతులు, రైతు కూలీలే ఉన్న ఆ ఊరి జనాభా 8 వేలు. ఆ ఊరిలో ఆదివారం తెల్లవారగానే సందడి మొదలైంది.

    జో బైడెన్, కమలా హారిస్ గెలిచారనే వార్త రాగానే ఆ గ్రామ ప్రజలు అక్కడి గుడిలో పూజలు జరిపారు. స్వీట్లు పంచి పెట్టారు. బాణసంచా కాల్చారు. కొంతమంది మహిళలు కమలా హారిస్‌ను అభినందిస్తూ తమ వాకిళ్ళలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. యువతీ యువకులు ఎంతో గర్వంగా ఆమె పోస్టర్లు ప్రదర్శించారు. వాళ్లందరి కళ్లలో విజయోత్సాహం. ఉదయం గుడిలో పూజకు గంట మోగగానే మహిళలు గుంపులు గుంపులుగా వెళ్లి పూజలు చేశారు. కమలా హారిస్ పూర్వీకుల కుటుంబ దైవానికి ప్రసాదాలు సమర్పించారు.

    చుట్టుపక్కల ఉన్న దాదాపు 120 గ్రామాల ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు ఆలయ పూజలకు హాజరయ్యారు. ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత కమల తమ ఊరిని చూడడానికి వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఆ ఆలయ నవీకరణకు ఆమె తాతగారు విరాళాలు ఇచ్చిన సంగతిని కొందరు గుర్తు చేశారు.

    తులసేంద్రపురం కౌన్సిలర్ అరుల్ మోళి సుధాకర్ భారత్, అమెరికా రాజకీయాలలో మహిళల పాత్ర గురించి మాట్లాడారు. “భారతదేశంలో ఇందిరా గాంధీ, జయలలిత వంటి మహిళా నేతలు ఉండేవారు. ఇప్పుడు భారత సంతతికి చెందిన ఒక మహిళ అమెరికాలో చరిత్ర సృష్టించారు. అది మాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది” అని ఆయన అన్నారు.

    “ఒక మహిళా నాయకురాలిగా నేను ఈ భారత కుగ్రామంలో ఉన్నప్పటికీ, మహిళలు ఈ రంగంలో పైకి రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. మా ఊరి బిడ్డ ఇప్పుడు అమెరికా చరిత్రను తిరగరాశారు” అని ఆమె అన్నారు.

    తమిళనాడు రాష్ట్ర మంత్రి ఆర్. కామరాజ్ కూడా తులసేంద్రపురంలో పూజలు నిర్వహించారు. 'ఈ చిన్న పల్లెటూరుకు చెందిన ఒక మహిళ అమెరికాలో అంతటి ఉన్నత స్థానానికి చేరుకోవడం మాకు గర్వకారణం' అని ఆయన అన్నారని ఏఎన్ఐ తెలిపింది.

  3. అమెరికా అధ్యక్ష ఎన్నికల మ్యాప్

  4. ‘మన ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం ఆపండి’ - జో బైడెన్

    దేశ ప్రజలు తీర్పు చెప్పారు. మనకు స్పష్టమైన విజయం కట్టబెట్టారు. ఇది మన విజయం. ప్రజల విజయం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకూ అత్యధిక ఓట్లతో - 74 మిలియన్ ఓట్లతో నన్ను గెలిపించారు.

    మీరు నాపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి నేను వినమ్రుడ్ని. నేను విభజించే అధ్యక్షుడిగా ఉండబోను. సమైక్యం చేసే అధ్యక్షుడిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.నేను రెడ్ స్టేట్స్ (రిపబ్లికన్స్ ఆధిక్యం సాధించిన రాష్ట్రాలు), బ్లూ స్టేట్స్ (డెమొక్రాట్లు ఆధిక్యం సాధించిన రాష్ట్రాలు) అని చూడను. నేను చూసేది యునైటెడ్ స్టేట్స్ మాత్రమే. మీ అందరి విశ్వాసాన్ని గెలిచేందుకు నా మనసారా పనిచేస్తాను.

