సత్య సాయి జిల్లాల్లో చోటు చేసుకున్న ప్రమాదం గురించి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేవలం ఉడుత రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు.
ఆటోపై మంచం ఉండడం, అదే సమయంలో తీగలపై ఉడుత పడడం.. ఆ తీగలు ఆటోపై పడడం, మంటలు రావడం ఆంతా యాక్సెడెంటల్‌గా జరిగిపోయాయని ఎమ్మేల్యే అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించారు.
"ఓవరాల్‌గా విద్యుత్ వైర్లను చాలా నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. రైతులు పంట దెబ్బతింటుందని, కరెంటు వారు రావడం లేటవుతుందని కట్టెలు కూడా పెట్టుకుని ఉంటారు. ఈ కేసులో ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ నుంచి పొరబాటు జరగలేదు. ఒక్కసారిగా స్పార్కింగ్ రాగానే ఎలక్ట్రికల్ లైన్ ట్రిప్ అవుతుంది. ఇక్కడ ఎందుకు అలా జరగలేదనే అంశాన్ని టెక్నికల్‌గా పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబాలకు వైయెస్సార్ బీమా కూడా అందజేస్తాం. అదికూడా కలిపితే మృతుల కుటుంబాలకు 15 లక్షల వరకు వస్తుంది" అని ఎమ్మెల్యే చెప్పారు.
సత్య సాయి జిల్లాలో ఆటోపై విద్యుత్ తీగలు పడి సంభవించిన ప్రమాదం గురించి పోలీసులు అందించిన వివరాలు ఇవీ..
తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన 11 మంది మహిళా కూలీలను పొలం పనుల కోసం పొలం యజమానురాలు ఆటోలో చిల్లరకొండయ్యపల్లికి తీసుకెళుతున్నారు.
మార్గమధ్యంలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో డైవర్‌తో సహా మెంత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కుమారి (35), రత్నమ్మ (35), రాములమ్మ (35), లక్ష్మి దేవి (32), కాంతమ్మ (32) అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
మరో కూలీ గాయత్రికి తీవ్రగాయాలవడంతో ఆనంతపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
ఇందులో మరికొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయని దర్మవరం రూరల్ సీఐ మన్సురుద్దీన్ మీడియాతో చెప్పారు.
చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కరంట్ తీగలపైకి ఉడుత ఎక్కడం వల్ల తీగలు ఒకదానికి ఒకటి తగిలి, విద్యుత్ తీగ తెగి ఆటోపై పడిందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరినాధరావు తెలిపారు. దీనిపై విజిలెన్స్ కమిటీ విచారణ జరుగుతుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎండీ చెప్పారు.