బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై స్పందిస్తూ నిర్మల సీతారామన్, 'ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్లుంది' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆర్థిక మంత్రి పతనాన్ని సూచిస్తున్నాయన్న కేటీఆర్.
పృథ్వి రాజ్
ధన్యవాదాలు.
మహారాష్ట్రలో శివసేన పార్టీ ఎన్నికల గుర్తు బాణాన్ని అటు ఉద్ధవ్ థాకరే ఇటు ఏక్ నాధ్ షిండే రెండు వర్గాలు అంధేరి ఉపఎన్నికలో ఉపయోగించేందుకు లేదని ఎన్నికల కమిషన్ శనివారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబరు 10 కల్లా తాము ఏ ఎన్నికల గుర్తును ఉపయోగించాలనుకుంటున్నారో కూడా వెల్లడించాలని ఆయా వర్గాలకు కమిషన్ సూచించింది.
ఈ ఉపఎన్నికలో ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తుల్లో ఏదో ఒక గుర్తును ఈ వర్గాలు ఎంచుకోవాల్సి ఉంది.
తంత్రాన్ని నమ్మి తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చారని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.
ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.
"నిధులు, నీరు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయింది. తాంత్రికులు, న్యూమరాలజిస్టులు చెప్పిన మాటలు విని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్ కు కూడా వెళ్లలేదు. మహిళలను క్యాబినెట్ లో పెట్టుకుంటే మేలు జరగదు అనే నమ్మకంతో చాలా కాలం వరకు మహిళలను కూడా క్యాబినెట్ లో చేర్చుకోలేదు. ప్రస్తుతం పార్టీ పేరును కూడా తాంత్రికుల మాట వినే మార్చారు" అని అన్నారు.
"తెలంగాణకు మేలు చేయని ముఖ్యమంత్రి దేశానికి ఎంత వరకు చేస్తారనేది అనుమానాస్పదంగా ఉంది"
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తాంత్రికుల మాట వినే టి ఆర్ ఎస్ పార్టీ పేరును మార్చిందని అన్నారు.
నిర్మల సీతారామన్ వ్యాఖ్యలకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
"రూపాయి విలువ మాత్రమే పడిపోయింది అనుకున్నాను. ఆర్ధిక మంత్రి అంత కంటే పతనం అవుతున్నట్లుగా ఉంది. ఏమిటీ పతనం?
"ఇవన్నీ జుమ్లానోమిక్స్ వినాశకర దుష్ప్రభావాలు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
"నేను జన్మాష్టమి నాడు పుట్టాను. దేముడు నన్ను ప్రత్యేక కార్యం కోసం పంపించారు" అని ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన గుజరాత్‌లోని వడోదరలో జరిగిన త్రిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు.
"నన్ను కంసుని వారసులను నాశనం చేసేందుకే దేముడు నన్ను పుట్టించాడు" అని అన్నారు.
ఆయన బీజేపీ పేరు తీసుకోకుండానే, "నా పై పోస్టర్లు పెట్టినవారు నన్ను ద్వేషిస్తారు. వీళ్ళు ద్వేషంతో కళ్ళు కనిపించకుండా పోయి భగవంతుడిని కూడా అవమానిస్తున్నారు" అని అన్నారు.
"నేనొక ఆధ్యాత్మిక వ్యక్తిని. నా పై అపారమైన హనుమంతుని దయ ఉంది. దుష్ట శక్తులన్నీ నా పై కక్ష కట్టాయి. వీళ్లంతా భగవంతుడు, భక్తులను కూడా అవమానిస్తారు" అని అన్నారు.
గుజరాత్ లోని సూరత్, రాజ్‌కోట్‌లో అరవింద్ కేజ్రీవాల్ ముస్లిం టోపీలు ధరించినట్లు పోస్టర్లు పెట్టారు.
ఈ పోస్టర్ల పై హిందూ వ్యతిరేక నినాదాలు రాశారు. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, కృష్ణుడిని దేముళ్ళుగా గుర్తించను అని కేజ్రీవాల్ అన్నట్లుగారాశారు.
గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ఓ భారత్ కంపెనీ తయారుచేసిన నాలుగు దగ్గు మందులతో సంబంధం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.
అయితే, ఈ ఔషధానికి కేవలం ఎగుమతి చేసేందుకు మాత్రమే లైసెన్స్ ఉందని స్టాండింగ్ నేషనల్ కమిటీ వైస్ చైర్మన్డాక్టర్ వై కే గుప్త చెప్పారు. ఈ విషయం ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.
https://twitter.com/ANI/status/1578641909723332609
"భారతదేశంలో ఉత్పత్తి చేసిన ఔషధాల నాణ్యతకు అంతర్జాతీయ మార్కెట్ లో పేరుంది. ఒక ఘటన ఆధారంగా భారతీయ ఔషధాల నాణ్యతను ప్రశ్నించడం సరైంది కాదు. భారతదేశంలో ఔషధ నియంత్రణ సంస్థ బలమైన సంస్థ. ఇటువంటి లోపాలను సహించే విధానం లేదు" అని అన్నారు.
గాంబియాలో జులైలో మొదటి మరణం చోటు చేసుకుంది. కానీ, సెప్టెంబరు 29 వరకు ఔషధ నియంత్రణ సంస్థకు దీని గురించి సమాచారం అందించలేదు. భారత ప్రభుత్వం ఈ మరణాలకు సంబంధించిన నివేదికను అందుకుంది. పరీక్షించిన మొత్తం 23 నమూనాలలో నాలుగు శాంపిళ్ళలో డైఇథైలీన్ గ్లైకాల్ ఉన్నట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని అన్నారు.
దేశంలో విద్వేషాలను రగుల్చుతున్న వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన భారత్ జోడో యాత్రలో భాగంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన యాత్ర కర్ణాటకలో సాగుతోంది.
"విద్వేషాలను ఎవరు ప్రచారం చేస్తున్నారు, వారే మతానికి చెందిన వారనేది ముఖ్యం కాదు. విద్వేషాలు రగిల్చి హింసకు పాల్పడటం దేశవిద్రోహ చర్య. అటువంటి వారికి వ్యతిరేకంగా మేము పోరాడతాం" అని రాహుల్ గాంధీ అన్నారు.
"భారతదేశం వివిధ రాష్ట్రాల సమాఖ్య. దేశంలో అన్ని భాషలు, సంస్కృతులు, రాష్ట్రాలకు సమాన స్థాయి దక్కాలి. అదే మన దేశ స్వభావం" అని అన్నారు.
"నేనెప్పుడూ కొన్ని విశ్వాసాలకు కట్టుబడ్డాను. ఇది బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ను ఇబ్బంది పెడుతుంది. నేను నిజాయితీ లేని మనిషినని చిత్రించడానికి కొన్ని వేల కోట్ల డబ్బును, శక్తిని ఖర్చు పెట్టారు. వాళ్ళు ఆర్ధికంగా బలంగా ఉండటంతో ఈ ప్రచారం కొనసాగుతోంది" అంటూ పాలక పార్టీని విమర్శించారు.
భారత జోడో యాత్ర ప్రస్తుతం 31వ రోజుకు చేరుకుంది.
ప్రేమించటం లేదనే అక్కసుతో ఓ యువతిని ఓ యువకుడు నడి రోడ్డు మీద గొంతుకోసి హత్య చేసిన దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో జరిగింది.
దిగ్భ్రాంతికరమైన ఈ దారుణం.. శనివారం ఉదయం కాకినాడ రూరల్ మండలం కూరాడు వద్ద చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూరాడ గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ అనే యువకుడు ఈ ఘోరానికి ఒడిగట్టాడు.
అతడు కొంతకాలంగా.. తనను ప్రేమించాలంటూ ఓ యువతి వెంటపడుతున్నాడు. శనివారం కూరాడు, కాండ్రేగుల గ్రామాల మధ్య దారికాసి, స్కూటర్ మీద వస్తున్న ఆ యువతిని అటకాయించి ఆమె గొంతు కోశాడు.
కొనఊపిరితో పడి ఉన్న ఆ యువతిని చూసినవారు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేసరికి ఆమె చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, అతడిని చెట్టుకి కట్టేసి చితకబాదారు.
పెదపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృగాడిని అదుపులో తీసుకున్నారు.
హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం మినహా ఇతర మతాల్లోకి మారిన దళితలకు షెడ్యూల్డు కులాల హోదా ఇవ్వవచ్చా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ ఈ కమిషన్‌కు నేతృత్వం వహిస్తారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీంద్ర కుమార్ జైన్, యూజీసీ సభ్యురాలు, ప్రొఫెసర్ సుష్మా యాదవ్‌లు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు.
ఈ కమిషన్ రెండు సంవత్సరాల్లో తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
ప్రధానంగా ఇస్లాం, క్రైస్తవ మతాలకు మారిన షెడ్యూల్డు కులాలకు చెందిన వారి సామాజిక, ఆర్థిక, విద్యా స్థాయిలను ఈ కమిషన్ అధ్యయనం చేస్తుంది.
రాజ్యాంగంలోని షెడ్యూల్డు కులాల ఉత్తర్వు 1950 ప్రకారం.. హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం కాని ఇతర మతాలను ఆచరించే వ్యక్తిని ఏ షెడ్యూల్డు కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించజాలరు.
వాస్తవ ఉత్తర్వులో కేవలం హిందువులుగా ఉన్న వారినే షెడ్యూల్డు కులాలుగా పరిగణించారు. ఆ తర్వాత ఆ ఉత్తర్వును సవరించి సిక్కుమతం, బౌద్ధ మతాలను కూడా చేర్చారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ (ఎన్‌సీడీసీ) సమర్పించిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ అంశంపై సుప్రీంకోర్టులో 2014 నుంచి చాలా కేసులు దాఖలయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత వైఖరి ఏమిటనేది వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు గత ఆగస్టులో నిర్దేశించింది.
రష్యా అధికారులు అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశాలకు ‘తమ సమాజాన్ని సన్నద్ధం’ చేయటం మొదలుపెట్టారని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అంటున్నారు. అయితే.. అణ్వాయుధాలను ఉపయోగించటానికి రష్యా సిద్ధంగా ఉందని తాను భావించటం లేదని చెప్పారు.
రష్యా మీద దాడులు చేయాలని తాను కోరానన్న వాదనను జెలియెన్‌స్కీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరస్కరించారు. ఈ అంశంపై ఇంతకుముందు తాను చేసిన వ్యాఖ్యను పొరపాటుగా అనువదించారని ఆయన పేర్కొన్నారు.
రష్యాను ‘‘నిరోధించటానికి దెబ్బలు (కిక్స్) కొట్టాలి’’ అని ఆంక్షలను ఉటంకిస్తూ చెప్పానని, ‘‘దాడులు (ఎటాక్స్) చేయాలి’’ అనే మాట అనలేదని వివరణ ఇచ్చారు.
యుక్రెయిన్ మీద యుద్ధంలో రష్యా ఆక్రమించిన భూభాగంలో పలు ప్రాంతాలను యుక్రెయిన్ సైన్యం ఇటీవలి వారాల్లో ఎదురు దాడులు చేసి తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ఎదురు దాడుల వల్ల రష్యా బలగాలు ఆయా ప్రాంతాలను విడిచి పలాయనమయ్యాయి.
ఈ పరాజయాలకు ప్రతిస్పందనగా వ్లాదిమిర్ పుతిన్.. యుక్రెయిన్‌లో పాక్షికంగా ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను రష్యాలో కలుపుకున్నారని కీయెవ్ అభివర్ణిస్తోంది.
ఇలా కలుపుకున్న భూభాగాలను కాపాడుకోవటానికి తాము అణ్వాయుధాలను ఉపయోగించవచ్చునని పుతిన్, ఇతర రష్యా ఉన్నతాధికారులు పరోక్షంగా సూచించారు. అయితే.. రష్యా అణ్వాయుధాలను ప్రయోగించటానికి సిద్ధంగా ఉందనటానికి ఆధారాలేవీ లేవని పశ్చిమ దేశాల ఉన్నతాధికారులు చెప్తున్నారు.