    అమెరికా అంటేనే ప్రజలు. అమెరికా ఆత్మను తిరిగితెచ్చేందుకు పాటుపడతాను. ఈ దేశం వెన్నెముక.. మధ్యతరగతిని పునర్నిర్మించేందుకు పాటుపడతాను. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తిరిగి గౌరవాన్ని పొందేలా, ఇక్కడ మనమంతా తిరిగి ఏకం అయ్యేలా కష్టపడతాను.

    అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కొంత వెనుకబడినప్పుడు.. నా ప్రచారాన్ని గాడిలో పెట్టిన ఆఫ్రికన్-అమెరికన్ ఓటర్లకు కృతజ్ఞతలు.

    (ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ..) మనం ఒకరికొకరం ఒక అవకాశం ఇచ్చుకుందాం. కఠినమైన వాక్‌చాతుర్యాన్ని వదిలేయడానికి, వేడి తగ్గించడానికి ఇదే సమయం. మళ్లీ ఒకరినొకరం చూసుకుని, ఒకరు చెప్పేది మరొకరు వినేందుకు ఇదే సమయం. మన ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం ఆపండి.

    ప్రతిదానికీ ఒక టైం ఉంటుంది. అమెరికాను నయం చేసే టైం ఇది.

    నాకు ఓటేసిన వాళ్ల కోసం ఎంత బాగా కష్టపడతానో.. ఓటు వేయని వాళ్ల కోసం కూడా అంతేబాగా కష్టపడతాను.

    మనం ఎలాంటి దేశం కాగలమని మనకు తెలుసో అలాంటి దేశంగా మారదాం. అది.. ఐక్యమైన, బలోపేతమైన, నయమైన దేశం.

    మనం ప్రయత్నించి సాధించలేనిది ఏదీ లేదు.

  5. ఈ పదవిలో నేను తొలి మహిళను కావచ్చు కానీ.. చివరి మహిళను కాదు: కమలా హారిస్

    ‘‘ఈ పదవిలో నేను తొలి మహిళను కావచ్చు.. చివరి మహిళను మాత్రం కాదు’’ అని అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ కమలా హారిస్ పేర్కొన్నారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ గెలుపు నేపథ్యంలో డెలవేర్‌ రాష్ట్రంలోని విల్మింగ్టన్‌లో జో బైడెన్, కమలా హారిస్‌లు స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కమలా హారిస్ మొదటిగా వేదిక మీదకు వచ్చి ఆ హోదాలో తొలిసారి ప్రసంగించారు.

    ‘‘అమెరికాలో ఇటువంటి విజయం సాధ్యమవుతుందని నా తల్లి చాలా బలంగా విశ్వసించారు. నల్లజాతి, ఆసియన్, శ్వేతజాతి, లాటినా, నేటివ్ మహిళల తరాలు ఈ చారిత్రక ఘట్టానికి మార్గంపరిచారు. మన ప్రజాస్వామ్యానికి వారు వెన్నెముక. వందేళ్ల కిందట 19వ రాజ్యాంగ సవరణ కోసం ఈ మహిళలు పోరాడారు. 55 సంవత్సరాల కిందట ఓటు హక్కు చట్టం కోసం పోరాడారు. ఇప్పుడు 2020లో తర్వాతి తరం మహిళలు తమ ఓట్లు వేశారు. వారి పోరాటం, వారి దృఢచిత్తం, వారి శక్తి, వారి ముందుచూపును నేను ఈ రాత్రి మననం చేసుకుంటున్నాను. వారి భుజాల మీద నేను నిలుచున్నాను’’ అని ఆమె చెప్పారు.

    ‘‘మీరు ఆశను, ఐకమత్యాన్ని, సభ్యతను, సైన్సును, సత్యాన్ని ఎంచుకున్నారు. అమెరికా తర్వాతి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎంచుకున్నారు. ప్రజాస్వామ్యం అనేది ఒక స్థితి కాదు.. అది ఒక క్రియ’ అని కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ ఒకప్పుడు చెప్పారు. ఆయన మాటలకు అర్థం.. అమెరికా ప్రజాస్వామ్యం అనేది దాని కోసం పోరాడటానికి మనం ఎంత దృఢచిత్తంతో ఉంటామో అంత బలంగా ఉంటుందని’’ అని కమల పేర్కొన్నారు.

    ‘‘మెరుగైన భవిష్యత్తును నిర్మించే శక్తి మనకు, ప్రజలకు ఉంది. అమెరికాలో కొత్త ఉదయానికి మీరు నాంది పలికారు’’ అని ఆమె ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

  6. బైడెన్, కమలా హ్యారిస్‌లకు సోనియా అభినందనలు

    అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక ప్రకటన విడుదలచేశారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సెనేటర్ కమలా హారిస్‌కు కూడా సోనియా అభినందనలు తెలిపారు.

    ఈ ఇరువురు నేతల సమర్థ నాయకత్వంలో భారత-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని, అది ఆసియా ప్రాంతంలోనే కాకుండా ప్రపంచమంతా శాంతికి, అభివృద్ధికి బాటలు వేస్తుందని సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు.

  7. బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

    'బైడెన్.. మీరు సాధించిన అద్భత విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యక్షుడిగా మీరు భారత్-అమెరికా సంబంధాలను బలపరచడంలో చేసిన కృషి ఎంతో విలువైనది' అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

    రెండు దేశాల సంబంధాలు మరింత ఎత్తుకు ఎదిగేలా మీతో కలిసి కృషి చేయాలని ఆశిస్తున్నాను అని మోదీ అన్నారు.

  8. దేశ ప్రజలను ఉద్దేశించి బైడెన్ ప్రసంగం

    అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు డెలవేర్, విల్మింగ్‌టన్‌లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించనున్నారు.

    ఆయనతోపాటూ ఆయన భార్య జిల్ బైడెన్ కూడా ఉంటారని పార్టీ నేతలు ప్రకటించారు.

    ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా తన భర్తతోపాటూ అక్కడ ఉంటారు. కానీ ఆమె ప్రసంగిస్తారా, లేదా అనేది తెలీడం లేదు.

  9. 'మనం సాధించాం జో': కమలా హ్యారిస్

    'మనం సాధించాం జో.'

    డోనల్డ్ ట్రంప్‌పై సాధించిన విజయానికి జో బైడెన్‌తో మాట్లాడుతూ కమలా హ్యారిస్ అన్న మాట ఇది.

  10. బైడెన్ విజయంతో అమెరికన్ల సంబరాలు

    జో బైడెన్ విజయం సాధించడంతో అమెరికా అంతటా ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

  11. సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత ప్రపంచమంతా వ్యాపించిన వార్త

    జో బైడెన్ గెలిచారనే వార్త దాదాపు ప్రపంచం నలుమూలలా వ్యాపించింది.

    ఆయన గెలిచారని అమెరికా మీడియా సంస్థలు చెప్పగానే, ట్విటర్ పుణ్యమా అని ఆ వార్త ప్రపంచమంతటా ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నవారికి చేరింది.

    చైనా దేశ అధికార మీడియా 'పీపుల్స్ డెయిలీ' నుంచి బ్రెజిల్ 'ఫోల్హా డీ సావ్ పాలో' వార్తా పత్రిక వరకూ 'కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్' అని చెబుతూ పతాక శీర్షికలు పెట్టేశాయి.

    అమెరికా ఎన్నికలు అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆసక్తి ఉంటుంది.

    కానీ, ఈ ఏడాది ఈ ఫలితంతో డోనల్డ్ ట్రంప్‌ను 1990 తర్వాత ఒకే విడత అమెరికా అధ్యక్షుడైన నేత కావడమనేది ప్రపంచమంతటా ఆసక్తి కలిగించింది.

  12. విజేత ఎవరో తెలిసిన తరువాత ఏం జరుగుతుంది?

    ఎన్నికల ఫలితాలు వెలువడి విజేత ఎవరో తేలిపోయిన తరువతా సాధారణంగా ఓడిపోయిన అభ్యర్థి దీనిని అంగీకరించాలి.

    కానీ, ట్రంప్ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తానని చెబుతున్నారు. పెన్సిల్వేనియా ఫలితాలకు స్పందనగా ఆయన లాయర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలు అప్పుడే ముగియలేదు. నాలుగు రాష్ట్రాల్లో జో బైడెన్ గెలిచారనే తప్పుడు వాదనలు ముగింపునకు చాల దూరంగా ఉన్నాయని అన్నారు.

    జార్జియాలో రీకౌంటింగ్ జరుగుతోంది. అక్కడ మార్జిన్ చాలా టైట్‌గా ఉంది. ట్రంప్ విస్కాన్సిన్‌లో కూడా అదే కోరుకుంటున్నారు. ఆయన సుప్రీంకోర్టులో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పారు.

    ఆధారాలు లేకుండానే ఓటింగ్‌లో మోసాలు జరిగాయంటున్నారు. ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తే, రాష్ట్రాల కోర్టుల్లో దానిని సవాలు చేయడానికి న్యాయ బృందాలు అవసరం అవుతాయి. అప్పుడు, రాష్ట్ర జడ్జిలు సవాలును సమర్థించి ఓట్లు తిరిగి లెక్కించాలని ఆదేశించాల్సి ఉంటుంది.

    అప్పుడు తీర్పును రద్దు చేయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అడగవచ్చు. ఇటు, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు లెక్కించడం కొనసాగుతుంది. చివరగా ధ్రువీకరించేవరకూ ఫలితాలను వెల్లడించరు.

    ఎన్నికల తర్వాత ప్రతి రాష్ట్రంలో కొన్ని వారాల పాటు అదే జరుగుతుంది.

  13. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు.

    బైడెన్‌కు 273 ఎలక్టోరల్ ఓట్లు రావడం ఖాయమని బీబీసీ అంచనా వేసింది. అంటే, ఎలాంటి చట్టపరమైన వివాదాలు అడ్డురాకపోతే బైడెన్ వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్ష పీఠాన్ని అలంకరిస్తారు.

    పెన్సిల్వేనియా ఫలితాలతో బైడెన్ అధ్యక్ష ఎన్నిక ఖరారైపోయింది.

    సుదీర్ఘ నిరీక్షణ తరువాత వెలువడిన ఈ ఫలితాలలో బైడెన్ విజయం కోసం కావలసిన 270 ఎలక్టోరల్ కాలేజి ఓట్ల మార్క్‌ను దాటేశారు.

  14. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఎవరు ముందంజలో ఉన్నారు...

    ఎన్నికల ఫలితాలను ఖరారు చేసే కీలక రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.

    ఇప్పటివరకు బైడెన్ 253 ఎలక్టోరల్ కాలేజి ఓట్లను గెలుచుకున్నారు. ట్రంప్ 214 ఓట్లను దక్కించుకున్నారు. అధ్యక్ష పదవి దక్కించుకోవాలంటే 270 స్థానాలు గెల్చుకోవాలి.

    బైడెన్ కనుక 20 ఎలక్టోరల్ కాలేజి ఓట్లున్న పెన్సిల్వేనియాను గెల్చుకుంటే ఆయనే తదుపరి అమెరికా అధ్యక్షుడు అవుతారు. ఈ రాష్ట్రంలో ఆయన దాదాపు 30,000 ఓట్ల ఆధిక్యంతో న్నారు.

    జార్జియాలో బైడెన్ స్వల్ప ఆధిక్యంతో ఉన్నారు. అక్కడ ఓట్ల లెక్కింపు మళ్లీ జరుగుతుంది. ఇవే కాకుండా ఆరిజోనా, నెవాడా రాష్ట్రాల్లో కూడా బైడెన్ ఆధిక్యమే కొనసాగుతోంది.

    ట్రంప్ 2016లో గెల్చుకున్న మిషిగన్, విస్కాన్సిన్ రాష్ట్రాలలో ఈసారి బైడెన్ గెలుస్తారని భావిస్తున్నారు.

    ఇక నువ్వానేనా అన్నట్లున్న ఫ్లోరిడా, ఒహాయో, టెక్సస్, అయోవా రాష్ట్రాలలో ట్రంప్ గెలుస్తారనే అంచనాలు వినిపించాయి. నార్త్ కరోలినా, అలాస్కాలలో ట్రంప్ ముందంజలో ఉన్నారు.

  15. బీబీసీకి అమెరికా ఎన్నికల గణాంకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

    అమెరికా ఎన్నికల గురించి వివిధ వెబ్ సైట్లు రకరకాల సమాచారం ఉపయోగిస్తున్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేదానిపై రకరకాల అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదంతా కాస్త గందరగోళానికి కూడా గురిచేస్తోంది.

    బీబీసీకి రాయిటర్స్ నుంచి ఎడిసన్ రీసెర్చ్ సంస్థ ద్వారా ఎన్నికల గణాంకాలు అందుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మీద క్షేత్రస్థాయిలో పనిచేసిన ఈ సంస్థ జాతీయ ఎన్నికల్లో అమెరికా టీవీ నెట్‌వర్కులతో కలిసి పనిచేసింది.

    కొన్ని వెబ్‌సైట్లు బైడెన్ గెలిచారని ఎందుకు చెబుతున్నాయి?

    నిన్న 'డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ' అనే మరో ఎన్నికల విశ్లేషణ గ్రూప్, పెన్సిల్వేనియాలో బైడెన్ విజయం సాధించారని చెబుతూ, అద్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచారని ప్రకటించింది. దాంతో దాని ద్వారా ఎన్నికల సమాచారం పొందే వాక్స్, బిజినెస్ ఇన్‌సైడర్ లాంటివి అదే వార్తను చెప్పాయి.

    ఈలోపు, అసోసియేటెడ్ ప్రెస్, ఫాక్స్ న్యూస్ లాంటి మిగతా సంస్థలు ఆరిజోనాలో ఆల్రెడీ బైడెన్ విజయం సాధించారని చెప్పాయి.దాంతో బైడెన్ ఎలక్టోరల్ ఓట్ల మొత్తం సంఖ్య బీబీసీ చెబుతున్న 253కు బదులు 264కు పెరిగింది.

    ఆరిజోనా, పెన్సిల్వేనియా విజేత ఎవరనేది బీబీసీ ఇంకా చెప్పలేదు. ఎందుకంటే అది తొందరపాటే అవుతుందని మేం భావించాం.

  16. జార్జియాలో పెరుగుతున్న బైడెన్ ఆధిక్యం

    హోరాహోరీ పోరుకు వేదిక అయిన జార్జియా... బైడెన్ సొంతం అయ్యేలా కనిపిస్తోంది.

    రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆయన ఆధిక్యం పెరుగుతోంది.

    99 శాతం ఓట్లు లెక్కించగా బైడెన్ 4 వేల ఓట్లకు పైగా ఆధిక్యం సాధించారు.

    ప్రస్తుతం ఈ డెమొక్రటిక్ నేత 7,248 ఓట్లతో ముందంజలో ఉన్నట్టు బీబీసీ గణాంకాలు చెబుతున్నాయి.

    16 ఎలక్టోరల్ ఓట్లున్న జార్జియా రిపబ్లికన్లకు కంచుకోటగా నిలిచింది.

    1992 నుంచి దీనిని డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి గెలుచుకోలేదు.

  17. బైడెన్ నివాసంపై విమాన రాకపోకల ఆంక్షల కొనసాగింపు

    డెలావేర్, విల్మింగ్టన్‌లోని జో బైడెన్ నివాసం మీదుగా విమానాల రాకపోకలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను పొడిగించారు.

    బైడెన్ డెమొక్రటికి నామినీగా ఎంపికైన వెంటనే సీక్రెట్ సర్వీస్ విజ్ఞాపన మేరకు ఆయన ఇంటి నుంచి ఒక మైలు వ్యాసంలో విమానాలు తిరగకుండా నిషేధం విధించారు.

    అయితే, నవంబర్ 4ననిషిద్ధ ప్రాంత పరిధిని మూడు మైళ్లకు పెంచారు. ఆ ఆదేశాలను నవంబర్ 11 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం నాడు ఆదేశాలు వెలువడ్డాయి.

    ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారికి లక్ష డాలర్ల జరిమానా లేదా 12 నెలల జైలు శిక్ష విధిస్తారు. దానితో పాటు పైలట్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు. శాశ్వతంగా రద్దు కూడా చేయవచ్చు.

    ఉన్నత స్థాయి రాజకీయ నేతల భధ్రత విషయంలో ఈ తరహా ఆంక్షలు మామూలే. దీన్ని ఎన్నికల తుది ఫలితాలకు సంకేతంగా చూడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.

    అయితే, అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తికి కల్పించే భద్రతా ప్రమాణాలు మరింత విస్తృతంగా ఉంటాయి. బైడెన్ కనుక అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆయనకు వెంటనే విస్తృత స్థాయి భద్రత కల్పిస్తారు.

  18. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచండి: బైడెన్

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నట్లు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చెప్పారు.

    శుక్రవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) ఆయన జాతినుద్దేశించి మాట్లాడుతూ.. అధ్యక్షుడిగా గెలిస్తే తన ప్రాధాన్యాలేమిటో చెప్పారు.

    7.4 కోట్ల మంది ఓటర్ల మద్దతుతో తాను, తమ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధిస్తామని.. కరోనావైరస్, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, జాతుల సమస్య వంటి అన్నిటికీ పరిష్కారాలు చూపుతామని అన్నారాయన.

    ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచాలని.. ప్రజలు సహనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

  19. రాత్రి 8 తరువాత వచ్చిన బ్యాలట్లను విడిగా లెక్కించండి: సుప్రీంకోర్టు

    ఎన్నికలు జరిగిన రోజు రాత్రి స్థానిక సమయం 8.00 గంటల తరువాత వచ్చిన బ్యాలెట్ పత్రాలను విడిగా ఉంచి లెక్కించాలని పెన్సిల్వేనియా సుప్రీం కోర్టు జస్టిస్ శామ్యూల్ అలిటో తీర్పు ఇచ్చారు.

    పెన్సిల్వేనియాలో ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించకూడదంటూ రిపబ్లికన్ పార్టీ దావా వేసింది. కానీ అది కోర్టులో వీగిపోయింది.

    రాష్ట్ర అధికారులు ముందుగా నిర్ణయించినట్లుగానే..నవంబర్ 3 అని ముద్ర ఉండి, ఆలస్యంగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలను విడిగా లెక్కించాలని కోర్టు ఆదేశించింది. పెన్సిల్వేనియాలో పోటీ హోరాహోరీగా సాగుతోంది.

    ఇక్కడ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ప్రారంభంలో ముందంజలో ఉన్న ట్రంప్..పోస్టు ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించడం మొదలుపెట్టాక వెనుకబడిపోయారు. ప్రస్తుతం 22,000 ఓట్ల మెజారిటీతో బైడెన్ ముందంజలో ఉన్నారు.

  20. ఎన్నికల ఫలితాలు టై అయితే ఏమవుతుంది

    అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర జనాభాను బట్టి ఒక్కో రాష్ట్రానికీ నిర్ధారిత సంఖ్యలో ఎలక్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    అభ్యర్థులు ఇద్దరికీ చెరి 269 ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే, అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ.

    ఏ అభ్యర్థికీ మెజారిటీ ఎలక్టోరల్ ఓట్లు రాకపోతే, అప్పుడు నిర్ణయం అమెరికా కాంగ్రెస్ దగ్గరికి చేరుతుంది. ఆ బాధ్యత 2020 ఎన్నికల్లో ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులకు మాత్రమే ఉంటుంది.

    అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఓటు వేస్తారు. ఒక్కో రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు మాత్రమే ఉంటుంది. అంటే, 50 ఓట్లలో సగానికి పైగా, 26 ఓట్లు సాధించిన అభ్యర్థి దేశాధ్యక్షుడు అవుతాడు.

    మొత్తం వంద మంది సెనేటర్లు ఓటు వేసి ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు.