You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 15 మందిపై సీబీఐ కేసు నమోదు

దిల్లీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనిష్ సిసోడియా నివాసంతో పాటు.. ఏడు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సీబీఐ శుక్రవారం నాడు ఆకస్మిక సోదాలు నిర్వహించింది.

లైవ్ కవరేజీ

  1. నేటి లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.

    మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

    అంత వరకు సెలవు.

    ధన్యవాదాలు!

  2. దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 15 మందిపై సీబీఐ కేసు నమోదు

    దిల్లీలో ఆరోపిత ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి.. దిల్లీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనిష్ సిసోడియా నివాసంతో పాటు.. ఏడు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సీబీఐ శుక్రవారం నాడు ఆకస్మిక సోదాలు నిర్వహించింది.

    దీనికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని.. అందులో దిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా సహా 15 మంది పేర్లను నిందితులుగా చేర్చిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఎక్సైజ్ విభాగం అధికారులు, లిక్కర్ కంపెనీల అధికారులు, డీలర్ల పేర్లు ఈ ఎఫ్ఐఆర్‌లో ఉన్నాయి. వీరితో పాటు గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులను కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

    సెక్షన్ 120-బి కింద కుట్ర, సెక్షన్ 477-ఎ కింద ఖాతాలు తారుమారు చేయటం, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 కింద వీరిపై కేసు నమోదు చేశారు.

  3. అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గిపోతోందా - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  4. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రానుందా, సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది

  5. 'ఇష్టమైన భోజనం మర్చిపోదాం... ఏదో ఒకటి తిని బతుకుదాం' - అయిదు దేశాల్లో అధిక ధరల కష్టాలు

  6. గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    శనివారం హైదరాబాద్‌లో జరగబోయే మునావర్ ఫారుఖీ అనే కమెడియన్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గతంలో ప్రకటించారు.

    ఈ నేపథ్యంలో రాజా సింగ్ ఇంటి దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. తరువాత నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

    మరోవైపు శనివారం సాయంత్రం శిల్పకళావేదికలో మునావర్ ఫారూఖీ షో కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి పోలీసులు శుక్రవారం అనుమతిచ్చారు. కానీ షో దగ్గర్లో ఏదైనా జరగవచ్చని, అతణ్ణి వెంటబడి కొడతామని రాజా సింగ్ అన్నారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు.

    మునావర్ గతంలో సీతారాములపై కామెంట్లు చేశారనీ, పలు రాష్ట్రాలు ఆయనపై నిషేధం విధించాయనీ రాజా సింగ్ మీడియాతో చెప్పారు. ఇప్పుడు సీతారాములపై కామెంట్ చేయడు అని కేటీఆర్ హామీ ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.

    ‘‘నాకు పార్టీ ముఖ్యం కాదు. ధర్మం ముఖ్యం. ధర్మాన్ని కించపరిచే వ్యక్తిని ఎందరు పోలీసులు ఉన్నా అడ్డుకుని కొడతాం. నేను పోలీసులను దండం పెట్టి ప్రార్థిస్తున్నా. అతని షోకి అనుమతించకండి. కానీ, ఒకవేళ మీరు నన్ను అడ్డుకుంటే, నేను 22న ఒక కామెడీ షో చేస్తా. తరువాత దేశంలోని హిందువులు గర్వపడేలా కామెడీ షో చేస్తాను. అప్పుడు దేశమంతా కమ్యూనల్ వాతావరణం వస్తుంది’’ అని ఆయన హెచ్చరించారు.

  7. బిల్కిస్ బానో రేప్ కేసు ఖైదీలను సత్ప్రవర్తన మీద విడుదల చేయడంపై గుజరాత్ ఎమ్మెల్యే రౌల్జీ ఏమంటున్నారు?

  8. రివ్యూ: వినోదాల వేట‌లో విఫ‌ల‌మైన 'వాంటెడ్ పండుగాడ్‌'

  9. కాకినాడ చక్కర కర్మాగారంలో మంటలు -ముగ్గురు మృతి

    కాకినాడ రూరల్ లోని వాకలపూడిలో ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. లారీలకు లోడు చేసే కన్వియర్‌ బెల్ట్‌ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

    మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

    అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసు అధికారులు, ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

  10. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ - అత్యవసర ల్యాండింగ్

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

    బిహార్ లో కరవు పరిస్థితిని అంచనా వేసేందుకు శుక్రవారంనితీశ్ కుమార్ హెలికాఫ్టర్ లో బయలుదేరారు.

    వాతావరణం అనుకూలించకపోవడంతో గయలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    బిహార్లో చాలా జిల్లాల్లో ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాలేదు.

    బిహార్లో చాలా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 40% తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

  11. జమ్మూ కశ్మీర్‌లో వోటింగ్ హక్కుల పై జోక్యం చేసుకున్న పాకిస్తాన్

    భారత పాలిత కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లన్నీ పూర్తిగా పరిస్థితులను తారుమారు చేసే చర్యలని పాకిస్తాన్ ఆరోపించింది.

    భారత ప్రభుత్వం కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ కోసం చేస్తున్న ప్రయత్నాలను తిరస్కరిస్తూ పాకిస్తాన్ అనేక ఆరోపణలు చేసింది.

    "ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు, కార్మికులు, భద్రతా దళాలను రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతిస్తూ భారత పాలిత కశ్మీర్ లో ఓటర్లుగా నమోదు చేస్తోంది. ఇదంతా చూస్తుంటే భారత ప్రభుత్వం ఈ ఎన్నికల ఫలితాల పై ప్రభావం చూపించాలని చూస్తోందనిస్పష్టంగా తెలుస్తోంది" అని ఆరోపిస్తూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.

    భారత ప్రభుత్వం కశ్మీర్‌లో ఉన్న మెజారిటీ ముస్లిం లను మైనారిటీలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

    ప్రభుత్వం డీలిమిటేషన్ కమీషన్ నివేదిక, ఆస్తి చట్టంలో చేస్తున్న మార్పులతో పాటు కొన్ని లక్షల మంది రాష్ట్రేతరులకు తప్పుడు నివాస సర్టిఫికేట్ లను మంజూరు చేస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది.

    కశ్మీర్ జనాభా స్వభావాన్ని మార్చేస్తున్న భారత్ ప్రయత్నాలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.

    కశ్మీర్‌లో నివాసముంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వోటింగ్ లో పాల్గొనవచ్చని గురువారం జమ్మూ కశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారి పిలుపిచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రకటన వెలువడింది.

  12. పోలవరం పరిహారంలో అవినీతి.. ఆధారాలతో దొరికిపోయిన అధికారులు.. అందరి బండారం బయటపడేనా?

  13. బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల - పలు వర్గాల నుంచి ఆగ్రహం

    బిల్కిస్ బానో అత్యాచార కేసులో గుజరాత్ ప్రభుత్వం దోషులను విడుదల చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాయి.

    సామాజిక కార్యకర్తలు, మహిళా హక్కుల ఉద్యమకారులు కూడా దీనికి వ్యతిరేకంగా తమ గొంతును విప్పారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

    ప్రముఖ కవి, రచయత జావేద్ అఖ్తర్ కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు.

    "5నెలల గర్భిణి పై సామూహిక అత్యాచారం చేసి ఆమె మూడేళ్ళ బిడ్డను చంపిన దోషులు జైలు నుంచి విడుదలయ్యారు. వారికి పూలదండలు వేసి మిఠాయిలతో స్వాగతం పలికారు. దేనినీ దాచిపెట్టకండి. ఆలోచించండి. సమాజం పయనిస్తున్న విధానంలో ఏదో పెద్ద తప్పే జరుగుతోంది" అని ప్రముఖ కవి జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు.

  14. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగానికి మహిళా డైరెక్టర్

    ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్ కు తొలి సారిఒక మహిళనుడైరెక్టర్‌గా నియమించారు.

    ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల విభాగపు డిప్లొమసీ టీమ్ ట్వీట్ చేసింది.

    "ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ గా 'ఏ' అనే వ్యక్తి నియమితులయ్యారు. ఈమె మొసాద్ చరిత్రలోనే ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ " అని ట్వీట్ చేశారు.

    ఇజ్రాయెల్ సైన్యం ఇంటెలిజెన్స్ విభాగం అధినేత హోదాతో సమానమైన హోదా ఈమెకు ఉంటుంది.

    ఇంటెలిజెన్స్ విభాగం ఇరాన్ డెస్క్ కు అధినేతగా 'కే' అనే మరొక మహిళ నియమితులైనట్లు ఇదే ట్వీట్ లో పేర్కొన్నారు.

    ఈ నియామకాలతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య నలుగురికి చేరింది.

  15. "మేక్ ఇండియా నంబర్ 1" కార్యక్రమాన్ని మొదలుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ "మేక్ ఇండియా నంబర్ 1" అనేప్రచారాన్ని మొదలుపెట్టారు.

    ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన 9510001000కు మిస్డ్ కాల్ ఇమ్మని పిలుపునిస్తున్నారు. భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా చూడాలనుకునేవారు ఈ మిషన్ లో చేరమని కోరారు.

    దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.

  16. భారత్‌తో శాంతియుత సంబంధాలు కోరుకుంటున్న పాక్

    పాకిస్తాన్ భారత్‌తో శాంతియుత సంబంధాలను కోరుకుంటోందని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు.

    ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూ కశ్మీర్ వివాదానికి కూడా శాంతియుత ఒప్పందం కుదుర్చుకోవాలని పిలుపునిచ్చారు.

    పాకిస్తాన్‌లో కొత్తగా నియమితులైన ఆస్ట్రేలియా హై కమీషనర్ నీల్ హాకిన్స్ తో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    కశ్మీర్‌లో శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు అక్కడి ప్రజల అభిప్రాయానికనుగుణంగా శాంతియుత పరిష్కారాన్ని సాధించాలని అన్నారు.

  17. "నా ప్రకటనను తప్పుగా చూస్తున్నారు" - బిల్కిస్ బానో కేసులో బ్రాహ్మణ సంస్కారాల గురించి ప్రకటన చేసిన ఎంఎల్ఏ సీకే రౌల్‌జీ

    బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో విడుదల చేసిన 11మంది దోషులను బ్రాహ్మణ సంస్కారాలతో పోల్చిన గోద్రా ఎంఎల్ఏ సీకే రౌల్‌జీ ప్రకటనను వక్రీకరించి చూస్తున్నారంటూ మరొక ప్రకటన చేశారు.

    "అత్యాచారం చేసిన వారికి కులంతో సంబంధం లేదని అన్నారు. నేనలా చెప్పలేదు. దోషులకు శిక్ష పడాల్సిందే. కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి" అని ఆయన ట్వీట్ చేశారు.

    బిల్కిస్ బానో కేసులో దోషులను వారి ప్రవర్తన ఆధారంగా విడుదల చేసినట్లు రౌల్‌జీఒక యూ ట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

    "వాళ్ళు బ్రాహ్మణ కులానికి చెందినవారు. వాళ్లకు ఉత్తమ సంస్కారాలుంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఇదే ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.

    బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో రౌల్‌జీసభ్యునిగా ఉన్నారు.

    దోషులను ఆగస్టు15న గోద్రా జైలు నుంచి విడుదల చేశారు.

  18. దక్షిణ కొరియాను నోరు మూసుకోమన్న - ఉత్తర కొరియా

    ఉత్తర కొరియా అణ్వస్త్ర నిరాయుధీకరణను చేపడితే అందుకు బదులుగా ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉందని ఆ దేశాధ్యక్షుడు చేసిన ప్రకటనకు ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రంగా స్పందించారు.

    దక్షిణ కొరియాను నోరు మూసుకోమని సమాధానమిచ్చారు.

    దక్షిణ కొరియా అధ్యక్షుడు గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో తిరిగి అదే ప్రతిపాదనను చేశారు.

    దక్షిణ కొరియా ప్రతిపాదన పై ఉత్తర కొరియా నాయకులు నేరుగా స్పందించడం ఇదే మొదటిసారని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

  19. దిల్లీ ఎక్సైజ్ కమీషనర్ అరవ గోపీ కృష్ణ ఇంట్లో సీబీఐ సోదాలు

    దిల్లీలో మద్యం పాలసీ కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో సీబీఐ వరుస సోదాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అప్పటి దిల్లీ ఎక్సైజ్ కమీషనర్ అరవ గోపీ కృష్ణ ఇంటి పై కూడా సోదాలు నిర్వహించారు.

    దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటి పై సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

    ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఈయన 2012 ఐఏ ఎస్ కేడర్ కు చెందినవారు.ఐఐటీ మద్రాస్ నుంచి బీ.టెక్ పూర్తి చేశారు.

  20. బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను నిరసిస్తూ మహిళా సంఘాల ప్రకటన

    బిల్కిస్ బానో అత్యాచార కేసులో విడుదల చేసిన దోషులను జైలు నుంచి విడుదల చేయడాన్ని నిరసిస్తూ మహిళా సంఘాలు, మేధావి వర్గాలు, సామాజిక కార్యకర్తలు ప్రకటన విడుదల చేశారు.

    ఈ ప్రకటన పై 6000 మందికి పైగా సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో సుభాషిణి అలీ, కవిత కృష్ణన్, సయీదా హమీద్, కవిత శ్రీవాస్తవ ఉన్నారు.

    ఈ విషయంలో సుప్రీం కోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

    2002, మార్చి 3న చోటు చేసుకున్న గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం చేసి, 14 మంది కుటుంబ సభ్యులను చంపేశారు. మరణించిన వారిలో బిల్కిస్ మూడేళ్ళ కూతురు కూడా ఉంది.