‘‘వాళ్లు తమ సమాజాన్ని సంసిద్ధం చేయటం ప్రారంభించారు. అది చాలా ప్రమాదకరం. వాటిని ఉపయోగించటానికి వారు సిద్ధంగా లేరు. కానీ వాటి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. వాటిని ఉపయోగిస్తారా లేదా అనేది వారికి తెలీదు. కానీ వాటి గురించి మాట్లాడటం కూడా ప్రమాదకరమే’’ అని జెలియన్‌స్కీ బీబీసీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అయితే.. రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తుందనేది కొందరు నిపుణులు చెప్తున్నంత కచ్చితంగా జరగదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
‘‘ఎందుకంటే వాటిని ఉపయోగించిన తర్వాత వెనుదిరిగే అవకాశం లేదని వారికి తెలుసు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఒక లగ్జరీ బస్సు, ఒక ట్రెయిలర్ ట్రక్కు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఒక చిన్నారి సహా 11 మంది చనిపోయారు. మరో 38 మంది గాయపడ్డారు.
శనివారం తెల్లవారుజామున ఈ రెండు వాహనాలు ఢీకొనటంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైందని నాసిక్ పోలీస్ కమిషనర్ జయంత్ నాయిక్నావర్నే చెప్పారు.
ప్రమాదంలో గాయపడిన వారిని నాసిక్ ఆస్పత్రికి తరలించారు.
యావత్మాల్ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న బస్సు, నాసిక్ నుంచి పూణె వెళుతున్న ట్రక్కు ఢీకొన్నాయి. బస్సు యావత్మాల్‌లో 30 మంది ప్రయాణికులతో ముంబై బయలుదేరగా, మధ్యలో మరో 19 మంది ఎక్కారని నాసిక్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రయాణికుల వివరాలను తెలుసుకుంటున్నామన్నారు.
ఈ ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందిస్తామని మోదీ ట్వీట్ చేశారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
ఓ యువతి మొరాలిటీ పోలీస్ (నైతిక పోలీసులు) డిపార్ట్‌మెంట్ కస్టడీలో చనిపోవటంతో ఇరాన్‌లో నిరసనలు చెలరేగాయి. ఆ నిరసనకారుల మీద భద్రతా బలగాలు హింసాత్మకంగా విరుచుకుపడుతున్నాయి.
మహసా అమీనీ అనే 22 ఏళ్ల మహిళను, ఆమె తన జుత్తును హిజాబ్‌తో సక్రమంగా కప్పుకోలేదనే ఆరోపణతో అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలను అణచివేయటానికి సాయుధ బలగాలు హింసను ప్రయోగిస్తుండటం వల్ల కనీసం 150 మంది జనం చనిపోయారని మానవ హక్కుల బృందాలు చెప్తున్నాయి.
నిరసనలను అణచివేయటానికి ఎప్పుడు బలప్రయోగం చేయాలనేది ఎవరు నిర్ణయిస్తారు?
పూర్తి కథనం: ఇరాన్‌లో అత్యున్నత అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, గంగాధర్ నెల్లూరు మండలం కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో 2018లో పట్టుబడ్డ గన్ పౌడర్ శనివారం ఉదయం పేలింది.
తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో ఈ పేలుడులో పాత ద్విచక్ర వాహనాలు, కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఘటన స్థలాన్ని చిత్తూరు డీఎస్‌పీ సుధాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ ప్రమాదంలో పోలీసు సిబ్బందికి ఎటువంటి గాయాలు అవ్వలేదని చిన్న పేలుడు మాత్రమే సంభవించిందని పెద్ద ప్రమాదం ఏమీ లేదని ఆయన బీబీసీతో చెప్పారు.
పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు జరిగిందని, విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయని స్థానిక టీవీ చానళ్లలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
2018 జూన్‌లో లైసెన్స్ ఉన్న ఓ గోడౌన్‌లో రికార్డుల కంటే ఎక్కువగా గన్ పౌడర్ ఉందని 713 కేజీల గన్ పౌడర్‌ని సీజ్ చేశారని, అందులో మిగిలిన కొంత భాగం ఇప్పుడు పేలిందని డీఎస్‌పీ వివరించారు.
ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ఉంచిన నల్లమందును పర్పస్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మర్రి చెట్టు కింది పాతి పెట్టారని దానిపైనే కాంక్రీట్ వేశారని అన్నారు. అది ఒత్తిడికి గురై పేలుడు సంభవించినట్టు భావిస్తున్నామని చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నామని ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు, విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి.