నేటి లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
అంత వరకు సెలవు.
ధన్యవాదాలు!
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజాదీవెన సభలో మాట్లాడిన కేసీఆర్ తాను ఈడీకి భయపడడనని, దొంగలే భయపడతారని అన్నారు.
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
అంత వరకు సెలవు.
ధన్యవాదాలు!
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల వల్ల.. ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో గత 24 గంటల్లో 21 మంది చనిపోయినట్లు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చెప్పింది.
ఈ ప్రమాదాల్లో 12 మంది గాయపడ్డారని, మరో ఆరుగురు గల్లంతయ్యారని వెల్లడించింది.
రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓంకార్ చంద్ శర్మ తెలిపారు.
వరదల వల్ల పఠాన్‌కోట్‌ను హిమాచల్‌తో అనుసంధానించే చక్కీ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది.
మరోవైపు.. సిమ్లా – కాల్కా మధ్య ఐదో నంబరు జాతీయ రహదారి మీద కొండ చరియలు విరిగిపడి రహదారి మూసుకుపోయింది. షోగి – తారా దేవి మధ్య సోను బంగ్లా సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయని.. రాళ్లు పడుతుండటం ఇంకా కొనసాగుతోందని సిమ్లా పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్‌ను షోగి మెహ్లి బైపాస్ మీదుగా మళ్లిస్తున్నట్లు చెప్పారు.
జింబాబ్వేలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు.. రెండో వన్‌డే క్రికెట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 ఆధిక్యంతో గెలుచుకుంది.
సంజు సామ్సన్ అజేయంగా సాధించిన 43 పరుగులు, శార్దూల్ ఠాకూర్ తీసిన 3 వికెట్లు.. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి.
తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొమ్మిదో ఓవర్‌లో జింబాబ్వే స్కోరు 20 పరుగులుగా ఉన్నపుడు.. మొహమ్మద్ సిరాజ్ తొలి వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత జింబాబ్వే కోలుకోలేదు. స్కోరు 31 పరుగులకు చేరుకునేటప్పటికి నాలుగు వికెట్లు కోల్పోయింది. మొత్తం 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది.
సిరాజ్ 8 ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీయగా.. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఫేమస్ కృష్ణ, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హూడాలు కూడా తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
భారత జట్టు లక్ష్యాన్ని కేవలం 26 ఓవర్లలో ఛేదించింది. శిఖర్ ధావన్ 33 పరుగులు, శుభ్‌మన్ గిల్ 33 పరుగులు, దీపక్ హూడా 25 పరుగులు చేశారు. అజేయంగా 43 పరుగులు చేసిన సంజూ సామ్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఇంతకుముందు గురువారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో మ్చాచ్ సోమవారం (ఆగస్టు 22వ తేదీన) జరుగుతుంది.
సోమాలియా రాజధాని మొగదిషులో ఒక హోటల్ మీద శుక్రవారం రాత్రి అల్-షబాబాద్ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు.
హయత్ హోటల్ వెలుపల రెండు కారు బాంబులు పేల్చిన ఇస్లామిక్ తీవ్రవాదులు అనంతరం భవనం లోపలికి వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
మిలిటెంట్లు ఇంకా హోటల్‌లోనే ఉన్నారని, కొందరిని బందీలుగా పట్టుకున్నారని.. శనివారం కూడా కాల్పులు, పేలుళ్లు కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
తీవ్రవాదులు ఎంత మంది ఉన్నారన్నది కూడా ఇంకా తెలీదు. భద్రతా సిబ్బంది వారితో పోరాడుతున్నాయి. హోటల్ నుంచి పదుల సంఖ్యలో సిబ్బందిని, అతిథులను రక్షించారు.
ఈ హోటల్ దాడిలో గాయపడ్డ వారితో పాటు.. వేరే మోర్టార్ దాడిలో గాయపడ్డ వారితో కలిపి మొత్తం 40 మందికి చికిత్స చేస్తున్నట్లు మొగదిషులోని ప్రధాన ఆస్పత్రి డైరెక్టర్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు.
హోటల్‌లో చిక్కుకుని ఉన్న తమ వారి కోసం వారి ఆత్మీయులు ఆందోళనగా హోటల్ వద్దకు చేరుకున్నట్లు స్థానిక జర్నలిస్ట్ అబ్దల్లే ముమిన్ బీబీసీకి తెలిపారు.
‘‘హోటల్ లోపల ఇంకా మృతదేహాలు పడి ఉన్నట్లు చెప్తున్నారు. కానీ ఎవరూ లేపలికి వెళ్లలేకపోతున్నారు’’ అని ఆయన చెప్పారు.
అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్-షబాబ్ సోమాలియాలో సుదీర్ఘ కాలంగా ప్రభుత్వంతో పోరాడుతోంది. దేశంలోని దక్షిణ, మధ్య ప్రాంతాలు చాలా వరకూ ఈ తీవ్రవాద సంస్థ నియంత్రణలో ఉన్నాయి. తన పట్టును మరింతగా విస్తరించుకోవటానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.
ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీజేపీపై పోరాటానికి మునుగోడులో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందుగా టీఆర్ఎస్ ప్రజాదీవెన సభను ఉద్దేశించి శనివారం ఆయన మాట్లాడారు.
కృష్ణా జలాల్లో వాటా ఎంతో ముందు చెప్పండని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. ‘‘మునుగోడు వస్తున్నారు కదా.. ముందు కృష్ణా జలాల సంగతి తేల్చండి’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ప్రతిపక్షాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను పంపిస్తున్నారని మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేశారు. ‘‘నా దగ్గరకు ఈడీ వస్తే చాయ్ ఇచ్చి పంపిస్తా. దొంగలు భయపడతారు.. నేను కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం.. రాచరిక వ్యవస్థ కాదు.. బెదిరిస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. మీ అహంకారమే మీకు శత్రువు అవుతుంది. రైతు వ్యతిరేక విధానాలే మిమ్మల్ని పడగొడతాయి’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే కుదరదని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘పిల్లలు తాగే పాల మీద జీఎస్టీ వేస్తున్నారు. చివరికి చస్తే కూడా జీఎస్టీ కట్టాలని అంటున్నారు’’అని ఆయన అన్నారు.
‘‘రైతుల బావుల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం అంటోంది. నేను చచ్చినా మీటర్లు పెట్టనని తేగేసి చెప్పాను. అసలు మనమంతా కలిసి బీజేపీకే మీటర్ పెట్టాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నూతనంగా నిర్మించిన కోర్టుల భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శనివారం నాడు ప్రారంభించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భవన సముదాయ ప్రాంగణంలో సీజేఐ, సీఎం, హైకోర్టు సీజే మొక్కలు నాటారు.
హైకోర్టు జడ్జిలు, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, ఏపీ హైకోర్టు అడ్వొకేట్ జనరల్, పలువురు సీనియర్ న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలోని 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే కూడా మహిళలకు ఎక్కువ మంది లైంగిక భాగస్వాములున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) 2019 - 2021 నివేదిక తెలిపింది.
రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, జమ్ము, కశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడులో మహిళలకు అక్కడి పురుషులతో పోల్చితే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములున్నట్లు నివేదిక తెలిపింది.
ఎక్కువ మంది లైంగికభాగస్వాములు ఉన్న మహిళలు రాజస్థాన్‌లో ఎక్కువగా ఉన్నారు.
అక్కడ మహిళలకు సగటున 3.1 మంది లైంగిక భాగస్వాములు ఉండగా పురుషులకు 1.8 మంది భాగస్వాములున్నారు.
నగరాల్లో మహిళలు, పెళ్లి కానివారు, విడాకులు తీసుకున్నవారు, వితంతువుల కంటే... గ్రామీణ ప్రాంతాల్లో వివాహిత మహిళలు ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొన్నట్లు సర్వేలో తెలిపారు.
ఈ సర్వేను దేశంలో 707 జిల్లాల్లో 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మందిపురుషులతో నిర్వహించారు.
బృందావనంలోని బన్కే బిహారీ ఆలయం దగ్గర శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. భారీ సంఖ్యలో భక్తులు జన్మాష్టమి ఉత్సవాలు జరుపుకునేందుకు గుమిగూడారు.
భక్తుల తొక్కిసలాట, ఊపిరి ఆడకపోవడంతో ఒకరు ఆలయం ద్వారం దగ్గరే కళ్ళు తిరిగి పడిపోయారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఆలయం లోపల ఉక్కపోత వల్ల చాలా మంది భక్తులు ఇబ్బంది పడ్డారు. చాలా మంది ఆస్పత్రుల్లో చేరినట్లు మథుర జిల్లా ఎస్ఎస్పీ అభిషేక్ యాదవ్ విలేఖరులకు తెలిపారు.
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో దోషులను విడుదల చేయడాన్ని యూఎస్ కమీషన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సిఐఆర్ఎఫ్) ఖండించింది.
"గుజరాత్ ప్రభుత్వం దోషులను విడుదల చేయడం తప్పు" అని యూఎస్‌సిఐఆర్ఎఫ్ కమీషనర్ స్టీఫెన్ స్నెక్, ఉపాధ్యక్షుడు అబ్రహాం కూపర్ ట్వీట్ చేశారు.
"2002 గుజరాత్ అల్లర్లలో శారీరక, లైంగిక దాడికి పాల్పడిన వారిని బాధ్యులుగా చేయకపోవడం చట్టాన్ని హేళన చేయడమే. ఈ చర్య భారతదేశంలో మైనారిటీల పై హింసకు పాల్పడి శిక్షను తప్పించుకోవచ్చనే ధోరణిని ప్రదర్శిస్తోంది" అని స్టీఫెన్ ట్వీట్ చేశారు.
అదే సమయంలో అబ్రహాం కూపర్ కూడా దోషుల విడుదలను ఖండిస్తూ ట్వీట్ చేసారు.
“గుజరాత్ అల్లర్లలో గర్భంతో ఉన్న ఒక ముస్లిం మహిళను అత్యాచారం చేసి ముస్లింలను హతమార్చి జీవిత ఖైదును అనుభవిస్తున్న 11 మంది దోషులను శిక్ష పూర్తి కాక ముందే విడుదల చేయడాన్ని యూఎస్‌సిఐఆర్ఎఫ్ ఖండిస్తోంది" అని ఆయన ట్వీట్ చేశారు.
మతపరమైన స్వేచ్ఛ గురించి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను విచారించి అందుకు తగిన విధానాలు రూపొందించాలని ప్రభుత్వాలకు సూచనలు చేస్తుంది.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాధ్రా ఆయనకు నివాళులర్పించారు.
న్యూ దిల్లీలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి దగ్గరకు వెళ్లి ఆయనను స్మరించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖార్గే, పార్లమెంట్ సభ్యుడు కేసి వేణుగోపాల్, పవన్ బన్సల్ కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ప్రధాని మోదీ కూడా రాజీవ్ గాంధీకి నివాళులు సమర్పిస్తూ ట్వీట్ చేశారు.
రాజీవ్ గాంధీ 1944, ఆగస్టు 20న జన్మించారు. ఇందిరా గాంధీ మరణం తర్వాత ఆయన ప్రధాని పదవిని చేపట్టారు.
ఐదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న ఆయన తమిళనాడులోని సిరిపెరంబదూర్‌లో 1991 మే లో ఎల్‌టీటీఈ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యారు.
విశాఖపట్నానికి చెందిన 95 మంది మున్సిపల్ కార్పొరేటర్లు కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్లే దారిలో చిక్కుకున్నారు.
శుక్రవారం రాత్రి కొండ చరియలు విరిగిపడి ఘాట్ మధ్యలో వీరు చిక్కుకుపోయారు.
వీరంతా ఆగస్టు 16నుంచి స్టడీ టూర్ లో ఉన్నారు. కార్పొరేటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
వీరంతా బస్సులోనే ఉన్నట్లు సమాచారం. వర్షం పడుతుండడంతో మార్గాన్ని సుగమం చేసే పరిస్థితులు లేవని తెలిసింది.
ప్రస్తుతం కార్పోరేటర్లు అంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.